‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.
సూర్య కిరణాలు నెమ్మది నెమ్మదిగా లోకాన్ని కాంతిమంతం చేస్తున్న సమయమది. అప్పటికే రకరకాల వంటకాలతో డైనింగ్ టేబుల్ నిండిపోయింది. అమెరికాలోని న్యూజెర్సీ నుంచి రాబోతున్న తన కొడుకు మాధవన్కీ, కోడలు మార్గరెట్కీ ఇష్టమైన స్వీట్స్ తయారు చెయ్యడంలో బిజీగా ఉంది కామేశ్వరి.
“ఏమండీ.. టైం అప్పుడే ఆరయిపోయింది. ఫ్లయిట్ పది గంటలకి. ఇప్పుడు బయల్దేరితేనే సరిగ్గా ఉంటుంది”
భర్త రామారావుకి వినిపించేటట్లుగా చెప్పింది.. వంటగదిలోంచి కామేశ్వరి.
“కొడుకూ, కోడలూ రాబోతున్నారన్న సంతోషం.. వాళ్లొచ్చే వరకూ కొంచెం దాచుకో! ఇదిగో నాన్నగారికి టవల్ బాత్ చేయించి బయల్దేరుతాను” నవ్వుతూ చెప్పాడు రామారావు.
పక్షవాతం వచ్చి ఒక కాలూ, ఒక చెయ్యి పడిపోవడంతో మంచానికే అంకితమై పోయాడు రామనాథం.
“నాన్నగారూ లేవండి. స్నానం చేయించేస్తాను” అంటూ ఆయన వేసుకున్న బట్టల్ని నెమ్మదిగా తీసి, టవల్‌తో ఒళ్లంతా తుడుస్తూ ఉంటే చూశాడు.. తండ్రి కళ్లల్లోంచి కారుతున్న కన్నీటిని.
“ఎందుకు నాన్నా ఏడుస్తున్నారు. ఇవాళ మీ మనవడూ, మనవడి భార్యా ఇక్కడికి వస్తున్నారు. అందువల్ల మనసులో ఏదీ ఆలోచించకుండా సంతోషంగా ఉండాలి మరి” అంటూ స్నానం చేయించి బట్టలు మార్చాడు రామారావు.
కామేశ్వరి తెచ్చి ఇచ్చిన టిఫిన్‌ని తండ్రికి తినిపించి ఎయిర్‌పోర్టుకి బయల్దేరాడు రామారావు.
ఇంటికి వచ్చిన కొడుకూ, కోడల్ని చూసి తెగ సంబర పడిపోయింది కామేశ్వరి.
మార్గరెట్‌కి ఆ ఇల్లు, వాతావరణం చాలా కొత్తగా ఉంది. ఇక్కడ ఒకరి కోసం ఒకరు జీవించడం, ప్రేమానురాగాలు పంచుకోవడం చూసి ఆశ్చర్యపోయింది. తల్లీ-తండ్రి, భార్యా-భర్త, కొడుకూ-కోడలు, కూతురూ-అల్లుడు.. ఇలా అందరి బాంధవ్యాలూ ప్రేమపాశంలో చిక్కుకుని ఉండటం, ఒకరి గురించి మరొకరు కష్టాన్నీ సంతోషంగా అనుభవించడం చూస్తుంటే.. ఆనందంతో పులకరించి పోయింది మార్గరెట్.
అమెరికాకి చెందిన మార్గరెట్.. మాధవన్‌ని చూడగానే ప్రేమించేసింది. భారతదేశ సంస్కృతి గురించి, మమతానురాగాల గురించి విన్న ఆమె.. తనకి తెలియకుండానే భారతదేశం మీద పిచ్చి అభిమానాన్ని పెంచుకుంది. అందుకే మాధవన్‌ని చూడగానే ప్రేమించేసింది. అందం, సంస్కారం ఉన్న మార్గరెట్ అంటే మాధవన్కీ చాలా ఇష్టం ఏర్పడింది. అదీ కాకుండా తన తల్లిదండ్రులు ఒప్పుకొంటేనే పెళ్లి.. లేకపోతే లేదు అని కచ్చితంగా, నిర్మొహమాటంగా చెప్పిన మాధవన్‌ని ఇంకా ఇష్టపడిపోయింది మార్గరెట్.
అలాగే ఇండియా నుంచి తల్లిదండ్రుల అనుమతి దొరికిన తర్వాతనే మార్గరెట్‌ని పెళ్లి చేసుకున్నాడు మాధవన్. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఇద్దరూ ఇండియా వచ్చారు.
