ఇన్స్పెక్టర్ రుద్ర తనను కనిపెట్టాడని గ్రహించిన సీఐ శరత్.. వెంటనే అలర్టయ్యి తన అనుచరుల సాయంతో రుద్రను, అతని టీమ్‌ను బంధించి తన స్థావరానికి తరలించాడు. అందర్నీ తాళ్లతో కట్టేసి రుద్రతో మాట్లాడటం ప్రారంభించాడు శరత్. ‘మిస్టర్ రుద్ర. నువ్వు చాలా జీనియస్. సైకో రవి, సైకో ట్విన్స్‌ను ఎంత తెలివిగా పట్టుకొన్నావో తెలుసుకొని చాలా ఎైగ్జెట్ అయ్యా..’ అన్నాడు.
శరత్ మాటలకు అడ్డుపడుతూ… ‘వాడి టాలెంట్ గురించి పక్కనబెట్టు. పోలీసువు అయ్యిండి ఇంతటి కిరాతకానికి ఎందుకు తెగబడ్డావో అది చెప్పు’ అంటూ గద్దించాడు స్నేహిల్. అంతే, ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన శరత్.. స్నేహిల్ చెంప ఛెల్లుమనిపించాడు. ‘నేను మాట్లాడుతుంది రుద్రతో. మధ్యలో ఎవ్వరు కలుగజేసుకొన్నా.. వాళ్లందరికీ ఇదే గతి పడుతుంది’ అంటూ మళ్లీ చెప్పడం ప్రారంభించాడు శరత్. ‘రుద్ర.. సాగదీస్తూ సోది చెప్పడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇదంతా ఎందుకు చేశానో.. చిన్నగా చెప్తా’ అంటూ పక్కన టేబుల్ మీద ఉన్న గ్లాసులోని నీళ్లు తాగి చెప్పడం ప్రారంభించాడు.
‘రుద్ర.. పురాణాలమీద నీకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. అయితే, నాకు మాత్రం బాగా పట్టు ఉంది. నువ్వు నమ్ముతావో లేదో గానీ, మనం మూఢ విశ్వాసాలు అనుకొనే చాలా ఘటనలు వాస్తవాలే. నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానో నీకు అర్థం అవ్వాలంటే నేను చెప్పే సబ్జెక్ట్‌పై నీకు ముందు అవగాహన ఉండాలి. క్లియర్‌గా ఎక్స్ప్లెయిన్ చేస్తా జాగ్రత్తగా విను. శివుడిని కాపాడటం కోసం మోహినీ అవతారంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు భస్మాసురుడిని తన నాట్యంతో మోసగించాడు. అలా భస్మాసురుడి తలమీద తానే చెయ్యిని పెట్టుకొనేలా చేశాడు. దాంతో భస్మాసురుడు భస్మమయ్యాడు. అయితే, క్షీరసాగర మథనంలో వచ్చిన అమృతాన్ని రాహు, కేతువులతో కలిసి అంతకుముందే భస్మాసురుడు తాగాడు. అమృతం గొంతువరకూ చేరడంతో భస్మాసురుడి తల అమరత్వం పొందింది. అందుకే, మోహినీ అవతారంలో మహావిష్ణువు మోసగించి చంపాలనుకొన్నా.. భస్మాసురుడి శరీరం కాలిపోయిందే గానీ, తల మాత్రం సజీవంగానే మిగిలింది. మనం ఇండ్ల ముందు రాక్షసుడి దిష్టిబొమ్మను పెట్టుకొంటాం చూడూ.. అదే ఇది. అంటే భస్మాసురుడి తలను మనం దిష్టిబొమ్మగా పెట్టుకొంటాం.
రాక్షస జాతిలో మిగిలిపోయిన ఒకే ఒక అసురుడు.. భస్మాసురుడు. అతని తల అమరత్వంతో నిండి ఉంది. భస్మాసురుడి వారసులం మేం. అతని వారసత్వాన్ని నిలబెట్టి, మళ్లీ భస్మాసురుడిని భూమి మీదకు తీసుకురావాలంటే.. 18వ పునర్జన్మ బలిపీఠ యాగాన్ని చేయాలి. అది జరగాలంటే మరణశాసనాలను లిఖించాలి. విష్ణుమూర్తి జాతకంలో పుట్టి, లింగమార్పిడి చేసుకొన్న 18 మందిని బలివ్వాలి. ఇందులో 16 మందిని గంట ఎడంతో బలిస్తూ పోవాలి. మిగతా ఇద్దరూ ఆత్మ బలిదానం చేయాలి. అలా జరిగితే, భస్మాసురుడు సశరీరంతో పూర్ణాయుష్షుడు అయ్యి భూమిపై రాక్షస రాజ్యాన్ని మళ్లీ సృష్టిస్తాడు. అంతరించిపోతున్న మా జాతి వర్ధిల్లుతుంది. అందుకే ఈ భస్మాసుర ప్రేమకు అంకురార్పణ చేశా’ అంటూ శరత్ చెప్తున్న స్టోరీని వింటూ రుద్ర సన్నగా నవ్వుతుంటే.. మిగతా వారందరూ భయంతో వణికిపోతున్నారు.
