‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.2 వేల బహుమతి పొందిన కథ.
ఎడతెరపి లేకుండ మూడు రోజుల్నుంచి వర్షం కురిసింది. కుంటలు, బావులు, చెరువులు తెప్పరిల్లి నిండినయ్. చెట్లమీద కాకులు రెక్కలు టపటప గొడ్తున్నయ్. సూరుకున్న గూట్లెనుండి తొంగిసూస్తున్నది ఊరబిచ్చుక. గజ్జికుక్క లొటలొట చెవులు కొట్టుకుంట ఉరుకుతంది. చెరువుగట్టెంట మిషన్ కాకతీయ పనులు పూర్తిగయి.. మోడై ముండమోసినట్టున్న ఎండిన చెరువు, జలకళతో నిండు గర్భిణి లెక్క కనిపిస్తా ఉంది.
ఊరి నడిమధ్యన డప్పు చప్పుడు డమడమ మోగుతుంటే.. సావట్ల ఏందో మీటింగుందని జనాన్ని రమ్మని పిల్పు తెల్సి పిల్లలు, పెద్దలు, ముసలి, పడుసు, ఈ కులం ఆ కులం అనకుండా అందరు జేరుకుంటుండ్రు.
ఊరవతల గుడారాలల్ల, గుడిసెలల్ల కాపురముండే ఏ కులం లేని కొన్ని బికారి కుటుంబాలు.. దండలు, సూదులు, పిన్నీసులు, పౌడర్ డబ్బాలు, సవరాలు అమ్ముకుంటూ ఊరంతా తిరిగినా.. కొనేటోడు లేక పొట్టగడ్సుడు కోసం బిచ్చపోల్లయి అడుక్కుంటుండ్రు.
తెల్లారక ముందే ఊర్లల్ల సూదికాడి నుండి కుర్చీలు, బెంచీలు, పండుకునే బెడ్లు, బట్టలు, బాతలు, కూలర్లు, ఫ్రిజ్జులు.. ట్రాక్టర్లల్ల, వ్యాన్లల్ల బుర్రబుర్ర వస్తుంటే ఎగబడే జనం.
మాసిన నెత్తిపైన బుట్టల సామాను ఎవడిక్కావాలి!!
చీకి చిక్కిపోయి చినిగిన చొక్కా గుండీలు లేకుండ మొల్తాడు మీద ఆగిన లాగు, మొకం పాలిపోయి కళ్లు కంతల్లకు పోయిన పొల్లగాడు..
“అమ్మా! అయ్యా! ధర్మం సేయండి” అని ఒక్కొక్కళ్లను బతిలాడుతున్న తల్లి చిటికెనేలు పట్టుకొని.. ఏమైనా పెడతారేమోనని ఆశగ చూస్తుండు.
“దగ్గరికి రాకు. నీ అయ్య జాగీరు మా దగ్గరున్నట్టు మీద మీదబడి అడుక్క తింటున్నవ్” అని ఒకరంటే..
“ఇస్తే తీస్కోవాలి. లేకుంటే ఊకోవాలి” అని ఇంకొకళ్లు.
ఒక ముసలి బైరాగి తన గుడారం పక్కన చెట్టుకింద పద్మాసనం వేస్కొని, వొళ్ల తంబుర పెట్టుకొని దాని తీగను వేళ్లతో టింగ్టింగ్ అనిపిస్తూ.. పెదవులు కదిలిస్తూ ఏదో తత్వం లోపల్లోపల పాడుకుంటుండు.
“అంబబల్కు జగదంబబల్కు! కంచిలున్న కామాక్షి పల్కు! బెజవాడలున్న దుర్గమ్మ పలుకు!” అని పాడుతూ.. బలిష్టంగా, మెడనిండా దండలతో, ఛాతిపైన పొంగుతున్న కండలతో ఉన్న ఒక బైరాగి కాలిబాట వెంట నడిచొస్తుండు. మెళ్ల రుద్రాక్షమాల, తెల్లటి బవిరి గడ్డం, ఎడమ భుజంమీద జోలె వేలాడుతుంటే.. కుడిచేతిలో తంబుర, చెప్పులు
లేని కాళ్లు దుమ్ము కొట్టుకున్నయ్.
అతను ముసలి బైరాగి ఉన్న చెట్టు దగ్గరాగి, చెట్టు నీడల జోలె దించి..
‘పొద్దు బారెడు కూడా ఎక్కలేదు. అప్పుడే ఎండ మాడపెడ్తుంది’ అని తనలో తను అనుకుంటుంటే..
