హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్‌లో విలీనం
- మొదట్లో హైదరాబాద్ రాజ్యంపై పోలీస్ చర్య జరపడంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఊగిసలాట విధానాన్ని కొనసాగించింది. ప్రధానంగా హైదరాబాద్ రాజ్య పరిస్థితి ఒక కొలిక్కి రావాలని కాంగ్రెస్ నాయకుల్లో ఆదుర్దాతో పాటు ప్రజలకు దూరమవుతామనే భయం, ప్రభుత్వ అండదండలు లభించడం లేదనే బాధ మొదలయ్యింది. ప్రభుత్వ జోక్యం అవసరమని భావించిన కాంగ్రెస్, హైదరాబాద్ నాయకులకు 1948, ఏప్రిల్ చివరలో కేఎం మున్షీ నెహ్రూని కలిసి హామీ ఇవ్వడంలో సహాయపడ్డాడు.
- ఇదిలా ఉండగా 1948, జూన్ 21న మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్‌గా పదవీ విరమణ చేసి ఇంగ్లండ్‌కు వెళ్లగానే రాజగోపాల చారి గవర్నర్ జనరల్ అయ్యాడు. దీంతో ఆంగ్లేయుల నామమాత్రపు ఆటంకం కూడా తొలగిపోయినప్పటికీ నెహ్రూ ఎంతో తాత్సారం చేశాడు. దానికి కారణం అహింసా మార్గాన దేశ స్వాతంత్య్రాన్ని పొందినవారు హైదరాబాద్ రాజ్యంపై హింసామార్గం అవలంబిస్తున్నారని, అంతర్జాతీయంగా చెడ్డ పేరు వస్తుందనే అనుమానం, దానివల్ల హైదరాబాద్‌లోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా హిందూ-ముస్లింల మధ్య మతకలహాలు చెలరేగుతాయన్న భయం నెహ్రూను ఆలోచనలో పడేసింది.
- కానీ హోంమంత్రి వల్లభాయ్ పటేల్ మాత్రం తాము అధికారంలో ఉన్న దేశంలో ప్రజలపై ఇంత హింసాకాండ జరుగుతుంటే ప్రేక్షకపాత్ర వహించడం తగదని ఆగ్రహించి ఒక సందర్భంలో నెహ్రూ అధ్యక్షతన జరుగుతున్న ‘రక్షణ కమిటీ’ నుంచి వాకౌట్ చేయడంతో తప్పనిసరి పరిస్థితిలో రాజగోపాలచారి కలగజేసుకొని హైదరాబాద్‌పై పోలీస్ చర్య తీసుకోడానికి నెహ్రూని ఒప్పించి, దానికి పోలీస్ యాక్షన్ అనే పేరును సూచించాడు.
- 1948, జూన్ చివరి వారం వరకు హైదరాబాద్ రాజ్యం విలీనం గురించి భారత ప్రభుత్వానికి, నిజాంకు మధ్య జరిగిన చర్చలు విఫలమవడమే కాకుండా, కశ్మీర్ సమస్య రగులుతుండటం, రుతుపవన వర్షపాతం అధికంగా ఉండటం వల్ల హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్యను కొంతకాలం వాయిదా వేసింది. ఇదే సమయంలో హైదరాబాద్ రాజ్యానికి పెద్ద మద్దతుదారుడైన పాకిస్థాన్ మొదటి గవర్నర్ జనరల్ మహ్మద్ అలీ జిన్నా సెప్టెంబర్ 12న మరణించడంతో హైదరాబాద్ రాజ్యంలో సెలవు ప్రకటించి మక్కా మసీదులో సామూహిక సంతాప ప్రార్థనలు ఏర్పాటు చేశారు.
- నిజాం నుంచి రూ.20 కోట్ల రుణం తీసుకున్న పాకిస్థాన్ నుంచి నిజాంకు ఆ గందరగోళంలో ఏ సహాయం అందదని తేలిపోయింది. ఇదే అదనుగా భావించిన భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిలో ‘హైదరాబాద్ అంశం’ చర్చకు రానున్నదని గ్రహించి, యుద్ధప్రాతిపదికన 1948, సెప్టెంబర్ 13 సోమవారం ఉదయం హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్యలో భాగంగా సైన్యాలను రాజ్య సరిహద్దుల్లో మోహరించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అవకాశం కోసం ఎదురుచూస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాటి భారత సైనిక శాఖ మంత్రి బల్దేవ్ సింగ్ ప్రమేయం లేకుండానే పోలీస్ చర్యకు ఆజ్ఞాపించాడు. దాన్ని మిలిటరీ భాషలో ‘ఆపరేషన్ పోలో’ అని వ్యవహరిస్తారు.
