‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో రూ.2వేల బహుమతి పొందిన కథ.
శాండిల్య ఆలోచిస్తున్నాడు. రిటైర్మెంట్కు ఇంకా పదేళ్ల పైనే ఉంది. ఇప్పటికే బాగా స్థిరపడి ఉండాల్సింది. కానీ, ఆ దిశగా పొదుపు చర్యలేవీ చేపట్టలేదు. అది తలుచుకుని కొద్దిగా చింతించాడు. అతను చేసిందల్లా అప్పుడప్పుడూ వచ్చిన బోనస్, డీఏ బకాయిలు, పే కమిషన్ వల్ల జీతం పెరిగినప్పుడు మొత్తంగా వచ్చిన డబ్బు ఇలాంటివన్నీ కలిపి సుమారుగా ఐదు లక్షల వరకూ ఫిక్స్డ్ డిపాజిట్ వేసి ఉంచాడు. అంతకుమించి మరేవిధమైనా పొదుపు చర్యలు చేపట్టలేదు. ఇళ్ల స్థలాలు కొనలేదు. బంగారం అసలే కొనలేదు. ప్రస్తుతం అతనుండే ఇల్లు మాత్రమే చెప్పుకోదగ్గ స్థిరాస్తి. అది కూడా పదేళ్ల క్రితం కొన్నది. ఇప్పటికీ దానికి నెలనెలా ఈఎంఐ కడుతూనే ఉన్నాడు. ఇరవై ఏళ్ల వ్యవధి.. అంటే రిటైర్మెంట్ వరకూ కడుతూనే ఉండాలి. ఏదో విధంగా దాని వ్యవధి తగ్గించుకుని అప్పనేది లేకుండా ఉండాలనుకుంటే కుదిరేట్టు లేదు. ఈసారి ఎలాగైనా ఈఎంఐ పెంచి వచ్చే ఐదేళ్లల్లో లోన్ మొత్తం తీర్చెయ్యాలి. ఉద్యోగం ఉండగానే అప్పు తీర్చేసి నిశ్చింతగా ఉండాలి. మదినిండా లెక్కలేనన్ని ఆలోచనలతో సతమతమవుతూ ఆఫీసుకు బయలుదేరాడు శాండిల్య.
ఆఫీసుకు చేరుకోగానే ఎదురుపడ్డాడు సహోద్యోగి వాసుదేవన్. పక్కసీట్లోనే కూర్చుంటాడు. శాండిల్య ప్లానింగ్ వర్క్ చూస్తే వాసు టెండర్ల పని చూస్తుంటాడు. అతనికి స్టాక్ మార్కెట్ పిచ్చి కాస్త ఎక్కువే. అలాగని తాహతుకు మించి పెట్టుబడులు పెట్టలేదు. అలాగని విపణిలో మరీ లెక్కలేనన్ని లాభాలు కూడా కళ్లజూడలేదు. మధ్యేమార్గంగా అతని పెట్టుబడుల కార్యక్రమం జరుగుతూ ఉంది. పెట్టుబడికి కొంత అమౌంట్ తక్కువ అవుతుందని అప్పుడప్పుడూ శాండిల్య దగ్గరకూడా చేబదులు తీసుకునేవాడు. అలా తీసుకునే సొమ్ము తక్కువగానే.. అంటే వందల్లోనే ఉండేది. ఎప్పుడో ఒక్కసారి మాత్రం సుమారు పదివేలు తీసుకున్నాడు. కానీ తీసుకున్నది చెప్పిన సమయానికి తిరిగి ఇచ్చేసేవాడు. శాండిల్యతో పోల్చుకుంటే అతను కాస్త బాగానే స్థిరపడ్డాడని చెప్పాలి. ముఖ్యంగా అప్పులేదు. తాతల కాలంనాటి సొంతిల్లు ఉంది. కాబట్టి వేరే స్థిరాస్తి గురించిన చింత లేదు. కానీ స్టాక్ మార్కెట్ పైనే ఎక్కువగా అతని గురి. దీర్ఘకాలంలో అది ఎక్కువ లాభాలను ఇస్తుందని నమ్మేవాళ్లల్లో అతను కూడా ఒకడు. అందువల్ల మార్కెట్ స్థితిగతులన్నీ ప్రతినిత్యం గమనిస్తూ ఉండేవాడు. అదును చూసి పెట్టుబడి పెట్టేవాడు. అయినా చాలాసార్లు పెట్టుబడి పెట్టిన కంపెనీ షేర్లు ఘోరంగా పతనమయ్యేవి. ఆ సమయంలో శాండిల్య అతన్ని మందలించేవాడు.
