అన్ని రంగాల్లో ఆధునిక సాంకేతికత విస్తరిస్తున్నా.. అన్నం పెట్టే రైతన్నకు అది అందని ద్రాక్షగానే ఉంటున్నది. అందుకే ఆమె.. టెక్నాలజీకి వాణిజ్య ప్రయోజనాలు జోడించి.. అన్నదాతకు అండగా నిలుస్తున్నారు. ‘న్యాస్తా గ్రామోజ్వల’ పేరిట స్టార్టప్ ప్రారంభించి బీడువారిన పొలాల్లో డిజిటల్ జల్లు కురిపిస్తున్నారు. నీటి నిర్వహణను సులభతరం చేస్తూ రైతుకు ఊతమిచ్చేందుకు నలుగురితో కలిసి ఈ సంస్థను నెలకొల్పారు. స్మార్ట్ ఫార్మింగ్‌కు బాటలు పరుస్తున్న ‘న్యాస్తా గ్రామోజ్వల’ వ్యవస్థాపకుల్లో ఒకరైన బాల భార్గవి స్టార్టప్ జర్నీ ఆమె మాటల్లోనే..
సంప్రదాయ వ్యవసాయంలో ఫలసాయం తక్కువ! అన్నం పెట్టే రైతన్న ఆకలి తీరాలంటే.. సేద్యంలో సాంకేతికత జోక్యం అవసరం అనిపించింది. అందుకే డిజిటల్ ప్రోత్సాహం అందించేలా అగ్రిటెక్ ఆధారిత స్టార్టప్‌తో ఆంత్రప్రెన్యూర్ అవతారమెత్తాను. ఎంటెక్ చేసే రోజుల్లోనే రైతులకు స్వదేశీ పరిజ్ఞానంతో పనిచేసే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పం ఉండేది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే..
న్యాస్తా గ్రామోజ్వల (https://nyasta.in/). దేశీయ వ్యవసాయరంగాన్ని టెక్నాలజీ బాట పట్టించడమే మా ఉద్దేశం. మిథిలేశ్ బోయిన, ప్రశాంత్ రెడ్డి, నరోత్తం రెడ్డి, రాజ్ వీకేతో కలిసి ఈ సంస్థను ప్రారంభించాం.
సాగు దిగుబడి పెరగాలంటే నీటి నిర్వహణ చాలా ముఖ్యం. నీటి వసతి ఎంత ఉందన్నది కాదు.. ఉన్న వనరులను ఎంత సమర్థంగా నిర్వహించామన్నది చాలా ప్రధానం. నీటి వృథాను నియంత్రించడం వల్ల పెట్టుబడి వ్యయం చాలావరకు తగ్గుతుంది. అలాగే సహజ వనరుల దుర్వినియోగాన్ని అడ్డుకున్నట్టూ అవుతుంది. రైతులకు డిజిటల్ పరిజ్ఞానం లేకపోయినా, చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ఆధారంగా పనిచేసే సాంకేతికతను అభివృద్ధి చేశాం. పంపుసెట్లు, బావుల వద్దకు రైతులు వెళ్లకుండానే టెక్నాలజీ సాయంతో నీటి నిర్వహణ చేసుకోవచ్చు.
ప్రస్తుతం మార్కెట్లో ఈ తరహా టెక్నాలజీ ఉన్నా.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారంగా పనిచేసే అధునాతన సాంకేతికతతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. క్లౌడ్ కంప్యూటింగ్ సాయంతో ఆధునిక డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను మార్కెట్లోకి తీసుకొచ్చాం. రైతులు ఫోన్‌కాల్, ఎస్ఎంఎస్, ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా పంపు సెట్లను నిర్వహించుకోవచ్చు. ప్రతి కరెంట్ మోటర్ ప్రత్యేకమైన ఐవీఆర్ఎస్ విధానం ద్వారా పనిచేస్తుంది.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) సాంకేతికతను ఇప్పుడు అన్ని రంగాల్లోనూ విస్తృతంగా వినియోగిస్తున్నారు. వ్యవసాయంలోనూ దీన్ని ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు పొందొచ్చు. ఐఓటీతో అనుసంధానం చేయడం ద్వారా.. పంటల నిర్వహణ మరింత సులభతరం అవుతుంది. స్మార్ట్ ఫార్మింగ్ ద్వారా రైతులకు పనిభారం తగ్గుతుంది. స్మార్ట్ మోటర్ మేనేజ్మెంట్, స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్, స్మార్ట్ ఆక్వాకల్చర్, స్మార్ట్ క్రాప్ మేనేజ్మెంట్ వంటి టెక్నాలజీలతోపాటు, డ్రిప్ ఇరిగేషన్‌కూ సాంకేతికతను జోడించాం.
ఇది ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సాంకేతికత కన్నా చౌక! పైగా మరింత సమర్థంగా పనిచేస్తుంది. మార్కెట్లో దొరికే నీటి నిర్వహణ వ్యవస్థలను సాధారణ, సన్నకారు రైతులు ఏర్పాటు చేసుకోవడం అధిక వ్యయంతో కూడుకున్న పని. కానీ, ‘న్యాస్తా’ అభివృద్ధి చేసిన స్మార్ట్ ఫార్మింగ్, వాటర్ మేనేజ్మెంట్ టెక్నాలజీ.. ఈ ఖర్చుల భారాన్ని 70 నుంచి 80 శాతం వరకు తగ్గిస్తుంది. ఫలితంగా రైతు వ్యవసాయంలో చక్కటి ఫలసాయం పొందుతాడని విశ్వసిస్తున్నాం.
– కడార్ల కిరణ్