కాలంతో పాటు యువత లక్ష్యాలు మారుతున్నాయి. కొలువుల చట్రంలో ఇరుక్కోకుండా.. సొంతంగా ఎదగాలనుకుంటున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. తమిళనాడులోని పళనికి చెందిన అన్నపూర్ణి ఆ కోవకే చెందుతుంది. ఎంబీఏ చదివిన ఆమె కార్పొరేట్ ఉద్యోగం వదిలిపెట్టి ఐదేండ్ల కిందట ఆర్పీ క్యాటిల్ ఫీడ్స్ సంస్థను నెలకొల్పింది. సంప్రదాయ పద్ధతుల్లో పశుగ్రాసం తయారు చేసే పరిశ్రమ ఇది. ఇక్కడ ఆవులు, మేకలు, కోళ్లకు దాణా తయారుచేస్తుంటారు.
సహజ సిద్ధమైన ముడిపదార్థాలతో ఏడు రకాల దాణా ఉత్పత్తి చేస్తున్నారు. కొర్రలు, గోధుమల ఊక, మక్కజొన్న పిండి, సోయా తవుడు, గోధుమ రవ్వ, ఇతర ఉత్పత్తులను మిళితం చేసి పశుగ్రాసం తయారు చేస్తున్నారు. ఈ మిక్స్డ్ ఫీడ్ తినడం వల్ల పశువులకు అన్ని రకాల పోషకాలు అందుతాయని అన్నపూర్ణి చెబుతున్నది. ఐదేండ్ల కిందట చిన్న పరిశ్రమగా మొదలైన ఆర్పీ ఫీడ్స్ ఇప్పుడు కోట్ల టర్నోవర్ సాధిస్తున్న సంస్థగా ఎదిగింది. ఇరుగుపొరుగు రాష్ర్టాలతోపాటు దేశదేశాలకు ఇక్కడ ఉత్పత్తి అయ్యే దాణా సరఫరా అవుతున్నది.