జరిగిన కథ : పుత్రకుడు అనేవాణ్ని తండ్రి మోసగించాడు. దేవతకు బలివ్వబోతుంటే తప్పించుకుని పారిపోయాడు. ఒకచోట పుత్రకునికి ఇద్దరు అన్నదమ్ములు కనిపించారు. వాళ్లు తమ తండ్రినుంచి సంక్రమించిన పాదుకలు, దండం, బొంతసంచీలను పంచుకోవడంలో తగాదా పడుతున్నారు. వారి మధ్య తీర్పుకోసం వెళ్లిన పుత్రకుడు.. మహిమాన్వితమైన ఆ వస్తువులను చేజిక్కించుకుని నిర్జనారణ్యంలోకి వెళ్లాడు.
పుత్రకుడు ఆ వస్తువులన్నీ గట్టుమీద పెట్టి చెరువులోకి దిగిన కొద్దిసేపటికే అక్కడికి ఓ కోతుల గుంపు వచ్చిపడింది. వాటిని చూస్తూనే భయపడిన పుత్రకుడు మరికొంచెం లోతుకు వెళ్లాడు. అవి గట్టుమీద స్వేచ్ఛగా తిరుగుతూ పుత్రకుడు తెచ్చిన మూడు వస్తువులతో ఆటలాడటం మొదలుపెట్టాయి. పుత్రకుడు కంగారుపడి చెరువులోనే ఉండి తామరపూలతో కోతులను అదిలించాలని ప్రయత్నించాడు. అవి పుత్రకుడి వంక చూసి గుర్రుమన్నాయి. అతను జడుసుకున్నాడు.
ఇంతలో పాదుకలను రెండు కోతులు చెరోటి నెత్తిపై పెట్టుకుని సమీపంలోని తలో చెట్టెక్కాయి. మరో కోతి సంచి మూతికున్న దారపు కొనలాగి మెడకు చుట్టుకుని ఎగిరింది. దండాన్ని మరోకోతి దక్కించుకుంది.
ఇంకా భయపడుతూ కూర్చుంటే లాభం లేదని పుత్రకుడు చెరువునుంచి బయటికొచ్చి వాటివెంట పడ్డాడు. చెట్టెక్కి పట్టుకోవాలని చూశాడు కానీ లాభం లేకపోయింది. అవి కొండలు కోనలు ఎక్కిదిగిపోతూ అతణ్ని చాలాదూరం పరిగెత్తించాయి. చివరికి కనిపించకుండా పోయాయి.
‘ఆహా! ధనాశతో ఆ అమాయకుల పితృధనాన్ని దొంగిలించాను. ఆ దోషం నన్ను వెంటనే కొట్టింది. ఇలా కోతుల రూపంలో దైవం నన్ను శిక్షించాడు. అయినా ఎన్నో దేశాలుండగా.. నేనీ నిర్జనారణ్యానికి రావడం ఎందుకు? ఇక్కణ్నుంచి బయటికెలా పోవాలో కూడా తెలియడం లేదు. సరే.. ఇప్పుడు చేయగలిగింది కూడా ఏమీ లేదు. తపస్సు వల్ల అన్ని పాపాలూ దగ్ధమవుతాయని చెబుతారు కదా! ఈ అడవిలో చేతనైనంత తపస్సు చేసుకుంటాను’ అనుకున్నాడు.
ఆనాటినుంచి తటాకాల్లో నీళ్లు తాగుతూ, చెట్ల పళ్లు – దుంపలు తింటూ ఏకాగ్రతతో గాయత్రీజపం చేయసాగాడు. అలా ఎంతకాలం గడిచిందో తెలియదు.
అతను తపస్సు చేస్తున్న ప్రాంతానికి.. ఒకనాడు ఉన్నట్లుండి కొందరు స్త్రీలు నీటికోసం కడవలెత్తుకు రావడం గమనించాడు.
‘అరె! ఇక్కడో పల్లె ఉందా? నేనిన్నాళ్లూ గమనించనే లేదే..’ అనుకుంటూ వాళ్లను సమీపించి పలకరించాడు. కానీ, వాళ్లభాష అతనికి అర్థం కాలేదు. వాళ్ల సైగల వల్ల పల్లె అక్కడికి సమీపంలోనే ఉందని మాత్రం అర్థమైంది.
