ఆషాఢమాసం.. వానలతోపాటు మైదాకు సంబురాన్ని కూడా వెంటేసుకుని వస్తుంది. ఈకాలంలో అమ్మాయిలందరం చేతుల నిండా మైదాకు పెట్టుకొని మురిసిపోయేవాళ్లం. పొద్దున బడికి రాగానే.. ఎవరి చేయి ఎర్రగా పండిందోనని అందరి చేతులూ ఒక దగ్గర పెట్టి చూసుకునేవాళ్లం.
అప్పట్లో ఇన్నిన్ని డిజైన్లు లేవు. అరచేతిలో గుండ్రంగా ఒక డిజైన్, వేళ్లకు తొడుగుల్లాగా పెట్టుకోవడం అంతే! అసలు మైదాకు, గోరింటాకు ఒక్కటే అనేది కూడా మాకు తెలియదు. ఇక గోరింటాకు సినిమాలో సావిత్రి పాడినట్టు.. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడనీ, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడనీ, సిందూరంలా పూస్తే చందమామ లాంటి మొగుడొస్తాడనీ జోకులేసుకునేవాళ్లం కూడా కాదు. అలాంటి మాటలే మాకు తెలియవు.
మొదట్లో మా ఇంట్లో మైదాకు చెట్టు లేదు. మేము మైదాకు పెట్టుకుందామనుకుంటే నాన్న జీతగాడికి చెప్పి మైదాకు తెప్పిచ్చేవాడు. అతని భార్య రోట్లో ఆకులు వేసి మెత్తగా నూరేది. ఒక్కొక్కసారి అందులో కొంచెం కాచు (తమలపాకుల్లో వేసుకునేది) కలిపేవారు. కొన్నాళ్లకు మా ఇంట్లోనే ఓ మైదాకు కొమ్మ తెచ్చి నాటితే.. అది చెట్టుగా ఎదిగింది. అందరూ వచ్చి ఆ చెట్టు ఆకులే తెంపుకొని పోయేవారు. ఎప్పుడంటే అప్పుడు ఆ చెట్టు ఆకులు తెంపి నూరించి పెట్టుకోగలిగినా.. ఎందుకో మరి తరచుగా పెట్టుకునేవాళ్లు కాదు. అదేమిటో కానీ, ఆషాఢమాసంలో ఆదివారమే మైదాకు పెట్టుకోవాలనేవారు అందరూ. ఎందుకన్నది మాత్రం చెప్పేవాళ్లు కారు.
ఓసారి అమ్మను అడిగాను.. “ఎందుకమ్మా.. ఆషాఢ మాసం ఆదివారమే పెట్టుకునుడు. వేరేరోజు మైదాకు పెట్టుకుంటె ఏమయితది? చెయ్యి ఊడిపోతదా?!” అని. “నీకన్ని ప్రశ్నలే! చెయ్యి ఎందుకు ఊడుతది?! ఆషాఢ మాసంల బాగ వానలు పడ్తయి. చెట్లకన్ని కొత్త ఆకులు ఒస్తయి. అప్పుడు మైదాకు చెట్ల లేత ఆకులు నూరి పెట్టుకుంటె.. మంచిగ ఎర్రబడుతదని పెట్టుకుంటరు. మైదాకును కొందరు చిన్న ఉండలు చేసుకొని కడుపులకు ఏసుకుంటరు. నులి పురుగులుంటె చస్తయి. ఒంట్లొ వేడి తగ్గిస్తది. ఆరోగ్యానికి మంచిదని” చెప్పింది అమ్మ.
రాత్రి ఏడవుతుండగానే అక్కనూ, నన్నూ కూర్చోబెట్టుకుని.. కథ చెబుతూ మైదాకు పెట్టేది నాన్నమ్మ. అది be బట్టలకు, పక్కబట్టలకు అంటకుండా చేతులకు వదులుగా గుడ్డలు చుట్టి సన్నని తాడుతో కట్టేది. ఆ తరువాత అమ్మ అన్నం తినిపించేది. పక్కల మీద పడుకోగానే నాన్న దుప్పటి కప్పేవాడు. ఆ రోజంతా వీఐపీ ట్రీట్మెంట్ అన్నమాట. కొంచెం పెద్దయ్యాక మాత్రం మేము అన్నాలు తిని పక్కలు వేసుకున్నాకే నానమ్మ మైదాకు పెట్టేది.
పొద్దున లేవగానే రాత్రి మైదాకు పెట్టుకున్నది గుర్తుండేది కాదు. కళ్లు నులుముకోబోయి.. చేతికి గుడ్డలున్న విషయం గుర్తొచ్చి, నానమ్మ దగ్గరికి పోయి విప్పించుకునేవాళ్లం. ఎండి పెళుసుగా అయిన మైదాకును తీసేసి.. చేతులు కడుక్కుని నానమ్మకు చూపించేవాళ్లం. ఆ తరువాత మా అంతట మేమే పెట్టుకోవడం మొదలుపెట్టాం.