బాల్కనీలో నిలబడి చుట్టు పక్కలకు చూస్తున్న మార్గరెట్ దగ్గరకి వచ్చాడు మాధవన్. బంగారు ఛాయలో తళతళ లాడుతున్న ఆమె తల వెంట్రుకలు గాలికి ఎగురుతూ ఉంటే.. అందంగా, కుందనపు బొమ్మలా ఉన్న మార్గరెట్.. మాధవన్‌ని చూసి.
“అమ్మ, నాన్నగారు, ఈ ఇల్లు, ప్రశాంతమైన ఈ వాతావరణం, కళ్లతోనే ప్రేమను పంచే తాతయ్య గారు, నాకిక్కడ చాలా బాగుంది మాధవ్” అంది తెగ సంబరపడుతూ.
ఆమె మాటల్లో నిజాయతీ కనిపించింది.
“నీకీ విషయం తెలుసా? అమ్మ మొదట్లో మన పెళ్లికి ఒప్పుకోలేదు. నాన్నగారే అమ్మ దగ్గర మాట్లాడి, నచ్చచెప్పి ఆమె మనసు మార్చారు. నేను వచ్చేటప్పుడు తాతయ్య బాగానే ఉన్నారు. ఇప్పుడు ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. మా ఇంటికి సంబంధించినంత వరకూ నాన్నగారే అన్నీ. మా తాతగారి మనసు కష్టపడకుండా, అమ్మమనసు నొప్పించకుండా చాలా శాంతంగా ఉంటారు. చాలా పెద్ద మనసుతో నిన్ను కోడలుగా చేసుకున్నారు. నాన్నగారంటే అందుకే నాకంత ఇష్టం!” అంటూ తన తండ్రి గురించి గొప్పగా చెప్పసాగాడు మాధవన్.
“మధూ! నా డెలివరీ టైంలో అమ్మానాన్నలు ఉంటే బాగుంటుందని, వాళ్లని మనతోపాటు తీసుకుని వెళ్దామని అనుకున్నాం కదా! వాళ్లు మనతో వస్తారంటావా?” దీనంగా అడిగింది మార్గరెట్.
కచ్చితంగా వస్తారు. మనవణ్ని చూడాలన్న కోరిక వాళ్లకి మాత్రం ఉండదా? తాతయ్యకి ఏదో ఒకటి అరేంజ్ చేసిన తర్వాత వాళ్లని మనతో తీసుకుని వెళ్దాం” అన్నాడు మాధవన్ ఆమెని సమాధాన పరుస్తూ.
“తాతయ్యా.. మార్గరెట్ మీతో ఏదో చెప్పాలనుకుంటోంది” అంటూ రామనాథం దగ్గరగా వచ్చి కూర్చొన్నాడు మాధవన్.
“రామ్మా.. ఇలా వచ్చి కూర్చో!” అంటూ, దగ్గరికి పిలిచాడు రామనాథం.
“తాతయ్య గారూ! ఇండియాకు వచ్చి మీ అందరితో మాట్లాడాలనే తెలుగు నేర్చుకున్నాను”.. మార్గరెట్ చిన్నపిల్లలా మాట్లాడుతుంటే ఆనందంగా వినసాగాడు.
“నా డెలివరీ టైంలో అత్తయ్య, మామయ్యా మా దగ్గర ఉండాలని అనుకుంటున్నాం. మీరు తప్పుగా తీసుకోవద్దు. మిమ్మల్ని మంచి వృద్ధాశ్రమంలో ఉంచుతాం. తిరిగి వాళ్లు ఇండియాకి వచ్చిన తర్వాత.. మీరు ఇంటికి వచ్చేద్దురుగానీ. ఇందులో మీకేమైనా అభ్యంతరముంటే చెప్పండి తాతయ్యగారు. మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకొంటేనే అత్తయ్య, మామయ్యల్ని మాతో తీసుకుని వెళ్తాం”.. బతిమాలుతున్నట్లుగా అడిగింది మార్గరెట్.
గొంతు వణుకుతుంటే మాట్లాడటం మొదలుపెట్టాడు రామనాథం.