ఆ సందర్భంలో ఒకసారి.. “ఎందుకొచ్చిన దురాశ? ఉన్నదాంట్లో తృప్తి పడొచ్చు కదా” అని అన్నప్పుడు “నామట్టుకు నష్టమేమీ లేదు. క్రితంలో వచ్చిన లాభం ఇప్పుడు పోయిందనుకుంటా. అయినా రిస్క్ లేని పెట్టుబడి ఎక్కడుంటుంది? ఈ ప్రపంచంలో ఉద్యోగం చేసుకుంటూ కోటీశ్వరుడైన వ్యక్తి ఒక్కడూ లేడు. ఇది అక్షరసత్యం. అదలాగుండనీ.. నాకో రెండు వేలు అప్పివ్వు. వచ్చే నెల జీతం రాగానే ఇచ్చేస్తాను” అన్నాడు. వాడి జవాబుకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. చాలాసార్లు శాండిల్యను కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టుమని ఒత్తిడి చేశాడు. అయితే శాండిల్య ఒప్పుకోలేదు. శాండిల్య ఉద్దేశంలో స్టాక్ మార్కెట్ అనేది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జూదం. అక్కడ కోటీశ్వరులు ఇంకా కోటీశ్వరులు అవుతారు. పేద మధ్యతరగతివాళ్లు సర్వనాశనమై పోతారు. అందువల్ల దానిగురించి కనీసం ఆలోచించే సాహసం చెయ్యడు.
“నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకున్నావురా. మనం పెట్టుబడి పెట్టే కంపెనీ మంచిదైతే ఇవాళ కాకుంటే రేపైనా మనకు లాభాలు తప్పకుండా వస్తాయి. అక్కడే మన విచక్షణతో పెట్టుబడి పెట్టాలి” అన్నాడు వాసుదేవన్. “నేను నమ్మనురా. కంపెనీ ఎంత మంచిదైనా స్టాక్ మార్కెట్ పెట్టుబడి తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటిది. కాకపోతే ఏమిట్రా? ఎక్కడో అమెరికాలో ఏదో జరిగితే ఇక్కడ మార్కెట్ కుప్పకూలిపోతుందా? మన బడ్జెట్ మొత్తం ఎంత బాగున్నా ఎక్కడో ఏదో ఒక్కచోట ట్యాక్స్ పరిమితి పెంచలేదని మార్కెట్ కూల్చేస్తారా? ఇది అన్యాయం కాదా? మన దేశపు ఆర్థిక మూలాలు, మనం పెట్టుబడి పెట్టే కంపెనీల పనితీరు బాగున్నప్పుడు ప్రపంచ పరిస్థితులు ఎలా ఉంటే ఏంటి? నాకు తెలిసి ఇక్కడ పెట్టుబడి పెట్టి, సంపాదించిన వాళ్లకంటే దివాలా తీసినవాళ్లే ఎక్కువ. దీన్ని మించిన గ్యాంబ్లింగ్ మరొకటి లేదు. అది అధికారికంగా జరుగుతున్న గ్యాంబ్లింగ్”
“నీకు అలా అనిపిస్తే నేనేమీ చెయ్యలేను. నామట్టుకు నాకు తృప్తిగానే ఉంది. నువ్వన్నట్టు కొన్నిసార్లు నష్టాలు వచ్చిన సందర్భాలు లేకపోలేదు. అయినా సరే, దీర్ఘకాలిక పెట్టుబడులకు నేను దీన్నే నమ్ముకుంటాను. సామాన్య పెట్టుబడిదారులు నష్టపోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు”
“చర్యలు తీసుకుంటున్నా స్కాములు జరుగుతూనే ఉన్నాయి కదా. దానికేమంటావు? శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టుగా.. ఎవరెన్ని చర్యలు తీసుకున్నా మోసపూరితమైన ఉద్దేశం ఉన్నవాడు ఏదో ఒక వంక కనిపెడుతూనే ఉంటాడు.