ఆనాటినుంచి ప్రతిరోజూ పల్లెవాళ్లు తరచుగా ఆ చెరువుకు రావడం గమనిస్తూ ఉన్నాడు. జన సంపర్కంతో తపస్సు పలచబడింది. కోతులు తన దగ్గర్నుంచి ఎత్తుకుపోయిన దండం రెండోకొన నేలకు పడుతూనే.. అక్కడో పల్లె పుట్టుకొచ్చిందని క్రమంగా అర్థం చేసుకున్నాడు.
అలాగైతే కాస్త కష్టపడితే తాను పోగొట్టుకున్న వస్తువులు దొరకవచ్చు అనిపించింది. తానుండే తావును విడిచిపెట్టి పల్లెకు పోయాడు. ఆ ప్రాంతంలో అదొక్కటే కాదు.. చాలా పల్లెలు ఉన్నాయి. అక్కడి ప్రజలలో ఒకడిగా కలిసిపోయాడు. వారి భాష తెలుసుకున్నాడు. వారితో సంభాషించి.. తన వస్తువుల జాడ పసిగట్టే ప్రయత్నం చేశాడు. కానీ లాభం లేకపోయింది.
‘అనవసరంగా మళ్లీ ఆశలో చిక్కుకుని పండులాంటి తపస్సు పాడు చేసుకున్నాను. దొరకని వాటికోసం వెతికి కాలాన్ని వృథా చేసుకోవడం కంటే.. ఏదో ఒకరకంగా కాశీకి పోతే ముక్తి అయినా సంపాదించుకోవచ్చు’ అనుకున్నాడు. అతనో పల్లెలో బాటవెంట నడుస్తుంటే ఒకచోట ఉపాధ్యాయుడు పిల్లలకు చెబుతున్న పద్యం ఒకటి వినిపించింది.
‘దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనానికి పూనుకున్నారు. హాలాహలం వచ్చిపడ్డా.. ఎంతోకాలం పట్టినా కూడా అమృతం పొందేవరకు విరక్తి చెందలేదు. తలపెట్టిన కార్యాన్ని విసుగుతో ఎప్పుడూ విడిచిపెట్టేయకూడదు. ప్రయత్నం మానేయకూడదు. పట్టుదల ఉంటే ఎప్పటికైనా అనుకున్నది సాధించవచ్చు’ అని తెలిపే నీతి పద్యమిది.
పుత్రకుడు ఆ పద్యభావాన్ని మననం చేసుకున్నాడు.
‘ఈ పద్యం ఇప్పుడెందుకు వినిపించింది? ఈ శకునం ఏమిటో పరీక్షచేసి చూద్దాం!’ అనుకున్నాడు. వెనక్కి తిరిగి మళ్లీ పల్లెల్లో వెతకజొచ్చాడు.
ఎవరి ఇంటిలో అయినా ప్రసవం అయితే బాలెంతరాలు ఉండే గదికి బయట చెప్పు కట్టడం పాతరోజుల్లో ఆచారం. అలా ఒక ఇంటిబయట తన పాదుక ఒకటి పుత్రకునికి కనిపించింది. వేగంగా వెళ్లి దాన్ని తీసుకోబోయాడు. ఆ ఇంటిలోనుంచి ఒక ముసలామె వచ్చి..
“ఇది బాలెంతరాలి గది. ఇక్కడికి ఎవరూ రాకూడదు. పోపో!” అని అదిలించింది.
“ఆ పాదుక నాదేనమ్మా!” అని ఆమెకు అర్థమయ్యేలా చెప్పుకొన్నాడు పుత్రకుడు.
“సరే.. ఎల్లుండి అమ్మాయికి స్నానం చేయిస్తాం. ఆ తర్వాత వచ్చి పట్టుకు పో!” అన్నది ముసలమ్మ.
