‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.5 వేల బహుమతి పొందిన కథ.
అయాన్ ఫోన్ శబ్ధం చేయకుండా స్క్రీన్ మాత్రమే వెలిగింది. ఇంట్లో వాళ్ల నాన్న ఉండటంతో తనుకూడా సైలెంట్ మోడ్‌లో మెలగాల్సి వస్తున్నది. సమీర నుంచి వాట్సప్‌లో మెసేజ్ వచ్చింది. కొత్తగూడెంకు చెందిన ఎవరో ఇద్దరు ప్రేమికులు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి పెట్టుకున్న దరఖాస్తును పంపింది. అమ్మాయి మెజారిటీ, అబ్బాయి మైనారిటీ అని అందులో ఉన్న ఫొటోలు, పేర్లని బట్టి తెలుస్తున్నది.
‘మరో లవ్‌జిహాద్. అమ్మాయి తల్లిదండ్రులకు ఈ విషయం చేరేంత వరకు షేర్ చెయ్యండి..’ అని, వాటితోపాటు ‘ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్’ అన్న లేబుల్‌తో వచ్చిందా సందేశం.
‘వీళ్లు ఇట్లెందుకున్నరబ్బ? ఎవరిష్టం వాళ్లదని ఇడ్శిపెట్టచ్చు గదా? ఆళ్లుగుడ బైట ఎట్లున్నదో తెల్సి ఈ నెత్తినొప్పులు ఎందుకు పెట్టుకుంటరో?’ అని వాటి కింద ఆమె పంపిన మెసేజ్ కూడా ఉంది. తను అనవసర విషయాలకు టెన్షన్ పడుతుంటుందని అతని భావన. ఏం సమాధానం ఇవ్వాలో తెలియక..
‘పోనీలే.. వదిలెయ్! అవును అసలారోజు పది నిముషాల్లో వస్తానని గంట వరకు రాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. వస్తున్నా అంటావు కానీ రావు. అప్పుడే ఊహించాల్సింది.. ఫ్యూచర్లో కలవటానికి కూడా ఇలాగే డిలే చేస్తావని’ అంటూ రిప్లయి ఇచ్చి టాపిక్ మార్చాడు.
‘ఫోన్ల చాటింగ్ చేస్తున్నం. మాట్లాడుకుంటున్నం సాలదా? కలవనీకి అంటె ఇంట్ల కారణం చెప్పాల. ఆరు గంటలు బస్‌ల కూసుండాల. అంతవుస్రం ఏమున్నదిప్పుడు? ఇంతకుముందు ఏమన్నవు.. గంట వరకు రాలేదా? హ హ.. అయినా నువ్వింకా ఫస్టు రోజును మర్చిపోలే?’.. లోగొంతుకతో రికార్డ్ చేసి పంపినట్టుంది. హెడ్సెట్లో హస్కీ వాయిస్ చెవుల గుండా లోపలికి వెళ్లి.. గుండెను హత్తుకున్నట్టు అనిపించి, అతని చేతిమీద రోమాలు క్షణకాలం నిక్కబొడుచుకున్నాయి. ఆ అమ్మాయికి టైప్ చేయటమంటే బద్ధకం! అందుకే వాయిస్ మెసేజ్. ఇంట్లో పరిస్థితులను బట్టి స్వరంలో హెచ్చుతగ్గులుంటాయి.
బ్యాంక్, గ్రూప్ ఉద్యోగ పరీక్షల కోసం అతను ప్రిపేర్ అవుతున్న సమయంలోనే.. ఉపాధ్యాయ పరీక్షల కోసం ఆమె సిద్ధమవసాగింది. ఇద్దరికీ కామన్‌గా ఉండే జీకే, ఇంగ్లిష్ మొదలైన సబ్జెక్టులు చెప్పే కోచింగ్ సెంటర్ దగ్గరికి.. నోటిఫికేషన్ వెలువడిన మరునాడే వెళ్లినప్పటికీ, అడ్మిషన్ కోసం బయటున్న కుర్చీల్లో చాలాసేపు ఎదురుచూసేంత మంది వచ్చారు. లగేజ్‌తో సహా వచ్చి అతని పక్కనే కూర్చుంది. కాసేపటికి తన స్నేహితురాలు.. ‘హాస్టల్ దొరికింది’ అని ఫోన్ చేయడంతో, సామాన్లు చూడమని చెప్పి అతని నంబర్ తీసుకొని, గబగబా వెళ్లిపోయింది.