ఆపరేషన్ పోలో
- హైదరాబాద్ రాజ్యంలో కమ్యూనిస్టులు, రజాకార్లు కొనసాగిస్తున్న హింస, ప్రతిహింసలకు వ్యతిరేకంగా శాంతి స్థాపన కోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో నిర్వహించబోతుందని పాకిస్థాన్ హై కమిషనర్‌కు, అమెరికా ప్రభుత్వానికి తెలియజేసింది. హైదరాబాద్ రాజ్యంపై భారత ప్రభుత్వం సైనిక చర్య చేపట్టినప్పటికీ దానికి పోలీస్ చర్య అని పేరు పెట్టారు. ఎందుకంటే ఒక స్వతంత్ర రాజ్యంపై మరో స్వతంత్ర రాజ్యం సైనిక చర్య నిర్వహించడం ఐక్యరాజ్య సమితి ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం. కానీ దానికి రుజువులు లేకుండా ఉండటానికి సైన్యానికి అయ్యే ఖర్చును ఇటు హోం శాఖలో కాకుండా, అటు రక్షణ శాఖలో కాకుండా విద్యా శాఖ ఖజానాలో జమ చేయడం జరిగింది.
- ఈ పోలీస్ చర్య సంపూర్ణంగా సదరన్ కమాండ్‌కు జీవోసీ అయిన లెఫ్టినెంట్ జనరల్ మహరాజ్ సింగ్ నేతృత్వంలో జరిగింది. అందులో షోలాపూర్ నుంచి మేజర్ జనరల్ జేఎన్ చౌధురి, విజయవాడ నుంచి మేజర్ జనరల్ రుద్ర చేసిన దాడులు అతి ప్రధానమైనవి. 1948, సెప్టెంబర్ 13న భారత సేనలు చౌధురి నాయకత్వాన షోలాపూర్, నల్దుర్గ్, తామల్ వాడి, తుల్జాపూర్లను ఆక్రమించాయి. మరో పక్క ‘లహ్మీ’ ప్రాంతం నుంచి కొన్ని బలగాలు ఉస్మానాబాద్‌కు దూసుకొచ్చాయి. అదేక్రమంలో తుల్జాపూర్ లొంగిపోయింది. నిజాం సైనికులు తమ పోస్ట్‌లు వదిలి పారిపోయారు.
- సెప్టెంబర్ 15న భారత సేనలు పురోగమిస్తున్నాయనే వార్త వినగానే ‘మర్దు’లోని నిజాం సేనలు లాతూర్, ఔరంగాబాద్, షోలాపూర్‌ల వైపు చెల్లాచెదురై పారిపోయాయి. కానీ మార్గం మధ్యలో యూనియన్ సేనలకు పట్టుబడి లొంగిపోయాయి. దీంతో పాటు వరంగల్ జిల్లాలో మకాం వేసిన నిజాం సేనలు కూడా మేజర్ జనరల్ రుద్ర సేనలకు లొంగిపోక తప్పలేదు. సూర్యాపేటలో మాత్రం కొంతసేపు నిజాం సేన నిలువరించగలిగింది. కానీ నిరాయుధులైన జనాల మీద కాల్పులు జరిపిన నిజాం సైన్యాలు శక్తిమంతమైన భారత సైనికుల ముందు ఎంతోసేపు నిలువలేకపోయాయి.