ఆ లోపుగా మిగిలిన వాటికోసం వెతుకుతూ ఆ పల్లెలోనే కాలక్షేపం చేశాడు పుత్రకుడు. కానీ లాభం లేకపోయింది. అనుకున్నట్లే మూడోరోజున ముసలమ్మ ఆ పాదుకను పుత్రకునికి ఇచ్చేసింది.
అతను దాన్ని చేతబట్టుకుని..
“ఓ పాదుకా రాజమా! నీ మహత్వం వల్లనే నేను నిన్ను మళ్లీ చేజిక్కించుకోగలిగాను. దయచేసి నీ రెండోజత పాదుక వద్దకు నన్ను తీసుకుపోవా?” అని కోరుకున్నాడు.
వెంటనే ఎవరో చేయిపుచ్చుకుని లాక్కుపోతున్నట్లు ఒక వీధివెంట కొంతదూరం వెళ్లాడు. ఒక ఇంటి బయట ఆగిపోయాడు. లోపలి వారిని పిలిచి..
“అయ్యా! ఈ పాదుకకు జోడీ మీ ఇంటిలో ఉంది. ఇవి మా గురువుగారివి. వీటిని నేను రోజూ పూజించుకుంటాను. దయచేసి నా పాదుక నాకు ఇప్పిస్తారా?” అని కోరాడు.
ఆ మాటలు విన్న ఆ ఇంటి ఇల్లాలు..
“ఇది మా ఇంట్లో ఉన్నదని చెప్పిందెవరు?! ఈ ఊళ్లో మేమంటే కళ్లల్లో నిప్పులు పోసుకునేవాళ్లు ఎక్కువైపోయారు” అని విసుక్కుంటూనే ఆ పాదుకను తెచ్చి పుత్రకుని చేతిలో పెట్టింది.
గూడెం నుంచి బయటికొచ్చిన పుత్రకుడు ఆ పాదుకలను తొడుక్కున్నాడు.
‘దండం ఉన్నచోటికి వెళ్లాలి’ అని మనసులో కోరుకున్నాడు.
మరునిమిషంలో ఓ పసులకాపరి అయిన కుర్రవాడి ముందున్నాడు. వాడి చేతిలో దండం ఉంది.
“ఒరేయ్ అబ్బాయ్! ఆ దండం ఏమిటీ?! ఇలా పట్టుకురా చూద్దాం!” అని దగ్గరికి పిలిచాడు.
వాన్ని మాటల్లో పెట్టి, ఆ దండాన్ని సంగ్రహించాడు.
‘కాలం చక్కబడినప్పుడు అన్నీ వాటికవే సమకూరుతాయి. నీరు పల్లానికి చేరుకున్నట్లు మనం కోరుకోకపోయినా మంచికాలంలో సంపదలు చేకూరుతాయి. చెడుకాలంలో చెట్టుమీద పిట్టల్లా సంపదలు ఎగిరిపోతుంటాయి’ అనుకున్నాడు.
“ఓ పాదుకలారా! నన్ను నా బొంతసంచి ఎక్కడుందో అక్కడికి తీసుకుపోండి” అని కోరుకున్నాడు.
కళ్లు మూసుకుని తెరిచేలోపుగా అతనొక నాలుగుబాటల కూడలిలో ఉన్నాడు. అతనికి ఎదురుగా పెద్ద మర్రిచెట్టుంది. దాని శాఖలు నాలుగు దిశలకూ క్రోసెడు దూరానికి వ్యాపించి ఉన్నాయి. దానికింద కొంతమంది బిచ్చగాళ్లు కాపురం ఉన్నారు. ఒకచోట పుత్రకుని తాలూకు బొంతసంచిలో ముష్టిగింజలు మూటకట్టి ఉన్నాయి.
ఆ బిచ్చగాళ్లలో ముగ్గురు మగవాళ్లున్నారు. పుత్రకుడు వారితో మాటలు కలిపాడు.
“మీదే ఊరు? ఎక్కణ్నుంచి వచ్చారు?! ఎక్కడికి పోతున్నారు?!” అని ప్రశ్నలు వేశాడు.
