‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.
సాయంత్రం ఐదు గంటల సమయం.. వసారాలో కుర్చీలేసుకుని కూచుని, కాఫీ తాగుతూ.. మా పిల్లల చిన్నప్పటి కబుర్ల్లుకలబోసుకుంటున్నాం. రోజూ మాకిదో వ్యాపకం.. పిల్లలు మాకు దూరంగా ఉన్న బాధనుంచి కొంత ఉపశమనం..ఇంతలో గేట్ తీసుకుని ఓ పదహారేళ్ల కుర్రవాడు లోపలికొచ్చాడు. మావైపు బెరుగ్గా చూస్తూ..
“ప్రసాద్ గారిని కలవాలండీ” అన్నాడు.
“నేనే ప్రసాద్‌ని. ఏంటో చెప్పు? ఇంతకూ ఎవర్నువ్వు?” అని అడిగాను.
“నాపేరు రఘురాం అండీ! నేనూ, మా తాత హైద్రాబాద్ నుంచి ఈ ఉదయమే వచ్చాం”
“ఆ వివరాలన్నీ నాకెందుకు? నాతో ఏం పనో చెప్పు చాలు” అన్నాను.
“అదే చెప్పబోతున్నానండీ. మా తాత పేరు సత్యవోలు శ్రీనివాసమూర్తి. ఈ ఊళ్లోనే పదో తరగతి వరకు చదువుకున్నాడటండీ. ఆ తర్వాత వాళ్ల నాన్నగారు హైద్రాబాద్‌కి మకాం మార్చడంతో.. ఈ ఊరికి దూరం కావాల్సివచ్చిందట. మా తాతకి ఈ ఊరంటే చాలా ఇష్టమని చెప్పాడు. తన చివరి రోజుల్లో ఓసారి ఈ ఊరిని చూడాలని ఉందని కోరడంతో.. తీసుకొచ్చానండీ” అన్నాడు. ఈ ఊళ్లో నేను చదివిన స్కూల్లోనే పదో తరగతి వరకు చదువుకున్నాడని వినగానే నాలో ఆసక్తి కలిగింది.
“పదో తరగతి ఏ బ్యాచో తెలుసా?” అని అడిగాను.
“తెలుసండీ. 1971” అన్నాడు. నాది కూడా అదే బ్యాచ్. కానీ, సత్యవోలు శ్రీనివాసమూర్తి ఎవరో గుర్తుకు రావడం లేదు.
“ఇంతకూ నన్ను వెతుక్కుంటూ ఎందుకొచ్చావు?”
“ప్రసాద్ అనే అతను మా తాతకు బాల్యస్నేహితుడట. పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారట. తన స్నేహితుణ్ని కల్సుకోవాలని తాత కోరిక. అతనితో కలిసి చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలన్నీ మళ్లా తిరగాలని కోరిక”
“ఏ ప్రసాదూ? ఇంటి పేరు ఏమైనా చెప్పాడా?”
“మా తాతకు అతని పూర్తిపేరు గుర్తులేదట. అందుకే ఇప్పటివరకూ ఇద్దరు ప్రసాదుల ఇళ్లకు వెళ్లాం. ఎవ్వరూ తాతను గుర్తుపట్టలేదు. తాత ఇంక నడవలేనంటే.. ఆయన్ని రాములోరి గుడి అరుగులమీద కూర్చోబెట్టి వచ్చాను” అన్నాడు.
“ఇందాక నువ్వు మీ తాత తన చివరి రోజుల్లో ఈ ఊరు చూడాలనుకుంటున్నట్టు చెప్పావు. చివరి రోజులేంటి? 71లో పది పాసైతే.. నా ఈడు వాడేగా. అరవై ఆరేళ్లుంటాయి” అన్నాను. ఆ అబ్బాయి మొహంలో విషాదఛాయలు కన్పించాయి.