“మంది ఏ ఊరు సామీ?” అంటూ మందలించిండు ముసలి బైరాగి.
“మాది అర్వదేశం నాయనా. సొంత దేశం వదిలిపెట్టి ముప్పై ఏళ్లయింది. ఇప్పుడన్నీ నా ఊర్లే. ఏ ఊరుకాడ పొద్దుబోతే ఆ దినానికదే నా ఊరు” అని తంబురను కళ్లకు అద్దుకున్నడు.
“పెద్దూరే నాయనా! వానలు జోరుగబడి చుట్టుపక్కల చెరువులన్నీ నిండిన సంబురం కనబడ్తుంది”.. సంతోషంగా అన్నడు మళ్లీ.
“ఔ మరి! వానలు పడి, సెర్వులు నిండితె.. తోటలు, దొడ్లున్న మారాజులకు లాభం. రోజోచోట కాపురముండే మనసోంటోల్లకేం సంబడం!?”.
“మరి ఊరు సల్లంగుంటేనే గదనే మనకు గింజలు దొరికేది. మన కడుపు నిండేది”.
చిన్న బైరాగి మాటలకు పెద్దాయన విరక్తిగా నవ్వి..
“గవన్నీ ఎన్కటిరోజులు. దేవుని కథలు చెప్పుకొంట, సామెతలు చెప్పుకొంట, తత్వాలు పాడుకుంట నడిరాత్రి నుంచి తెల్లారిందాకా చేతిలో లాంతరు పట్టుకొని, ఇంకో చేత్తో డమరుకం వాయిస్తూ రెండు కాళ్ల సందున గంట గట్టుకొని భుజాన పెద్ద జంపకానతో తిరిగే బుడుబుడుకలోల్లం.. సలిపొద్దుల ఇంటింటి ముందు వాయించినా నిద్రపోకుండా లేపిండని జనాలు ఇసుక్కోకుండా చేటలతో గింజలు పెట్టెటోళ్లు. ఇప్పుడేముందబ్బీ.. ముష్టోల్ల కింద జమ కడ్తుండ్రు!”.
“మీరేమిటోళ్లు కొడ్కా!?” అడిగిండు ముసలాయన.
“భలేగడ్గినవ్ నాయ్నా! నీదేకులమో నాది గదే!”.
“మనకు కులం యాడిది కొడ్కా!” బాధగా అన్నడు ముసలి బైరాగి.
“బాధ పడుతున్నవెందుకు నాయ్నా? అయినా.. పచ్చికి, పశువుకు కులముందా? చెరువుల నీళ్లకు, ఇర్గ గాసే యెన్నెలకు, సువాసనిచ్చే పూలకు, ఆ వాసనను అంతటికి తోల్కపోయె గాలికి, చెట్టుకు చామకు ఆఖర్కి పొటోలున్న దేవునికి కులముందా? మనకూ గంతే! ఈ నడుమంత్ర పోళ్లకే కులం గావాలె గాని మనకెందుకు?”.
“నువ్వనుకునేదంత తప్పు కొడ్కా!”.
మాసిన నెత్తిని పొడుగాటి గోళ్లతో గోక్కుంటూ..
“కులమంటు ఉండాలె కొడ్కా. మనిషి ముందుగ భూమ్మీదికి అచ్చినప్పుడు కులం లేదు. మతం లేదు. ఇల్లు లేదు. ఊరు లేదు. జంతువు లెక్కే తిరిగేటోళ్లట. రాన్రాను యేండ్లకేండ్లు గడిశినాంక ఒకటొకటి అన్ని సమకూర్నయ్. బూమి, ఎద్దు, ఎగుసాయం, పంట, పాడిగల్గి ఎవరూర్ల వాళ్లు ఉండి పోయిండ్రు. మనసోంటి దేశదిమ్మరి జాతులకు ఈనాటికీ కులం లేదు. స్థలం లేదు. కడుపు నిండ తిండి లేదు. నిజం చెప్పుకొంటె జంతువుకు మనకు తేడెక్కడుంది? కులరుత్తి చేస్కుంటనైన పొట్ట నింపుకోవొచ్చు. గది కూడ మనకు లేదాయె. పాత రోజుల్ల మనల్ను కళాకారులనేటోళ్లు. గౌరవించేటోళ్లు. ఇప్పుడు మనల్ని సూస్తెనే సీదరించుకుంటుండ్రు. నేను పోయినంక ఇప్పుడు తింటున్న ఒంటి పూట అన్నం కూడ నావోల్లకి దొరకదు”.. ముసలి బైరాగి గొంతు వణికింది.