జరిగింది గుర్తొచ్చి..
‘హ హ.. ఏం చెయ్యాల మరి! ఆ హాస్టల్ చెండాళంగా ఉంది. అక్కడున్న అన్ని హాస్టల్లూ సూశి, లాష్టుకి ఒక్కటి కొంచెం పోపు అన్పించి అడ్వాన్స్ ఇచ్చచ్చే సరికి.. ఆ టైం అయ్యింది’ అని మెసేజ్ పంపింది.
‘అసలారోజు లగేజ్ తీసుకొని పారిపోయుంటే తెలిసేది’ అని పంపాడు.
కుదిరినప్పుడల్లా వాళ్లు మొదటి నుంచి అన్నీ నెమరు వేసుకొని గుర్తుచేసుకుంటూ, తద్వారా ఎన్నో యుగాలుగా ఒకరికొకరు తెలిసిన వాళ్లమన్న లోకంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు.
‘నోట్లె యేలు వెడ్తె కొర్కడన్నట్టుండె నీ మొకం. అందుకే నా సామాన్ నీకప్పజెప్పిన హ హ..’ అంటూ తెరలు తెరలుగా నవ్వుతున్నదామె.
దూరం నుంచి వాళ్లమ్మ గొంతు..
“ఏందే.. ఎంతసేపు నగుడు? పంటె కాదా?” అని.
ఇంతలో వాళ్ల నాన్న..
“ఏదో సినిమా సూస్తున్నట్టు ఉన్నది. పంటది తియ్!” అంటూ.
నవ్వు ఆపుకొంటూనే..
“ఆ.. పంటున్ననే!” అన్నది.
‘సరె బై.. మరి!’ అంటూ చాటింగ్ ముగించింది.
ఆ కోచింగ్ సెంటర్లో ఉదయం తొమ్మిది వరకు క్లాస్ అయిపోగానే, సైన్స్ సబ్జెక్ట్‌లో తర్ఫీదు కోసం దగ్గర్లోని మరో సెంటర్‌కి వెళ్లేది. ఆ అబ్బాయి నిదానంగా పది గంటల బ్యాచ్‌లో వచ్చేవాడు. దాంతో ఇద్దరికీ కలుసుకునే అవకాశం ఉండేది కాదు. అయితే నోటిఫికేషన్లకు సంబంధించి ఏదైనా కొత్త విషయం తెలిసినా, కొత్త స్టడీ మెటీరియల్ ఏమైనా దొరికినా ఫార్వర్డ్ చేసుకునేవారు.
ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకోవడానికి వారి ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం అకౌంట్లు ఉపయోగపడ్డాయి. ఇద్దరూ ఖాళీగా ఉన్న రోజు, ఒకవైపు పనులు చేసుకుంటూనే మరోవైపు రోజంతా వాయిస్ మెసేజ్‌ల రూపంలో మాట్లాడుకుంటూ.. పక్కపక్కనే గడుపుతున్న అలౌకిక భావనలో ఉండేవారు.
మరునాడు రాత్రికి..
‘ఏం జేస్తున్నవ్?’ అని వాయిస్ మెసేజ్ పంపింది.
ఆమె గొంతులో అలజడిని పసిగట్టి..
‘ఏమైంది’ అని అడిగాడు.
ఒక వీడియో పంపించింది. అందులో బురఖా ధరించిన ఒక యువతిని, బొట్టు పెట్టుకొని ఉన్న ఒక యువకుడు బైక్‌మీద తీసుకెళ్తుండగా కొంతమంది వెంబడించి ఆపి.. అతన్ని కొట్టి మరోసారి ‘వాళ్ల’ అమ్మాయిలతో తిరగొద్దని వార్నింగ్ ఇచ్చారు.
‘ఇట్లాంటియి చూస్తే భయమైతదబ్బ!’.
‘నువ్వెందుకు అంత టెన్షన్ పడతావు? అది జరిగింది ఇక్కడ కాదు. ఎక్కడో నార్త్‌లో! ఏదో ఎమర్జెన్సీ ఉందంటే అతను లిఫ్ట్ ఇచ్చాడని తర్వాత తెలిసింది. ఆ వీడియో వైరల్ అయ్యాక ఇక్కడ హైదరాబాద్‌లోని పెద్ద రాజకీయ నేత.. అలా చేయకండని గట్టిగా చెప్పాడు. అయినా మనకా ప్రాబ్లం లేదు కదా!’.
‘హా కరక్టే! కానీ, కొంచెం భయమైంది. అయినా ఈ పొలిటీషియన్లని నమ్మొద్దబ్బ.. వాళ్ల స్వార్థం కోసం అనవుస్రంగ జనంతోని ఆడుకుంటరు’. ‘ఆ వీడియో గొడవలో అసలు విషయం మర్చిపోయాను. రేపు భైంసా రావడం కుదురుతుందా?’.
అయాన్ వాళ్ల నాన్నని గల్ఫ్‌లో ఉండే ఆయన స్నేహితుడు ఒక బిజినెస్ ప్రపోజల్ మీద నిర్మల్ జిల్లాలోని భైంసాకి వెళ్లిరమ్మన్నాడు. ఈ వయసులో అంతదూరం ప్రయాణం చేయలేక.. ఆ పనిని అయాన్‌కి పురమాయించాడు. భైంసాకి ఇరవై కిలోమీటర్ల దగ్గరలోని కుబీర్‌లో ఉంటున్న తనని కలవడానికి ఇదే మంచి అవకాశంగా భావించి ఆమెని అడిగాడు. ఆమె మనసులోనే ఎగిరి గెంతేసింది. ‘అయ్యో.. ఎందుకు రాను? తప్పకుండస్త’ అని పంపింది.
సమీర నాన్న ప్రభుత్వోద్యోగి కావటం వల్ల తనుకూడా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని, సబ్జెక్ట్స్ మీద పట్టు పెరగడానికి ఇంటికి దగ్గరగా ఉన్న స్కూల్లో టీచర్‌గా జాయిన్ అయ్యింది. జాబ్ నోటిఫికేషన్ పడ్డాక హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకొని పరీక్షలు రాసి.. తిరిగి ఇంటికి వచ్చి అదే బడిలో చేరి, ఫలితాల కోసం ఎదురుచూడసాగింది.
బెడ్ మీద బోర్లా పడిపోయి..
‘అసలెన్ని సార్ల కలిశినం?’.. ఎదురుగా ఉన్న నిలువుటద్దంలో తనని తాను చూసుకుంటూ ప్రశ్నించుకుంది.
‘మూడు సార్లు! ఇప్పుడు కలిస్తే నాలుగోసారి. అంతేనా!?’ అనుకుంది.
ఆ ఎక్స్ప్రెషన్ బాగా నచ్చేసి.. అతనికి మాత్రమే కనిపించేలా వాట్సప్‌లో స్టేటస్ పెట్టింది.
ఆ రీల్ చూశాడు అయాన్.
‘వెన్ యు రియలైజ్ దట్ యు మెట్ హిమ్ ఓన్లీ త్రైస్’ అన్న అక్షరాలు డాన్స్ చేస్తుంటే.. ఆశ్చర్యపోతున్న మొహంతో కళ్లను కుడి ఎడమలకు తిప్పుతున్న ఆమె లేత గులాబీలా మరింత అందంగా కనిపించింది. అది చూడగానే, నవ్వుతో చిన్నవవుతున్న కళ్లను మూసుకొని ఆలోచించాడు.
‘పరిచయమై ఆరు నెలలైనా, కలిసింది కేవలం.. ఓహ్.. హౌ షేమ్ ఇట్ ఈస్?’ అనుకున్నాడు.
‘యు నో వాట్?’ ఏదో గుర్తొచ్చిన సంతోషంలో వాయిస్ మెసేజ్ పంపాడు.
‘ఏంది?’.
‘ఏం లేదు. కలిసాక చెప్తా!’.