“మా తాతకు ప్రొస్టేట్ క్యాన్సర్. రెండు మూడేళ్లకు మించి బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు. దానికితోడు ఈమధ్య మతిమరుపు కూడా ఎక్కువైంది” అన్నాడు. మా ఇంటికి దగ్గర్లో మూర్తి అనే కుర్రాడు ఉండేవాడు. పదో తరగతి కలిసే చదివాం. మేమిద్దరం ఓ జట్టుగా తిరిగేవాళ్లం. వాళ్ల కుటుంబం కూడా ఇల్లూ పొలాలు అమ్మేసి, హైద్రాబాద్‌కి వెళ్లిపోయింది. ఆ మూర్తి.. ఈ మూర్తి ఒక్కరే కావొచ్చేమో!? అన్పించడంతో..
“మా వీధిలోనే మూర్తి అనే అబ్బాయి వాళ్ల ఇల్లుండేది. ఇంటిపేరు నాకు గుర్తులేదు. ఓసారి మీ తాతను చూస్తే గుర్తు పట్టగలనేమో వెళ్దాం పద” అన్నాను. అతని మొహంలో సంతోషం వెల్లువలా పొంగింది. రామాలయం అరుగుమీద కూచుని ఉన్న మూర్తి.. నన్ను చూడగానే లేచినిలబడి, తన మనవడివైపు మెచ్చుకోలుగా చూస్తూ..
“ఇతనే నా చిన్ననాటి స్నేహితుడు ప్రసాద్” అన్నాడు. నావైపు తిరిగి..
“ఈ ఊరిడిచిపెట్టి వెళ్లి యాభై యేళ్లు దాటినా నిన్నెలా గుర్తుపట్టానో చూశావా?” అంటూ కౌగిలించుకున్నాడు. అతని దుర్బలమైన శరీరం సంతోషాతిరేకంతో అనుకుంటాను.. కొద్దిగా వణకడం గమనించాను. ఐదడుగుల నాలుగంగుళాలకు మించని ఎత్తు, పల్చటి శరీరంతో మనిషి పిట్టలా ఉన్నాడు. క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్లనుకుంటాను.. నెత్తిమీద ఒక్క వెంట్రుక కూడా లేదు.
“నీలో చాలా మార్పొచ్చింది మూర్తీ. గుర్తు పట్టలేనంతగా మారిపోయావు” అతని చేతిని నా చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నిమురుతూ అన్నాను.
“నువ్వు మాత్రం అలానే ఉన్నావు ప్రసాద్. జుట్టు నెరిసింది అంతే! అందుకే వెంటనే గుర్తు పట్టగలిగాను” అన్నాడు మూర్తి. మెల్లగా చీకట్లు ముసురుకోసాగాయి.
“మొదట ఇంటికెళ్దాం. అక్కడ తాపీగా మాట్లాడుకోవచ్చు” అంటూ మూర్తి చేయి పట్టుకుని.. మా ఇంటి వైపు నడవసాగాను. మమ్మల్ని అనుసరిస్తూ రఘురాం..
“నిన్ను కల్సుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రసాద్. మన స్కూల్, మనం ఆడుకున్న చింతలతోపు, మనం కూచుని కబుర్లు చెప్పుకొన్న చెరువు గట్టు, అక్కడి తాటిచెట్లు, మేం వదిలేసి వెళ్లిన ఇల్లు.. ఇవన్నీ నీతో కలిసి చూడాలన్న కోరిక” అన్నాడు మూర్తి.
“ఇప్పుడేగా కల్సుకున్నాం. తొందరేముంది? మా ఇంట్లో నాలుగైదు రోజులైనా ఉండాల్సిందే! నువ్వడిగినవన్నీ మెల్లగా చూపిస్తాలే” అన్నాను. ఇంటికెళ్లగానే నా భార్యకు పరిచయం చేశాను.
“నా చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాసమూర్తి. పదోతరగతి వరకు కలిసే చదువుకున్నాం. ఇన్నేళ్ల తర్వాత నన్ను వెతుక్కుంటూ హైద్రాబాద్ నుంచి వచ్చాడు” అన్నాను. మా పెరట్లో కుర్చీలేసుకుని కూచుని కబుర్లలో పడ్డాం.
