“ఆకలయితాందే”. ఎగిలిబారంగాల్నే రాజు గాడు అట్ల అడిగేసరికల్ల ఎల్లవ్వ మనసు కలుక్కుమన్నది.పాడు ఆకలి. రాజుగానికి రాతిరి సుత ఆకలాయే. సర్వలేమో యింత బువ్వ లేకపాయే. ఐనా అండుతందుకు రాజుగానికి ఆరేళ్లుంటయి. పోరనికి జరమొచ్చింది. వొళ్లు అగ్గి లెక్క మండ్తాంది. రెండ్రోజుల సంది ఆపతి వడ్తాండు. గది సూశి మల్లడూ బాధవడ్తనే వున్నడు. కానీ దవ్కనకు తీస్కవోను ముసలోని శేతిల పైసలేడియి.
‘వున్నొక్క పోరనికి బుక్కెడు బువ్వ గూడా వెట్టలేక వోతుంటిమయ్యా’ అన్న ఎల్లవ్వ మాటలకు, గుడిసెకు గంతదూరం వోయి దోశేడు కన్నీళ్లకు యెక్కువ యెడ్శిండు మల్లడు. కొడుకు ఫొటో సూసుకుంట.. “ఐనా ఆడు బతికుంటే నా మూసలోనికి ఈ గతి వట్టేది కాదని” ఎల్లవ్వ బాధవడ్డది.
యాదిగాడు.. మల్లని కొడుకు. ఆడు సచ్చి మూడేళ్లయితాంది. అమ్మా నాయినల్ని యిడ్సివెట్టి.. పోరన్ని, యింటామెని యెంటెస్కోని బాయి పనిజేయ్య దేశం వొయ్యిండు. మట్టిపెళ్లలు కూళీ, అయ్యి మీద వడి పాణమిడిశిండు. మూడేళ్ల రాజుగాడ్ని సంకలేస్కొని, పెనిమిటి పినిగని యేడ్సుకుంట యింటికి యేస్కచ్చింది కోడలు సుభద్ర. పటేళ్లు.. ఆ సచ్చిన పాణానికి రెండు వేలిచ్చి శేతులు దులుపుకున్నరని జెప్పి, అయ్యి మావకు అప్పజెప్పింది.సావూ, దినాల ఖర్సులకే గా పైసలు వడ్శినయి. దినాలెల్లిన మూడ్రోజులకు కోడలు యింట్ల నుంచి మాయమైంది. దోలాడి అల్శిపోయిన కులపోల్లు, పెనిమిటి వొయ్యిండన్న బాధల.. పిచ్చిలేశి యేటో తప్పివొయిందన్నరు. అటుపక్క ఎల్లవ్వకీ పాణం కరబైంది. ఇగ గప్పటిసంది మల్లడొక్కడే కూలీ నాలి జేత్తూ ముసల్దానికీ మనవడికి అన్ని అయి సూత్తాండు.
మట్టిపని తప్పించి మల్లనికి మరేపని రాదు. కాలువల్ని, బావుల్ని తవ్వుట్ల ఆన్నీ తీసి పడేసేటోడు లేడు. ఐనా పెద్ద పెద్ద అంత్రాలచ్చీ శేతి పని జేసేటోళ్ల వుపాధికి గండి గొట్టే గదా. అన్ని సోట్ల ఆళ్లకు పని దొరుకుడు కస్టమైంది.
రాజుగాడు ఆనాధైన కాడ్నుంచి ముసలోళ్లిద్దరూ సొంతూరనే మాటే మర్శిర్రు. కొడుకూ కోడలి లెక్కనే ఏ వూర్లే పనుందని తెల్సినా.. కడుపు శేత వట్టుకుని పోరడ్ని యెంటెసుకుంటున్నరు. కులపోల్లతో గల్సి ఆ సోటుకి వోతున్నరు. పని నడిశినన్ని రోజులూ గుడిసేలేస్కొని గక్కడే వుంటున్నరు. పని ఐపోయ్యిన్నాడు.. గిట్లనే మళ్లో కాడికి వలసవోతూ సంచార జీవితం గడుపుతున్నరు.
ఈ వూరికచ్చి గూడ కొద్ది దినాలే ఐతాంది. వచ్చీ రాంగానే మూడ్రోజుల పనైతే దొరికింది. అట్లొచ్చిన పైసల్తో యిన్ని దినాలూ పూట గడ్శింది. కానీ ఆరం సంది మళ్ల పనెక్కడిది!
