‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.
బ్యాగ్‌లోనుంచి మరోసారి ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్స్ కాపీని చూసుకొని సర్దుకున్నాను. బాబు నుదుటిపై చెయ్యివేసి చూశాను. జ్వరం జారింది. వేసుకున్న టీషర్ట్ చెమటలు పోసి తడిచిపోయింది వాడికి. అటుకేసి తిరిగాడు. దిగులుపొర నా గుండెల్ని మెలిపెట్టింది.
బీటెక్ సెమిస్టర్ పరీక్షల్లో ఈ డెంగీ జ్వరమొకటి వాడికి. ఇంకో రెండు పరీక్షలు రాయాలి. ఈ వేసవిలో.. మే ఐదు, ఆరు తేదీల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా విధి నిర్వహణ కీలకమైనది నాకు.
బాబును హాస్టల్ నుంచి తీసుకొచ్చి కూకట్‌పల్లిలోని మా దగ్గరి బంధువులింట్లో ఉంచాను. పాఠశాల వేసవి సెలవులు అయినందువల్ల నేనూ అక్కడే మకాం. వాడికి దగ్గరుండి పళ్లరసాలు, అవసరమైన మాత్రలు, తేలికపాటి ఆహారం అందిస్తూ అటు సపర్యలు, ఇటు వాడి పరీక్షల ఒత్తిడిలో తలమునకలై ఉన్న నాకు రేపటి ప్రయాణం ఒక ప్రశ్నార్థకమైన బెంగను రేకెత్తించింది.
డైనింగ్ టేబుల్‌పై ట్రైనింగ్‌లో ఇచ్చిన ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ వేయి నాల్కల ఫణిరాజులా బరువుగా నా ఆఫీసర్ బాధ్యతను నెత్తిన మోదడానికి సిద్ధం అంటూ చూడసాగింది. రేపటి ప్రయాణ ఏర్పాట్లలో భాగంగా అవసరమైన చపాతీలు, నాకిష్టమైన ఆలూ బఠాణీ కూర ప్యాక్ చేసుకొని.. తెల్లవారుజామున 4 గంటలకు అలారం పెట్టుకొని తలగడపై ఒత్తిగిల్లాను. దిమ్మన్న పని ఒత్తిడి భారంతో రాత్రంతా కలతనిద్రా మరకలే..! నా దిండు నిండా..!
తెల్లారి ఫెటీల్మన్న సూర్యోదయంతో పోటీపడి, గబగబా రెడీ అయ్యి.. బట్టల బ్యాగు, ఎలక్షన్ ఆర్డర్ కాపీని హ్యాండ్‌బ్యాగ్‌లో సర్దుకొని, బాబుకు నుదుటిపై ముద్దుపెట్టి ‘బెస్ట్‌ఆఫ్ లక్’ చెప్పి బయటపడ్డాను. వాడి కళ్లు అలసటతో మెరిశాయి. పెదవులపై కనీ కనిపించని చిరునవ్వుతో డోర్ వేసుకున్నాడు.
ఉదయం ఏడుగంటలకే బోయిన్పల్లి బస్టాండ్ జనసందోహంతో కిటకిటలాడసాగింది. ఊపిరి సలపని రష్. నా మనసులోని గడబిడకు సమాధానమంటూ దేవుడు పంపిన దూతలా కామారెడ్డి బస్ టైంకి వచ్చింది. టికెట్ తీసి కిటికీ తెరిచాను. పొద్దుటి చల్లగాలి విధి నిర్వహణకు ఆహ్వానమంటూ నా చెంపలను సుతారంగా నిమిరింది. మరో రెండుగంటల తర్వాత కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం దగ్గర రిక్వెస్ట్ స్టాపులో దిగిపోయాను.
మైక్‌లో సందడి చేస్తున్న సూచనలు, ఒకపక్క వరుసలో ఉన్న వివిధ రూట్ బస్సులు, పోలీసుల బందోబస్తు, బయట ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ దగ్గర నా నెంబర్ చూసుకొని.. మా రూట్ ఆఫీసర్ టేబుల్ దగ్గర రిపోర్ట్ చేశాను. మనిషి సన్నగా, రివటలా ఉన్నాడు. పాత సినిమాల్లో రమణారెడ్డిని తలపిస్తూ..! హడావుడిగా అందరి ఆర్డర్స్ తీసుకొని మెటీరియల్ ఇస్తూ సంతకాలు తీసుకోసాగాడు. ఎన్నికల సామగ్రి, చెక్ లిస్ట్ అన్నీ చెక్ చేసుకున్నాక.. నా ఆర్డర్‌లోని పోలింగ్ ఆఫీసర్ ఇంకా రాలేదని మా ఆర్వోకు చెప్పాను. రిజర్వ్ వాళ్లు అలాట్ అవుతారేమోనన్న సందేహాన్ని పూర్తి హామీతో వెలిబుచ్చలేక తడబడ్డాడు. ఎన్నికల సిబ్బంది అందరూ లేనిదే బస్ బయల్దేరదని రూఢిగా తెలుసు.