“ఊరంతా ఎంత మారిపోయిందో? ఎంత గుర్తు చేసుకుందామన్నా అప్పటి వీధులు, ఇళ్లు, భవనాలు ఏమీ గుర్తుకు రావడంలేదు” అన్నాడు మూర్తి.
“ఐదు దశాబ్దాల కాలం గడిచిపోయింది కదా.. అప్పుడు మన ఊరు గ్రామపంచాయతీ కింద ఉండేది. ఇప్పుడు మండలకేంద్రం అయ్యింది. వ్యాపారాలు పెరిగాయి. వాటితోపాటు రోడ్లు, బిల్డింగులు, ట్రాన్స్పోర్ట్.. అన్నీ పెరిగాయి” అన్నాను.
“నేనీ ఇంటికి చాలాసార్లు వచ్చేవాణ్ని. ఈ వేపచెట్టు కిందనే ఆడుకునేవాళ్లం. కానీ, అప్పుడది పెంకుటిల్లు కదా. ఇంటిముందు అరుగులు కూడా ఉండేవి”
“మా నాన్నగారు చనిపోయాక, పాత ఇంటిని పడగొట్టి పైన రెండు పోర్షన్లు, కింద ఒక పోర్షన్ ఉండేలా ఇల్లు కట్టించాను. నాకిద్దరు మగపిల్లలు. పై పోర్షన్లలో వాళ్లుంటారని కట్టించినవే! అయినా.. ఈ రోజుల్లో పిల్లలెవరూ తల్లిదండ్రుల్ని చూసుకుంటూ ఉన్న ఊళ్లో ఉండటం లేదుగా. మా ఇద్దరబ్బాయిలూ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో సెటిలయ్యారు. పెళ్లిళ్లు.. పిల్లలు! ఎవరి సంసారాల్లో వాళ్లు బిజీ. పలకరించే తీరిక లేనంత బిజీ” దుఃఖం ఉండలా నా గొంతుకు అడ్డుపడింది.
“మా నాన్న చేసిన బట్టల వ్యాపారమే నేనూ చేశాను. వ్యాపారాన్ని నాలుగింతలు పెంచాను. నాకు ఒక్కడే కొడుకు. వాణ్ని ఇంజినీరింగ్ చదివించి పొరపాటు చేశాను. బట్టల కొట్టులో కూచోవడం నామోషీ అట. బెంగళూర్‌లో ఒరాకిల్‌లో పనిచేస్తున్నాడు. వాడి కొడుకే రఘురాం. కాలేజీకి సెలవు ఇచ్చినపుడల్లా హైద్రాబాద్ వచ్చేస్తాడు. నా కొడుకు నుంచి ఆశించిన ప్రేమ.. మనవడి ద్వారా దొరుకుతున్నందుకు సంతోషపడాలో, మా గురించి పట్టించుకోని కొడుకుని తల్చుకుని బాధపడాలో తెలియని పరిస్థితి మాది” మూర్తి కళ్లు తుడుచుకున్నాడు.
“వంటేం చేయమంటారు? మీ మిత్రుడికి ఇష్టమైన కూరలేమిటో చెప్తే అవే వండి పెడ్తాను” అంది శకుంతల.
“మూర్తికి బెండకాయ పులుసిష్టం. చిన్న బెల్లమ్ముక్క వేయడం మర్చిపోకు. గడ్డపెరుగు, అందులోకి మజ్జిగ మిరపకాయలు ఎలాగూ ఉన్నాయిగా” అన్నాను.
“అదేంటీ? మా తాత బెండకాయతో ఏం చేసినా ఇష్టపడడు కదా! మర్చిపోయారా?” అన్నాడు రఘురాం.
“ఔను కదా! అయినా మతిమరుపుకి నేనేమీ అతీతుణ్ని కాదుగా” అంటూ నవ్వాను.