ఒకరినొకరు ఇష్టపడ్డారన్న విషయం కూడా ఎరుకలోకి రాకుండానే వారి మనసులు అలా సర్దుకున్నాయి. ఇంతవరకు ప్రపోజ్ చేసుకోలేదు కాబట్టి అతనేం చెప్తాడోనని ఊహించగానే ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి.
అయాన్ తల్లిదండ్రులది శ్రీకాకుళం దగ్గర ఒక చిన్న ఊరు. కరువుకు తాళలేక అతను పుట్టకముందే హైదరాబాద్‌కు వలస వచ్చారు. అతను పుట్టిన మూడేళ్ల వరకు ఇక్కడే ఉన్నాడు. చెల్లి పుట్టగానే అతన్ని అమ్మమ్మ వాళ్లింటికి పంపించారు. సెలవుల్లో వచ్చిపోతూ పది వరకు అక్కడే చదువుకొని, తర్వాత ఇక్కడికి వచ్చి ఇంటర్ నుంచి పీజీ వరకు పూర్తి చేశాడు. అక్కడి స్థానికత ఉండటంతో ప్రభుత్వ సంబంధిత పరీక్షలకు వెళ్లి రాసి వచ్చేవాడు.
‘యు నో వన్ మోర్ థింగ్? మనం మొదటిసారి శుక్రవారం రోజు కలుసుకుంటున్నాం!’ అని పంపాడు.
‘అవునా?’.
‘నీకు శుక్రవారం బాగా ఇష్టం అనుకుంటా?’.
‘హా.. నీకేమన్న తక్కువనా? అసలే మీకు బిజినెస్ ఉంది కదా! మీక్కొంచెం ఎక్కువనే ఇష్టముంటది!’.
అబ్బాయి నాన్నకు ఫుట్‌వేర్ షాపుంది. చిన్నప్పటి నుంచీ నాన్న ఒడుదొడుకుల్ని చూస్తున్న అతనికి.. ప్రభుత్వరంగ ఉద్యోగం ఉంటేనే భద్రత అని నమ్మి ప్రయత్నిస్తున్నాడు.
‘ఆరోజు ఇద్దరం ట్రెడిషనల్‌గా తయారై కలుద్దామా?’.
ఆ ఐడియా అమ్మాయికి బాగా నచ్చింది. పైగా మళ్లీ ఎప్పుడు కలుస్తారో తెలియదు కాబట్టి..
‘సరే!’ అని మెసేజ్ చేసింది. ఆమె పొద్దున్నే లేచింది. చిలకపచ్చ రంగు పట్టుశారీ కట్టింది. లిప్ లైనర్‌తో బార్డర్ వేసింది. ముందే చెప్పడంతో ఇద్దరు స్నేహితురాళ్లు ఇంటికి వచ్చారు.
“భైంసాల చిన్న ఫంక్షన్ ఉంది. పొయస్తం!” అని ఇంట్లో చెప్పింది.
“ఎందుకు బిడ్డా అనవస్రంగా?” అన్నది సమీర అమ్మ కాస్త భయపడుతూ!
“ఇట్ల భయపడితె ఎట్లమ్మ? అట్లనే గోపాల్‌కృష్ణ మందిర్‌కి పోక మస్తు రోజులాయె. జల్ది అచ్చేస్తం!”.
“లేట్ జేస్కోకుండ్రి మల్ల..” అన్నది అమ్మ.
భైంసా మార్కెట్ దగ్గర దిగగానే అక్కడ కనిపించిన తునికిపండ్లు తీసుకుంది.. అబ్బాయికి రుచి చూపిద్దామని. ఆ ఊళ్లో మాత్రమే తయారయ్యే ‘కలామ్’ స్వీట్‌ను కూడా ప్యాక్ చేయించింది.
గుడికి వెళ్లి దర్శనం చేసుకొని, అక్కడే కిసాన్ గల్లీలో ఉన్న ఒక బేకరీలో కూర్చున్నారు. టెన్షన్ టెన్షన్‌గా అటూ ఇటూ చూస్తూ అన్నీ గమనిస్తూ ఉన్నారు. మూడు నెలల క్రితం మొదలైన గొడవల వల్ల ఆ ఏరియా సమస్యాత్మక ప్రాంతంగా మారింది. కానీ, అక్కడ కలుసుకోవడం ఒకరకంగా ‘సేఫ్’ అని రమ్మంది. ఇప్పుడంతా సర్దుకుంది కానీ.. ఎప్పుడు ఏ క్షణంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కాదు. అతను తొందరగా వస్తే కాసేపుండి గుడికి తీసుకెళ్లాలని ఎదురుచూస్తూ కూర్చుంది. మొహంలో తెలియని నవ్వు, మనసులో కనిపించని ఆత్రం తగ్గక ముందే.. వెనుక నుంచి వచ్చి..
