(హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)
జరిగిన కథ
రోహ, జయసేనులు పరస్పరం చూసుకున్నట్లు గ్రహిస్తారు. చేసిన నేరానికి ప్రణాళునికి దేశ బహిష్కార శిక్ష విధిస్తే.. అతను అడవిలో ఒక అంధకూపంలో దూకి, చనిపోవాలనుకుంటాడు. ఆ తర్వాత…
“ఏమేమీ… నా బిడ్డ చూసింది కోడలు పిల్లనేనా!? ఎంత ఆశ్చర్యకరం! ఇదంతా దైవలీల. మరెందుకు ఆలస్యం? పురోహితుని పిలువనంపి, మంచి ముహూర్తం చూడండి! చిన్న వయసులో వివాహం జరిగినా ఇద్దరినీ ఏకంచేసే అవకాశం లభించలేదు. ఇప్పుడు ఆ ముహూర్తం, అందుకు బయలుదేరాల్సిన ముహూర్తం చూస్తే.. అన్ని పనులూ చక్కబడుతాయి” సంతోష తరంగిత అయిన సిరిసత్తి.. ఉద్విగ్న భరిత కంఠస్వరంతో జయసేన-వామదేవులతో అన్నది.
“కానీ, అమ్మా…” ఏదో చెప్పబోయినాడు జయసేనుడు.
“బిడ్డా! ‘శుభస్య శీఘ్రం’ అన్నారు పెద్దలు. మంచి పనులు చేయడంలో ఆలస్యం చేస్తే ఫలితాలు తారుమారవుతాయి. ఇంతకూ నీవు ఏం చెప్పదలుచుకున్నావు?” అని అడిగింది సిరిసత్తి.
“అమ్మా.. నాయన గారు లేకుండా…” అంటూ ఆగిపోయినాడు జయసేనుడు.
కొడుకు గుర్తుచేసేదాకా తనకు గుర్తుకు రాకపోవడం సిగ్గుగా అనిపించింది సిరిసత్తికి. కోడలి రాకపట్ల తనకున్న ఆరాటమే అందుకు కారణమని గ్రహించి..
“అవును బిడ్డా! కోడలు ఇంటికి రావాలన్న కోరిక తీవ్రతరం కావడం చేత మీ నాయన గారి దేశాంతర విషయం మరచిపోయినాను. స్త్రీ అంతరంగమే అంత నాయనా! పిల్లలు పెద్దవాళ్లు అవుతుంటే భర్త కంటే వాళ్ల భవిష్యత్తే ముఖ్యమైపోతుంది. అయితే మీ తండ్రిగారు కళింగ దేశమే కదా వెళ్లినది, వార్తాహరుని పంపుదాం. పరివారానికి పనులను అప్పగించి.. వారు వచ్చి రెండు రోజులుండి వెళ్లగలరు. ఒక వారం రోజులలో ముహూర్తం నిర్ణయించుమని పురోహితులను కోరుతాను” సావధానంగా ఆలోచిస్తూ తన యోచనను కొడుకుకు ఎరిగించింది.
జయసేనుని హృదయం ఆనంద సరోవరమైంది. అంతలోనే తన భార్య రోహను తలుచుకొని ఇట్లా అనుకున్నాడు…
మదవతి కన్నులన్ గనిన
మాత్రమునే చెడె డెంద మప్పు డా
ముదిత మదీయ దైత యని
మోదము గల్గెను నేడు, కాని ప్ర
త్యుదయము రేయియున్ గలచె
నూహల బాణములందు జిక్కి, ఆ
సుదతిని జూడగా నెదురుచూచుట
తప్పుట యెప్పుడో కదా!
(అందాల తన భామను చూడగానే మనసు చెదిరింది. ఆమె తన భార్యయే అని తెలిసినప్పుడు చాలా ఆనందం కలిగింది కానీ, రాత్రీ పగలు ఆమెను చూడాలని ఊహల బాణాల్లో చిక్కి, ఈ ఎదురు చూపులు ఎప్పుడు అంతమవుతాయో కదా!? అని మదన పడుతున్నాడు)
మిత్రులిద్దరూ మాట్లాడుకుంటూ మిద్దె పైకి చేరినారు.
“గృహస్థాశ్రమం స్వీకరించకుండానే సన్యాసిగా మారిపోతానన్న నా సోపతికాడు ఇప్పుడు అర్ధాంగి కోసం అర్రులు సాచడం చూస్తుంటే నమ్మలేకపోతున్నాను” అంటూ స్నేహితుని వంక ఆశ్చర్యంగా చూసినాడు వామదేవుడు.