“బీరకాయ కందిపప్పు కలిపి కూర చేయి” అన్నాను నా భార్యతో.. భోజనాలు చేస్తున్నప్పుడు..
“మన క్లాస్‌లో రాజ్యలక్ష్మి అనే అమ్మాయి ఉండేది కదా. నువ్వా అమ్మాయిని చాలా ఇష్టపడేవాడివి. ఇప్పుడెక్కడుందో తెలుసా?”.. నాకు మాత్రమే విన్పించేంత మెల్లగా అడిగాడు మూర్తి.
“తెలియదు. టెన్త్ క్లాస్‌లో ఆ అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించాను. కానీ ఆ అమ్మాయితో చెప్పేంత ధైర్యం చేయలేకపోయాను. ఇప్పటి జనరేషన్కున్న తెగువ, చొరవ మనకెక్కడివి?”.. నేను కూడా శకుంతలకు విన్పించనంత మెల్లగా చెప్పాను.
“ఆరేళ్ల క్రితం బెంగళూరు నుంచి తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ స్టేషన్లో కన్పించింది. ఎంత మారిపోయిందో తెలుసా? నేనసలు గుర్తుపట్టలేక పోయానంటే నమ్ము. తనే నన్ను పోల్చుకుని, దగ్గరకొచ్చి పలకరించింది”
“తనకూ అరవై యేళ్లు వచ్చి ఉంటాయిగా! బాగా లావై ఉంటుంది. ఎంత తెల్లగా ఉండేదో కదా..”
“రంగు పెద్దగా మారలేదు. తను హైద్రాబాద్‌లోనే ఇంగ్లీష్ లెక్చరర్‌గా చేసి రిటైరైనట్టు చెప్పింది”
“పక్కన వాళ్లాయన లేడా?”
“లేడు! ఏడాది క్రితం హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది”
“అయ్యో పాపం” అన్నాను ఇంకేమనాలో తెలియక. పై బెడ్రూంలో వాళ్లకు పడకలు ఏర్పాటుచేశాను. శకుంతల మొహం చూస్తేనే అర్థమైంది.. చాలా కోపంగా ఉందని. అటువంటి సమయంలో ఆమెను కదల్చకపోవడమే ఉత్తమమని, పక్కకు తిరిగి పడుకున్నాను.
“ఎవరా రాజ్యలక్ష్మి? నాకెప్పుడూ మీ టెన్త్‌క్లాస్ ప్రేమ గురించి చెప్పలేదే!” గదిలో నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ, శకుంతల నోటినుంచి బుల్లెట్లలా మాటలు దూసుకొచ్చాయి.
“రాజ్యలక్ష్మి ఎవరు?” అన్నాను ఆశ్చర్యాన్ని నటిస్తూ.
“బుకాయించకండి. మీరు చిన్నగా మాట్లాడుకుంటే నాకు విన్పించవనుకున్నారా? నాకేమీ చెవుడు లేదు” అంది.
“ఓహ్.. ఆ రాజ్యమా? టీనేజ్ కదా.. ఏదో వెర్రి. దాన్నే ప్రేమనుకుని. అయినా ఎప్పటి విషయమో అది.. ఎప్పుడో మర్చిపోయాను. నాకు రాజ్యాలూ రాణులూ ఎందుకు చెప్పు. నా శాకుంతలం ఉండగా” అన్నాను.
“చాల్లెండి సంబడం! మీ మాటల మాయలో పడిపోవడానికి నేనేమీ టీనేజ్ అమ్మాయిని కాదు” శకుంతల ముసిముసిగా నవ్వుకుంటోందని అర్థమైంది. ఉదయం పదింటికి మూర్తిని మా స్కూల్‌కి తీసుకెళ్లాను. రిటైర్డ్ హెడ్మాస్టర్ని కదా. టీచర్లందరూ ఆత్మీయంగా పలకరించారు.