రుద్ర నవ్వడాన్ని తట్టుకోలేని శరత్.. ‘రుద్ర.. నేను చెప్పేది నీకు సినిమా స్టోరీలా అనిపిస్తుందా? అయితే, నీకు అసలైన షాక్ ఇవ్వనా?? 18వ పునర్జన్మ బలిపీఠ యాగంలో 16 మందిని బలిస్తా అన్నాను కదా.. వాళ్లందరినీ ఎప్పుడో బంధించేశా. రానున్న పెత్తరమాస నాడు.. అమావాస్య ఘడియల్లో గంట గంటకూ ఒక్కొక్కరినీ బలిచ్చేలా ప్లాన్ చేశా.. ఇక ఆత్మ బలిదానం చేసుకొనే ఆ ఇద్దరి డెడ్‌బాడీలను అక్షయతృతీయ నాడు కాల్చేలా ప్లాన్ చేశా. అలాగైతేనే, ఆత్మ బలిదానం చేసే ఆ ప్రేమికులు మళ్లీ పుడతారు’ అంటూ శరత్ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు.
ఇంతలో కలుగజేసుకొన్న రుద్ర.. ‘ఒరేయ్ పిచ్చి వెధవ.. సినిమా స్టోరీలను నాకు చెప్పకు’ అంటూ కసురుకొన్నాడు. దీంతో రెచ్చిపోయిన శరత్.. ‘రేయ్ నన్ను పిచ్చి వెధవ అంటావా?? నిజ జీవితంలో జరిగిన ఘటనలను, పురాణాల్లోని సారాన్ని సినిమా కథ అంటావా? అయినా.. ప్రతీ విషయాన్ని లాజికల్‌గా ఆలోచించే నీకు ఎంత చెప్పినా వేస్టే. అయినా.. నేను చెప్పిన 18వ పునర్జన్మ బలిపీఠ యాగం ఏ సినిమాలో ఉందిరా? అక్షయ తృతీయ నాడు కలిసి బూడిదైన ప్రేమికులు మళ్లీ పుడుతారన్న విషయం ఏ మూవీలో చూపించారురా? అధర్వన వేదంలో ఉన్న
ఈ సారాన్ని సినిమా స్టోరీలు అంటూ ఎగతాళి చేస్తావా? ఇప్పుడు గనుక నువ్వు నేను చెప్పిన ఈ వాస్తవాలను.. సినిమా స్టోరీలని ప్రూవ్ చేయకపోతే, నీతోపాటు ఇక్కడ ఉన్న అందర్నీ చంపేస్తా’ అంటూ కోపంతో రివాల్వర్‌ను లోడ్ చేశాడు శరత్.
శరత్‌లోని మరో సైకో కోణాన్ని అప్పుడే చూసిన స్నేహిల్, జయ, రామస్వామి, శివుడితో పాటు మిగతా వాళ్లందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భయపడిపోతున్నారు. ఇంతలో సినిమా పేర్లను చెప్పిన రుద్ర.. కావాలంటే ఆ సినిమా స్టోరీలను నెట్లో సెర్చ్ చేయమని శరత్‌కు చెప్పాడు. దీంతో రుద్ర చెప్పినట్టే, ఆ సినిమాలను సెర్చ్ చేయగానే, అవే కథలు వచ్చాయి. దీంతో నిర్ఘాంతపోయాడు శరత్. ఇంతకీ, రుద్ర చెప్పిన ఆ సినిమాలు ఏంటో కనిపెట్టారా?
సమాధానం:
భస్మాసురుడి స్టోరీ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ మూవీలోనిది కాగా, అక్షయ తృతీయ ప్రేమికుల మరణం ‘అనసూయ’ సినిమాకి సంబంధించినదిగా రుద్ర చెప్పాడు. నెట్లో వెదికితే, ఆ సినిమాల ఇతివృత్తం ఇదేనని తేలడంతో శరత్ షాకయ్యాడు. దీంతో కోపోద్రిక్తుడైన శరత్.. తనను వెధవ అని సంభోదించిన రుద్రపై మరింత రెచ్చిపోయాడు
-రాజశేఖర్ కడవేర్గు