మాటల్లో ఆ ముగ్గురిలోనూ వయసులో పెద్దవాడిపేరు రామజోగి అని.. అతనో తంత్రగాడని తెలిసింది. మిగిలిన ఇద్దరూ అతని తంత్రశక్తిని గురించి గొప్పగా చెప్పారు.
“అయితే రామజోగి అంతవాడా?!” అని ఆశ్చర్యం వ్యక్తంచేశాడు పుత్రకుడు.
“అవును బాబూ! నేను ఢక్కా మోగిస్తూ.. ‘అంబ పలుకు జగదంబ పలుకు’ అంటూ వీధివెంట పోతుంటే భూతాలు పారిపోతాయని జనాలు విశ్వసిస్తారు. ఇతరులమీద కసి, కోపం ఉన్నవాళ్లు.. డబ్బు గట్రా కావాల్సినవాళ్లు నా జోలెలో బియ్యంపోసి సాయం కోరుతుంటారు. ఈ విద్య పుణ్యమా అని ఇప్పుడో పెద్ద సమస్య వచ్చిపడింది” అని రామజోగి విచారంగా చెప్పాడు.
“ఏం జరిగింది?”.. ఆసక్తిగా అడిగాడు పుత్రకుడు.
అప్పుడు రామజోగి తన కథను చెప్పడం మొదలుపెట్టాడు.
“ఇక్కడికి పక్కనే ఉన్న ఊరిలో ఒక సోమిదమ్మ ఉంది. ఆమె కోడళ్ల పాలిట కొరివిదయ్యం. నలుగురు మగపిల్లల్లో.. చివరి ముగ్గురికీ పెళ్లిళ్లు కాలేదు కానీ, పెద్దవాడికే నాలుగుసార్లు పెళ్లయింది. ఎంతమంది కోడళ్లు వచ్చినా.. ఈ అత్తకు వాళ్లతో పడేది కాదు. ఏదో కారణంతో కాపురంలో కలతలు లేవదీసి భార్యాభర్తల్ని విడదీసేది.
ఆమె దృష్టిలో కాపురానికి వచ్చేవరకే కోడలు. ఆ తరువాత పగదానికన్నా అధమం. మొదటిరోజు నుంచీ ఆ అత్తపెట్టే ఆరళ్లు భరించలేక కోడళ్లు పారిపోతుండేవారు. ఇటీవలే పెద్దకొడుక్కి మళ్లీ పెళ్లయి, నాలుగో కోడలు కాపురానికి వచ్చింది.
ఒకనాడు కూతురిని చూసుకోవడానికి వియ్యంకుడు ఇంటికి వచ్చాడు. జరుగుతున్న తతంగమంతా చూసి నొచ్చుకున్నాడు.
‘నువ్వు కోడండ్రమారివని తెలియక మీ ఇంటికి పిల్లనిచ్చాను. నువ్వు కూడా కూతురిని కన్నతల్లివే. నీ కూతురిని కూడా అత్తవారు ఇలాగే ఆరళ్లు పెడితే నీకెంత బాధ కలుగుతుంది?! ఆ మాత్రమైనా నా కూతురిపైన కనికరం ఉంచరాదా?’ అని ఎంతో బతిమాలుకున్నాడు. చివరికి..
‘ఒక్క పదిరోజులు ఆగి మళ్లీ వస్తాను. ఈలోపు నీ పద్ధతి మార్చుకోకపోతే నిన్నేం చేస్తానో చూడు’ అని బెదిరించి వెళ్లిపోయాడు.
ఆనాటినుంచి కోడండ్రమారి అత్త వింతనాటకం ఆడటం మొదలుపెట్టింది. వియ్యంకుడు తనపై ఏదో దయ్యాన్ని ప్రయోగించాడని.. రాత్రిళ్లు ఆ దయ్యం వచ్చి తన గొంతు పిసికేస్తున్నదని గొడవ చేయసాగింది.
తల్లి పడుతున్న బాధ చూడలేని కొడుకు.. ఒకనాడు నేను ఢక్కా మోగిస్తూ వాళ్ల వీధివెంట వెళుతుండగా చూసి నన్ను పిలిచాడు.