మోసాలు చేస్తూనే ఉన్నాడు. అటువంటి వాళ్లను మార్చలేం” బాస్ పిలుపు రావడంతో అప్పటికి చర్చ ముగిసింది. ఎవరి పనుల్లో వాళ్లు లీనమయ్యారు.మరునాడు ఆఫీసుకు వచ్చిన వాసుదేవన్ చాలా అశాంతిగా ఉన్నట్టు కనిపించింది. ఏం జరిగిందో, ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందేమో అనుకుంటూ దగ్గరికెళ్లి ఆరా తీశాడు శాండిల్య.
“అదేం లేదురా. అంతా బాగానే ఉంది” అన్నాడు కానీ, అతని ముఖ కవళికలలో మాత్రం మార్పులేదు. కొద్దిసేపు అతనివంక తదేకంగా చూసి వెళ్లి సీట్లో కూర్చుని పని చేసుకోసాగాడు శాండిల్య. అప్పుడప్పుడూ అతనివంక చూసినప్పుడు కొద్దిగా అశాంతిగా కదులుతూ ఉండటం గమనించాడు. మధ్యాహ్నం వరకూ చూసి ఇక ఉండబట్టలేక మళ్లీ లేచి వెళ్లి అడిగాడు.
“సమస్య చెప్పకుండా ఇలా దాటవేస్తే ఎవరుమాత్రం ఏం చెయ్యగలరు? నాకు చెప్పడంలో ఎందుకీ దాపరికం?” “అదేం లేదురా. నీకు నచ్చని విషయం, నా పెట్టుబడి గురించిన ఇబ్బందులు” అన్నాడు. “ఇబ్బంది పడేంత విషయమైతే దాని గురించి ఆలోచించడం ఎందుకు? మన తాహతుకు మించి పెట్టుబడి పెట్టడం మూర్ఖత్వం అనిపించుకోదా?” అన్నాడు కోపంగా.
శాండిల్యవంక చూసి సన్నగా నవ్వాడు వాసుదేవన్. “ఒక్కొకరి ఆలోచనాసరళి ఒక్కోవిధంగా ఉంటుంది. ప్రస్తుతం నేను అనుకుంటున్న పెట్టుబడి నాకు సంబంధించి చాలా ముఖ్యం. ఎందుకంటే అది దీర్ఘకాలిక పెట్టుబడి. దానివల్ల లాభమేకానీ నాకు ఎంతమాత్రమూ నష్టం ఉండదు. అందుకే ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నాను. ఇంట్లో ఉన్న బంగారమేదైనా అమ్మితే అన్న ఆలోచన కూడా ఉంది”
అతని ఆలోచనకు ఉలికిపడ్డాడు శాండిల్య. పెట్టుబడి గురించి అతనంత తీవ్రంగా ఆలోచిస్తున్నాడన్న విషయం చాలా విచిత్రంగా అనిపించింది. ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఇలా చెయ్యడం సమంజసమా? అన్న ప్రశ్న ఉదయించింది. అది అతని వ్యక్తిగత విషయం. తన వరకూ రానంతవరకు ఫర్వాలేదు అనుకుని
మిన్నకున్నాడు శాండిల్య. రెండురోజుల తరువాత ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లగానే ఎదురుపడ్డాడు వాసుదేవన్. చూసీ చూడగానే..