ఏ వూరికి వొయినా పనిల కుదుర్కొనికి టైం వడ్తది. గుత్తదార్లూ, మేస్త్రీలు పరిచయం గావలే. యేడేడ యే పనులైతున్నయో తెల్సుకోవాలే. కులపోల్లల్లో జరంత సదువచ్చినొల్లిద్దరు అటువొయ్యి కూలీ మాట్లడుకరావాలే.
దినాం పని దొర్కుతనే నాలుగు పైసలు కండ్ల జూస్తడు మల్లడు. రెక్కలిర్గా జేయంగచ్చే ఆ పైసలు ఐద్రోజులు గూడా సరిపోవు. వొక్కోపారి రోజులకద్దీ పనే దొరకదు. గట్లయితే పొట్ట నిండదు. యింతకుమున్పు గాశారం బాలేక పస్తులుండాల్శిన దినాలు గూడా అచ్చే గానీ, రాజుగానికిన్ని గంజి మెతుకులైనా వెట్టిర్రు. కానీ యీసారట్ల గాలే. పోరనికి మందుగోళి యెయ్యనికి గూడా శేతిల పైసా లేకుంటైంది.
పక్కపోంటి యేడెనమిది గుడిసెలుంటయి. ఆపతికి యెవల్నన్న సాయమడుగుదామన్నా.. మనసు రాలే. ‘ఐనా యెవలు సాయమైతరు! యెవలి కస్టాలాళ్లయి. యే పూటకాపూట జేస్కుంటనే పూట గడిశే యెట్టి బతుకులు గదా’ అనుకుండు.
పోరడు “అమ్మా, అమ్మా” అనుకుంటా జరంతోనే మూల్గుతున్నడు. ఆకలైతున్నట్టు పొట్టని వత్తుకుంట సాప మీదనే అటీటూ బొర్లుతున్నడు. మనవడినట్ల సూశి ముసలోని కండ్లకు మళ్లా నీళ్లచ్చినయి.
‘యింకెక్కడి అమ్మ కొడ్కా. అసలుందో లేదో దెల్వని గతివట్టే నీకు.
కొడుకుని వోగొట్టుకున్న నాకేమో.. యీ గతివట్టే.’
అని మనసులనుకుంట మళ్లోపారి కుమ్లివొయ్యిండు.
కులపోళ్ల సప్పుడినిపిచ్చి గుడిసె బయటకచ్చిండు మల్లడు. అప్పుడే ఎగిలిబారిన.. రాబోయ్యే యెండ సూశనగా వొంటికి యేడిగా తగుల్తాంది. ఎగిలిబారకమున్పే పటేళెవరో అచ్చి పని జెప్పినట్టు కులపోల్లంతా తయారైతున్రు. కూలీకి పోవాలన్నట్టు దబ్బదబ్బ గట్కా తిని, గిన్నెలు కడుక్కుంటున్రు. కావ్ కావ్ మని అర్సనికి గూడా వోపిక లేనట్టే నాలుగైదు కాకులు యేపశెట్టు మీదచ్చి కుసున్నయ్. యే గుడిసె ముందైనా యిన్ని మెతుకులు వడ్తయని నోరు తెర్శీ, కండ్లప్పగిచ్చి అటీటూ సూత్తున్నయి. కాకుల్ని సూస్కుంట యింత పండ్ల పుల్ల తెంపి నోట్లేసుకుండు మల్లడు.
కులపోల్లంతా ఆగమాగం గుడిసెల్లోంచి బైటికొత్తున్రు. ఆడోళ్లంతా గోశిలు పెట్టుకున్రు. మొగోళ్లంతా లుంగీలు సరి చేసుకున్రు. నేలమీది పారలూ, గడ్డ పారల్ని యెడమ కాలితో లేవదన్నీ వంగకుండానే ఆటిని జేత వట్టుకుంటున్రు. ఆళ్ల ఆడోళ్లంతా గంపల్ల సర్దిన సద్ది మూటలు నెత్తినెత్తుకుంటున్రు. యిదంతా జూసిన మల్లనికి గుండెల రాయి వడ్డట్టైంది. పని దొరికీ, కూలికి వోతున్నట్టు తనకెవలూ జెప్పలేదని దుక్కం పొడుసుకచ్చింది.