“మన్ది గూడ వృత్తేగద నాయ్న. సత్యవాక్కు చెప్తం. లోకమంతా బాగుండాలని భగమంతున్ని కోరుకుంటం. ప్రతి ఇంట్ల పిల్లపాప సంతోషంగా సుఖంగుండాల్నని మన్సుల ఇసంలేకుండ దీవిస్తం. గింతకన్న గొప్ప రుత్తేముందయ్య!”.
చిన్న బైరాగి మాటలకు పెద్దాయన ఆలోచనలో పడ్డడు. తనకు మాత్రం తన పని మీద గౌరవం లేదా? తత్వాలు పాడకుండ ఏనాడైన గడ్చిందా.
అటు ఇటు గుడిసెలల్ల సిన్నసిన్న పిల్లగాండ్లు ఆకలితో ఆవురావురనుకుంట గిన్నెలు, బొచ్చెలు పట్టుకొని ఊర్ల అడుక్కుందామని పోటిబడి ఉరుకుతుండ్రు.
“మనకు కులం లేకున్న కట్టుబాట్లు ఎక్కువగద కొడ్క. మిగిల్న తెగలు పగటిపూట బిక్షాటన జేస్తె.. మనం నడిరేత్రి ఊర్లకిపొయ్యి, తెల్లారక ముందు విరమించెటోళ్లం. పొద్దు పొడిస్తె వీధుల మొకం చూడొద్దనేది మన ఆశారం. మనం తిరిగే ఊళ్లల్ల చెడు జరుగొద్దని గౌరికట్టు కట్టెటోళ్లం. పసిపిల్లగాండ్లకు దోసాలు రావద్దని తాయత్తులు కట్టెటోళ్లం. సాట నిండుగ గింజలు పెట్టకపోతే తీసుకోకపోదుము. అంటే.. కొట్లాడి తీసుకునేటోళ్లం. వాళ్లిచ్చే గింజలు, బట్టలు నచ్చకుంటే హక్కు తీర్గ అల్గెటోళ్లం. ప్రతింటోళ్లు తమ ఇంటిమనిషి లెక్క చూస్కునెటోళ్లు. ఇప్పుడు అవన్ని పోయ్నయ్. పది రూపాలిచ్చినా, రెండు రూపాలిచ్చినా కొంగుసాపుతున్నం. ఏదన్న కట్టం చేస్కొని బత్కండని కొందరి మాట!”..
ముసలి తాత పాత రోజులన్నీ కండ్ల ముంగట జరిగినట్టు చెప్పుకొంట పోతున్నడు.
“మనకున్న ఊర్లల్ల ఇంకోళ్లు పోవద్దని కట్టుబాటుండేది. పెద్దోండ్లు సెప్పిందే వేదం. కోర్టుల్లేవు. వకీల్లు లేరు!”.
అంతదాన్క పెద్దాయన చెప్పినవన్నీ సెవులు గోస్కొని ఇంటున్న చిన్న బైరాగి ఒక్కసారే ఉలికిపడ్డడు.
“ఈ ఊరు నీది గదా నాయ్న! నాకియన్నీ తెల్వక వచ్చిన. కోప్పడకయ్యా.. నా మానాన నేను బోత!” అంటూ, జోలెను చంకనేసుకొని తంబరను చేతికి తీసుకుండు.
ముసలి బైరాగి పోవద్దని చేతితో అతణ్ని పట్టుకొని..
“ఇంగ నేను తిర్గలేను కొడ్కా. నువ్వీ కాలపోడివైనా మన రుత్తిమీద నీకున్న ఇట్టం, గౌరవం చూస్తే నా తాతలనాటి కాలం గుర్తొచ్చి సంబురమైతుంది. మొన్నీమధ్యల ‘నా కాలమై పోయింది. నువ్వు ఊర్ల తిర్గు!’ అంటే.. కొట్ట కొట్టొచ్చిండు నా కొడ్కు. నా మనుమన్ని బల్లెకు పంపి సదివిస్తనని పోతె.. కులం సప్టికెట్టు అడిగిండ్రట. వాడు నా మీద గరంగరం అయిండు. నిజంగనే మనం యేడ కుద్రుగ లేకుంటే సర్కారు గుర్తించకపాయె. పించిన్లు లేవాయె. గ్రూపుల్లేవాయె. అన్ని విదాల్గ సెడిపోతిమి. మన పిల్లగాళ్లు బడికి పోవాల. సదువుకోవాల. నౌకరీలు సేయాల” అట్ల అనుకుంటుంటె.. అతని కండ్లల్ల మెరుపు.