“నాకు అర్జంటుగా యాభై వేలు కావాలి. సర్దగలవా? అయితే తిరిగిచ్చేందుకు నాకు కాస్త సమయం పడుతుంది. ఏడాది కూడా పట్టొచ్చు. కచ్చితంగా చెప్పలేను” అన్నాడు. తాను విన్నదేమిటో అర్థం చేసుకుని జీర్ణించుకునేందుకు శాండిల్యకు కొంత సమయం పట్టింది. అంతవరకూ వందల్లో అడిగి ఎప్పుడైనా పదివేలు అడిగే అతను.. హఠాత్తుగా తన స్థాయిని యాభై వేలకు పెంచడంతో దిక్కుతోచలేదు. వాడికైనా తనకైనా వచ్చే జీతమే నలభై వేలకు మించదు.
అలాంటప్పుడు యాభై వేలు ఎక్కణ్నుంచి తేవాలి? అదే సమయంలో తనకున్న ఏకైక స్నేహితుణ్ని నిరాశ పరచేదెలా? అన్న ఆలోచన కూడా వచ్చింది. అతనెందుకు అడుగుతున్నాడో దాపరికం లేకుండా చెప్పిన తరువాత ఇవ్వాలా? వద్దా? అన్నది నిర్ణయించుకోవడం తన వంతు. వాడేదో పెద్ద పెట్టుబడి ఆలోచనలో ఉన్నాడన్న విషయం మాత్రం అర్థమైంది. దాపరికం లేకుండా విషయం చెప్పినందుకు సంతోషం కలిగింది. కానీ, అంత పెద్దమొత్తం సర్దడం తన తాహతుకు మించిన సమాచారం. కాబట్టి వెంటనే జవాబివ్వకుండా.. “ఆలోచించుకుని రెండు మూడ్రోజుల్లో చెప్తాను” అన్నాడు.
“అంత వ్యవధి లేదు. నాకు రేపటికల్లా కావాలి. రేపే ఆఖరు తేదీ” అన్నాడు వాసుదేవన్. ఆలోచనలో పడిపోయాడు శాండిల్య. ఇవ్వనంటే ఏమనుకుంటాడో. ఇంతకాలమూ ఇస్తూనే ఉన్నాడు. కానీ, ఎప్పుడూ ఇంతపెద్ద మొత్తం ఇవ్వలేదు. వాడు అడగనూ లేదు. సంకట స్థితిలో ఏం తోచకుండా పోయింది. ఆ సమయంలో హఠాత్తుగా అతనికి యూట్యూబ్‌లో చూసిన గరికపాటివారి ప్రవచనం ఒకటి గుర్తొచ్చింది. స్నేహాన్ని, స్నేహధర్మాన్ని ఎలా కాపాడుకోవడం అన్న విషయమై చెప్పిన మాటలవి. లేదనకుండా ఎంతో కొంత ఇచ్చి, ఇచ్చింది ఇక తిరిగి రాకున్నా ఫర్వాలేదనుకునే మానసిక స్థితికి రావడమే! ఆ మాటలు ఆ క్షణంలో చాలా అద్భుతంగా తోచాయి. నిజమే.. అలా చెయ్యడమే మంచిది. అనుకుని మనసు స్థిమిత పరచుకున్నాడు. మర్నాడు ఆఫీసుకు వెళ్లగానే పదివేల రూపాయలు చేతిలో ఉంచి..