“ఇతను నా క్లాస్మేట్ శ్రీనివాసమూర్తి. మన స్కూల్లోనే పదో తరగతి వరకూ చదువుకున్నాడు. తన స్కూల్ రోజుల్ని రీవిజిట్ చేసుకోవాలన్న కోరికతో హైద్రాబాద్ నుంచి వచ్చాడు” అంటూ వాళ్లందరికీ పరిచయం చేశాను. తరగతి గదులన్నీ తిప్పి చూపించాను.
“మనం చదివిన స్కూల్లోనే నువ్వు టీచర్‌గా చేరి, హెడ్మాస్టర్గా రిటైర్ కావడం గొప్ప విషయం ప్రసాద్. స్కూల్ చాలా మారిపోయింది. ఆ రోజుల్లో ఆరేడు తరగతుల్లో మనం కిందనే కూచునేవాళ్లం. గదులన్నీ రంగులు వెలసిపోయి, పెచ్చులూడిపోయి ఉండేవి. ఇప్పుడన్నీ పక్కా కాంక్రీట్ గదులే కన్పిస్తున్నాయి. అన్ని గదుల్లో పిల్లలు కూచోడానికి బల్లలున్నాయి. అంతా కొత్తగా కన్పిస్తోంది” అన్నాడు మూర్తి.
“నేను హెడ్మాస్టర్ అయ్యాక, ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ ఏర్పాటుచేశాను. వచ్చినవాళ్లలో అన్ని రంగాల్లో రాణిస్తున్నవాళ్లు ఉన్నారు. వాళ్లందరి సహకారంతో స్కూల్ బిల్డింగ్‌కి కొత్త రూపు తీసుకొచ్చాను” కించిత్ గర్వంతో అన్నాను.
“మరి నాకెందుకు ఆహ్వానం పంపలేదు? నేను తప్పకుండా వచ్చి ఉండేవాణ్ని. పాత స్నేహితుల్ని కల్సుకునే అరుదైన అవకాశాన్ని మిస్సయ్యాను” బాధగా అన్నాడు.
“హైద్రాబాద్‌లో నీ అడ్రస్ తెలియదు. నీదే కాదు, చాలామంది అడ్రస్‌లు మా దగ్గర లేవు. అందుకే న్యూస్ పేపర్లో ప్రకటనలు ఇప్పించాం”
“అలానా.. నేనా ప్రకటనల్ని చూసి ఉండను. డబ్బు సంపాదనలో పడి జీవితాన్ని జీవించడం మర్చిపోయాను. అనుభవించడం, అనుభూతి చెందడం మర్చిపోయాను. ఇప్పుడు పశ్చాత్తాపపడి ప్రయోజనం ఏముంది? గడిచిపోయిన కాలం తిరిగిరాదుగా!”
“ఇప్పటికీ మించిపోయింది లేదు మూర్తీ. ఇకనుంచి జీవితంలోని ప్రతిక్షణాన్నీ ఆస్వాదించు. నీ మనసుకు నచ్చిన పనులు చేయి. నచ్చినట్టు బతుకు. రోజుకో ఉత్సవంలా బతుకు” అన్నాను.
“అందుకేగా ఈ ఊరికొచ్చాను” మూర్తి మొహంలో సంతోషం కన్పించింది. ఇంటికి తిరిగొచ్చేటప్పటికి పన్నెండున్నర దాటింది. భోజనం చేసి, సాయంత్రం ఐదు గంటల వరకు విశ్రాంతి తీసుకున్నాక..
“చెరువు గట్టుమీద కూచుని కబుర్లు చెప్పుకొందాం పద” అన్నాడు మూర్తి. మా టీచర్ల గురించి మాట్లాడుకుంటూ, మెల్లగా నడక సాగించాం. ఎదురుగా పార్క్ కన్పించింది.
“లోపలికెళ్లి కూచుందాం” అన్నాను.
“మరి చెరువు గట్టో” అన్నాడు మూర్తి.
“గుర్తుకు తెచ్చుకో.. మనం ఇప్పుడు నడిచొచ్చిన దారేగా చెరువుకట్టకు దారి” నవ్వుతూ అన్నాను.
“అవునా? ఇంతకూ చెరువేది?” అన్నాడు.
“ఇంకెక్కడి చెరువు? చాలా ఏళ్ల క్రితమే దాన్ని పూడ్చేసి, ఇళ్ల స్థలాలు చేసి అమ్ముకున్నారు. ఈ చుట్టుపక్కల కన్పిస్తున్న ఇళ్లన్నీ ఆ జాగాలో కట్టుకున్నవే. ఎటొచ్చీ కొద్ది స్థలాన్ని పార్క్ కోసం వదిలిపెట్టారు”
“అయ్యో.. ఎంత అందమైన చెరువు.. దాన్ని పూడ్చేయడానికి మనసెలా ఒప్పింది?” అన్నాడు మూర్తి.
“రియల్ ఎస్టేట్ బూమ్! శ్మశానాల్నే వదలడం లేదు, చెరువుల్ని వదుల్తారా చెప్పు.. గజం స్థలం తులం బంగారంకన్నా విలువైపోయిందిగా”.. పార్క్‌లో చెట్లకిందున్న సిమెంట్ బెంచీ మీద కూచుంటూ అన్నాను.
“చింతల తోపైనా ఉందా?” అని అడిగాడు.
“దానికీ అదే గతి పట్టింది. ఒక్క చింతచెట్టు కూడా లేకుండా కొట్టేసి ఇళ్లు కట్టుకున్నారు”
“మన చిన్నప్పుడు ఆ చెట్లెక్కి చింతచిగురు కోసేవాళ్లం గుర్తుందా!? చింతచిగురేసి పప్పు వండితే ఎంత రుచిగా ఉండేదో. చింతకాయలతో అమ్మ తొక్కుడు పచ్చడి చేసేది. సాయంత్రాలు పిల్లలందరం అక్కడ ఎన్ని ఆటలు ఆడుకునేవాళ్లమో! చింతలతోపుతో అల్లుకుని ఎన్ని జ్ఞాపకాలో కదా!” అన్నాడు. కొన్ని క్షణాల విరామం తర్వాత..
“స్కూల్లో మనతోపాటు చదివిన రంగనాయకులు ఇప్పుడెక్కడున్నాడో తెలుసా?” అని అడిగాడు.
“ఏ రంగనాయకులు?”
“వాడి అమ్మానాన్న చిన్నప్పుడే చనిపోతే వాడి నాయనమ్మేగా సాకింది. మన బడి బైట తేగలు, రేగుపళ్లు, నువ్వుజీడీలు, వేరుసెనగ ఉండలు అమ్మేది గుర్తుందా? బడి వదిలాక రంగనాయకులు సోడాబండి వేసుకుని, వీధులన్నీ తిరిగి సోడాలు అమ్మేవాడు” నేను మూర్తివైపు మెచ్చుకోలుగా చూస్తూ..
“ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావో.. హాట్సాఫ్ మూర్తీ! నాకిప్పుడు గుర్తొస్తున్నాడు. సన్నగా బక్కపల్చగా ఉండేవాడు కదా. వాడి నాయనమ్మ చనిపోయాక, గుంటూరులో బంధువులెవరో చేరదీశారని విన్నాను. ఆ తర్వాత ఏమయ్యాడో తెలియదు” అన్నాను. ఓ గంట పార్క్‌లో గడిపాక, తిరుగు ప్రయాణంలో..
“మీ పాతఇంటిని చూపిస్తాను పద” అన్నాను.
మా ఇంటికి నాలుగిళ్లవతల ఉన్న సుబ్బన్న వాళ్ల ఇంటి దగ్గర ఆగాం. సుబ్బన్న తన ఐదెకరాల పొలంలో వ్యవసాయం చేస్తాడు. నా స్టూడెంట్.. తొమ్మిదో తరగతి వరకు చదివాడు. నన్ను చూడగానే లేచొచ్చి..
