అమెరికా కొలువులు, ధనవ్యామోహం మధ్య తరగతి ప్రజానీకం నెత్తినెక్కింది. అందువల్ల వాళ్లు పొందుతున్నదేమిటి? కోల్పోతున్నదేమిటి? ఇందులోని సంతోషమేమిటి? విషాదం ఏమిటి? ఈ పయనం ఇంకెన్నాళ్లు? దీనికి భరత వాక్యం పలకలేమా? కొనసాగాల్సిందేనా?.. అన్న చర్చకు తెరలేపిన నాటిక.. ‘ఇది ప్రమాదానికి సంకేతం’.
రమాదేవి, రామారావు భార్యాభర్తలు. రామారావు రిటైర్డ్ ఉద్యోగి. బ్యాంకులోఅప్పు తీసుకొని కొడుకు కైలాష్ని ఉన్నత చదువు కోసం అమెరికాకు పంపిస్తాడు. కైలాష్ అక్కడే ఉద్యోగం సంపాదించుకుంటాడు. అక్కడే ఉద్యోగం చేస్తున్న తెలుగు అమ్మాయి రూపని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వాళ్లకు ఓ పాప పుడుతుంది. ఆ పాప అమెరికాలో పుట్టింది. కాబట్టి ఆ పాప బాగుగులపై అమెరికా ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఇదీ ఈ నాటిక నేపథ్యం.
కైలాష్ ఒక కంపెనీలో పని చేస్తూనే, మరో కంపెనీలో రహస్యంగా పని చేస్తుంటాడు. అది బయటపడి అసలు ఉద్యోగం ఊడుతుంది. ఈ చిరాకులో పాపపై చేయి చేసుకుంటే, పక్కవాళ్లు చూసి అధికారులకు ఫోన్ చేస్తారు. వెంటనే సోషల్ సెక్యూరిటీ అధికారులు వచ్చి పాపను తమ ఆధీనంలోకి తీసుకుంటారు. కైలాష్ దంపతులపై కేసు నమోదవుతుంది. కైలాష్ అక్కడి నుంచి పారిపోవాలనుకుంటాడు. ఎవరికీ చెప్పాపెట్టకుండా ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత.. కైలాష్ మీద కోపంతో అతని భార్య కూడా ఇండియా వస్తుంది.
కైలాష్ దంపతుల మధ్య నిత్యం ఘర్షణ చెలరేగుతూనే ఉంటుంది. ఎడ ముఖం, పెడ ముఖంగా ఉంటారు. రామారావు దంపతులకు ఇది అర్థమయ్యి.. అర్థం కాక గందరగోళంలో ఉంటారు. ఈ సమయంలో రామారావు ఇంటికి అతని మేనమామ వెంకటాచలం వస్తాడు. ఈయనది మరో కథ. ఉపకారి మనస్తత్వం. కొడుకు నక్సలైట్ల ఉద్యమంలోకి వెళ్తాడు. అతను బతికి ఉన్నాడో.. లేడో.. తెలియదు. భార్య చనిపోవడంతో తీర్థయాత్రలకు, బంధువుల ఇళ్లకు వెళ్తూ కాలం వెళ్లదీస్తూ ఉంటాడు. ఈ వెంకటాచలం సమక్షంలోనే కైలాష్-రూపల ఘర్షణ పతాక స్థాయికి చేరుతుంది.

నాటిక పేరు: ఇది ప్రమాదానికి సంకేతం
రచన : ఆకురాతి భాస్కర చంద్ర
దర్శకత్వం: ఎస్.కె. మిశ్రా
నిర్వహణ: ప్రసాద్
పాత్రధారులు: శ్యాంప్రసాద్, ప్రకాశ్, భాస్కర శర్మ, సత్యానందిని, కుసుమ సాయి తదితరులు
కైలాష్ మిత్రుడు చక్రవర్తి వైద్యుడు. అదే ఊరిలో హాస్పిటల్ పెట్టి, ఫ్రీ క్యాంపులు నిర్వహిస్తుంటాడు. రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తూ, లోపాయికారిగా కిడ్నీల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అమెరికా ధనవంతులకు కావాల్సిన కిడ్నీ వెంకటాచలం వద్ద ఉన్నదని తెలుస్తుంది ఆ డాక్టర్‌కి. కిడ్నీ దానం చేస్తే.. ప్రతిఫలంగా తనకు అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తారని కైలాష్ చెబుతాడు. మేనల్లుడి ఉద్యోగం కోసం కిడ్నీ దానం చేయడానికి ఒప్పుకొంటాడు వెంకటాచలం. కైలాష్కు ఈ ధనవంతులు అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తామని మాట ఇస్తారు. అసలు విషయం ఏమిటంటే?.. అంతకు ముందే ఆ కిడ్నీని చక్రవర్తి వారికి పాతిక లక్షలకు విక్రయిస్తాడు. అతని హాస్పిటల్లోనే కిడ్నీ మార్పిడి జరుగుతుంది. ఆ పాతిక లక్షలు చక్రవర్తికి దక్కకుండా కైలాష్ మధ్యలోనే నొక్కేస్తాడు. భార్యతో కలిసి తిరిగి అమెరికా వెళ్లిపోతాడు. జరిగిన మోసం తెలుసుకుని వెంకటాచలంతో సహా తల్లిదండ్రులు హతాశులవుతారు. పెద్ద బాలశిక్ష చదువుకున్న పెద్దతరం ఎంతో కొంత విలువలు పాటిస్తుంటే, అమెరికా చదువులు చదువుకుంటున్న ఈ తరం ఎందుకింత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన చెందుతారు.
ఒకరిని ఒకరు వాడుకోవడం తప్ప సాటి మనిషికి సాయపడాలనే ఆలోచనే లేకుండా డబ్బు వ్యామోహంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారో ఈ నాటిక కళ్లకు కట్టింది. నవంబర్ 27న రవీంద్ర భారతి (హైదరాబాద్)లో ‘రసరంజని’ ఈ నాటిక ప్రదర్శించింది. అమానవీయ ధన వ్యామోహం సమాజాన్ని వైరస్‌లా ఎలా అల్లుకుపోతున్నదో తెలపడానికి రచయిత, దర్శకులు ఎంతగా కష్టపడ్డారో ఈ నాటిక చూస్తుంటే అర్థమవుతుంది.