“హాయ్” అన్నాడు. వెనక్కి తిరిగి చూసింది సమీర. ట్రిమ్ చేసి ఉన్న సన్నని గడ్డం మీసాలు, నల్లని జుట్టును కప్పి ఉంచిన తెల్లటి టోపి, కళ్ల కింద సుర్మా, తెల్లటి లాల్చీ పైజామలో.. మరింత రంగు తేలిన అయాన్‌ను చూస్తూ..
‘ఓళ్లీళ్లు? యాడ్నో సూశినట్టుంది?’ అనుకున్నది.
“సమీరా! నేను..” అంటూ.. నుదుటన కుంకుమతో, దాని కింద చిన్న స్టిక్కర్‌తో, వీరబూసిన జుట్టును చిన్న క్లిప్‌తో జతచేసిన ఆమెని చూసి ఆశ్చర్యపోయాడు. మూడు రోజులు నీళ్లు పోయకుంటే వాడిపోయిన రోజాలా..
“అయాన్.. నువ్వేనా? ఇట్లున్నవేంది?” అన్నది. అప్పటికే సమీర ఫ్రెండ్స్ అతని వంక బిగుసుకుపోయి భయంగా చూస్తున్నారు. చుట్టూ ఉన్నవాళ్లు వీళ్లని గమనిస్తున్నారు.
“ట్రెడిషనల్‌గా రెడీ అవుదామని అనుకున్నాం కదా! కానీ, నువ్వేంటి ఇలా?” షాక్ తగిలినట్టుగా అన్నాడు.
సమీర ఫ్రెండ్ ఆమె చెవిలో..
“సుట్టూరుగ సూడే ఒకసారి” అన్నది.
పక్క టేబుల్ దగ్గరున్న ఒకతను పళ్లు కొరుకుతూ చూస్తున్నాడు. బేకరీ షాపు ఓనర్ వీళ్లని తీక్షణంగా గమనిస్తూ ఫోన్ తీసి ఎవరికో కలుపుతున్నాడు.
ఈ లోకంలోకి వచ్చిన సమీర బేలగా చూస్తూ..
“ఈడ్నుంచి ఎంబటే యెళ్లిపో!” అన్నది. అసలేం అర్థంకానట్టు చూశాడు అతను.
“నువ్వింకో ఐదు నిమిషాలు ఈడ్నే ఉంటె.. అటూ ఇటూ కల్పి పదిండ్లు కాలిపోతయి. జప్పున పో!” అన్నది కాస్త గట్టిగా. చుట్టూ ఓసారి చూసి క్షణం ఆలస్యం చేయకుండా బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్లిపోయాడు.
“బేటీ.. ఏమంట?” అన్నాడు అనుమానంగా చూస్తూ.. పక్కనున్న వ్యక్తి.
“ఏంలే కాక.. హైద్రవాద్కెంచి అచ్చిండట. ‘ఖాజీ గల్లి యాడుంటది?’ అంటే తెల్వదన్న!”.
“గంతే అనాల..” అని ఊరుకున్నాడు. సమీర, ఆమె దోస్తుల కాళ్లూ చేతులు వణుకుతుంటే కాసేపు అక్కడే కూర్చొని స్థిమితపడి ఇంటికొచ్చారు.
‘అయాన్.. మీరు ముస్లింలా? నాకెందుకు జెప్పలేదు!? నీ లాంగ్వెజ్, డ్రెస్సింగ్తోని ఇన్నిరోజులూ మావోళ్లనే అనుకున్న!’ అని వాయిస్ మెసేజ్ చేసి.. రిప్లయి కోసం ఎదురు చూడసాగింది. అతని దగ్గరి నుంచి సమాధానం రాకపోయేసరికి, అతని సోషల్ మీడియా అకౌంట్లు చెక్ చేసింది. ఎక్కడా ఒక్క పోస్టు, డీపీ కూడా అతను ముస్లిం అని తెలిసేలా కనిపించలేదు. ఇంటికి చేరుకున్న తరువాత రాత్రి పదిన్నర ప్రాంతంలో చూసుకున్న అతను..