వార్డ్ మెంబర్లవి తెలుపు రంగు బ్యాలెట్, గులాబీ రంగువి సర్పంచుల బ్యాలెట్ పత్రాలను జాగ్రత్తగా లెక్కించుకొని భద్రపర్చుకున్నాను. ఎల్లారెడ్డి డివిజన్లోని రాంపూర్ గ్రామంలో ఎలక్షన్ డ్యూటీ. అక్కడ సర్పంచ్ ఎన్నిక ఇదే ప్రథమం. అడవిలింగాల, నల్లమడుగు, రాంపూర్, శాంతాపూర్, చద్మల్ తండా, కల్పోల్, బైరాపూర్ తండా రూట్ మ్యాపు గిర్రున కళ్లలో తిరిగింది. నా జ్ఞాపకాలు ముప్పై ఏళ్లు వెనక్కి నెట్టబడ్డాయి.
మార్పు అత్యంత సహజమేనంటూ.. అనివార్యమైన దానికి శోకించుట తగదు అన్న గీతాచార్యుని ప్రబోధామృతం మదిలో కదలాడగా గుండె చిక్కబట్టుకొని నా ప్రథమ నియామక పత్రాన్ని చేతబట్టుకొని..‘బైరాపూర్ తండాకు ఎలా వెళ్లాలి?’ అని బస్ ఎంక్వైరీ చేస్తే.. నివ్వెరపోయిన నిజం కళ్లు బైర్లు కమ్మేలా చేసింది.ఆ ఊరికి బస్ లేదన్న విషయం తెలియగానే మూర్ఛిల్లే ఆశ్చర్యంతో కొయ్యబారిపోయాను..
అప్పటికి నేను అవివాహితురాల్ని. భవిష్యత్ ఎలానన్న భయం, దుఃఖం తాలూకు బెంగతో బిగుసుకుపోయాను. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ బ్లాక్ బోర్డు అన్న స్కీం కింద కొత్తగా తండాల్లోనూ పాఠశాలలు తెరుస్తూ.. ప్రాథమిక విద్యకు పెద్దపీట అంటూ స్పెషల్‌గా మహిళా ఉపాధ్యాయినులను నియమించ సాగింది. అదిగో.. ఆ పద్మవ్యూహంలో భాగంగా నేను మొదట పోస్టింగ్ పొందిన తండా అది.
నావెంట ఎవరూ రాలేదు. ఎలా వెళ్లాలి? ఎక్కడ ఉండాలి? హోరుమంటున్న అంతుచిక్కని ప్రశ్నల సొద నాలో.. జాయినింగ్ రోజు మండల కేంద్రంలో రిపోర్ట్ చేసి నా నిర్జన బతుకుయాత్రను ఎడ్లబండి ఎక్కి ప్రారంభించాను. వన్యమృగాలు తిరిగే అటవీ ప్రాంతం కేసి కిర్రుమంటూ బండిచక్రాలు కదిలాయి. చిక్కటి దట్టమైన కీకారణ్యం అడవి లోపలికి.. లోలోతులకు వెళ్తుంటే.. అసలు ఈ గుట్టల్లో ఎక్కడుందీ తండా? అంటూ తచ్చాడాల్సిందే!
“గీ నల్లవాగు దాటి మూడు కిలోమీటర్లు ప్రయాణించి మొండివాగు మరీ ఉధృతంగా ప్రవహిస్తే చుట్టూ తిరిగి వెళ్లాలి. అదిగో ఆ గుట్టమీద చిన్న గుడిసెలు బొమ్మలలెక్క కన్పిస్తున్నయి జూడు! గదే బైరాపూర్ తండా!” అంటూ ఆ వృద్ధుడు వేలు తిప్పిన వైపు చూస్తే వెన్నులో చలిపాకింది నాకు.