“పాపం నా కొడుకు.. ఈ రెండేళ్లలో నాకు సేవలు చేసి బాగా అలసిపోయాడు. ఎప్పుడూ ముఖం మాడ్చుకోవడం గానీ, విసుక్కోవడం గానీ నేను చూసింది లేదు. వాడికి కొంచెం మార్పు కావాలి. తప్పకుండా వాళ్లిద్దర్నీ మీతోపాటు తీసుకుని వెళ్తామంటే.. నాకు అంతకన్నా కావాల్సిందేముంది? చాలా సంతోషం. నువ్వు మామీద ఇంత ప్రేమ చూపించడం.. నిజంగా చాలా ఆనందంగా ఉందమ్మాయ్. నేను అబ్బాయితో మాట్లాడతాను. వాళ్లిద్దర్నీ మీతోపాటు పంపే బాధ్యత నాది”.. నమ్మకంగా చెప్పడంతో మార్గరెట్‌కి కొంచెం ధైర్యం వచ్చింది.
బాల్కనీలో నిలబడి ఆకాశాన్నే తదేకంగా చూస్తున్న కొడుకూ, కోడలు దగ్గరికి వచ్చి నిలబడింది కామేశ్వరి.
“మార్గరెట్.. నువ్వు గోవా వెళ్లి అక్కడి ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాసిలికా చర్చిని చూడాలని చెప్పావుకదా! మరి ఎప్పుడు బయల్దేరుతున్నారు?” అడిగింది.. కోడలి చేతులు పట్టుకుని.
“మేము రెండు నెలల లీవ్‌లో వచ్చాం అత్తయ్యా! మిమ్మల్నీ, మామయ్య గారినీ మాతోపాటు తీసుకుని వెళ్లడానికి ఏర్పాట్లు చేయాలి కదా! తాతగార్ని మంచి వృద్ధాశ్రమంలో చేర్పించాలి. ఇవన్నీ చక్కగా అయిన తర్వాతే దేవుడి దర్శనం”.. జవాబు చెప్పిన కోడల్ని తదేకంగా చూస్తూ తన్మయత్వంలో ఉండిపోయింది కామేశ్వరి.
“మాధవన్‌ని అడిగితే వాడూ ఇలాగే అన్నాడు. కానీ, మీ మామయ్యగారు ఒప్పుకొంటారా? అన్నదే నాకు కొంచెం అనుమానంగా ఉందమ్మా. పుట్టబోయే మనవణ్ని చూడాలన్న కోరికైతే మనసులో బోలెడు ఉందికానీ.. ఆయన ఏమంటారో చూడాలి మరి”
“మీరేం భయపడకండి. మామయ్య తప్పకుండా వస్తారు. మీ మనవణ్ని ముందుగా మీరే ఎత్తుకుని ముద్దాడాలి. అదే నా ఆశ కూడానూ” నెమ్మదిగా అంది మార్గరెట్.
రెండు రోజుల తర్వాత…
“మీరందరూ వారం రోజుల్నుంచీ చెవులు కొరుక్కుంటున్న విషయం నాకిప్పుడే తెలిసింది. నాన్న ఇప్పుడే నాకంతా చెప్పారు. కానీ, మీరు అనుకుంటున్నదానిలో చిన్న మార్పు. కచ్చితంగా మీ అమ్మ మీతో వస్తుంది. తనని మీతో తీసుకుని వెళ్లి, మీతోనే ఉంచుకుని మనవడి ఆలనా పాలనా చూసుకోమని చెప్పండి. మీకెప్పుడు తిరిగి పంపాలనిపిస్తే అప్పుడు పంపించండి. దయచేసి నన్ను మాత్రం బలవంతం చేయవద్దు. ప్లీజ్.. నాన్నగారిని ఈ స్థితిలో వదిలిపెట్టి రాలేను. ఆయన్ని వేరేవాళ్ల దగ్గర ఉంచడం నాకిష్టం లేదు. ఆయన ఆఖరి శ్వాస వరకూ నేను ఆయన పక్కనే ఉండాలని అనుకుంటున్నాను” కొడుకును నెమ్మదిగా సమాధానపరిచాడు రామారావు.
రాత్రి పడుకునే ముందు..
“ఏమండీ! మీరు లేకుండా నేనుమాత్రం వెళ్లడం నాకిష్టం లేదండి” అంది కామేశ్వరి.
భార్యని ప్రేమగా చూశాడు రామారావు.
“కామూ! నువ్వు తప్పకుండా వాళ్లతో వెళ్లాలి. డెలివరీ సమయంలో నువ్వు మార్గరెట్ పక్కన ఉండటం చాలా అవసరం. నా గురించి భయపడొద్దు. వంట చెయ్యడానికి పనమ్మాయి ఉంది. నాన్నగారిని చూడటానికి నేనున్నాను. నువ్వు మాత్రం ఎలాంటి కారణాలు చెప్పక బయల్దేరు” అన్నాడు రామారావు.. భార్యకి ఆర్డరు వేస్తున్నట్లు.