“యేమాయేరా పని దొరికేనా? వొక్కడూ జెప్తలేడేమిరా?” అని సూరన్ని అడిగిండు మల్లడు.
సూరడు యినిపించుకోలే.
“యేమాయేరా..?” మళ్లోపారి అడిగిండు.
‘వొయ్యేది యెంచర్ల పనికి. గాడ పెద్ద సార్లు యే పని జెప్తరో! జంటలుండాలే. నీ వొక్కనితోటి యేడైతదే ముసలోడా?’ అన్నడు సూరడు.
“అయ్యో. ఆరం సంది పని లేకవాయే. గుడిసెల పొద్దుందాకా యేం జేద్దూ! యెంచర్ల పనైతే యేంది. నేను జూడనిదా. జేయ్యనిదా. నా పని నేనే జేత్త. ఓ దమ్ము గడ్డపారేత్తా. ఓ దమ్ము తట్టెత్తుకుంట. ముసలోడంటివేందిరా? పనిల యేనాడన్న సాయమడిగితినా నిన్ను. జేయకుండ తప్పించుకుంటినా? పని రానిదే గిడిదాకా అచ్చిన్నారా? నిన్నియాల నా ముందు పుట్టి పెరిగితివి. నాకే జెప్పవడ్తివేందిరో.” అని జరంత కోపంగ అన్నడు.
మధ్యల నర్సిగాడు కలగజేసుకుంట.. ‘ఓ మావా నువ్వేడ జేత్తావే గా పని. పెద్ద సారు సూత్తే మూసలోన్ని పట్టుకచ్చినరని మా మీద కోపమైతడు. యెనిమిద్రోజుల పని. నీ వల్ల కరబ్ చేసుకోవాల్నా?’ గద్దించి అన్నడు.
పక్కనుంచి యిదంతా యింటున్న మైసడు..
‘యేందిరా గప్పటినుంచి సూత్తాన్న. పెయ్యి గులగుల వెడ్తుందా? గాడ్ది కొడుకా. నువ్వేమన్న వశ్శోనివారా. శేతనైన వోలే ఇద్దరు జేశే పని వొక్కనివే శెత్తాన్నవావా?’ అని నర్సిగాని మీద గరమైండు.
మధ్యలొచ్చిన సూరీగాడ్ని గూడా.. ‘ఊకో బాడకవ్. భలే మాట్టడతాన్నవ్. కులపోడూ. మనల్ని నమ్ముకొని వొచ్చిండు. ముసలోడు అత్తాంటే యెనకేసుకచ్చేదివొయ్యి.. పరాశ్కాలడ్తన్నవ్.’ అనంగనే నాల్క సర్సుకున్నరు సూరడూ, నర్సిగాల్లు.
‘నీ యవ్వ. యెవడేమంటడే సూత్తా. న్వుతే దావే పెద్దయ్య.’ అని మైసడు అనంగనే.. మల్లడు మొఖాన యిన్ని నీళ్లు కొట్టుకుని తువాళ, గడ్డపార అందుకుని పయనమైండు.
యెంచర్లకి వొంగనే సూపరైజరుకి దూరం నుంచే వో నమస్తే కొట్టిన్రు కులపోల్లు. అంతా వొక్క కాడా కూడిన్రు. పనిముట్లు శేతవట్టి పని షురు చేసిన్రు. భూమికి పలుగుడు వడుతున్నట్టు యెండ ఘోరంగా మండవట్టింది. ఇయ్యేవీ వట్టనట్టుగా మోగోళ్లంతా గట్టెమ్మటి గడ్డపారేసి తవ్వుతున్రు. ఆడోల్లంతా తట్టల్లో మట్టి నింపి శెట్లు వెట్టే సోట పోస్తున్రు.
గోశి సర్దుకుంట గడ్డపారేస్తున్న మల్లని నల్లటి పెయ్యి మీద.. శెమట నీరు నిగనిగ మెరుస్తాంది. సూత్తుండంగనే యెండ నడినెత్తికచ్చింది. గప్పటికే అల్సిపోయిన కులపోల్లంతా అన్నానికి దిగిన్రు. ఉప్పేసిన గంజన్నంల ఉల్లిగడ్డ, నిమ్మ తొక్కేసి జుర్రుతున్రు.
