ఒక దేశ పాలనలో అనుసరించాల్సిన మౌలిక చట్టమే రాజ్యాంగం. దేశ ప్రజల హక్కులు, సంక్షేమం దృష్ట్యా చూస్తే భారత రాజ్యాంగం అత్యుత్తమమైన రచన. దేశ ప్రజలకూ, ప్రజాస్వామ్యానికీ వజ్ర కవచంగా రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఈ సందర్భాన్ని ఏటా గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకొంటున్నాం. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన రాజ్యాంగంలోని కీలక విషయాలు ప్రస్తావించుకుందాం.
భారతదేశ పరిపాలనకు అవసరమైన మౌలిక పుస్తక రచన కోసం వివిధ రంగాల ప్రముఖులతో 1946లో ఓ రాజ్యాంగ సభ ఏర్పాటైంది. దీనికి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాజ్యాంగ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన ‘డ్రాఫ్టింగ్ కమిటీ’ (రచనా లేదా ముసాయిదా సంఘం)కి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అధ్యక్షత వహించారు. రాజ్యాంగ సభకు సలహాదారుడిగా ప్రఖ్యాత న్యాయ కోవిదుడు బెనెగల్ నరసింగ రావు వ్యవహరించారు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో రాజ్యాంగ సభ భారత రాజ్యాంగ రచనను పూర్తిచేసింది.
రాజ్యాంగ రచన 1949 నవంబర్ 26 నాడు పూర్తయింది. అయితే, ఇది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 అధికరణలు, 8 షెడ్యూళ్లు, 22 భాగాలు ఉన్నాయి. ప్రస్తుతం 450 అధికరణలు, 12 షెడ్యూళ్లు, 25 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలతో పోలిస్తే భారతదేశ రాజ్యాంగమే అతిపెద్దది.
సమాఖ్య తరహా దేశాల్లో రెండు పౌరసత్వాలు ఉంటాయి. అంటే ఒకటి దేశ పౌరసత్వం. ఇంకొకటి పౌరుడు నివాసం ఉండే రాష్ర్టానికి సంబంధించింది. కానీ, భారతదేశంలో మాత్రం పౌరసత్వం ఒక్కటే. రాష్ర్టాలకు విడిగా ఉండదు. ఏ రాష్ట్రంలో ఉన్నా భారత పౌరులే.
కుల, లింగ, మత, స్థాయితో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు ఎన్నికల్లో ఓటు వేయడానికి మన రాజ్యాంగం అర్హత కల్పించింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 21 ఏండ్లు నిండిన వారికే ఓటుహక్కు ఉండేది. దాన్ని 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 1989లో 18 ఏండ్లకు తగ్గించారు. మరో విశేషం ఏంటంటే పురుషులతోపాటే స్త్రీలకూ ఓటు హక్కు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, ధనికులు, పేదలు అనే తేడా లేకుండా అందరికీ ఓటుహక్కును రాజ్యాంగ బద్ధంగా ప్రసాదించిన తొలి దేశం భారతదేశమే.
రాజ్యాంగంలోని మూడో భాగంలో ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. ఇవి ప్రతి పౌరుడూ పుట్టుకతోనే అనుభవించాల్సినవి అన్నమాట. వీటిని రాజ్యాంగంలో 12వ అధికరణ నుంచి 35 వరకు పేర్కొన్నారు. మొత్తం ఆరు రకాలైన ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఉన్నాయి. అవి..
1. సమానత్వపు హక్కు- ఆర్టికల్ 14-18
2. స్వేచ్ఛా స్వాతంత్య్రపు హక్కు- ఆర్టికల్ 19-22
3. పీడనాన్ని నిరోధించే హక్కు- ఆర్టికల్ 23-24
4. మత స్వాతంత్య్రపు హక్కు- ఆర్టికల్ 25-28
5. విద్యా, సాంస్కృతిక హక్కు- ఆర్టికల్ 29-30
6. రాజ్యాంగ పరిరక్షణ హక్కు- ఆర్టికల్ 32