“సమీరా.. నువ్వూ నాలాగా ముస్లిం అనే ఇన్ని రోజుల్నుంచి అనుకుంటున్నా. నువ్వు ఒక్కసారి కూడా బొట్టు పెట్టుకున్నట్టు గుర్తులేదు. వేళ్లకు ఉంగరాల్లాంటివి కనిపించలేదు కదా!’ అని తిరిగి వాయిస్ మెసేజ్ పంపించాడు.
‘గవన్నీ నాకిష్టముండయి. అయినా నువ్వు మీవోళ్లందరి లెక్క మీసాలు తీసి గడ్డం ఎందుకు పెంచుకోలె?’.
‘అందరు అలా ఉండరు!’.
‘నీకు మా దేవుడి పేరు పెడితె నాకెట్ల డౌటస్తది?’.
‘అది మా వాళ్లందరూ పెట్టుకునే పేరు. గాడ్స్ గిఫ్ట్ అని అర్థం. అసలు నువ్వు మా పేరెందుకు పెట్టుకున్నావు?’.
‘అది పువ్వు పేరు. మాదాంట్లో చాలా మందికుంటది. నీ లాంగ్వేజ్ ఎందుకంత న్యూట్రల్గ ఉంటది?’.
‘నేను టెంత్ వరకు ఆంధ్రాలో చదివానని చెప్పా కదా. అక్కడ మా వాళ్లెవరూ ఇక్కడిలా ఉర్దూ – హిందీ మాట్లాడరు. మొత్తం తెలుగే. ఇక్కడికి వచ్చాక నా స్లాంగ్ ఎవ్వరికీ అర్థం కావట్లేదని న్యూట్రల్‌గా మాట్లాడటం అలవాటు చేసుకున్నా’.
కాసేపు ఇద్దరి ఫోన్లలో నిశ్శబ్దం రోమింగ్ చేసింది. గతంలో కలిసినప్పుడు క్లాసుకు టైం అవుతుందన్న హడావుడిలో ఒకర్నొకరు సరిగ్గా గమనించుకోలేదని అర్థం అయ్యింది. ఒకరికొకరు నచ్చారని తెలుసుకున్నాక కలవడం మాత్రం ఇదే మొదటిసారి.
‘ఐ స్వేర్ సమీరా! నువ్వు నిజంగా మావాళ్లు అనుకొనే నేను లైక్ చేశాను’.
‘నేను కుడ.. నువ్వు మావోళ్లనుకునె ఇష్టవడ్డ! నీకు చాలాసార్లు చెప్పిన కద.. నాకెంత భయమో! మూడు నెల్ల కిందట జరిగిన గొడవలల్ల ఇక్కడ ఇండ్లు బండ్లు కాలవెట్టిండ్రు!’.
‘ఇప్పుడేం చేద్దాం?’.
‘మీది అంధ్రా అని ఎట్ల చెప్పల్నో నాకిప్పటికీ సమజ్ కాదు. అసుంటిదిప్పుడు వేరే మతం అంటె.. ఇంట్ల చెప్పుడు నాతోని కాదు అయాన్’.
‘మనిద్దరం మతం పట్ల ఏదీ తలకెక్కించుకోకుండా న్యూట్రల్‌గా ఉన్నాం. పైగా ఇతర మతాల పట్ల మనిద్దరికీ గౌరవమే ఉంది. మనిద్దరం ఎవరి మతాన్ని వారు ఆరాధిస్తూ జీవితాన్ని గడపొచ్చు కదా?’.