కామేశ్వరికి వీసా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంకో పదిరోజుల్లో బయల్దేరాలి. తండ్రి తమతో రాకపోవడం మాధవన్కి బాధగానే ఉంది. రాత్రి మాధవ్ రూమ్‌లోకి వెళ్లింది కామేశ్వరి. తల్లిని చూసి..
“ఏమ్మా! ఇంకా నిద్రపోలేదా? నాతో పనేమైనా ఉందా?” ఆత్రుతగా అడిగాడు మాధవ్.
“మాధవ్.. నేను ఒకమాట అడుగుతాను. తప్పుగా తీసుకోవద్దు. నాకు నాన్నగారిని వదిలి అమెరికా రావాలనిపించడం లేదురా! మీరు వెళ్లిరండి. తర్వాత నేనూ, నాన్నగారూ వీలు చూసుకుని అక్కడికి వస్తాం”
మాధవన్, మార్గరెట్ ఆశ్చర్యంగా చూశారుకామేశ్వరిని.
“సర్లేమ్మా! నాకు అర్థమైపోయింది. నువ్వు మార్గరెట్‌ని నీ కోడలుగా మనస్ఫూర్తిగా అంగీకరించలేదని తెలుస్తోంది. ఆమె వేరే దేశానికి చెందిన అమ్మాయి అయి ఉండొచ్చు. కానీ, ఆమె ఈ ఇంటి వారసుణ్ని తన కడుపులో మోస్తోంది. మన దేశ సంస్కృతిని, ఇక్కడ ఒకరిపై ఒకరు చూపించుకునే ప్రేమాభిమానాల్ని చూసే.. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. డెలివరీ సమయంలో తనకి తోడుగా ఉండమని అడిగితే నిరాకరించడానికి మీ మనసెలా ఒప్పుకొందమ్మా! నువ్వు, నాన్నగారూ తనతోపాటు ఆమెరికా వస్తారని, తనకి తోడుగా ఉంటారని ఎంతో నమ్మకం పెట్టుకుంది మార్గరెట్. కానీ, ఒక్క నిమిషంలో మా నమ్మకాన్ని ముక్కలు చేసేశావు కదమ్మా!” మాధవన్ గొంతులో కోపం తొంగి చూసింది.
“లేదు నాన్నా! నేను చెప్పేది కొంచెం విను!”
“వద్దమ్మా ప్లీజ్! ఇంతటితో ఈ టాపిక్‌ను ముగించేద్దాం. మేము ఎలా వచ్చామో అలాగే వెళ్లిపోతాం. ఎవరూ మాతో రావొద్దు” అంటూ ముఖం తిప్పుకొన్నాడు మాధవన్.
కామేశ్వరికి ఏం మాట్లాడాలో తెలీక నిశ్శబ్దంగా అక్కడినుంచి వెళ్లిపోయింది.
మార్గరెట్ విచారంలో మునిగిపోయింది.
“ఇక్కడ ఉన్నన్ని రోజుల్లో నువ్వు చూడాలనుకున్నవన్నీ చూసేసి బయల్దేరిపోదాం” అన్నాడు మాధవన్. కళ్లలో తిరుగుతున్న కన్నీటిని బయటికి రానీయకుండా.
“నాన్నగారూ! నేనూ, మార్గరెట్ ఇవ్వాళ గోవాకి బయల్దేరుతున్నాం. తిరిగి మేం అమెరికా వెళ్లడానికి ఒకరోజు ముందే వస్తాం!”
“అలాగే వెళ్లరా! మార్గరెట్‌కి అన్నీ చూపించు. అవన్నీ చూసిన తర్వాత బాలఏసులాంటి మనవణ్ని కని ఇవ్వమని చెప్పు” అంటూ.. మౌనంగా నిలబడి ఉన్న కొడుకు దగ్గరికి వచ్చి..
“చూడు మాధవ్! అమ్మా, నేనూ రావడం లేదని బాధపడకురా! నేను లేకుండా రావడానికి అమ్మ ఇష్టపడటం లేదు. ఇక్కడ మా బాధ్యతల్ని పూర్తిగా నిర్వహించిన తర్వాత తప్పకుండా అమెరికా వస్తాం.. సరేనా?” కొడుకుని సమాధానపరిచాడు రామారావు.