‘రావే పెద్దయ్య. సల్లబడి, ఇంత తిందువు’ అని మైసడూ, ఇంకొంతమంది పిలిశినా.. ఆకలైతలేదంటూ మల్లడు వోలే. పనిగాకుంటే పెద్దసారు గరమైతడని వొంట్లోని పాణవంతా తీసి మట్టిగడ్డ తవ్వుతనే ఉన్నడు.
మల్లనికి ఆకలి మీదకన్నా.. మనవని మీదకే పాణం గుంజుతాంది. ‘గుడిసెకెప్పుడు వొవాల్నో. ఆనికింత డబల్రొట్టే వెట్టి, మందుగోళీ యెప్పుడెయ్యాల్నో’ అన్న బాధే మనసుల మెదులుతాంది.
మల్లని పాలుకొచ్చిన పని సగం గూడ ఐతలేదని దూరం నుంచి జూస్తున్న కులపోల్లు అనుకుంటున్రు. అటుపక్క పని ఐపోవుడు సంగతి పక్కన వెడ్తే, తిండి లేక ముసలోని వొంట్లున్న వోపికైతే ఐపోవచ్చింది.
గట్టిగా వొక్క తవ్వుడు తవ్విన మల్లని గడ్డపారకి వో బండరౌతు తల్గింది. గడ్డపార మొన వంకరై, శేయి జారి కిందవడ్డది. అటెనక కాలూశేయిలు వణికి ముసలోడు గూడా వొక్కపారిగా కూలవడ్డడు.
“అయ్యో.. మల్లయ్య మావా కింద పడ్డడుర్లా” అని తినే సద్దిని పక్కనేశి వురికొచ్చిర్రు కులపోల్లు.
మల్లన్ని లేపీ, పక్కకు కుసవెట్టే పనిల కొంతమందుంటే, ముసలోడ్ని తోలుకస్తే గిట్లనే వుంటదని సూరీగాడు, నర్సీగాడు అన్నరు. ఆళ్లంతా వొక్కకాడ మూగేసరికల్లా సూపరైజరూ అటొచ్చిండు.
“కూలికచ్చి అందరూ వొక్కకాడ గూడి ముచ్చట వెడ్తున్నార్రా?” అని గుర్రుగా జూసిండు. పని మజ్జెల బండెళ్లిన ఇషయం గమనించిండు. ముసలోని గోస తెల్సుకుని అయ్యో పాపం అనుకుండు.
‘వో ముసలోడా, గీ పనికొస్తివి. నీతోని యేడైతదే. యీళ్లంతా రక్తం మీదున్నరు. నీ వల్ల గాదుగాని, రేపటిసంది మాకు నీ అసోంటి జీతగాడొకడు గావాలే. యెంచర్ సుట్టూ శెట్లు వెడ్తరు. రోజూ వొచ్చి ఆటికి నీళ్లు వట్టాలే. నెలకు పదిహేనొందలిస్తం. జేరుతవా పనిల?’ అన్నడు సూపరైజరు.
ఆ మాటతో మల్లని కళ్లల్ల నీళ్లాగాలే. కడుపు నిండినట్టయింది. దేవుడా, నా పోరన్ని సల్లంగా సూశినవ్ అని మనసుల మొక్కుకున్నడు. ‘గట్లనే అయ్యా. నీ బంచాన్. రేపట్నుంచి పనిలకొస్త. జెప్పిన పని జేస్తా’ అని సూపరైజర్తో అన్నడు.
ఆ మాటలకు మైసడు, ఆని పెళ్లాం, యింకొంత మంది కులపోల్లు మస్తు సంబురపడ్డరు. సూరిగాడు, నర్సిగాడు మాత్రం మూతి తిప్పుకున్నరు.
మల్లడు పస్తులున్న యిషయమిని.. “సరేగానీ నాతోటిరా. మా పెద్ద సారు ఆఫీసు రూము కాడా యింత కూడు తిని కడుపు సల్ల జేసుకుందువు” అన్నడు సూపరైజరు.
పెద్దొళ్లు పిలిశిర్రు, యెళ్లకపోతే యెట్లా అనుకుండు మల్లడు. పెట్టిన బువ్వల యింత తీస్కవొయి మనవని ఆకలి గూడా తీర్సొచ్చని ఆశవడ్డడు. ఆయన యెన్కమ్మటే పెద్దసారు ఆఫీసుండే యింటి దగ్గర్కి వొయ్యిండు.
