సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 21: మోసపూరిత గ్యారెంటీలతో ప్రజల ముందుకు వస్తున్న కాంగ్రెస్‌కు ఓటేస్తే 24 గంటల కరెంట్ మూడు గంటలు కావడం ఖాయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సీఎం కేసీఆర్ లక్షకోట్ల అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒక్కరే రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారని ఎద్దేవా చేశారు. లక్ష కోట్లు ఖర్చు చేయని ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
శనివారం తంగళ్లపల్లిలో బీఆర్ఎస్ ఆఫీసును నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఆర్బీఎస్ జిల్లా కోఆర్డినేటర్ గడ్డం నర్సయ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బృహత్తర కాశేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని, మూడోసారి, నాలుగోసారి కేసీఆరే సీఎం అవుతారని చెప్పారు. పొరపాటున ఓటేసి కాంగ్రెస్‌ను గెలిపించుకున్న కర్ణాటక ప్రజలు ఇప్పుడు అరిగోస పడుతున్నారన్నారు.
అక్కడ ఐదు గంటలే కరెంట్ ఇస్తుండడంతో కటిక చీకట్లో బతుకులు వెళ్లదీస్తున్నారని గుర్తుచేశారు. రాహుల్‌గాంధీ మాట్లాడేందుకు అంశాలు దొరక్క సీఎం కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేసేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, ఎంపీపీ పడిగెల మానస, జడ్పీటీసీ పుర్మాణి మంజుల, ఏఎంసీ చైర్ పర్సన్ పూసపల్లి సరస్వతి, వైస్ ఎంపీపీ జంగిటి అంజయ్య, సర్పంచ్ అంకారపు అనిత, ఎంపీటీసీ కోడి అంతయ్య, తంగళ్లపల్లి టౌన్ అధ్యక్షుడు బండి జగన్, బీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు అవదూత మహేందర్ తదితరులు పాల్గొన్నారు.