నేనా గయ్యాళి అత్తను చూసి..
‘మీ ఇంటిలో కామినీ భూతమున్నది. నాకు కనిపిస్తున్నది. దాన్ని నేను మారణహోమం చేయగలను. కానీ నూటపదహార్లు ఖర్చవుతాయి. ఆ సొమ్మిస్తే ఇప్పుడే ప్రక్రియ మొదలుపెడతాను’ అన్నాను.
కుమారుడు కొంతమొత్తం తెచ్చి నా చేతిలో పోశాడు. పని పూర్తయ్యాక మిగిలిన సొమ్ము ఇస్తానన్నాడు. నాలుగురోజులు పోయాక వెళ్లి రక్షరేకు ఇచ్చాను. కానీ గయ్యాళి కట్టుకోలేదు.
‘నా వియ్యంకుడు చచ్చేవరకు నేనీ రేకులేవీ కట్టుకోను’ అని శపథం పట్టింది.
నిజానికి ఆ వియ్యంకుడేమీ ప్రయోగం చేయలేదు. అయినా మనుషుల్ని మంత్రాలతో చంపడం నా శక్యమా?! ఆవిడ మాటలాగే నా మాట కూడా వట్టిదే. అయినా..
‘నిత్యం హోమం చేస్తున్నాను. నేడో రేపో నీ వియ్యంకుడు చచ్చిపోతాడు!’ అని మభ్యపెట్టి ఆమె దగ్గర్నుంచి పదోపరకో సంపాదిస్తున్నాను. ఇది తొందరగా పూర్తి చేయకపోతే ఊరివాళ్లు మమ్మల్ని తన్ని తరిమేసే అవకాశముంది. ఆ కోడండ్రమారి దగ్గర్నుంచి మరికొంచెం సంపాదించుకుని ఇక్కణ్నుంచి పోవాలని చూస్తున్నాం”..
..రామజోగి చెప్పిన కథంతా విన్న పుత్రకునికి తన బొంత సంచీని.. అతని దగ్గర్నుంచి తిరిగి సంపాదించుకునే అవకాశం దొరికినట్లు అనిపించింది. చెట్టుకు వేలాడగట్టిన తన సంచీవైపు ఓసారి చూశాడు.
మరికొన్ని మంచిమాటలు చెప్పి, రామజోగిని బుట్టలో పడేయాలనుకున్నాడు.
“ఇటువంటి గంపగయ్యాళి కథ నాకొకటి తెలుసు. చెబుతాను వినండి” అంటూ ఇలా మొదలుపెట్టాడు.
విన్నకోట అగ్రహారంలో సానుభూతి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను పుట్టు దరిద్రుడు కావడం వల్ల భిక్షాటనతో బతుకుతుండేవాడు. అతని భార్యవంటి గయ్యాళి మూడు లోకాల్లో లేదు. నువ్వు చెప్పిన కోడండ్రమారి అత్తకంటే చాలా చెడ్డది. మగడు తెచ్చిన బియ్యం వండి తాను తిని, మిగిలిందే భర్తకు పెట్టేది. అతనా అన్నం తిని, పాత్రలు తోమి జాగ్రత్త పెడుతుండేవాడు.
ప్రతిరోజూ రాత్రిపూట ఒక వీసెడు గోగునార తెచ్చి గట్టి తాడు పేనేది. ఆ తాడుతో భర్తను కసిదీరా కొడుతుండేది. అలా కొట్టకపోతే ఆమె చెయ్యి తీట తీరేది కాదు.
ఒకనాడు అతనికి ఎవరో శుభలేఖ ఇచ్చి పొరుగూరికి పంపించారు. అతను తిరిగి రావడానికి పదిరోజుల సమయం పట్టింది. గంపగయ్యాళి నిత్యం భర్త కోసం కొత్త తాడుపేని సిద్ధం చేస్తూనే ఉంది. కానీ ఎవరిని కొట్టాలో తెలియక.. చేతుల తీట తీరక చాలా బాధపడసాగింది.
(వచ్చేవారం.. పాటలీపుత్ర నగరం)
అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