‘అట్ల ఉండదల్గి మనం సెలబ్రిటీలం కాదు. ఆళ్లకు సొంతంగ సెక్యూరిటీ ఉంటది. మనకేముంటది? ఇక్కడ భైంసాల జరిగిన అల్లర్లల్ల రక్తాలు కారినయి, కాళ్లు చేతులిర్గినయి, తలలు వల్గినయి. పొలిటీషియన్లు, పైసలున్నోళ్లు కిందున్నోళ్లని మతం సెంటిమెంట్తోని రెచ్చగొడుతున్నరు. ఆళ్ల పిల్లలు మాత్రం పెద్ద సదువుల కోసం ఫారెన్ పోతున్నరు. ఈడ లొల్లి వెట్టుకొమ్మని చెప్పే మతమోల్లతోని ఆళ్లు వేల కోట్ల బిజినెస్‌లు పెడుతున్నరు. కని ఈడ మధ్యతరగతోళ్లు, కింది తరగతోళ్లు ఈ గొడవల్లల్ల పడి.. అటు పైసలు, ఆరోగ్యం, ఇటు పిల్లల సదువు లాసై కోర్టు జైళ్ల సుట్టూత తిరుగుతున్నరు. నువ్వు హైద్రబాదుల ఉండి సూస్తున్నవ్. నీకర్థం కాదు. ఈడ ఒక మతమోళ్ల దుకాండ్ల ఇంకో మతమోళ్లు అడుగువెడ్తలేరు. ఏం కొంటలేరు’.. జీరబోయిన గొంతుతో వాయిస్ మెసేజ్ పంపింది సమీర.
అయాన్‌కి పొద్దున అందరూ తనని చూసిన చూపులు గుర్తొచ్చాయి. సమీరా భయపడుతూ తనని ఎందుకు వెళ్లిపొమ్మందో అర్థమైంది. నెట్లో వెతికి ఫొటోలు, వార్తలు చూసి నుదుటిన వచ్చిన చెమటను తుడుచుకున్నాడు. ఆ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య గతంలో ఒకసారి గొడవలు జరిగినా సద్దుమనిగింది. కానీ, మూడు నెలల క్రితం జరిగిన అల్లర్లలో తీవ్ర ఆస్తి నష్టంతోపాటు చాలామంది గాయపడ్డారు. 38 మందిని అరెస్టు చేసి, 66 మందిని బైండోవర్ చేసి, 26 కేసులు నమోదు చేసి, 500 మంది పోలీసులు పహారా కాస్తే తప్ప.. శాంతి భద్రతలు నెలకొనలేదన్న విషయం తెలుసుకొని హతాశుడయ్యాడు. కానీ, ఆశ చావక, సమీరకి కాల్ చేశాడు.
ఫోన్ తనలా వణికిపోతుంటే, మెల్లిగా రూమ్ తలుపు మూసేసి లిఫ్ట్ చేసింది.
“అలా కాదు సమీరా! మనం బాగా కలిసిపోయాం. ఒకర్నొకరం అర్థం చేసుకున్నాం కదా!” అన్నాడు.
“మా అమ్మానాయినకు నేనొక్కత్తే బిడ్డెని. ఆళ్లని ఇడ్సవెట్టి రాను. ఆళ్లను ఒప్పిచ్చే చేసుకోవాల. ఇంకొక పదేండ్ల సర్వీసున్నది నాయినకు. అప్పటిదాక మావోళ్లు ఈన్నే ఉండాల. ఒక్యాల మావోళ్లని ఒప్పిచ్చి చేసుకున్నా.. దేశంల యాడ మతఘర్షణలైనా మనమీద కోపంతోని రెండు వర్గాల జనం మా ఇంటి మీది కొస్తరు. అగ్గే వెడ్తరో, నెత్తే వలగ్గొడ్తరో తల్సుకుంటెనే భయమైతుంది. ఇప్పుడు కీడు దినాలు నడుస్తున్నయి దేశంల. నన్ను ఇడ్సవెట్టెయ్!” వణుకుతున్న గొంతులో బాధ, భయం కలగలిపిన మాటలు వచ్చాయి.
“రోజులెప్పుడూ ఒకేలా ఉండవు సమీర. మంచి రోజులొస్తాయి. నాకా నమ్మకం ఉంది”.
