‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో విశిష్ట బహుమతి పొందిన కథ.
కుక్కిమంచంమీద పడివుండి, కృష్ణపక్షపు చంద్రుడిలా రోజురోజుకీ కృశించిపోతున్న అన్నపూర్ణ శరీరం వైపు.. సెగలు పొగలుగా సాగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియ తాలూకు ఉక్కిరిబిక్కిరిలోంచి బయటపడటానికి విఫల ప్రయత్నం చేస్తూ.. కన్నీటి పొరల చాటుగా చూస్తున్నాడు పతంజలి. ఒకనాడు అత్యంత ముగ్ధ మోహన కళాగుళిక లాంటి ఆ ముఖమేనా ఇది?!.. ఇలా.. వాడిపోయిన తామర పువ్వులా! గుండెలు కక్కటిల్లి పోతున్నాయి.
‘ఈ రాత్రి గడుస్తుందా?’ లోలోనే చీకటి కమ్మిన కాళరాత్రి లాంటి భయంతో గొణుక్కున్నాడు.
పొద్దున ప్రారంభమైన గాలివాన.. గుండెల మీద కాళ్లుపెట్టి కదలకుండా నిలబడ్డ మదించిన వృషభంలా.. పైలోకంలో ఉన్న వారంతా ఒక్కుమ్మడిగా రోదిస్తున్నట్లుగా.. రాత్రి పదయినా ఇంకా అలా కురుస్తూనే ఉంది. పైన రేకుల మీద కురుస్తున్న వాన తాలూకు నిరంతర ధ్వని మరణ మృదంగనాదాన్ని తలపిస్తూ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది.
సాయంత్రం పోయిన కరెంటు ఇంకా రాలేదు. వెలిగించిన గుడ్డి లాంతరు దీపం మసకబారుతూ అప్పుడప్పుడూ రెపరెపలాడుతూ.. అన్నపూర్ణ ముఖం మీద చావు బతుకుల తెరలను కదుపుతున్నది.
లోనుంచి వరద పొంగులా తన్నుకొస్తున్న దుఃఖానికి పళ్లని బిగపట్టి ప్రయత్నపూర్వకంగా ఆనకట్ట వేసి ఆపుకొన్నాడు పతంజలి. ఆ చిన్నగదిలోనే బయట వానకు తడిసిపోకుండా లోపలికి తెచ్చిపెట్టుకుని గోడవారగా నిలబెట్టిన తన మరో ప్రాణం.. తన జీవనాధారం అయిన పాత సైకిల్ మీదికి పారింది అతని చూపు. ఆ సైకిలూ, అన్నపూర్ణా ఒక్కసారే పరిచయమయ్యారు తనకి. ఆనాటి నుంచీ తన జీవితంలో భాగమైపోయి.. ఈనాడూ ఒక్కలాగే జీర్ణావస్థకి చేరిపోయి..
చెమ్మ ఇంకి, ప్రపంచపటం లాంటి మరకలతో తడి బారిన గోడకి నీరసంగా చేరగిలబడి.. కిందికి జారి కూర్చుని కళ్లు మూసుకున్నాడు పతంజలి.
తమ పరిచయం.. సంవత్సరాల క్రితం నాటి మాట!
పురి తిప్పిన ఉక్కు తీగల్లాంటి నరాలు కాళ్లలోంచి బయటికి ఉబికివచ్చేంత ఉద్వేగంతో.. కొలిమి నుంచి వెలువడే వేడి సెగలను తలపించే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో.. చెదరని లక్ష్యంతో.. ‘సాధించి తీరాలంతే’ అనే ఉక్కు సంకల్పంతో.. తొక్కుతున్నాడు సైకిల్ని పతంజలి. కిలోమీటర్లు.. కిలోమీటర్లు.. తరిగిపోతున్నాయి.. గమ్యం చేరువవుతూ ఉంది.. పోటీదారులు వెనకబడుతున్నారు. కొద్దిసేపటికే అందరూ వెనకబడి పోయారు కూడా.. తనే ముందున్నాడు.. ముప్ఫై కిలోమీటర్ల సైకిల్ రేస్‌లో.. కాళ్లని యంత్రవేగంతో ఆడిస్తూ ముందుకు దూసుకుపోయి..