- సూర్యాపేట గ్రామంలోకి ప్రవేశిస్తున్న భారత సేనలకు ప్రజలు స్వాగతం పలికారు. 1948, సెప్టెంబర్ 16న జహీరాబాద్, హింగోళీ, రాయచూర్, పర్బనీ, కొప్పల్, మునీరాబాద్ తదితర పట్టణాలన్నీ భారత సేనల వశమయ్యాయి. రోజురోజుకు భారత సేనలు పురోగమించడం నిజాం సేనలు తిరోగమించడం, భారత సేనలు విజయఢంకా మోగిస్తూ హైదరాబాద్ భూభాగంలోకి వాయువేగంగా ప్రవేశిస్తున్నాయన్న వార్తలతో నిజాంకు భయం మొదలైంది. చివరికి నిజాంకు భారత ఏజెంట్ జనరల్ కేఎం మున్షీని శరణు వేడటమే మిగిలింది. ఇంతలో మేజర్ జనరల్ చౌధురి నాయకత్వాన భారత సేనలు పటాన్‌చెరువుకు వచ్చాయి.
- భారత సైన్యానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్న నిజాం రాజ్య మిలిటరీ కమాండర్ సయ్యద్ అహ్మద్ ఎల్ ఎడ్రూస్ భారత సైన్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేయకుండా హైదరాబాద్ నగరానికి తిరిగి రావాలని కింది స్థాయి సైన్యాధికారులకు రహస్యంగా ఆదేశాలు పంపించాడు. దీంతో కొద్దికాలంలోనే భారత సైన్యం హైదరాబాద్ రాజ్యంలోకి చొచ్చుకొని రావడమే కాకుండా కేవలం నాలుగైదు రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ నగరంలోకి మేజర్ జనరల్ జేఎన్ చౌధురి నేతృత్వంలోని సేనలు ప్రవేశించాయి.
- ఒకవేళ ఎడ్రూస్ అలాంటి పనిచేయకపోతే భారత సైన్యం సెప్టెంబర్ 17లోగా హైదరాబాద్ నగరంలోకి రాలేకపోయేది. దీంతో సెప్టెంబర్ 17 సాయంత్రం ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో హైదరాబాద్ అంశం చర్చకు వచ్చి హైదరాబాద్ రాజ్యం స్వతంత్ర రాజ్యంగా లేదా జమ్ముకశ్మీర్ లాగా స్వతంత్రప్రతిపత్తి కలిగి ఉండేది. ఇదంతా నెహ్రూకు, నిజాం ప్రభుత్వానికి మధ్య జరిగిన లోపాయకారి ఒప్పందంగా భావించాల్సి ఉంటుంది.
- అప్పటికే రాజీనామా చేసిన నిజాం రాజ్య ప్రధాని మీర్ లాయక్ అలీ సలహా ప్రకారం నిజాం కార్యాలయంలో, ప్రధాని కార్యాలయంలో గల రహస్య పత్రాలన్నింటిని ధ్వంసం చేయించారు. పాకిస్థాన్‌లో హైదరాబాద్ ఏజెంట్ జనరల్ ముస్తాక్ అహ్మద్ ఖాన్‌కు ఆయన ఆఫీసుకు చెందిన మొత్తం డబ్బును తన అకౌంట్లో జమ చేసుకోమని, లండన్‌లోని ఏజెంట్ జనరల్ మీర్ నవాజ్ జంగ్కు 5000 పౌండ్లు తన అకౌంట్లో జమ చేసుకోమని టెలిగ్రామ్ ద్వారా లాయక్ అలీ వర్తమానం పంపించాడు.
- ఆ తరువాత వారిద్దరి అకౌంట్ల నుంచి ఆ డబ్బును తన పేర జమ చేయాలని కూడా అలీ అదేశించాడు. ఆ డబ్బు భవిష్యత్తులో స్వాతంత్య్ర పోరాటానికి అవసరమవుతుందని కూడా తెలిపాడు. అదే సమయంలో లాతూర్‌లోని స్టేట్ బ్యాంకులోని భారీ మొత్తాన్ని వేరే చోటుకు తరలించారు. 1948, సెప్టెంబర్ 17 శుక్రవారం ప్రార్థనా సమయంలో హిందువులను ఊచకోత కోయాలని రజాకార్లను ఆదేశిస్తూ ఖాసీం రజ్వీ వారికి ఆయుధాలు పంచానని, మహ్మద్ హైదర్‌ను బయటకు రావద్దని ఫోన్ చేసి చెప్పాడు. అంత దారుణానికి పాల్పడవద్దని దాని ఫలితంగా భారత బలగాలు మొత్తం హైదరాబాద్‌ని సర్వనాశనం చేస్తాయని హెచ్చరించాడు హైదర్.