మల్లన్ని యింటి లోపలికి తీస్కవోతూ.. “అమ్మగారూ. వున్నరా. మన కూలీకచ్చినాయనే అన్నం టిపినీ మర్చిపోయోచ్చిండంట. జర గింత బువ్వ వెడ్తరా” అని బయట్నుంచే అడిగిండు సూపరైజరు.
“యేంది. దారిన వొయ్యోటోళ్లందరినీ పట్టుకస్తన్నవా. నువ్వు శెప్పంగనే ఇస్తారేశి అడ్డించాల్న యిప్పుడు. యేదో దూరపు సుట్టానివని నౌకర్లకి తీసుకున్నడాయనే. నువ్వేమో రాన్రాను యిసుంట రమ్మంటే, యిళ్లంతా నాదే అంటన్నవ్. సూశీ సూడనట్టు వోతంటే యేర్పడ్తలేదు నీకు. గీడ వుద్యోగం శేయాలనుందా లేదా నీకు” అని లోపల్నుంచి అర్శిందామే.
“ముసలోడు అమ్మగారు. పాపం గావరై, కళ్లు తిరిగి వడ్డడు.” అన్నడు సూపరైజరు.
మళ్ల యిటు దిక్కేమో.. ‘శెప్పులిప్పూ. యీడనే కూసో.’ అని మల్లనికి మెల్లగా శేవుల జెప్పిండు.
“మా సార్ భార్య దేవత. శానా మంచిది. ఆ దూరంగా రెండంతరాలిళ్లు కనిపిస్తాంది సూడు. ఆమె గా యింట్లనే బిడ్డలతో కలిసుంటది. యిప్పుడిందులుందీ మా సారు ఉంచుకున్నామె. పొగరువోతు. మనుసుల్నీ లెక్క జేయ్యదు. మన లాంటోళ్లనింక పురుగులెక్క జూస్తది. వొకప్పుడు మీలెక్కనే కూలీ పని జేసేటిదంట. మా సార్‌ని వల్లెస్కోని, ఆళ్లతోనే ఆమె మొగడ్ని పక్కకు జరిపించి యిడికొచ్చిందంట.” అని మల్లనికి గొణుక్కుండా జెప్పిండు.
కాసేపటికి “కూలోడ్ని, కూలోని లెక్కనే వుంచాలి. పాపం అనుకుంట యింట్లకి తీస్కరావొద్దు. ఐనా ముసలోన్ని పనిలకెందుకు తీస్కున్నవ్. మా సొమ్మంత ఆగం జేస్తున్నవ్” అనుకుంట ఓ యిస్తరాకుల యింత అన్నం, పచ్చడేదో వట్టుకుని బయటికచ్చిందామే.
బగ్గ ఆకలి మీదున్న మల్లడు.. తనకెళ్లోచ్చే యిస్తరాకును గాకుండా ఆ ఆడ గొంతెక్కడ్నో యిన్నట్టనిపించి తలెత్తి జూసిండు. మొకం గూడా యెడ్నో జూసినట్టనిపిచ్చి, కళ్లు తూడ్సుకుని మళ్లోపారి జూసిండు. గతమొక్కపారి కండ్లముందు యాదికచ్చి మాయమైనట్టనిపిచ్చింది ముసలోనికి. బతికుందో, సనిపోయిందోననుకుంటున్న కోడలు సుభద్రను.. యెదురుంగ ఆ రీతిల జూసేసరికల్ల కండ్లు తిరిగినట్టనిపిచ్చింది. “కటు్టూ, బొట్టు అన్నీ మార్నయి. మెడల బంగారం, నెత్తిల మల్లెబూలు, వొంటికి శిల్కు శీర కట్టుకుని యేషకాంత లెక్కున్నంత వోలే దాన్నెట్ల మర్శిపోత” అనుకున్నడు.
“నోరొక్కటే శెడ్డది. వూకే మొగని మీదవడి వొర్లుతదేగానీ మనసు బంగారమనుకుంటి. కానీ బంగారమసొంటి నా యాదిగాన్ని మాయం జేశుంటదా ఇది” అనుకుంట గుండెల్నుంచి తన్నుకొస్తున్న యేడుపును ఆపుకున్నడు. కోపాన్ని అదిమిపట్టుకున్నడు. మొకాన్ని పక్కకు తిప్పి కూసుండు.