“అండ్ ద విన్నర్ ఈజ్.. మిస్టర్ పతంజలి!”..
కర్ణపేయంగా అనౌన్స్మెంట్ వినిపిస్తూనే గుండెలు ఆనందంతో రివ్వుమన్నాయి. గమ్యాన్ని చేరుతూనే సైకిల్ని అలవోకగా పచ్చిక మీదికి జార విడిచి, కూలబడి, హెల్పర్స్ అందించిన మంచినీటి బాటిల్ అందుకుని, తల మీద, ముఖం మీద వంచుకుని, నాలుక తడుపుకొని, పొంగుతున్న ఆనందంతో, ఆయాసం తీరడానికి మోకాళ్ల మీద తల ఆన్చుకుని సేదదీరుతున్నాడు పతంజలి. చుట్టుముట్టిన అనేకమంది అభినందిస్తూ పొగుడుతున్నారు..
“కంగ్రాచ్యులేషన్స్ టు ద హీరో ఆఫ్ ద డే!”..
స్వరమా అది!?.. ఈమని శంకర శాస్త్రి వీణానాదం కాదూ!?
చటుక్కున తలెత్తాడు పతంజలి. కళ్లెదురుగా.. తెల్లని అరటి దూట చివర పొందిగ్గా ఓ కలువని తగిలించినట్లున్న హస్తం!.. తన వైపే సాగి ఉంది.. అందుకోమన్నట్లుగా.. అభినందనగా! ఒళ్లు తెలియని నివ్వెరపాటుతో ఆ హస్తంలో అప్రయత్నంగానే తన హస్తాన్ని ఉంచాడు పతంజలి.
“కంగ్రాట్స్ వన్స్ అగైన్. బైదిబై.. ఐ యాం అన్నపూర్ణ”.. ముర్ముర ధ్వనితో అల్లన మెల్లన సాగుతున్న కృష్ణవేణమ్మ అలల్లాంటి మృదుమధుర స్వరం.
యాంత్రికంగా పతంజలి తల ఇంకొంచెం పైకి లేచింది. ధవళ కాంతులీనుతున్న కళ్లకి రేగడి ఒడ్డుల్లాంటి నల్లటి కాటుకతో.. పండిన బాదపు రంగు పల్చని పెదవుల మధ్య పాల నురగలాంటి తెల్లని నవ్వుతో.. దిగివచ్చిన పున్నమి చందమామలా..
అవాక్కయి పోయి అలాగే చూస్తున్నాడు పతంజలి.
“నేను కూడా ఈ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్‌కి సంబంధించిన కాంపిటిషన్స్‌లో పార్టిసిపెంట్నే! డ్యాన్స్ విభాగంలో. రియల్లీ ఐయాం థ్రిల్డ్ ఆఫ్టర్ సీయింగ్ యువర్ పెర్ఫార్మెన్స్!”.
సంభ్రమాశ్చర్యాలతో పతంజలికి నోరు పెగిలితే కదా.. ఏవేవో అలౌకిక అనుభూతులు. ఆమెతో గత జన్మలోనే ఏదో బంధమున్నంత వింత భ్రాంతి.
అది మొదలుగా.. ఆ పరిచయం వివిధ సందర్భాలలో కలయికగానూ.. అనేక రీతుల్లో ఆకర్షణతో నిండిన అభిమానంగానూ.. ఆపైన ప్రేమగానూ మారి.. చివరికి ప్రణయం దాకా దారితీసింది. ఆర్థిక స్థితుల స్థాయీ భేదం కారణంగా వారి పెళ్లికి సుతరామూ ఒప్పుకోమన్నారు అన్నపూర్ణ తాలూకు పెద్దలు. తెగించి, ఇంటిలోంచి బయటికి వచ్చేసి, పతంజలి చెయ్యందుకుంది అన్నపూర్ణ.