- ఈ మాటలు వినే పరిస్థితుల్లో రజ్వీ లేకపోవడాన్ని గమనించిన హైదర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నవాబ్ దీన్ యార్ జంగ్ ద్వారా వచ్చే ప్రమాదాన్ని ఆపగలిగాడు. 1948, సెప్టెంబర్ 17న లాయక్ అలీ మంత్రివర్గం రాజీనామా చేసి ప్రభుత్వ పగ్గాలను నిజాంకు అప్పగించింది. నిజాం అదే రోజు సాయంత్రం 7 గంటలకు దక్కన్ రేడియో నుంచి ఒక ప్రకటన చేశాడు. 1948, సెప్టెంబర్ 18న మేజర్ జనరల్ చౌధురి ఎదుట నిజాం సైన్యాధిపతి మేజర్ జనరల్ ఎల్ ఎడ్రూస్ లొంగిపోయాడు.
- మిలిటరీ నియమాల ప్రకారం హైదరాబాద్‌ను మొదట చేరుకున్న జనరల్ చౌధురి పాలనా బాధ్యతలు స్వీకరించాడు. చౌధురి హైదరాబాద్ రాజ్యంలో మిలిటరీ గవర్నర్‌గా నియమితులైనప్పటికీ చట్టరీత్యా రాజ్యాధినేతగా నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొనసాగాడు. 1948, సెప్టెంబర్ 22న భారత్‌పై యూఎన్వోలో చేసిన ఫిర్యాదును వెనుకకు తీసుకుంటున్నట్లు నిజాం కేబుల్ ద్వారా భద్రతామండలికి తెలిపాడు.
- ఈ సందర్భంగా భారతదేశ కడుపులో ఏర్పడ్డ హైదరాబాద్ రాజ్యమనే పుండు తొలగిపోయిందని వల్లభాయ్ పటేల్ భావించాడు. 1948, సెప్టెంబర్ 18న లాయక్ అలీని గృహ నిర్బంధంలో ఉంచడం, ఖాసీం రజ్వీని తిరుమలగిరిలోని సైనిక కారాగారంలో నిర్బంధించడం జరిగింది. చివరికి పోలీస్ చర్య అనంతరం హైదరాబాద్ సంస్థానానికి వచ్చిన వల్లభాయ్ పటేల్‌కు బేగంపేట విమానాశ్రయం వద్ద నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్వయంగా స్వాగతం పలికాడు.
రాజ్‌ప్రముఖ్‌గా నిజాం
- 1950, జనవరి 25న (భారత రాజ్యాంగం ఆవిష్కరణకు ఒక రోజు ముందు) భారత ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని హైదరాబాద్ రాష్ర్టానికి కూడా వర్తింపజేస్తూ ఒక ఫర్మానా జారీచేసింది. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జీవించి ఉన్నంతకాలం రూ.యాభై లక్షలు ఎలాంటి పన్నులు లేకుండా ప్రతి ఏటా రాజాభరణం చెల్లించాలని ఆ ఫర్మానాలోనే పేర్కొన్నారు. తన వ్యక్తిగత స్థిరాస్తులు, చరాస్తులు, వజ్రవైఢూర్యాలు, షేర్లు, సెక్యూరిటీలపై యాజమాన్య హక్కులు, అనుభవ హక్కులను మీర్ ఉస్మాన్ అలీఖాన్ కలిగి ఉండవచ్చునని ఈ ఫర్మానాలో పేర్కొన్నారు.
- 1947, ఆగస్టు 15కు ముందు నిజాం, అతని కుటుంబ సభ్యులు అనుభవించిన సౌకర్యాలన్నీ ఇకముందు కూడా కొనసాగుతాయని ఫర్మానాలో స్పష్టం చేశారు. హైదరాబాద్ రాజ్య పీఠం వారసత్వంతో పాటు నిజాంకు గల అన్ని హక్కులు, సౌకర్యాలు, హోదాలు, టైటిళ్లకు ఇదే ఫర్మానా ద్వారా భారత ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. 1950, ఫిబ్రవరి 8న నిజాం అభ్యర్థనపై మరో రూ.50 లక్షలు ప్రతి సంవత్సరం చెల్లించడానికి (మొత్తం కోటి రూపాయలు) ప్రభుత్వం అంగీకరించింది.
