నిరంకుశ నిజాం పాలన నుంచి విముక్తి లభిస్తుందని భావించి పోలీస్ చర్యను స్వాగతించిన హైదరాబాద్ రాజ్య ప్రజలకు తరువాత ఏర్పడిన మిలిటరీ జనరల్ జేఎన్ చౌధరి పాలన, ఎంకే వెల్లోడి పౌర ప్రభుత్వ పాలనలో స్థానికేతరులను (నాన్ ముల్కీ) వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించడం అనేది పెద్ద సమస్యగా మారింది. దీనికి తోడు పక్క రాష్ర్టాలైన మద్రాస్, బాంబే, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి గంపగుత్తగా అధికారులను దిగుమతి చేసుకోవడం వల్ల హైదరాబాద్ రాష్ట్ర ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి, అలజడులు ఆందోళన రూపంలో బయటపడ్డాయి. అయితే బాంబే, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన అధికారులు మాత్రం హైదరాబాద్ రాష్ట్ర ప్రజలతో మంచిగా కలిసిపోయారు. కానీ మద్రాస్ ప్రాంత అధికారులు ముఖ్యంగా ఆంధ్రులు స్థానిక ప్రజల పట్ల చులకన భావంతో, ఆధిపత్యం చెలాయిస్తూ సమస్యలు సృష్టించారు. నిజాం పాలన పోయి భారత యూనియన్ కాంగ్రెస్ పాలన వస్తే తమ బతుకులు బాగుపడుతాయని భావించిన హైదరాబాద్ రాష్ట్ర ప్రజల భ్రమలు త్వరగానే చెదిరిపోయాయి.
దీంతో నాన్ ముల్కీల వల్ల స్థానికులైన విద్యావంతులకు ఉద్యోగాలు రావేమోనని ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లోనే 1952 మార్చి 6న ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికయిన ప్రజా ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ఏర్పడింది. అయినప్పటికీ నాన్ ముల్కీలు నకిలీ ధృవపత్రాలు సృష్టించి ముల్కీలుగా ఉద్యోగాల్లో చేరడం వంటి విషయాలను బూర్గుల ప్రభుత్వం అరికట్టలేకపోయింది. దీంతో స్థానికుల్లో అభద్రతాభావం పెరిగిపోయింది. ఆనాడు ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి వరంగల్‌లో 1952, జూలై 26న ఒక ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి వేలాది మంది విద్యార్థులు బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించారు.
అదే క్రమంలో ఈ ఐక్యకార్యాచరణ సమితి 1952, జూలై 26న ఒక తీర్మానాన్ని కూడా చేసింది.
1) ముల్కీ నిబంధనలను పరిశీలించడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని నియమించి, దాన్ని ముఖ్యమంత్రే స్వయంగా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయాలి.
2) ముల్కీ నిబంధనల ప్రకారమే వెంటనే ఉద్యోగాలకు ఉత్తర్వులు జారీచేసి, యుద్ధ ప్రాతిపదికపై వాటిని నింపాలి.
3) హైదరాబాద్ రాష్ట్రంలో స్థానికేతరుల ఆధిపత్యం, అజమాయిషీలను వెంటనే అరికట్టి, స్థానికుల్లో అభద్రతా భావాన్ని తొలగించే ప్రకటన చేయాలి.
1. హైదరాబాద్ హిత రక్షణ సమితిని స్థాపించి, నాన్ ముల్కీలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించింది?
1) వందేమాతరం రామచంద్రారావు
2) పీ రామాచారి
3) మర్రి చెన్నారెడ్డి
4) హయగ్రీవాచారి
2. ‘ది జ్యుడీషియరీ ఐ సర్వ్డ్’ ఎవరి ఆత్మకథ?
1) పింగళి జగన్మోహన్ రెడ్డి
2) పండిట్ సుందర్ లాల్
3) కొండా లక్ష్మణ్ బాపూజీ
4) కేవీ రంగారెడ్డి
3. కింది వారిలో ముల్కీ నిబంధనల అమలు కోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులు కానివారు?
1) కేవీ రంగారెడ్డి
2) డా. మెల్కోటే
3) ఫూల్‌చంద్ గాంధీ
4) మర్రి చెన్నారెడ్డి
4. తెలంగాణ ప్రజల పట్ల ఆంధ్ర అధికారుల దుష్ప్రవర్తన వల్లనే ముల్కీ అల్లర్లు తెలంగాణ ప్రాంతమంతటా వ్యాపించాయని ఎవరి ఆత్మకథలో పేర్కొన్నారు?
1) నవాజ్ జంగ్
2) రామాచారి
3) పింగళి జగన్మోహన్ రెడ్డి
4) వీబీ రాజు
5. సిటీ కాలేజీ సంఘటన జరిగింది?
1) 1952, సెప్టెంబర్ 2
2) 1952, సెప్టెంబర్ 3
3) 1952, సెప్టెంబర్ 4
4) 1952, సెప్టెంబర్ 5
6. 1952, సెప్టెంబర్ 13న ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (పీడీఏ) కింద అరెస్ట్ అయిన శాసనసభ్యుడు?
1) సయ్యద్ అక్తర్ హుస్సేన్
2) కొండా లక్ష్మణ్ బాపూజీ
3) మర్రి చెన్నారెడ్డి
4) పీ రామాచారి
7. హైదరాబాద్ రాష్ట్ర మొదటి స్పీకర్?
1) పంపన్న గౌడ
2) ఎం నర్సింగరావు
3) కాశీనాథరావు వైద్య
4) వీడీ దేశ్‌పాండే
సమాధానాలు
1-2, 2-1, 3-4, 4-3, 5-2, 6-1, 7-3