ఇంటి ముందు టాక్సీ నిలబడి ఉంది.
“ఫ్లయిట్‌కి టైం అవుతోంది. త్వరగా రా మార్గరెట్”.. అంటూ, ఇంట్లోకి వెళ్లి మంచినీళ్లు తాగుతున్నాడు మాధవన్.
నెమ్మదిగా కొడుకు దగ్గరికి వచ్చింది కామేశ్వరి.
మాధవన్ చేతికి ఒక కవరిచ్చి..
“తొందర లేదురే! గోవాకి వెళ్లి అన్నీ చూసిన తర్వాత నిదానంగా ఈ ఉత్తరం చదువుకో!” అంది కళ్లలో నీళ్లు తిప్పుకొంటూ.
ఆమె కన్నీళ్లు అర్థం కాక.. కవర్ తీసుకొని గబగబా నడిచి వెళ్లిపోయాడు మాధవన్.
ఎయిర్‌పోర్టులోని లాంజ్‌లో కూర్చొన్న తర్వాత జేబులోంచి లెటర్ తీసి మార్గరెట్ చేతికిచ్చాడు.. లోపల పెట్టమని. కానీ, మార్గరెట్ అక్కడే కవర్ చింపి ఆ లెటర్ని చదవసాగింది ఆత్రుతగా.
ప్రియమైన మాధవన్, మార్గరెట్‌కి,దయచేసి మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకండి. మేము మీమీద చూపించే ప్రేమలో ఏ మాత్రమూ లోపం లేదు. అది మీరు తెలుసుకోవాలి. అదీ కాకుండా మీ నాన్నగారిని మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదని నేను ఇంత కాలమూ దాచిన ఒక రహస్యం మీకు చెప్పాలనుకుంటున్నా. మాధవన్.. నువ్వు నా కడుపులో ఉన్నప్పుడే ఒక యాక్సిడెంట్లో మీ నాన్నగారు చనిపోయారు. ఈ రామారావు గారు మీ నాన్నకాదు. పెద్దల్ని ఎదిరించి పెళ్లిచేసుకుని.. అందర్నీ దూరం చేసుకున్నాను. మీ నాన్నగారి మరణంతో అందరి ఆదరాభిమానాల్నీ కోల్పోయాను. ఒంటరిగా మిగిలిపోయాను. అలాంటి సమయంలో మీ నాన్న స్నేహితుడైన ఈ రామారావుగారు నన్ను పెళ్లి చేసుకుని.. సమాజంలో నాకొక స్థానం సంపాదించి పెట్టారు. అలాగే నువ్వు తండ్రిలేని అనాథవి కాకూడదని తనే నీకు నాన్న అయ్యారు. నీ దగ్గర మనసు విప్పి చెబుతున్నాను.
ఈ క్షణం వరకూ మేమిద్దరం మంచి స్నేహితులుగానే ఉండిపోయాం. మామధ్య ఎలాంటి దాంపత్య సంబంధాలూ లేవు. తన స్నేహితుడి కుటుంబం కోసం తన జీవితాన్నే కర్పూరంగా మార్చి కరిగిపోతున్నారు. అంతేకాదు మాధవన్! పక్షవాతం వచ్చి కాలూ, చెయ్యి పడిపోయిన మీ తాతకి తనే అన్నీ అయి చూసుకోసాగారు. ఆయన కూడా రామారావు గారి తండ్రి కాదు. ప్రేమ పెళ్లి చేసుకున్నానని నన్ను ఇంటి నుంచి తరిమేసిన మా నాన్నే. అమ్మ చనిపోయిన తర్వాత అన్నయ్యలు చేతులు దులిపేసుకుంటే.. ఎవరి ప్రేమకీ నోచుకోక నా దగ్గరికి వచ్చారు. ఆయన్ని మన కుటుంబంలో ఒకరిగా ఆదరించారు రామారావుగారు. ఈరోజు వరకూ మీ తాతయ్యని తన తండ్రిగానే చూసుకుంటున్నారు రామారావుగారు.