“రండి మాస్టారూ!” అంటూ ఆహ్వానించాడు. మూర్తి ఒళ్లంతా కళ్లు చేసుకుని, ఆ ఇంటిని గమనిస్తూ.. గుర్తు చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. సుబ్బన్నకు మూర్తిని పరిచయం చేస్తూ..
“ఇప్పుడు నువ్వుంటున్న ఈ ఇల్లు వీళ్లదే. మూర్తి వాళ్ల నాన్న ఈ ఇంటిని మీ తాతకు అమ్మేసి, హైద్రాబాద్ వెళ్లిపోయాడు” అన్నాను.
“అలానా మాస్టారూ.. నాకా విషయం తెలియదు” అన్నాడు సుబ్బన్న.ఇంటి చుట్టూ తిరిగి చూసి..
“పెరట్లో జామచెట్టు ఉండాలే. మనిద్దరం దోరగా ఉన్న జామకాయలు తెంపుకొని తినేవాళ్లం గుర్తుందా? ఆ చెట్టు ఏమైపోయింది?” అన్నాడు మూర్తి.
“సుబ్బన్న వాళ్ల నాన్న పాత ఇంటిని పడగొట్టి కొత్త ఇల్లు కట్టుకున్నాడు. అప్పుడు జామచెట్టు అడ్డంగా ఉందని కొట్టేశారు” అన్నాను. మరో రెండ్రోజులు ఉన్నాక మూర్తి హైద్రాబాద్ తిరిగెళ్లడానికి బ్యాగ్ సర్దుకుంటుంటే..
“స్టేషన్ దాకా నేనూ వస్తాను” అన్నాను.
“నీకెందుకు శ్రమ?” అన్నాడు మూర్తి.
“శ్రమేముంది? నువ్వు నన్ను చూడటానికి హైద్రాబాద్ నుంచి రెండొందల కిలోమీటర్లు ప్రయాణించి రాగాలేనిది.. నేను మూడు కిలోమీటర్లు నీ కోసం రాలేనా?” అంటూ నవ్వాను. రైల్వే స్టేషన్లో రఘురాం నాతో..
“మీ ఇంట్లో ఉన్న నాలుగు రోజులు మాతాత ఎంత సంతోషంగా ఉన్నాడో.. టీనేజ్ కుర్రాడిలా మీతో ఎక్కడెక్కడికో ఎంత ఉత్సాహంగా తిరిగాడో. మీ దయ వల్లనే మా తాత కోరిన కోరిక తీర్చగలిగాను. మీకు చాలా థ్యాంక్స్ సర్” అన్నాడు. రైలు ఎక్కేముందు మూర్తి నా చేతులు పట్టుకుని..
“ఎన్ని అందమైన జ్ఞాపకాల్ని మూటగట్టుకుని పోతున్నానో.. నీలాంటి స్నేహితుడుండటం నా పూర్వజన్మ సుకృతం” అంటున్నప్పుడు అతని కళ్లు చెమర్చాయి. ఇంటికి తిరిగి రాగానే నా భార్య మంచినీళ్లు ఇస్తూ..
“మీ బాల్య స్నేహితుడికి సెండాఫ్ ఇచ్చి వచ్చారన్నమాట” అంది.
“నీకో రహస్యం చెప్పనా? అతను నాతో కలిసి చదువుకున్న మూర్తి కాదు. ఈ శ్రీనివాసమూర్తి ఎవరో నాకు తెలియదు” అన్నాను.
నా భార్య ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి..
“అదేంటండీ! నాలుగు రోజులు ప్రాణస్నేహితుణ్ని చూసినట్టే చూశారుగా. నటించారా?” అంది.
“లేదు.. నటించలేదు! నిజంగానే అతను నా చిన్ననాటి స్నేహితుడైనట్టే అనుభూతి చెందాను. అతణ్ని సంతోషపెట్టడమే కాదు.. నేనూ సంతృప్తి పొందాను” అన్నాను.
“ఎందుకలా చేశారు?”