“నీ సంపన్న కుటుంబపు సుఖాలనన్నీ వదులుకుని, నాతోపాటే సామాన్య జీవితాన్ని గడపడానికి వచ్చేసిన నిన్ను పువ్వులలో పెట్టి చూసుకుంటూ, సుఖపెట్టాల్సిన నైతిక బాధ్యత నామీదుంది. నీచేత ఉద్యోగమే కాదు.. ఏ పనీ చెయ్యనియ్యను నేను” అని కచ్చితంగా చెప్పేసిన పతంజలి.. స్పోర్ట్స్ కోటాలో బ్యాంక్ ఉద్యోగం సంపాదించుకున్నాడు.
చుట్టుపక్కల పిల్లలకి ఉచితంగా డ్యాన్స్ క్లాసులు తీసుకుంటూ, ఆనందంగా కాలక్షేపం చేస్తూ, భర్త సహకారంతో తరుచు బీదాబిక్కీకి అన్నదానం చేస్తూ.. సార్థక నామధేయురాలు అనిపించుకుంటున్నది అన్నపూర్ణ.
జీవితాలతో ఆడుకోవడం ఈ సృష్టికో వింత సరదా.
తృప్తిమయ జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ల జీవితంలో పెద్ద కుదుపు..
పెళ్లయి మూడు సంవత్సరాలైనా కాకుండానే అన్నపూర్ణ పక్షవాతానికి గురయ్యింది. ఇప్పుడామె కదలలేదు. కాలు, చేయి కదిపి నృత్యం చెయ్యలేదు. కుమిలిపోయాడు పతంజలి. ఉద్యోగ సమయంలో తప్ప మిగిలిన కాలమంతా ఆమె చెంతనే ఉండి కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. మరో ఏడేళ్లు గడిచాయి. పతంజలి మీద మళ్లీ ఏ దేముడో కన్నెర్రజేశాడు. బ్యాంకులో తను చేయని నేరానికి బాధ్యుడిగా, అన్యాయంగా ఉద్యోగాన్నే పోగొట్టుకున్నాడు.
ఇటువంటి పరిస్థితులలో పిల్లలు లేకపోవడం ఓ వరమే అనిపించింది. అయినా, ఇల్లు గడవాలంటేనూ.. అన్నపూర్ణకి మందులు కొనాలంటేనూ తనకి పని కావాలి!
పతంజలి విజ్ఞాపన విని ఫక్కున నవ్వాడుక్యాటరింగ్ మేనేజర్.
“లంచ్‌కి కర్రీస్ క్యారేజీలు సప్లయి చేసే పనికోసం మా దగ్గరకి వచ్చే ప్రతి ఒక్కరి దగ్గరా బళ్లుంటాయి! ఎందుకంటే ఆగమేఘాల మీద అందించడానికి. నువ్వేమో నీ దగ్గర బండి లేదంటున్నావాయే! ఎట్లా నీకు ఈ జాబ్ అప్పజెప్పమంటావు? కుదరదు కదా?” అడిగాడు నొసలు ముడేసి .
వినయంగా చెప్పాడు పతంజలి..
“నా దగ్గర సైకిల్ ఉందండి. నేనుకూడా వాళ్లంత వేగంగానూ క్యారేజీలు అందించి రాగలనండీ!”.
“సైకిలా? ఏఁవయ్యా తమాషా అనుకున్నావా? మా కస్టమర్లలో తొంభై తొమ్మిది శాతం మంది ముసలి వాళ్లుంటారు. పది నిమిషాలు లేటైతే చాలు ముప్ఫై ఫోన్లు వస్తాయి నాకు.. ‘కర్రీస్ రాలేదింకా’ అంటూ. బళ్లున్నవాళ్లే ఒక్కోసారి సమయానికి అందించలేక పోతుంటే.. నువ్వు.. ఆ పాత సైకిల్ మీద..!?” వెటకారంగా నవ్వేశాడు మేనేజర్.
“నేను సైకిల్ రేసుల్లో పదిసార్లు స్టేట్‌ఫస్ట్ సర్. ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో నాకు ఏదో ఓ ఉద్యోగం చాలా అవసరం సర్. ప్లీజ్!”.
పతంజలి వైపు ఆశ్చర్యంతోనూ, జాలితోనూ, అభినందనతోనూ చూశాడు మేనేజర్. మారు మాట్లాడక పతంజలికి జాబ్ ఇచ్చేశాడు.
గత పది సంవత్సరాలుగా తనకు తోడుగా తనతోపాటే కష్ట సుఖాలను అనుభవిస్తూ వస్తున్న తన సైకిల్ నేస్తాన్ని, తట్టి ఉత్సాహ పరుస్తూ..
“రాజా! నాకు ఎన్నో విజయాలనిచ్చి కడుపుని ఆనందంతో నింపావు. ఇప్పుడు కాలుతున్న మా దంపతుల కడుపుల్ని ఆహారంతో నింపు” అని రెండు చేతులూ జోడించాడు.
తూర్పు తెల్లారకముందే లేచి కాలకృత్యాలు తీర్చేసుకుని, అన్నపూర్ణకి స్నానం చేయించి, తల దువ్వి, చీర మార్చి, పాక హోటల్ నుంచి రెండు ఇడ్లీలు తెచ్చి పెట్టి, అన్నం మాత్రం వండి, ఆదరాబాదరాగా కేటరింగ్ హౌస్‌కి చేరి, తన సైకిల్‌కి ఇరుపక్కలా సంచులలో కర్రీ ప్యాకెట్లని పెట్టుకుని, ఒకప్పటి తన శక్తిసామర్థ్యాలను గుర్తుతెచ్చుకుంటూ సైకిల్‌ను శక్తికొద్దీ తొక్కి, ప్యాకెట్స్ అందించి, పని పూర్తయ్యాక తిరిగి మేనేజర్‌కి కనిపించి, ఆయన వర్కర్లందరికీ ఫ్రీగా ఇచ్చే రెండు చల్లబారిన కర్రీ పొట్లాలతో ఇంటికి చేరడం.. పతంజలి నిత్యకృత్యం.
ఇంటికి చేరాక, కర్రీ పొట్లాలు విప్పి, గబగబా అన్నంలో కలిపి, ఆకలితో ఎదురుచూసే భార్యకి నాలుగు ముద్దలు తినిపించి, తనూ ఎంగిలి పడతాడు. ఇదీ దినచర్య.
తమ క్యాటరింగ్ హౌస్ కుక్ మాస్టర్స్ ‘అద్భుతంగా’ చేసే గుత్తి వంకాయ కూరని ‘సరిగ్గా కస్టమర్లకి సరిపోయేంత మాత్రమే’ చేయిస్తాడు మేనేజర్. ఆ కారణంగా తమకి ఆ కూర ఎన్నడూ దక్కదు. విచారించాల్సిన విషయం ఏమంటే గుత్తి వంకాయ కూరంటే
అన్నపూర్ణకి ప్రాణం. ఆ కూర ఎన్నోసార్లు ఆమె తనకి వండి పెట్టింది. ఇప్పుడు.. ఆమె ఆరోగ్యం బాగాలేనప్పుడు.. క్యాటరింగ్ హోమ్‌లో గుండిగ నిండా ఘుమఘుమలాడే ఆ కూర కళ్ల ఎదుట కనిపిస్తున్నా.. ప్యాకెట్లలో వేడివేడిగా కస్టమర్లకి వెళ్లిపోతున్నా.. ఒక్కముక్క కూడా తను అన్నపూర్ణ కోసం తీసుకొని వెళ్లలేడు. చాలా బాధగా ఉంది పతంజలికి.
..అలా గోడకి జారబడి నిస్సత్తువతో కూర్చుని ఉన్న పతంజలికి కొద్దిగా కునుకు పట్టేసింది. అందులో ఓ కల. తనని వదిలేసి అలా పైపైకి వెళ్లిపోతున్న అన్నపూర్ణ.. ఒంటరిగా మిగిలి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్న తనని ఓదార్చుతున్న ఎవరిదో అమృత హస్తం. తన తల నిమురుతూ.. చెంపల మీది కన్నీరు తుడుస్తూ.. ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు పతంజలి.
ఎదురుగా అన్నపూర్ణ.. కుక్కిమంచం పట్టీమీద కూర్చుని తనవైపు వంగి, తన ముఖంలోకి ప్రేమగా, ఆత్మీయంగా చూస్తూ, తల నిమురుతూ, చెంపలు తడుముతున్నది. విస్మయంగా చూశాడు ఆమె ముఖంలోకి.