“యిదిగో పెట్టుకోపో. మీ సారు లేనిది జూసి యింకోపారి యిలాంటోళ్లందర్ని యింట్లకి తోల్కరాకు.” అనుకుంట ఆ అన్నం సూపరైజరుకిచ్చి ఆమె లోపల్కి వొయ్యింది.
సూపరైజరు యిస్తరాకుని మల్లని ముందు వెట్టిండు. ‘జెప్పిన గదనే గామె యెట్లాంటిదో. యెన్ని మాటలన్న నేను వట్టించుకోను. నువ్వు గూడ సప్పుడు జేయకుండ దబ్బున తిని యింటికి వో. రేపొచ్చి పనిల జేరు. నేను వోతన్న. గక్కడ పనెట్ల జేస్తున్నరో’ అనుకుంట యెల్లివొయ్యిండు.
ముసలోడు పచ్చడి మెతుకుల్నైతే కలిపిండు గానీ, ముద్ద నోట్లోకి వెట్టలేదు. యింకో దిక్కు మన్వని ఆకలి గూడా మతికి రాలేదు ఆ గడియల. శేతికంటిన ఆ యెర్రటి మెతుకులు జూస్తే కొడుకు రక్తపు కూడులెక్క అన్పిచ్చినయి. బలవంతంగా యిస్తర్లోకి వదిలించుకున్నడు. ‘అమ్మా బుక్కెడన్ని నీళ్లిత్తవా’ అని గట్టిగా పిల్శిండు.
“ఏయ్. నీకు బువ్వ వెట్టుడే యెక్కువ. యింక నీళ్లు గూడా నేనే యియ్యాల్నా” అన్నదామే.
మళ్లీ.. ‘అమ్మా..’ అని యింకింత గట్టిగనే వొర్లిండు మల్లడు.
“ఛీ ఛీ. అడ్డమైనొళ్లందర్నీ లోపలికి రానిత్తే యిట్టనే వుంటది.” అనుకుంట కొంతసేపట్కి నీళ్లు తెచ్చి మల్లని ముందు వెట్టింది సుభద్ర.
కళ్ల నుంచి దుంకుతున్న కన్నీళ్లను ఆగవట్టుకుంట పైకి లేసిండు మల్లడు. మావని జూసిన సుభద్ర ఒక్కపారిగా యెనక్కి జరిగింది. భయంతో యెనకాలున్న గోడకతుక్కుని కదలకుండా నిలవడ్డది.
కోడల్ని సంపేటంత కోపంతో పళ్లు కొరుక్కుంటా.. వో సూపు జూసిండు మల్లడు. తెచ్చిన నీళ్లను శేత గుంజుకుండు. యిసొంటి తిండి తింటే యెంత, తినకవోతే యెంత అనుకుంట దబ్బదబ్బ శేతులు కడుక్కున్నడు. “థూ. దీనవ్వ. పాడు ఆకలి.” అనుకుంట అక్కడ్నుంచి బైటకచ్చి, గుడిసెల దిక్కు నడ్శిండు.
అప్పటిదంకా బొమ్మలెక్క కళ్లు కిందకేశిన సుభద్ర, మల్లడు అటు తిరగంగనే యేగిరంగా యింట్లకుర్కి తలుపులేస్కుంది.
గుడిసెకు ఎదురుంగొస్తున్న మల్లన్ని జూసింది ఎల్లవ్వ. గప్పుడే అత్తాన్నావ్ ఎందయ్యా అనుకుంటనే ‘పోరనికి జరమగ్గింది‘ అని సంబురంగా జెప్పింది.
‘రాజుగాని ఆకలి జూసి.. జరానికి కూడా భయమైనట్టున్నదే ఎల్లి. ఆని అమ్మ నాయనల లెక్కనే గది గూడా ఆడ్ని దబ్బున్నే యిడ్సివెట్టి వొయ్యిందిలే. ఐనా జరానికి మించిన జెట్ట రోగాలున్నయ్ గొన్ని. గయి మనకు లేనందుకే యింకెక్కువ సంబురవడాలే’ అనుకుంట దబ్బదబ్బ గుడిసెలోకి వొయ్యిండు. బాసాన్లని, బట్టల్ని బస్తాల సర్దిండు. గుడిసేపైన పట్టాల్ని అట్లే అదిలేసిండు.