“నువ్వు నా ఇంట్లనే ఉండు కొడ్కా. నువ్వు నాకు బర్వుగాదు. నా కొడుకు లెక్క సూస్కుంట. గీ ఇసయంల నా కొడ్కు నాతో జగడం బెట్టుకొని పెళ్లాం పిల్లల్తో గల్శి ఇంట్లనుండి ఎళ్లిపోయిండు” అనుకుంట ఎక్కెక్కి ఏడిసిండు ముసలి బైరాగి.
రెండ్రోజుల్నుండి లోపల్లోపల పాడుకుంటున్నట్టు పెదవులు కదిలించుకుంట, మాటపలుకు లేకుండా తిండి లేకుండ కుక్కి మంచంల పడిఉన్న మగన్ని జూసిన ఆదెమ్మకు ఏడ్పొచ్చింది. మగడు తత్వం పాడుకుంటుండని ఆమెకు తెల్సు.
“పాడినవ్లే ఆపు!”.. కొడుకు విసుగ్గ అన్నమాట గుర్తొచ్చింది ముసలాయనకి.
“నువ్వు ఊర్లపొంటి అడుక్క తిన్నది సాలక.. నన్నీ దిక్కుమాలిన ఏశం యేస్కోని బిచ్చపోని లెక్క తిర్గమంటవా? సాల్సాలు. ఈదాక ఏమేం సంపాదించిపెట్టినవ్. ఈ కాణ్నించి నీ జిగ్రి నాకొద్దు. ఏ కూలి పనో చేస్కుంట, నా కొడ్కును సద్వించుకుంట. గీ ఏశం నీతోటే పోవాలె!”.
కొడుకు మాటలకు బాధవడ్డ ముసలాయన..
“ఇది నా అయ్యల తాతలనాటి రుత్తి రా! ఇది నాకు అబ్బడం నా అదృట్టం. మననింత దాన్క తిండిపెట్టి బతికిచ్చిన దీన్ని అడుక్క తినడమంటవుర! గీ ఏశం తోటి, గీ పాటతోటే నా జీవం పోవాలె!”.
జర్గిందంత గుర్తొచ్చి ఉండుండి ముసలాయన కండ్లనుండి నీళ్లు కారిపోతున్నయి.
కళ్లనీళ్లను తుడ్చుకుంటు ఒక్కసారె అదాటున ఆవేశంగ, ఉద్రేకంగ లేచి తలకు పేటా జుట్టి, నుదుర్ల తిరునామం పెట్టి, మెళ్ల తోలుతిత్తి తగిలించుకొని ఒక చేతిలో వెలుగుతున్న గరుడ స్తంభాన్ని, ఇంకో చేతిలో బుడుబుక్క పట్టుకొని ఎదురుంగున్న చిన్న బైరాగితో..
“కొడ్కా! ఇయ్యాలొక్కరోజు నేను ఊరంత తిరిగొస్త. రేపటినుంచి నాకున్న ఆస్తంత నీకె!”.
అనుకుంట తడిక తీసి చీకటి వీధులెంట శాన రోజుల తర్వాత బుడుబుక్క మోగిస్తూ బయటికి నడిచిండు.
“దొరగారి నాన్నగారు తాతగారు
చిన్నాన్న పెదనాన్న బిడ్డలు కొడుకులు
కూతుళ్లు మనమలు మునిమనవులు
అక్కచెల్లెళ్లు, తోటి కోడండ్లు తోడ పుట్టినోళ్లు అత్తింటోళ్లు, పుట్టింటోళ్లు బంధువులు సల్లగుండాలె! వాళ్ల ఉద్యోగాలు వ్యాపారాలు సల్లగుండాలె. అన్నదానం చెయ్యాలె. వస్త్రదానం చేయాలె!”..
తెల్లారగట్ల అయింది. ఓ ఇంటి ముందట గంట చప్పుడిని..
“ఓసామీ.. ముందు నోరుముయ్. పెద్దయ్య నిద్ర పాడైతే నీది, నాది తోలొలుస్తడు. పో.. ఈడ్నించి పోపో!”..
ఆ మాట లేవి వినపడని పెద్ద బైరాగి..
“ఓ దొరా.. మా దొరా..
త్యాగాల దొరా.. బోగాల దొరా..
మా దొర లోగిల్లో మా లచ్చిముండాలె!
మా దొర పట్టిందె బంగార మవ్వాలె!
తలిచిందంత నడిచి రావాలె!”..
బైరాగి కండ్లు బైర్లుగమ్మినయ్. జానెడు పొడ్గు నాల్కతో మీదికి దుంకిన పెద్దపులంటి కుక్క.. ముందరి రెండు కాళ్లతోని బైరాగి శరీరాన్ని నిచ్చెన మాదిరెక్కి జోలెనుపీకి.. పంచె, చొక్కా పీకేస్తుంటే ఎన్కకెన్కకు నడిచి కూలబడ్డడు. ఎవలో వచ్చి..
“వార్నీ. ఎంత పనైందీ!? కుక్క పాడ్గాను. గొలుసు తెంపుకొన్నది” అనుకుంట గొలుసుతో కుక్కను లోపల్కి పట్కపోయిండు.
బైరాగి అర్ధనగ్న దేహం నేలమీద పడిపోయింది. జుట్టు కొప్పు ఇడిపోయి ఎంటికలు చెల్లాచెదురైనయ్. ఒళ్లంతా రక్తం గారుతూ పచ్చి పుండైంది. ఆడుతా పాడుతా ఎగిరే పిట్ట రెక్కలు తెగి జటాయువులా నేలకొరిగింది.
పైన ఆకాశంలో నల్ల మబ్బుసాటు చంద్రుడు బొగ్గుల మధ్యన నిప్పులెక్క ఉన్నడు. కను రెప్పలు మూసిన బైరాగి కళ్లనుంచి నీళ్లు కార్తనే ఉన్నయ్. నోటి నుండి ఆకలి పాట పాడ్తనే ఉండు.
“అంబ పలుకు జగదంబ పలుకు
ఇటువంటి ఊర్లల్లో ఎవ్వరుండొద్దు
టక్కు ఎక్కుల ఊరు కుక్కలుండే ఊరు.
నా రుత్తి, నా తన్వు కుక్క పాలాయె.
ఇటువంటి ఊర్లల ఎవ్వరుండొద్దు.
ఇంకో.. ఇం..కో ఊ..ర్కి పోతున్న నే.. ను!”
కొస పాటను, కొస ఊపిర్ని గాలికొదిలిండు..
మొన్నీమధ్యల..
‘నా కాలమై పోయింది. నువ్వు ఊర్ల తిర్గు!’ అంటే.. కొట్ట కొట్టొచ్చిండు నా కొడ్కు.
నా మనుమన్ని బల్లెకు పంపి
సదివిస్తనని పోతె.. కులం సప్టికెట్టు
అడిగిండ్రట. వాడు నా మీద గరంగరం అయిండు. నిజంగనే మనం యేడ
కుద్రుగ లేకుంటే సర్కారు గుర్తించకపాయె. పించిన్లు లేవాయె. గ్రూపుల్లేవాయె.
అన్ని విదాల్గ సెడిపోతిమి. మన పిల్లగాళ్లు బడికి పోవాల. నౌకరీలు సేయాల”..
వేముగంటి శుక్తిమతి
ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి, రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా ఎంచుకున్నారు వేముగంటి శుక్తిమతి. వీరి స్వస్థలం హన్మకొండ. ఇప్పటివరకు 40 కథలు, 90 కంటే ఎక్కువ వ్యాసాలు, ఆరు నవలలు, సాయిబాబా పారాయణ గ్రంథం రాశారు. మొదటి కథ.. ‘మానవత్వం మరిచిన వేళ’. ఈ కథకు 1997లో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ఉగాది కథల పోటీలో మొదటి బహుమతి దక్కింది. ‘నేటి మనిషి’ కథకు ఉపాసం సంస్థ నిర్వహించిన కథల పోటీలో బహుమతి లభించింది. 2020లో నమస్తే తెలంగాణ – ముల్కనూరు గ్రంథాలయం కథల పోటీలో ‘సుక్కబర్రె’ కథకు విశిష్ట బహుమతి, ‘ఊరు పిలిచింది’ కథకు పాలపిట్ట కథల పోటీలలో ప్రత్యేక బహుమతి, ‘చివరి కోరిక’ కథకు వాసా ఫౌండేషన్ కథల పోటీలో రెండవ బహుమతి అందుకున్నారు. మొదటి నవల.. ‘మళ్లీ పల్లె ఒడిలోకి’ అంపశయ్య నవీన్ నవలల పోటీ (2016)లో బహుమతికి ఎంపికైంది. వీరు రాసిన అనేక కథలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి.
వేముగంటి శుక్తిమతి
99081 10937