నీరసంగా.. తుంపుడు మాటలతో..
“ఇలా.. మంచం మీద.. కూర్చోండి!” అన్నది.
“ఫర్వాలేదులే! నాకిక్కడ బాగానే ఉంది. నీకెలా ఉందో చెప్పు!?” పూడుకుపోతున్న స్వరంతో అన్నాడు.
తన పక్కన మంచం మీద తట్టుతూ మళ్లీ పిలిచింది. లేచి, పక్కనే కూర్చుని, ఆమెని పొదివి పట్టుకుని..
“ఏంటమ్మా?” అనడిగాడు గోముగా.
ఒక్కసారి కళ్లు మూసుకుని తెరచి, నీరసంగా, పతంజలి వీపు నిమురుతూ అన్నది..
“మీరు.. నా గురించి.. ఎక్కువగా.. ఆలోచిస్తూ.. భయపడుతున్నారు. నాకు.. ఏమీ కాదు.. ముందు మీ ఆరోగ్యం.. జాగర్త!” ఆమె గొంతు అనురాగం నిండిన భయంతో వణికింది. ఆర్ద్రమయిన హృదయంతో ఆమె తలని గుండెలకు హత్తుకున్నాడు పతంజలి.
“ఏమైనా.. కబుర్లు.. జోకులూ.. చెప్పండి. నేను.. ఎక్కువగా.. మాట్లాడలేను.. వింటాను” అంటున్న భార్య మాటలు ఈరోజు కొంత విచిత్రంగానూ.. ముద్దుగానూ.. ఏదో తెలియని గుబులుగానూ అనిపించాయి.
తమ వివాహ జీవితంలోని అనేక మధుర క్షణాలనీ, హాస్య సంఘటనలనీ గుర్తు చేస్తూ పతంజలి అలా చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నాడు. అతని ఛాతిమీద తల ఆన్చి, పెదాల మీద చెరగని చిరునవ్వుతో అతని కళ్లలోకి ఆరాధనగా చూస్తూ ఆమె వింటూనే ఉంది.
అంతా అతని చేతే మాట్లాడిస్తూ, మౌనంగా వింటూనే ఉన్నదల్లా ఒక్కసారిగా నోరు విప్పి..
“ఏమండీ.. ఓ విచిత్రమైన కోరిక కోరనా? నాకు మీ చేత్తో.. అన్నంలో వేడివేడి గుత్తి వంకాయ కూర.. కలిపి.. తినిపిస్తే.. తినాలని ఉందండీ!” అన్నది.
విస్మయంతో ఉలిక్కిపడ్డాడు పతంజలి!!
తనకోసం వండి పెట్టడం.. అనేక మంది బీదాబిక్కీ కోసం వండి వార్చి వడ్డించడమే చేసిన అన్నపూర్ణ.. ఈనాడు ఇలా.. ఈ కోరిక..!!!? అతి సామాన్యమైన చిన్న కోరికే ఇది!.. కానీ.. ఎలా?! వేడివేడి గుత్తి వంకాయ కూర.. తనకి వండటం చేతకాదు. కానీ, తన చేతుల మీదుగా ఇస్తూనే ఉంటాడు తను కస్టమర్లకి. అయినా, ఒక్క ప్యాకెట్టూ తను ఇంటికి తెచ్చుకుని, ఆమెకి తినిపించే ప్రాప్తం లేదు. పోనీ.. మేనేజర్‌తో..
‘డబ్బులిస్తాను.. ప్యాకెట్ కావాలి’ అందామంటే.. అతగాడి అహం దెబ్బతిని, మొదటికే మోసం రావచ్చు. బాధతో గిలగిలలాడి పోయాడు పతంజలి.
“ఏం.. మీ చేత్తో ఓసారి ఓ ముద్ద తినిపిస్తారా?” మళ్లీ అడిగింది అన్నపూర్ణ గోముగా.. ఆఖరి కోరికేమో!? అన్నంత భ్రాంతిని ధ్వనించే స్వరంతో. చలించిపోయాడు పతంజలి..
ఏదో స్థిర నిర్ణయానికి వచ్చిన వాడై..
“త-ప్ప-కుం-డా..” అన్నాడు.
రెండు రోజులు గడిచాయి. ఏవేవో వేరే పచ్చళ్లూ పులుసుల ప్యాకెట్లతో ఇంటికి వచ్చిన పతంజలి భార్యకి అన్నం కలిపి తినిపిస్తూ.. చాలా బిడియ పడుతూ.. మూగవాడే అయిపోయాడు.
మూడవ రోజు..
క్యాటరింగ్ హోం కిచెన్‌లో.. వంట పనులు జరుగుతుండగా.. కమ్మని గుత్తి వంకాయ కూర సువాసన.. పతంజలి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి.
ప్యాకెట్లు తయారయ్యాయి. తను పంచాల్సిన బ్యాగుల్ని సైకిల్‌కి తగిలించుకున్నాడు పతంజలి. మనసు రాయిచేసుకుని.. తెగించి.. సైకిల్ని ఈరోజు మొదటే ఇంటి మార్గం పట్టించాడు.. అతని మస్తిష్కంలో ఆశగా తను కోరిన ముద్దకోసం ఎదురుచూస్తున్న అన్నపూర్ణ, ఇంకా నిత్యం మందు మీదుండే ఆ కాలనీ సెవెంత్ క్రాస్‌లోని నార్త్ ఇండియన్ డివోర్సీ ముసలాయన మాత్రమే మెదులుతున్నారు ఇప్పుడు. ఆ ముసలాయన కొన్ని కర్రీస్‌ని అలా ప్యాకెట్ల పళంగానే డస్ట్ బిన్లో పడెయ్యడం తనకి తెలుసు. అందులో వంకాయ కూర ఒకటి.. అతగాడికి పడదు. అనైతికమే అయినా.. ఇప్పుడు తను ఆ కర్రీ తీసుకువెళ్లక పోయినా ప్రాబ్లం ఏమీ ఉండదు. అతగాడికి కారణం చెప్పొచ్చు.
వేగంగా ఇంటికి చేరాడు పతంజలి.
అన్నంలో గుత్తి వంకాయ కూర గబగబా వేడి, చల్లారిపోకూడదనే ఆతృతతో కలిపి.. రెండు ముద్దలు స్వయంగా అన్నపూర్ణ నోటికి అందించాడు. ఇష్టంగా ఆ ముద్దల్ని తినగలిగిన అన్నపూర్ణ.. ‘ఇక చాలు’ అన్నట్లుగా ఎంతోతృప్తిగా నవ్వుతూ.. కృతజ్ఞత, ఆరాధనా నిండిన చూపులతో పతంజలి కళ్లలోకే చూస్తూ.. చూస్తూ.. చూస్తూ..
కదలిక లేక ‘నిలిచిపోయిన’ ఆమె ముఖంలోని అలౌకికమైన ఆ తృప్తినే చదువుతున్న పతంజలి గుండెలు పొంగాయి.
“పతంజలీ!” గుమ్మం బయటి నుంచి పిడుగులాంటి పిలుపు.
గొంతుని గుర్తుపట్టాడు పతంజలి. భుజం మీద వాలి ఉన్న భార్య తలని అతిసున్నితంగా తలగడ మీదికి చేర్చి, సుతారంగా ఆమె కనురెప్పల్ని వాల్చి, యాంత్రికంగా లేచి, నిబ్బరంగా బయటికి నడిచాడు.
“ఇటువైపు వెళ్తుంటే నీ ఇంటి బయట మన క్యారేజీ సంచులతో నీ సైకిల్ కనిపించింది. అంటే.. దొంగతనంగా కర్రీలను ఇంటికి తెచ్చుకు తింటున్నావన్న మాట రోజూ! ఇక నువ్వు రేపట్నుంచీ పనిలోకి రానక్కర్లేదు. ఈనెల జీతం కూడా ఇవ్వను”.. పతంజలి ఎంగిలి చేతివైపు చూస్తూ కోపంగా ఉరిమి, వెళ్లిపోయాడు మేనేజర్.
అతని మాటలకి పతంజలిలో ఎటువంటి స్పందనా లేదు. చేయి కడుక్కుని, అన్నపూర్ణ కనురెప్పల మీద సుతారంగా ముద్దుపెట్టి.. తన ప్రియనేస్తమైన సైకిల్ని చేతుల్లోకి తీసుకున్నాడు. రోజూ కంటే వేగంగా తన డ్యూటీ ప్రకారం లంచ్ ప్యాకెట్స్ బట్వాడా చేసేశాడు.
అ తర్వాత…
..అన్నపూర్ణ ఆఖరి చూపుల్లోని తృప్తితో నిండిన ఆరాధనతో కూడిన రూపమే కళ్లముందు మెదులుతుండగా.. ఆకాశాన్ని తాకిన ఉత్సాహంతో పెడల్స్ మీద బలంగా పాదాలను తొక్కుతూ.. ఓనాడు రేసుల్లో పాల్గొని విజయాలను సాధించిన ఘడియల్ని నెమరు వేసుకుంటూ.. హైవే మీద అలా.. అలా.. గాలిలో తేలిపోతూ..
“కమాన్ కమాన్.. పతంజలీ!”..
అభిమానుల కేకలు..
“కమాన్ ద హీరో ఆఫ్ ద సైకిల్ రేసెస్..” అన్నపూర్ణ ప్రోత్సాహపు కేరింతలు.
చెవుల్లో మారుమోగుతున్నాయి.
తొక్కుతూనే ఉన్నాడు పతంజలి. ఎక్కడికో తెలియదు. ఒక్కటే కోరిక.. ఈ ప్రపంచాన్ని జయించి, అన్నపూర్ణ వెళ్లిపోయిన లోకానికి చేరి, ఆమెని కలవాలని ఆరాటం. అంతే!..
ఒక్కసారిగా ఛాతి ఎడమ వైపున ఎగసిన రక్తపు కెరటం.. రోడ్డు పక్కగా చల్లని చెట్టు నీడలో తన ప్రియనేస్తం సైకిల్‌తోపాటు అలవోకగా వాలిపోతున్న పతంజలిలో అలౌకికమైన ఆనందంతో కూడిన స్పందన.. తన(ను) అన్నపూర్ణని చేరుతున్న అ-మృత క్షణాలు ఆసన్నమయ్యాయని..
తులసి బాలకృష్ణ
మనిషై భూమ్మీద పుట్టాక.. కొన్ని బంధాలు మనల్ని అల్లుకుంటాయి. అందులో కొన్ని అలౌకికంగా మన గుండెలను గుబాళింపజేస్తే.. మరికొన్ని అర్థంకాని ఆవేదనతో ఘూర్ణింపజేస్తాయి. ఓ అలౌకిక మమకారం, ఆత్మీయత, స్నేహం మనల్ని స్థిరంగా నిలవనీయక కుదిపేస్తాయి. ఈ కథలో.. ఆ విషయాన్నే ఆవిష్కరించే ప్రయత్నం చేశారు రచయిత తులసి బాలకృష్ణ. రచయితగా, రంగస్థల నటుడిగా, దర్శకుడిగా తెలుగువారికి సుపరిచితులు. వీరి స్వస్థలం హైదరాబాద్. బ్యాంక్ మేనేజర్‌గా పనిచేసి, విరమణ పొందారు. నాలుగున్నర దశాబ్దాల కళా సేవలో.. 500లకు పైగా కథలు, 40 నాటికలు, 8 నవలలు, 3 నాటకాలు, రేడియో నాటకాలు, టీవీ నాటకాలు రాశారు. వీటిలో హాస్యం, సరసం, సస్పెన్స్, సాహసం.. ఇలా అన్నిరకాల రసాల రచనలూ ఉన్నాయి. నాటకాలలో రచన, నటన, దర్శకత్వాలకు నందులు అందాయి. మిత్రులు ఆత్మీయతతో సన్మానించి.. ‘రచనా విరించి’, ‘అక్షర కళా యశస్వి’ అనే బిరుదులు కూడా ఇచ్చారు. బళ్లారి రాఘవ, గురజాడ, శ్రీశ్రీ అవార్డులూ దక్కాయి. నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీ పీఠం ఏటా నిర్వహించే కథల పోటీలలో మూడుసార్లు పాల్గొనగా.. మూడుసార్లూ బహుమతులు అందుకున్నారు.
తులసి బాలకృష్ణ
87901 15544