- ఫర్మానాలో హామీ ఇచ్చిన ప్రకారం 1950, జనవరి 26న మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ రాష్ట్ర రాజ్‌ప్రముఖ్‌గా ప్రమాణ స్వీకారం చేశాడు. 1956, నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్ర విచ్ఛిత్తి వరకు చివరి నిజాం రాజ్‌ప్రముఖ్‌గా కొనసాగాడు.
ప్రాక్టీస్ బిట్స్
1. ఆపరేషన్ పోలోకు అయిన ఖర్చును భారత ప్రభుత్వం ఏ శాఖలో చూపించింది?
1) వైద్యశాఖ 2) విద్యాశాఖ
3) రక్షణ శాఖ 4) హోం శాఖ
2. పోలీస్ చర్య ఎవరి నేతృత్వంలో జరిగింది?
1) జనరల్ మహరాజ్ సింగ్
2) జనరల్ జేఎన్ చౌధురి
3) జనరల్ రుద్ర
4) జనరల్ ఎల్ ఎడ్రూస్
3. కింది వాటిలో సరైనవి?
1) పోలీస్ చర్యలో భాగంగా షోలాపూర్ నుంచి దాడులు చేస్తున్న సైన్యానికి జనరల్ జేఎన్ చౌధురి నాయకత్వం వహించాడు
2) పోలీస్ చర్యలో భాగంగా విజయవాడ నుంచి దాడులు చేస్తున్న సైన్యానికి మేజర్ జనరల్ రుద్ర నాయకత్వం వహించాడు
3) 1 4) 1, 2
4. భారత ప్రభుత్వంపై ఐక్యరాజ్యసమితికి చేసిన ఫిర్యాదును నిజాం ఎప్పుడు వెనకకు తీసుకున్నాడు?
1) 1949, సెప్టెంబర్ 22
2) 1948, అక్టోబర్ 22
3) 1948, సెప్టెంబర్ 22
4) 1949, అక్టోబర్ 22
5. ‘భారతదేశ కడుపులో ఏర్పడ్డ హైదరాబాద్ రాజ్యమనే పుండు’ తొలగిపోయిందని వ్యాఖ్యానించింది?
1) సర్దార్ వల్లభాయ్ పటేల్
2) జవహర్లాల్ నెహ్రూ
3) రాజగోపాలచారి
4) కేఎం మున్షీ
6. హైదరాబాద్ రాష్ట్ర రాజ్‌ప్రముఖ్‌గా మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రమాణస్వీకారం చేసింది?
1) 1950, జనవరి 25
2) 1950, జనవరి 26
3) 1950, ఫిబ్రవరి 25
4) 1956, జనవరి 25
7. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జీవించి ఉన్నంతకాలం ఎన్ని రూపాయలు రాజాభరణం చెల్లించడానికి భారత ప్రభుత్వం ఒప్పుకొంది?
1) రూ.కోటి 2) రూ.50 లక్షలు
3) రూ.25 లక్షలు 4) ఏదీకాదు
8. హైదరాబాద్ రాజ్యంపై పోలీస్ చర్య జరిగింది ఎప్పుడు?
1) 1948, సెప్టెంబర్ 13-17
2) 1948, సెప్టెంబర్ 13-18
3) 1947, సెప్టెంబర్ 13-17
4) 1947, సెప్టెంబర్ 12-17
9. ఆపరేషన్ పోలో జరుగుతున్న సమయంలో భారత సైనిక శాఖ మంత్రి?
1) వల్లభాయ్ పటేల్ 2) బల్దేవ్ సింగ్
3) రాజగోపాల చారి
4) మహరాజ్ సింగ్
10. నిజాం పాకిస్థాన్‌కు ఎన్ని కోట్ల రూపాయలను రుణంగా ఇచ్చాడు?
1) రూ.25 కోట్లు 2) రూ.15 కోట్లు
3) రూ.20 కోట్లు 4) రూ.50 కోట్లు

Read Today's Latest Study-material Study-material Study-material News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