మనవన్ని భుజానేసుకున్నడు. బస్తా శేతవట్టిండు. యేవైందయ్యా అనడిగిన ఎల్లవ్వకు “యీ వూళ్లే మనకు పని దొరకదే. పోరడ్ని బతికించుకొని సాదుకోవాల్నంటే మనం యిడ్నుంచి బోవాలే” అని జెప్పి బయటకి తీస్కచ్చిండు. అట్లా ఆల్లంతా కొంత దూరం నడ్శి, పక్కనే వున్న పెద్ద రోడ్డెక్కిర్రు. ఎదురుంగొచ్చిన బండేదో యెక్కిర్రు.
అటుదిక్కు సూపరైజరును యింట్లకి పిల్శింది సుభద్ర. రేపటిసంది యీ గుంపునంతా పనులకు రానియ్యెద్దని జెప్పింది. యేరే గుంపుతో పని వొడ్పియ్యాలన్నది. యెందుకు, యేంది అనడిగితే.. ‘నన్ను నువ్వు శెర్సాడానికి జూసినవని మీ సారుకు జెప్తా’ అని ఆన్ని బెదిరిచ్చింది.
నౌకరి వొతే బతుకుదెరువు కస్టమనుకున్న సూపరైజరు.. పొద్దుగూకగముందే కూలోల్ల దగ్గర్కివొయ్యిండు. యేమీ జెప్పకుండా రేపటిసంది పనుండదని జెప్పీ, రెండు పొంటెల కూలిచ్చి ఆళ్లని యెల్లగొట్టిండు. యేవైందో సమజ్గాని మల్లని కులపోల్లు.. గుడిసెల కాడికచ్చీ ఆళ్లక్కడ లేనిది జూసి ఆగమైన్రు.
“అయ్యో.. మల్లయ్య మావా కింద పడ్డడుర్లా” అని తినే సద్దిని పక్కనేశి వురికొచ్చిర్రు కులపోల్లు.మల్లన్ని లేపీ, పక్కకు కుసవెట్టే పనిల కొంతమందుంటే, ముసలోడ్ని తోలుకస్తే గిట్లనే వుంటదని
సూరీగాడు, నర్సీగాడు అన్నరు. ఆళ్లంతా వొక్కకాడ మూగేసరికల్లా సూపరైజరూ అటొచ్చిండు. “కూలికచ్చి అందరూ వొక్కకాడ గూడి ముచ్చట వెడ్తున్నార్రా?” అని గుర్రుగా జూసిండు. పని మజ్జెల బండెళ్లిన ఇషయం గమనించిండు. ముసలోని గోస తెల్సుకుని అయ్యో పాపం అనుకుండు.
క్రాంతి శివరాత్రి
ఈ కథ రాసిన రచయిత క్రాంతి శివరాత్రిది సూర్యాపేట జిల్లా తిరుమలగిరి. సివిల్ ఇంజినీరింగ్ చదివి, ఉస్మానియా యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ చేశారు. మూడేండ్ల పాటు జర్నలిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. పదో తరగతిలో ఉండగా మొదటి కథ రాశారు. 2019లో పూర్తిస్థాయి కథలు రాయడం మొదలుపెట్టారు. ఇలా రాసిన మొదటి కథ ఓ ప్రముఖ దినపత్రికలో అచ్చయింది. ఈ అయిదేండ్లలో ఎనిమిది కథలు రాశారు. అవన్నీ వివిధ దిన పత్రికల్లోని అదివారం అనుబంధాల్లో ప్రచురితమయ్యాయి. కొన్ని నవలలకు ఎడిటర్‌గా కూడా సేవలు అందిస్తున్నారు క్రాంతి శివరాత్రి. 2020 సంవత్సరంలో ‘వెలితి’ అనే కథకు ‘భానుపురి సాహితీ వేదిక’ వారి నుంచి జాతీయ పురస్కారం అందుకున్నారు. చుట్టూ జరిగేవాటిని, చూసిన వాటిని, విన్న వాటిని కథావస్తువులగా ఎంచుకుంటానంటారు రచయిత. “జెట్టరోగం’ మా అమ్మ చెప్పిన కథ. ఇది రాసేటప్పుడు, పోటీకి పంపేటప్పుడు అమ్మ నా పక్కనే ఉంది. ఫలితాలు వచ్చేసమయానికి బ్రెయిన్ స్ట్రోక్‌తో అమ్మ నాకు దూరమైంది’ అని తన ఆవేదనను వెలిబుచ్చారు.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.5 వేల బహుమతి పొందిన కథ.
-క్రాంతి శివరాత్రి
99515 90398