“రెండు కారణాల వల్ల శకుంతలా.. అతని మనవడికి తన తాత కోరిక తీర్చిన సంతృప్తిని మిగల్చాలని చేశాను. మూర్తికి తన చివరి రోజుల్లో ఓ అందమైన అనుభవం మిగల్చాలని చేశాను”
“ఇంతకూ అతను మీ బాల్యస్నేహితుడు కాదని ఎప్పుడు తెల్సింది? అలాంటప్పుడు ఆ శ్రీనివాసమూర్తి మిమ్మల్ని వెతుక్కుంటూ ఎందుకొచ్చినట్టు?”
“నాతోపాటు చదువుకున్న మూర్తి అప్పట్లోనే చాలా పొడవుగా, తెల్లగా ఉండేవాడు. అతణ్ని రామాలయం దగ్గర చూసినపుడే తెల్సిపోయింది.. ఈ మూర్తి ఆ మూర్తి కాడని. మా ఊళ్లో నా చిన్నప్పుడు కూడా చెరువు లేదు. చింతలతోపు కూడా లేదు. నాకు అర్థమైంది ఏమిటంటే.. అతనికి క్యాన్సర్ కంటే ముందే అల్జీమర్స్ వ్యాధి ఉండి ఉంటుందని. అతని చిన్నప్పుడు ప్రసాద్ అనే స్నేహితుడు నిజం. ఆ ఊళ్లో చెరువుగట్టు, చింతలతోపు నిజం. అతను గుర్తుచేసుకున్న రంగనాయకులు నిజం. కానీ, ఆ ఊరిపేరు మర్చిపోయాడు. మన ఊరినే తన బాల్యంలో గడిపిన ఊరనుకుని భ్రమపడ్డాడు. అతని భ్రమని అందమైన నిజంలా చేయడంలో నేను తోడ్పడ్డాను అంతే! నిజం చెప్పనా? అతనున్న నాలుగు రోజులు నేను కూడా ఎంత సంతోషంగా ఉన్నానో.. నేనూ బాల్యంలోకి ప్రయాణించాను. ఏడాదికి ఒక్కసారైనా ఒక్కరైనా అలా నన్ను వెతుక్కుంటూ వచ్చి, బాల్యంలోకి లాక్కెళితే ఎంత బావుంటుందో కదా!” అన్నాను.
సలీం
మలి వయసులో మనల్ని వెతుక్కుంటూ ఎవరైనా వచ్చి, మూడు రోజులు మనతో గడిపి వెళ్తే.. ఎంత బావుంటుందో కదా! పొరబడి వచ్చినా, వాళ్లు పొందే ఆనందం, మనకు మిగిల్చి వెళ్లే అనుభూతి మధురంగా ఉంటాయి కదా.. ఈ భావనే ‘తడబడిన జ్ఞాపకం’ కథకు ప్రేరణ. రచయిత సలీం. సొంతూరు ఒంగోలు సమీపంలోని తోవగుంట. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో ఎమ్మెస్సీ (టెక్) చేశారు. ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్లో అడిషనల్ కమిషనర్‌గా ఉద్యోగ విరమణ పొందారు. ఇప్పటివరకు మూడు కవితా సంపుటాలు, పన్నెండు కథా సంపుటాలు, ముప్పై ఆరు నవలలు వెలువరించారు.
ఈయన రాసిన కొన్ని నవలలు, కథలు ఆంగ్లం, హిందీ, మరాఠి, ఒరియా, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లోకి అనువాదం అయ్యాయి. పిల్లల కోసం ఏడు సైన్సు కాల్పనిక నవలికలు రాశారు. సాహితీసేవలో భాగంగా.. భాషా పురస్కారం, చాసో సాహిత్య పురస్కారం, వాసిరెడ్డి సీతాదేవి సాహిత్య పురస్కారం, కొవ్వలి సాహిత్య పురస్కారం, మాడభూషి రంగాచారి స్మారక పురస్కారం, సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. వివిధ సాహితీ సంస్థలు నిర్వహించిన కథల పోటీల్లో బహుమతులు, సన్మానాలు పొందారు.