“నువ్వు అడిగినట్టు యాభై వేలు ఇచ్చే పరిస్థితులు లేవుగానీ ప్రస్తుతానికి ఇవి ఉంచు. ఇవి నీకెంతవరకూ ఉపయోగపడతాయో తెలీదు” అన్నాడు. దాన్ని తీసుకుని దానివంకే చూస్తూ.. “మళ్లీ చెప్తున్నాను. తిరిగి ఇచ్చేందుకు టైమ్ పట్టొచ్చు” అన్నాడు వాసుదేవన్. “అలాగేలేరా. నీకు తోచినప్పుడే ఇవ్వు” అన్నాడు ప్రవచనాన్ని మననం చేసుకుంటూ. తరువాత ఏడాదికి వాసుదేవన్ వేరే డిపార్టుమెంట్‌కు బదిలీ అయి వెళ్లిపోయాడు. పోతూ పోతూ..
“నేను నీకు పది వేలివ్వాలి. ఇస్తాను” అని మాత్రం అన్నాడు. అయితే శాండిల్యకు అప్పుడు గుర్తొచ్చిందది. నిజంగానే తానిచ్చినట్టు మర్చిపోయాడు. కానీ, ఏడాది తర్వాత కూడా వాసుదేవన్ గుర్తుంచుకుని అలా చెప్పడంతో ఆశ్చర్యపోవడమే కాక ఆనందం కలిగింది. మనసులోనే ‘నిజమైన స్నేహితుడంటే వీడే’ అనుకున్నాడు. తర్వాత ఇద్దరిమధ్యా పెద్దగా సంబంధాలు కొనసాగలేదు. వేరువేరు విభాగాలు కావడంవల్ల కలవడం చాలా అరుదుగా ఉండేది. కలిసినా పది నిమిషాలకన్నా ఎక్కువ మాట్లాడుకునే వాళ్లు కాదు.
కాలం గిర్రున తిరిగింది. పదేళ్లు గడిచింది. శాండిల్య పదవీ విరమణ సమయం వచ్చింది. అతను ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే.. ఇంటి ఈఎంఐ పెంచుకుని ఐదేళ్లల్లోనే అప్పు మొత్తం తీర్చేసుకుని గత ఐదేళ్లుగా అప్పుల్లేని ప్రశాంత జీవనం గడుపుతున్నాడు. పదవీ విరమణకు కొద్దిరోజుల ముందు శాండిల్య తన ఆఫీసులోని సహోద్యోగులందరికీ ఒక చిన్న విందు ఏర్పాటు చేశాడు. మర్చిపోకుండా వాసుదేవన్‌ను కూడా పిలిచాడు.
సహోద్యోగులందరూ తమకు తోచిన విధంగా చదివింపులు ఇచ్చుకున్నారు. అప్పుడు వాసుదేవన్ వచ్చాడు. అతని చేతిలో ఒక పెద్ద కవర్ ఉంది. కాస్త మందంగానే ఉంది. దాన్ని శాండిల్యకు ఇచ్చి.. “ఇప్పుడు కాదు! ఇంటికెళ్లి తెరిచి చూసుకో. అర్థం కాకపోతే రేపు ఆఫీసులో మాట్లాడుకుందాం” అన్నాడు.
ఇంటికెళ్లి కవర్ తెరిచి చూస్తే.. అందులో ఏదో కంపెనీ షేర్ సర్టిఫికెట్లు ఉన్నాయి. మొత్తంగా చూస్తే లక్షా ఇరవై వేల షేర్లు. శాండిల్య తన కళ్లను తానే నమ్మలేకపోయాడు.
అవన్నీ తన పేరనే ఉన్నాయి. దానిపైన ఒక్కొక్కటి ఒక్క రూపాయి అని ఉంది. అంటే లక్షా ఇరవై వేలు బహుమతిగా ఇచ్చాడా? అనుకుంటూ ఆశ్చర్యపోయాడు శాండిల్య. ఎప్పుడెప్పుడు ఉదయం అవుతుందా? ఆఫీసుకెళ్లి వాసుదేవన్‌తో మాట్లాడుతానా? అనిపించింది.పదవీ విరమణకు ఇక పది రోజులే ఉంది. ఆరోజు ఉదయం ఆఫీసుకు చేరుకోగానే నేరుగా వాసుదేవన్ ఉండే డిపార్టుమెంట్‌కు వెళ్లాడు. శాండిల్యను చూడగానే పిలిచి కూర్చోబెట్టి ప్యూన్‌ను కాఫీ తెమ్మని పురమాయించాడు వాసుదేవన్.