మైదాకు అనగానే రెండు సంగతులు గుర్తొస్తాయి. ఒకటి మా స్కూలు రోజులనాటి సంగతి. మా క్లాసులో ఇద్దరు పద్మలు ఉండేవారు. ఇంకవేరే మార్గమేదీ లేనట్టు.. వాళ్లిద్దర్నీ రంగులను బట్టే ‘ఎర్ర పద్మ.. కర్రె పద్మ’ అని గుర్తించేవారు. కర్మగాలి వాళ్ల ఇంటిపేర్లు కూడా ఏ, కే అక్షరాలతోనే మొదలయ్యేవి. ఉన్నట్టుండి కర్రె పద్మ రెండ్రోజులు బడి ఎగ్గొట్టి.. మూడో రోజు వచ్చింది. ఆమె మొహమంతా కాలిపోయినట్టుగా అదో జేగురు రంగులోకి మారిపోయింది. మేమంతా చుట్టూ చేరి.. “ఏమైందబ్బా.. మొహం కాలిందా? మొహం మీద కొర్రాసు అంటుకున్నదా?!” అంటూ, ఇప్పటి ప్రెస్మీట్లో రిపోర్టర్స్లా అడిగాం. దాంతో పాపం పద్మ ఏమీ చెప్పలేక.. “ఏ.. కాదబ్బా! మా అమ్మ అప్పాలు జేస్తుంటే నేను పక్కన కూసున్న. మూకుట్ల ఉడుకు నూనె మొకం మీద పడ్డది” అని చెప్పింది. కానీ, కొన్నాళ్లకే నిజనిర్ధారణ జరుపగా.. అసలు విషయం బయటపడ్డది. మైదాకు పెట్టుకుంటే ఎర్ర పద్మలాగా అవుతావని ఎవరో చెప్పితే.. మొహానికి మైదాకు పెట్టుకున్నదట. అయితే అరచేతుల్లో ఎర్రబడినట్టుగా మిగతా చర్మంపైన పడదు సరికదా.. ఏదో మచ్చలు పడినట్టుగా అవుతుంది. పద్మకూ అదే జరిగింది.
మా కజిన్స్ హైమక్క, లక్ష్మి ఓసారి జులైలో మా ఇంటికొచ్చారు. నేనూ, అక్కా.. వాళ్లతోపాటు వరండాలో వరుసగా పక్కలు వేసుకుని పడుకున్నాం. ఆరోజు మైదాకు పెట్టుకుందామని నూరించి.. అర్ధరాత్రి దాకా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ మైదాకు పెట్టుకున్నాం. అంతలో హైమక్క.. “మైదాకు శానా నూరినట్టున్నరు. పెట్టుకోకపోతే వేస్ట్ అయితది. కాళ్లకు కూడా పెట్టుకుందామా?” అన్నది. మేమేదో మొక్కుబడిగా పాదాల మీద ఓ చుక్కలాగా పెట్టుకున్నాం. కానీ, తను మాత్రం పాదాలు కనిపించనంతగా, సాక్స్ తొడుక్కున్నంత మందంగా పెట్టుకుంది. తీరా లేచి కాళ్లు కదుపుదామంటే నడవరాకుండా అయింది. అందరం ఒకటే నవ్వడం!
గోడకు కాళ్లు పెట్టి పడుకున్నామేమో.. తెల్లారి చూస్తే తెల్లటి గోడనిండా ఎర్రటి మరకలు పడ్డాయి. హైమక్క పడుకున్న దగ్గరైతే పిడకలు కొట్టినట్టుగా రంగు అంటుకున్నది. దాన్ని చూసి.. “ఈ కాళ్లెవరివి?” అని నానమ్మ ఇంటరాగేట్ చేసింది. ఆ రోజంతా గులిగి, చివరికి ఒక సున్నం డబ్బీ తెప్పించి ఆ మరకల మీద రుద్దేదాకా ఊరుకోలేదు నానమ్మ. మైదాకు ఎప్పుడు పెట్టుకున్నా ఈ సంఘటన గుర్తొచ్చి నవ్వొస్తుంది.
1977లో అనుకుంటా.. స్వాతి మాస పత్రికలో అనుబంధ నవలగా ‘పూర్ణిమ’ అనే నవల వచ్చింది. అందులో కథానాయిక పూర్ణిమ పల్లెటూరి అమ్మాయి. హీరో ప్రభాకర్ ఆ ఊరికి వచ్చినపుడు పూర్ణిమ గోరింటాకు పెట్టుకుంటుంది. “ఛీఛీ! అదేంటీ? చేతులకు పేడ పెట్టుకున్నావు?” అనడుగుతాడు హీరో. మేము ఆ నవల చదివి.. “గోరింటాకు తెలియని వాడికి పేడ మాత్రం ఎలా తెలుస్తుంది?” అంటే.. “పేడ అంటే తెలుస్తుంది గానీ, ఎప్పుడో ఏడాదిలో ఒక్కసారి అమ్మాయిలు పెట్టుకునే గోరింటాకు ఏం తెలుస్తుందీ!?” అని చర్చించుకున్నాం.
మైదాకుకు కులమత భేదం లేదండోయ్! మా ముస్లిం ఫ్రెండ్స్ కూడా పెట్టుకునేవారు. కొందరు అబ్బాయిలు కూడా పెట్టుకునేవారు. ఇప్పటి పెళ్లిళ్లలో మెహందీ పెద్ద ఈవెంట్! లక్షలు ఖర్చు పెడుతున్నారు! ఏ మెహందీలూ, కోన్లూ లేని ఆ రోజుల్లో, మైదాకు పెట్టుకోవడం.. ఎర్రగా పండితే సంబురపడటం.. అదొక బాల్యానందం!!
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి