ఆలోచనాత్మక రచనలు
కథలు కొన్ని విషయ ప్రధానంగా సాగితే, మరికొన్ని వర్ణన ప్రధానంగా ఉంటాయి. కోట్ల వనజాత ‘మైదాకు వసంతం’ సంకలనంలోని కథలు విషయ ప్రధానంగా పరుగెడతాయి. మానవత్వమే గొప్పదని చాటుతాయి. మనిషిని మనిషి వంచించుకునే క్రమాన్ని ఆపేయాలని సందేశం ఇస్తాయి. ఇందులో మొదటి కథ ‘మైసమ్మబండ’.. భర్త దూరంగా ఉన్న సమయంలో పిల్లాణ్ని కన్నందుకు అపనిందలపాలై జీవితాన్ని అంతం చేసుకున్న పల్లెటూరి స్త్రీ వెతలను కళ్లకుకడుతుంది. ఊళ్లలో గ్రామదేవతగా కొలుపులు అందుకునే మైసమ్మబండ సాక్ష్యంగా ఈ కథ సాగడం విశేషం. వ్యవసాయం సాధకబాధకాలను వివరిస్తూ… సేంద్రియ సేద్యమే ఆరోగ్యకరం, లాభదాయకమని వివరించే కథ ‘మైదాకు వసంతం’.
రసాయనాలు వాడుతూ పంటల దిగుబడులు పెంచుకుంటున్న తరుణంలో, ప్రకృతి సేద్యానికి పెద్దపీట వేయాలనే సందేశం ఇచ్చే ఈ కథ పేరునే సంకలనం శీర్షికగా ఎంచుకోవడం ఔచిత్యంతో కూడినదే. ఆధునిక జీవనశైలికి అలవాటుపడిపోయి ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాల పరిస్థితి వర్ణిస్తుంది ‘కార్పొరేట్ కాకి’. ‘ప్రేమించకపోతే పోయే.. నాలుకతో నరకడం మానండబ్బా’ అనే హెచ్చరిస్తూ కత్తుల్లాంటి మాటలతో ఎదుటి మనిషిని చంపేయకుండా, ప్రేమను పంచాలనే బోధతో సాగుతుంది ‘నాలుకతో హత్య’. సంకలనంలోని కథలు సమకాలీన సమాజంలోని వివిధ కోణాలను కండ్లముందు ఆవిష్కరిస్తాయి. తన తొలి నవల ‘ఊరుగాని ఊరు’లో పుట్టిన ఊళ్లో ఉన్న ఆస్తిని నిలుపుకొనేందుకు వచ్చిన ఓ మహిళకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో వివరించారు వనజాత. ఇది వర్తమాన కాలంలో గ్రామాల స్థితిగతులను వర్ణిస్తుంది.
మైదాకు వసంతం
రచన : కోట్ల వనజాత
పేజీలు : 132, ధర: రూ. 125
ప్రచురణ : శ్రీమతి సుశీలానారాయణ రెడ్డి ట్రస్ట్
ప్రతులకు : ప్రముఖ పుస్తకాల దుకాణాలు
…? చింతలపల్లి హర్షవర్ధన్
బుక్ షెల్ఫ్ వామపక్షం- భారత స్వాతంత్య్రం
రచన : సీతారాం ఏచూరి, ఇతరులు,
పేజీలు : 152,
ధర : రూ. 150
ప్రతులకు : నవతెలంగాణ, ప్రజాశక్తి పుస్తక కేంద్రాలు
బాలల తీర్పు (కథలు)
రచన : చొప్ప వీరభద్రప్ప
పేజీలు : 83, ధర: రూ. 100
ప్రచురణ : పాలపిట్ట బుక్స్
ప్రతులకు : ప్రధాన పుస్తక కేంద్రాలు, ఫోన్: 94924 50984
ఎదురీత
రచన : కుమ్మమూరి సుబ్బాయమ్మ
పేజీలు : 99, ధర: రూ. 100
ప్రచురణ : సాహితీ కిరణం
ప్రతులకు : ఫోన్: 94907 51681