“అదే సృష్టి విచిత్రం!” విలాసంగా నవ్వినాడు జయసేనుడు.
“మరో నాలుగు రోజుల్లో మల్లికాగిరి ప్రయాణం! వారం రోజుల్లో సుముహూర్తం. భలే కుదిరింది జయసేనా! అప్పుడిక ఈ వామదేవుడు గుర్తుంటాడా?” ఆట పట్టిస్తున్నట్లు అన్నాడు వామదేవుడు.
“అదేమి వామదేవా! అంత నిష్ఠురంగా మాట్లాడతావు? నీవు లేకుండా ఏ పనీ జరగదు. ప్రతిక్షణం నీవు నా వెంట ఉండాల్సిందే!” అన్నాడు ‘కచ్చితంగా’ అన్నట్లు జయసేనుడు.
“ప్రతి క్షణమూనా… అదెట్లా కుదురుతుంది?” అని నర్మగర్భంగా నవ్వినాడు వామదేవుడు.
వీళ్లు ఇట్లా మాట్లాడుతుండగానే ఏదో గుర్తుకొచ్చి అక్కడికి వచ్చిన సిరిసత్తి.. బిడ్డ ఆనందం చూసి సంతోషంతో ఉబ్బితబిబ్బయింది.
“నాయనా జయా! నీవు ఎప్పుడూ ఇట్లాగే నవ్వుతూ ఉండాలి. భగవంతుడు నీకు మంచి బుద్ధినిచ్చినాడు. పిల్లాపాపలతో ఈ ఇల్లు కళకళలాడే భాగ్యం ప్రసాదించినాడు. నిన్న మొన్నటి వరకు తథాగతుని శరణుడనై, సంసార బంధం అంటకుండా తిరుగుతానన్న నా బిడ్డ.. ఇప్పుడు ఆ బంధం కోసం తానే తొందరపడుతూ ఉండటం ఆ దేవదేవుని ఇంద్రజాలం కదా!” తనలో తాను అనుకున్నట్లే పైకి అనేసింది.
“చిన్నమ్మా! జయ కూడా ఎప్పుడెప్పుడు మల్లికాగిరికి వెళదామా అని ఉవ్విళ్లూరుతున్నాడు…” వామదేవుడు ఇంకా ఏదో చెప్పబోతుండగానే..
“అదేమి? మల్లికాగిరికి జయ వెళ్లడం ఎందుకు? నేను సపరివారంగా వెళ్లి కోడలిని సగౌరవంగా ఇంటికి కొని తెస్తాను. అందుకు ముహూర్తం కూడా నిర్ణయించినారు కదా జ్యోతిషులు” సాలోచనతో గంభీరంగా అన్నది సిరిసత్తి.
నెత్తిన పిడుగు పడినట్లు అయింది జయసేనునికి.
అక్కడ ములక రాజ్యంలోని మల్లికాగిరిలో
రోహాదేవి శయనమందిరం.
“సీహా! నిజంగా మీ బావ వస్తారంటావా?” అప్పటికి ఆ ప్రశ్న నూటాపదకొండవ సారి.
మళ్లా నవ్వింది సీహాదేవి.
“నన్ను నమ్మవే అక్కా! ప్రపంచంలో జరిగేది నూటికి నూరు శాతం అదే! వస్తారు; రావాలి. ఆయన రాలేడని మనం వెళ్లడం కుదరదు కదా!” అమాయకురాలైన అక్కకు నమ్మకం కలిగేటట్లు చెప్పింది.
ఏదో అనుమానం గుండెమూలలో గుచ్చుతున్నది రోహకు.
‘ఆ జలపాతం దాకా వెళ్లడం ఎందుకు? వెళ్లినా అక్కడ జల క్రీడలాడుతుంటే తన పెనిమిటి రావడం ఎందుకు? వచ్చినా తన కంటబడటం ఎందుకు? పడినవాడు తన వద్దకు రావడం, తీసుకొని పోవడం జరుగదెందుకు? తాను సంపన్న కుటుంబంలో కాక సాధారణ కుటుంబంలోనో, రైతు కుటుంబంలోనో పుట్టి ఉంటే ఈ అగచాట్లు ఉండేవి కాదేమో… అయినా, సామాన్య కుటుంబంలో పుట్టినట్లయితే దేశం కాని దేశం సంబంధం కుదిరేదే కాదు కదా! అప్పుడు ఈ దూరం కలవర పెట్టేది కాదు! ఆయన కనబడనంత వరకూ లోటు తెలియరాలేదు. ఇప్పుడు ఇక్కడ నిలవడమే కష్టంగా ఉంది. కష్టం కాదు దుర్భరం!’
అట్లా ఆలోచిస్తున్న రోహ కన్నుల నుండి అప్రయత్నంగా నీరు జారిపోతున్నది. అది చూసిన సీహా కలవరపడిపోయింది.
“ఎందుకక్కా అంత దుఃఖం? బావ తప్పక వస్తారు. నిన్ను తీసుకుపోతారు. బాధపడాల్సింది నేను, నీవు ఇక నీ దారిన నీ పెనిమిటి వద్దకు పోతే… ఆపైన తోడు దొరికే దాకా ఒంటరితనం అనుభవించవలసింది నేనే కదా!” అని నచ్చజెప్ప జూసింది.
రోహలో ఏ మార్పు కనిపించకపోవడంతో మనసులో మార్పు రావాలంటే పరిసరాల మార్పు పనికొస్తుంది… అనుకొని, తల్లి అనుమతి తీసుకొని అక్కను వన విహారానికి బయలుదేరదీసింది సీహ.
“ఏమీ! మరలా ఆ జలపాతం వద్దకు వెళ్దామా? “అన్నది; అమాయకత్వం ఆశల నల్లుకొని, ఊహల ఊయలను ఎక్కుతూ రోహాదేవి.
పంటి బిగువున కోపాన్ని అణచుకొని..
“నోరు మూసుకొని అనుసరించు… ఒకందుకు పోస్తే మరొకందుకు తాగినట్లు చేయకు! అన్నీ మరిచి, ప్రకృతిలోని అందాలను ఆస్వాదించు ముందు…” బెదిరిస్తున్నట్లే అన్నది సీహ.
“అయ్యో అంత కోపం ఎందుకే? కొంచెం నిమ్మలంగా చెప్పవచ్చును కదా!” అంటూ మూతి ముడుచుకున్నది రోహ.
సోదరీమణు లిద్దరూ అచ్చమైన సంగిడీల రీతి వనంలో విహరిస్తూ కన్నుల దొన్నెల నిండా అందాలను జుర్రుకుంటున్నారు.
ఒక్కసారిగా ఆకాశంలోకి చూసిన సీహాదేవి ఆశ్చర్యపోతూ అక్క రోహాదేవితో…
ఆమె మనసు స్వచ్ఛంగా అయింది. అన్నీ మరచిపోయి ప్రకృతిని పరవశించి చూస్తున్నది. వీళ్లు చూస్తుండగానేఆ చిలుకల గుంపు ఇంద్రజాలికుడిలా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది.
చుక్కల తేరు నుండి దిగి
సుందరి ఒక్కతె జూడ నింగి యం
దక్కజ మొప్ప పచ్చని
కళాకృతి తీర్చిన చీరె జారగా
నిక్కుచు వీడినట్లు గమనించిన
కన్పడు కీర బృంద’ మో
యక్క! అటంచు సీహ తన
యగ్రజ రోహకు జూపె నత్తరిన్!
(ఆకాశంలో ఈ చుక్కల రథం నుండి దిగిన ఒక అందాల భామ బాగా అలంకరించిన తన పచ్చని చీర జారిపోయిందా… అన్నట్లు చిలుకల బృందం విహరించడాన్ని అక్క రోహకు చూపించింది సీహ)
చెల్లి చూపిన దిక్కు చూసింది రోహ. ఆశ్చర్యంతో ఆమె కన్నులు విప్పారినాయి.
నిజమే! చెల్లి చెప్పినట్లు ఆకాశంలో ఎవరో అప్సరస తన పచ్చని చీరను వదిలేసినట్లు కనిపిస్తున్నది. చిలుకల గుంపు చేసిన అక్కజమైన దృశ్యం అది. వాటి ఎర్రని ముక్కులు ఆ చీరకు అందమైన అంచును కూడా సమకూర్చినాయి. అద్భుతమైన ఆ దృశ్యం చూసి ఆమె మనసు నిండిపోయింది.