“నాకు లేదు అయాన్! మన చేత్లేం లేదు. కొన్నేండ్ల నుంచి సూస్తున్న, మా దగ్గర్నే కాదు దేశం మొత్తం అంతే ఉంది. ఎప్పుడు ఏదో ఒక జాగల మతం లేకపోతె కులం మీద లొల్లి నడుస్తున్నది. ఓళ్లని సపోర్ట్ జేసే గౌర్నమెంట్ అస్తె ఆళ్లు రెచ్చిపోతున్నరు. ఊహల్ల బత్కుడు నాకు రాదు. మనం కల్శినమని నేను మర్శిపోత. నువ్వు గుడ మర్శిపో.. ప్లీజ్!”.
“ఐ లవ్ యూ సమీర. ఐ రియల్లీ లవ్ యూ!” చేజారిపోతున్న ప్రాణసఖికి, మళ్లీ చెప్పలేనేమోనన్న బెంగ కనిపించిందా గొంతులో.
“సేమ్ టూ యూ అయాన్” అని అనుకోకుండా వచ్చిన మాటలకు తల పట్టుకొని..
“అయ్యో.. ఐ మీన్ ఐ టూ లవ్ యూ” అన్నది కళ్లు మూసుకొని. బాధలో కూడా వచ్చిన చిన్న నవ్వును ఆపి..
“యు నో వాట్?” అన్నాడు. కళ్లలోంచి నీళ్లు జలపాతం అవుతుంటే..
“ఏందబ్బా?” అన్నది.
“విడిపోయే ముందు ఐలవ్యూ చెప్పుకొన్న జంట.. బహుశా ఈ ప్రపంచంలో మనమే కావచ్చు”.. మసక బారుతున్న కళ్లను తుడిచి చెప్పాడు.
“గుడ్ బై!” గద్గద స్వరంతో అన్నది.
“బై!”.. గొంతు బొంగురు పోతుండగా కట్ చేశాడు.
చాలాసేపు మోకాళ్లలో తలపెట్టుకొని ఏడ్చింది ఆమె. ఫోన్ తీసి..
“నువ్వు ఎవర్ని ప్రేమించాలన్న విషయం అసలు నీకేమాత్రం సంబంధంలేని వ్యక్తుల చేతుల్లో ఉందన్న నిజం తెలిసినప్పుడు..” అని టైప్ చేసి, అందరికీ కనిపించేలా, అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అది చూసిన అతను గుండె పగిలేలా మనసులోనే రోదించాడు.
అరుణ్ కుమార్ ఆలూరి దేశంలో అక్కడక్కడా మతం పేరుతో జరుగుతున్న సంఘటనలు.. స్వచ్ఛమైన మనసులను ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పే కథ.. ‘వెన్ రియలైజ్ దట్’. రచయిత అరుణ్ కుమార్ ఆలూరి. ఈయన స్వస్థలం నిజామాబాద్ జిల్లాలోని అభంగపట్నం. బీ టెక్ చేసి.. సినీ రచయితగా పనిచేస్తున్నారు. జయమ్మ పంచాయతీ, 8 ఏఎం మెట్రో చిత్రాలకు స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా, షరతులు వర్తిస్తాయి, టెన్షన్ కైకు బాబా సినిమాలకు కోరైటర్‌గా పనిచేశారు.
2007 నుంచి కథలు రాస్తున్నారు. ఇప్పటివరకు 20 కథలు, 20 నానీలు రాశారు. మేడిపండు (ఆటా), మిణుకుమనే ఆశలు (తెలుగు వెలుగు), సుబ్బయ్య తాత పెళ్లి (విశాలాక్షి), సూపర్‌ఫాస్ట్ రైటర్ (సారంగ), తండ్లాట (నమస్తే తెలంగాణ), వంట చేయగలవా ఓ నరహరి (ఈనాడు) కథలు గుర్తింపు పొందాయి. దాదాపు అన్ని ప్రధాన పత్రికలలో ఈయన కథలు అచ్చయ్యాయి. అమెరికన్ తెలుగు అసోసియేషన్, వాసా ఫౌండేషన్ – సాహితీ కిరణం, తెలుగుతల్లి కెనడా, విశాలాక్షి, నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీ పీఠం, నవసాహితి ఇంటర్నేషనల్ (చెన్నై) నుంచి బహుమతులు, పురస్కారాలు అందుకున్నారు.
– అరుణ్ కుమార్ ఆలూరి 63058 16242