ఆయనకి భార్యగా జీవిస్తున్న నేను.. నిజానికి భార్యగా ఏమీ ఇవ్వలేకపోయాను. నువ్వు ఆయన కొడుకువి కాదు. నీ తాత ఆయన తండ్రి కాదు. అయినా సరే.. ఆయన చూపే ప్రేమానురాగాలలో నువ్వేమైనా తప్పు పట్టగలవా? చెప్పు మాధవ్? జన్మతః వచ్చేవే కాదు బంధుత్వాలు. ప్రేమతో, అనురాగాలతో కూడా బంధుత్వాలని ఏర్పరుచుకోవచ్చని నిరూపించారు మీ నాన్నగారు. అలాంటి ఆయన్ని విడిచి మీతో రావడం న్యాయమా చెప్పు? జీవితాంతం ఆయన పక్కనే ఉండి ఆయన సేవ చేసుకోవాలన్నదే నా కోరిక. ఆయన మీనుంచి ఆశించేది కూడా.. మీ ప్రేమ మాత్రమే.
ప్రేమతో..
అమ్మ.
ఈ క్షణం వరకూ మేమిద్దరం మంచి స్నేహితులుగానే ఉండిపోయాం. మామధ్య ఎలాంటి దాంపత్య సంబంధాలూ లేవు. తన స్నేహితుడి కుటుంబం కోసం తన జీవితాన్నే కర్పూరంగా మార్చి కరిగిపోతున్నారు. అంతేకాదు మాధవన్! పక్షవాతం వచ్చి కాలూ, చెయ్యి పడిపోయిన మీ తాతకి తనే అన్నీ అయి చూసుకోసాగారు. ఆయన కూడా రామారావు గారి తండ్రి కాదు. ప్రేమ పెళ్లి చేసుకున్నానని నన్ను ఇంటి నుంచి తరిమేసిన మా నాన్నే.మంచం మీద కళ్లు మూసుకుని పడుకుని ఉన్న రామారావుకి.. నీడలా ఏదో కదలినట్టనిపిస్తే కళ్లు తెరిచి చూశాడు.
ఎదురుగా మాధవన్, మార్గరెట్.
“ఏమిటి మాధవా?. ఫ్లయిట్ ఏమైనా క్యాన్సిల్ అయ్యిందా”? అంటూ లేచి కూర్చున్నాడు.
“లేదు నాన్నగారూ! ఉన్న పది రోజులూ మీతోనూ, అమ్మతోనూ గడపాలని గోవా వెళ్లకుండా వచ్చేశాం”.. తండ్రిని ఆరాధనగా చూస్తూ అన్నాడు మాధవన్.
‘నేను చూడాలని ఆశపడ్డ ఆ బాలఏసు నా కళ్లెదురుగా ప్రశాంతంగా కూర్చుని ఉంటే.. మీ కాళ్ల దగ్గర ఆనందంగా జీవించాలని వచ్చేశాం మామయ్యా!’ అని మనసులోనే అనుకుంటూ..
కామేశ్వరిని మంచం మీద కూర్చోబెట్టి వాళ్ల కాళ్ల దగ్గర కూర్చొంది మార్గరెట్.. కళ్లలో ఆనందబాష్పాలు తిరుగుతూ ఉంటే!
సూరిశెట్టి వసంతకుమార్
‘బంధుత్వాలు అనేవి జన్మతః మాత్రమే వచ్చేవి కాదు. ప్రేమతో, అనురాగాలతోనూ బంధుత్వాలను ఏర్పరుచుకోవచ్చు’ అని నిరూపించే కథ.. దైవం మానుష్య రూపేణ. రచయిత సూరిశెట్టి వసంత కుమార్. బి.ఎ. చదివారు. నెల్లిమర్ల జూట్ మిల్లులో 20 ఏళ్లు పర్సనల్ మేనేజర్‌గా ఉద్యోగం చేసి.. పదవీ విరమణ చేశారు. తండ్రి సూరిశెట్టి సాంబశివరావు. దాదాపు 20 ఏళ్లపాటు బాలమిత్రకి ఎడిటర్‌గా చేశారు. తండ్రి దీవెనలతోనే రచనారంగంలో రాణిస్తున్నట్లు రచయిత చెబుతున్నారు. ఇప్పటి వరకు 30 కథలు, 25 ఆర్టికల్స్ రాశారు. అవన్నీ ప్రముఖ దిన, వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. నమస్తే తెలంగాణ – ముల్కనూరు ప్రజా గ్రంథాలయం కథల పోటీతోపాటు ఉషా పక్షపత్రిక, జాగృతి, సాహితీ కిరణం, విశాలాక్షి సంస్థలు నిర్వహించిన వివిధ కథల పోటీల్లోనూ బహుమతులు గెలుచుకున్నారు. తనను విమర్శించే శ్రీమతి గోమతికి, ప్రోత్సహించే పిల్లలు శక్తీ, శాంతి, పవన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు.
సూరిశెట్టి వసంతకుమార్
62812 87659