ఆమె మనసు స్వచ్ఛంగా అయింది. అన్నీ మరచిపోయి ప్రకృతిని పరవశించి చూస్తున్నది. వీళ్లు చూస్తుండగానే ఆ చిలుకల గుంపు ఇంద్రజాలికుడిలా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. వందలాది ఆ చిలుకలు అట్లా ఎగురుకుంటూ వచ్చి తమ సమీపంలోనే ఉన్న ఆకులు రాలిన మర్రి చెట్టు మీద వాలినాయి. అంతసేపు మోడువారినట్లున్న ఆ వటవృక్షం.. చిలుకలు వాలడంతో పచ్చని చెట్టుగా మురిసిపోయింది. చిలుకల ఎర్రని ముక్కులు మర్రి పండ్లను తలపించ సాగినాయి. ఇద్దరూ ఆ దృశ్యం చూసి ఆనందం పట్టలేక కేరింతలతో చప్పట్లు కొట్టినారు.
వాళ్లు అట్లా తిరుగుతూ తిరుగుతూ ఒక వరి చేను పక్కనుండి వెళుతున్నారు. అప్పటికే ముళక సీమను దాటి అస్మక దేశ జనపదాల్లోకి అడుగుపెట్టినట్లు వాళ్లు గ్రహించనే లేదు. తమను తీసుకొచ్చిన రథికుడు ముళక పరిధిలోని వనంలోనే వదిలినాడు. ఆ సారథిని అక్కడనే ఉండుమని చెప్పి వీళ్లిద్దరూ ఎంతోదూరం వచ్చేసినారు.
ఆ వరి చేను కోస్తున్న వనితలిద్దరూ ఇట్లా పరాచకాలు ఆడుకుంటున్నారు.
“వదినా! ఎండిపోయిన ఈ వరి చేనును చూస్తే గుండె పిండేసినట్లున్నది…”
“ఎందుకు మరదలా? వరి ఎండితేనే కద ప్రాలు (బియ్యం) వచ్చేది. అయినా వరి ఎండటానికి నీ బాధకు ఏం సంబంధం?!”
“వదినా! ఈ వరి చేనే కదా మీ తమ్మునికి, నాకు ప్రకృతి ఇచ్చిన సరసాల గది” అని సిగ్గుపడుతూ నర్మగర్భంగా నవ్వింది.
అది అర్థమైన మరో వనిత గలగలా నవ్వేసింది.
“అవునులే! నీవు అట్లాగే నవ్వుతావు. ఎద్దు పుండు కాకికి నొప్పా?” ముఖం ముడుచుకున్నది చిన్నది.
అప్పుడా పెద్ద వనిత..
“మరదలా! నేను నవ్వింది అందుకు కాదు, మా తమ్ముడు సామాన్యుడు గాడని చెప్పడానికి. ఇదిగో ఇటుపక్క చూడు! వరి చేను పోతే ఏం కొంప మునిగిపోయింది? ఈ సంగతి ముందే గ్రహించి జనుప చేను వేసినాడు వాడు” అన్నది.
ఆశ్చర్యంగా అటు చూసిన చిన్నది విలాసంగా, మరింత సిగ్గుపడుతూ నవ్వింది.
వాళ్ల సంభాషణ అర్థం అయ్యీ, కానట్లు మొహం పెట్టింది రోహ.
‘ఇంత అమాయకురాలివేందే అక్క!’ అని మనసులోనే అనుకొని, ఈ సందర్భంలో ఆమెకు అర్థం కాకపోవడమే మేలని నిర్ధారించుకొని.. తనకు కూడా అర్థం కాలేదన్నట్లు భుజాలను ఎగరేసింది సీహ. అంతలో వాళ్లు బాగా పొద్దుపోయిన విషయం గ్రహించినారు. వెంటనే తిరుగు ప్రయాణం కావాలని అక్కడి నుంచి వెనుదిరిగినారు.
అయితే, ఆ వచ్చిన దారి గుర్తుకు రాలేదు. అసలు వాళ్లు దారి వెంబడి వస్తే కదా తెలవడానికి. ప్రకృతిని ఆరాధిస్తూ ఎటుపడితే అటు సాగినారు. సారథి కూడా వాళ్లు ఎంతో దూరం పోరన్న ధీమాతో ఓ కునుకు తీసినాడు. తర్వాత లేచి చూస్తే వాళ్లు కనబడలేదు. వాళ్లను వెతుక్కుంటూ బయలుదేరినాడు.
సీహా-రోహాలకు అప్పుడు ఒక వ్యక్తి బాధతో మూలుగుతున్న శబ్దం వినిపించింది. ఇద్దరూ అటువైపు అడుగులు వేసినారు.
(సశేషం)
దోరవేటి
89788 71961