“ఏమిట్రా! ఇన్ని షేర్లు నా పేరనే ఉన్నాయి. ఇదెలా సాధ్యం?” అనడిగాడు శాండిల్య. “నేను నీకు పదివేలు ఇవ్వాలన్న విషయం నీకు గుర్తుందా?”.. ఆ ప్రశ్నకు ఉందన్నట్టు తలూపాడు కానీ, అతనెప్పుడో మర్చిపోయాడు. “నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. ఆరోజు నిన్ను డబ్బులు అడిగింది దీని కోసమే. నువ్వు నీ జీతంలో కూడబెట్టింది చాలా తక్కువని తెలుసు. జీవితంలో మనం కొంతమేరకైనా రిస్క్ తీసుకోవాలి. ఆరోజు నిన్ను అడిగిన మొత్తం ఎక్కువే. అందుకే, తర్వాత ఆచితూచి నాపేరన కూడా కొద్ది మొత్తంలోనే తీసుకున్నాను. నేనీ షేర్లు కొన్నప్పుడు ఇప్పటిలాగా డీమ్యాట్ ఖాతా తప్పనిసరి కాదు. అందువల్ల నీ పేరున కొనగలిగాను. ఇప్పుడు వీటిని అమ్మాలంటే డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. కాబట్టి, ఖాతా ఓపెన్ చేసి వీటిని అమ్ముకోవచ్చు” అన్నాడు వాసుదేవన్.
అయితే ఇప్పటికీ శాండిల్యకు ఈ షేర్ మార్కెట్ గురించిన ఓనమాలు తెలియవు. అందువల్ల వెంటనే.. “దానిక్కూడా నేను నీదగ్గరకే రావాలి. వస్తాను” అన్నాడు. “ఒక విషయం తెలుసా? నేను మొదట కొన్నది పది రూపాయల వంతుల వెయ్యి షేర్లే. తరువాత ఈ పదేళ్లలో రెండుసార్లు బోనస్ షేర్లని ఇచ్చారు. తరువాత వాటి విలువ తగ్గించి ఒక్క రూపాయి చేశారు. అలా ఇవాళ మన దగ్గర ఒక్కొక్కరికీ ఇన్ని షేర్లు వచ్చాయి” అన్నాడు.
శాండిల్యకు అంతా కలగా ఉంది. ఇంటికెళ్లాక ఎందుకో ఒకసారి షేర్ మార్కెట్ గురించి గూగుల్‌లో వెతికాడు. కంపెనీ షేర్ల విలువ, వాటి రోజువారీ ధరలు వగైరాలన్నీ చూస్తూ తన దగ్గరున్న ఆ షేర్ విలువ ఎంతుందో చూడాలన్న కుతూహలంతో వేసి చూశాడు. అతని కళ్లు బైర్లు కమ్మాయి. ఆ షేర్ విలువ ఆరోజు వంద రూపాయల పైనే ఉంది. అంటే.. తన దగ్గరున్న షేర్లు అమ్మితే అక్షరాలా కోటీ ఇరవై లక్షలు వస్తాయన్నమాట. కొద్ది క్షణాలు గుండె కొట్టుకోవడం మానేసినట్టు అనిపించింది.
పదవీ విరమణ సందర్భంగా తన మిత్రుడు ఇంతటి విలువైన బహుమతి ఇస్తాడని అనుకోలేదు. పదవీ విరమణ తరువాత ఇద్దరు మిత్రులు పెద్దగా కలిసే సందర్భాలు కలగలేదు. శాండిల్య రిటైరైన ఏడాదికి వాసుదేవన్ కూడా రిటైరయ్యాడు. తరువాత శాండిల్య ఊరొదిలి తమ సొంతూరికే వెళ్లిపోవడం వల్ల ఫోన్లో కూడా పెద్దగా కాంటాక్ట్ లేకపోయింది.
రెండేళ్లు గడిచాక ఒకరోజు పెన్షన్‌కు సంబంధించిన వివరాలు సరిచూసుకునేందుకు ఆఫీసుకు రమ్మని కబురు రావడంవల్ల చెన్నైకి చేరుకున్నాడు శాండిల్య. అదే రోజున అక్కడికి వాసుదేవన్ కూడా వచ్చాడు. అయితే అతన్ని చూసి అతిపెద్ద షాక్‌కు గురయ్యాడు శాండిల్య. అతను చక్రాల కుర్చీ పైన ఉన్నాడు. వాసుదేవన్ రిటైరైన కొద్దిరోజులకే జరిగిన ప్రమాదంలో వెన్నెముక దెబ్బతిన్నందువల్ల ఆ పరిస్థితి వచ్చిందన్నాడు. బాగా బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మిత్రుణ్ని చూడగానే.. ప్రపంచమంతా తలకిందులైనట్టు అనిపించింది శాండిల్యకు. “ఇంత జరిగినా నాకెందుకు చెప్పలేదురా. ఫోన్ నంబరుందిగా” అన్నాడు కోపంగా. “చెప్పినా ప్రయోజనం ఏంట్రా. జీవితం చక్రాల కుర్చీకి అంకితమైంది.
ఇప్పటికీ ఆపరేషన్ చేస్తే బాగు పడుతుందని చెప్పారు కానీ, యాభై శాతమే ఛాన్స్ ఉందన్నారు. దానిక్కూడా పాతిక లక్షలు ఖర్చవుతాయట. అంత డబ్బు ఎక్కణ్నుంచి తేగలను? వ్యాపారంలో రిస్క్ తీసుకుంటే డబ్బులు మాత్రమే పోతాయి కానీ, ఆరోగ్యం విషయంలో రిస్క్ తీసుకుంటే ప్రాణానికే ప్రమాదం. ఎలాగోలా బతికుంటే చాలని నా భార్య అన్నది. నూరు శాతం బాగయ్యే అవకాశం ఉందట కానీ, అందుకు యాభై లక్షలు కావాలి. పాతికకే గతిలేనివాణ్ని.. యాభై ఎక్కణ్నుంచి తేగలను?” అన్నాడు విరక్తిగా. “అదేమిట్రా. నువ్వు కొని పెట్టిన షేర్లున్నాయిగా”
“దురాశ దుఃఖమునకు చేటన్న సామెత నాకు సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. ఉన్నవన్నీ అమ్మి అంతకన్నా మంచిదన్న అత్యాశతో వేరే ఒకే కంపెనీ షేర్లు కొన్నాను. తరువాత కొద్ది రోజులకే యాక్సిడెంట్ కావడంతో సుమారు రెండు నెలలు కోమాలో ఉన్నాను. ఆ సమయంలో కంపెనీ దివాలా తీసి వాటి విలువ దారుణంగా పడిపోయి.. మొత్తంగా లక్షకు చేరుకుంది. ఇప్పుడసలు ట్రేడింగ్‌లోనే లేదు. నాకు తెలివొచ్చాక అదీ పరిస్థితి. ఇంకేం చెయ్యగలను? ప్రస్తుతానికి నాకొచ్చే పెన్షన్‌తో జీవితాన్ని నెట్టుకొస్తున్నాను. షేర్ మార్కెట్ బిజినెస్ మొత్తంగా మానేశాను” అన్నాడు వాసుదేవన్.
ఆ మాటలు విన్న శాండిల్య కేవలం రెండే నిమిషాలు ఆలోచించాడు. “నూరు శాతం బాగవుతుందని చెప్పిందెవరు?” అనడిగాడు. “ఇక్కడ కాదు. అమెరికా వెళ్లాలి. అయ్యేపని కాదులే” చప్పరించేశాడు వాసుదేవన్.“ముందుగా నాకా వివరాలన్నీ ఇవ్వు” అంటూ అతను వద్దని పలుమార్లు వారిస్తున్నా, బలవంతంగా అతన్నుంచి వివరాలన్నీ సేకరించి, అవిశ్రాంతిగా పనిచేసి.. రెండు వారాల్లోనే అమెరికా ప్రయాణానికి వాసుదేవన్‌ను సిద్ధం చేశాడు.
“నేను నీకిచ్చింది పది వేలే. అది తిరిగి ఇవ్వకున్నా నేనేమీ అనుకునేవాణ్ని కాదు. కానీ, నువ్వు పదివేలను కోటి రూపాయలకన్నా ఎక్కువగానే చేసి తిరిగిచ్చావు. అందులోనుంచి యాభై లక్షలు నీకోసం ఖర్చు చెయ్యలేనా? ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను మునుపటి వాసుదేవన్‌గా చూడటమే ప్రస్తుతం నా లక్ష్యం. ఈ విషయంలో నువ్వింకేమీ మాట్లాడకు” అన్నాడు శాండిల్య.
అశ్రుపూరిత నయనాలతో.. “ఉన్నదాంట్లో తృప్తిగా జీవించడం ఎలాగో నిన్ను చూసి నేర్చుకోవాలిరా. ఇదే నేను నేర్చుకున్న అతి విలువైన జీవిత పాఠం” అన్నాడు వాసుదేవన్. అమెరికాలో రెండు నెలలు వాసుదేవన్‌ను దగ్గరుండి కంటికి రెప్పలా చూసుకున్నాడు శాండిల్య. రెండు నెలల తర్వాత పూర్తిగా కోలుకున్న వాసుదేవన్ ఠీవీగా నడుచుకుంటూ భారతదేశంలో అడుగుపెట్టాడు.. మిత్రుడితో సహా.
‘సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ!’ అన్న వాక్యానికి అక్షరరూపమే ఈ కథ. రచయిత సింగీతం ఘటికాచల రావు. స్వస్థలం నెల్లూరు. మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా చేశారు. చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి, సీనియర్ సెక్షన్ ఇంజినీర్‌గా విరమణ పొందారు. పన్నెండో ఏట ఛందోబద్ధమైన కవిత్వంతో రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు. 1997లో రాసిన ‘ఐదు పైసలు’ సింగిల్ పేజీ కథ స్వాతి సపరివార పత్రికకు ఎంపికైంది. అలా, రచయితగా పత్రికల ద్వారా పాఠకులకు పరిచయమయ్యారు. హాస్య, సామాజిక, థ్రిల్లర్, సరసమైన.. ఇలా అన్నిరకాల కథలూ రాశారు. ఇప్పటివరకు 200 కథలు, 18 నవలలు ప్రచురితమయ్యాయి. ‘పెంకుల వసారా’ కథకు అనిల్ అవార్డ్ కన్సొలేషన్ బహుమతి అందుకున్నారు. పిచ్చుక గూళ్లు కథ.. స్వాతి మాసపత్రికలో అనిల్ అవార్డ్ గెలుచుకుంది. ఈయన మొదటి నవల మనసున మనసై.. స్వాతి మాస పత్రికలో అనుబంధ నవలగా ప్రచురితమైంది. పునర్జన్మ (రూ. లక్ష బహుమతి), రాగ విపంచి (సిపి బ్రౌన్ అకాడమీ అవార్డు), అజాత శత్రువు, సారేజహాసే అచ్ఛా నవలలకు వివిధ పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు. నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం కథల పోటీలో బహుమతి గెలుచుకోవడం ఇది రెండోసారి.
– సింగీతం ఘటికాచల రావు
95004 31474