తెచ్చుకున్న సూట్‌కేసు దించుకున్నాను. ఆ వృద్ధుడు ఎడ్లను అదిలిస్తూ, కల్పోల్ తండాకేసి సాగిపోతున్నాడు. క్రమంగా ఎడ్ల మువ్వల శబ్దం వినపడకుండా పోయింది. నిర్మానుష్యమైన ఆ అడవిలో నా శ్వాస, గుండెదడ భయం భయంగా నాకే వినిపించసాగాయి. మధ్యాహ్న మార్తాండ కిరణాలు నిప్పులు కక్కసాగాయి. దాహంతో నాలుక పిడచకట్టుకపోసాగింది. సోయి తెచ్చుకొని బ్యాగులోనుండి నీళ్ల సీసా తీసి గబగబా గొంతు తడుపుకొన్నాను. తెచ్చుకున్న కాల్చిన జొన్నరొట్టెలు తిని, చీర నడుం చుట్టూ బిగించాను.
గుట్టమీద కిరీటంలా మెరిసిపోతున్నాయి తెల్లని మేఘ మాలికలు. నల్లవాగులో కాలు మోపగానే గులకరాళ్ల సంగీత ప్రవాహం ఆప్యాయంగా నా చీర కుచ్చిళ్లను చుట్టుకొంది. ఇసుకలో గట్టిగా పాదాలను తొక్కిపెట్టి జారిపోకుండా.. వాగు ఉధృతికి తగ్గట్టుగా అడుగులను సమంగా వేసుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాను. కొండంత భరోసానిస్తూ ఎదురుగా కొండపైన తునికాకు సేకరణలోనున్న బంజారా స్త్రీలను చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది.
విద్యా గంధానికి దూరమైన ఈ అడవిబిడ్డలకు చదువు విలువ తెలియజెప్పాలి.. చదువుకొని తమకాళ్లపై తాము నిలబడే తొలితరానికి అంకురార్పణం చేసే ఆదిగురువును నేనే అవడం గొప్ప బాధ్యతాయుతమైన కర్తవ్యంగా భావించగానే.. ఎలాంటి జంకూ గొంకూ లేకుండా వారి మువ్వల పట్టీలకు అనుగుణంగా నా పాదాలు ఆశల వసంతంతో అడవిబాట పట్టాయి. ఎత్తుగా, బలాఢ్యులైన ఆ బంజారా మహిళల వెంట నడుస్తుంటే మౌర్యుల కాలంలో అంగరక్షకులుగా మహిళలు ఉండేవారన్న చరిత్ర పాఠం కళ్లముందు కదలాడింది.
దారిలో బండలపై ఎండకాగుకు మత్తుగా జోగుతున్న కొండచిలువలు, అక్కడక్కడా పురివిప్పిన నెమళ్లు, పేరు తెలియని పక్షుల కూతలు వింటూ అదురుతున్న గుండెలతో నాముందు నడుస్తూ బలిష్టంగానున్న ఆ బంజారా మహిళ చేయి చప్పున పట్టుకున్నా.
“అవి అలాగే పోతయిగాని.. నీకేం భయం లేదు. మాతోబాటు గుడిసెలో ఉండొచ్చు!” అంది తన భాషను మిళితం చేస్తూ.. బహుశా నా వాలకం పోల్చుకుందేమో! వీపున కట్టుకున్న తునికాకు మోపును సవరించుకుంటూ.. నాపేరు కనుక్కుని, తన పేరు చంప్లీబాయి అని చెప్పింది దృఢమైన అంగలతో..!
ఈ గుట్టే వారి మాతృఛాయ అంటూ దీని వాలులో పండే పెసలు, కందులు, జొన్న, మక్కలే ప్రధాన ఆహారధాన్యాలుగా.. ప్రతిరోజూ ఇలా ఏడెనిమిది కిలోమీటర్లు నడిచి తునికాకు, కుంకుడుకాయ, పుట్టతేనె, గెయిగడ్డలు, వంటచెరుకు, మొర్రిపండ్లు సేకరిస్తామని గరగరమనే కంఠంతో చెప్పింది చంప్లి. బహుశా తండా దగ్గరపడిందేమో సన్నని నీలిరంగు వెలుతురు పొగ చారికలు చారికలుగా పైకి కదులుతూ వెళ్లసాగింది. మక్కరొట్టెలు కాలుస్తున్న పచ్చివాసన ముందుగానే పలకరించింది.
పేరు తెలియని అక్షాంశాలు, రేఖాంశాలు అంటూ గిరిగీసుకుంటాం.. గ్లోబుపై ఆనవాలు కూడా పట్టలేని ఈ తండా ఇలా కొండలు, గుట్టలెక్కితేనేగా అగుపడేది..! ఇలా స్థానికత పట్టుతెలిసేది..! అనుకుంటూ.. బురద జారుడుబాటలో పాదరక్షలు జారిపోతుంటే తీసి చేతిలో పట్టుకున్నాను. ఎత్తు ఎక్కడం వలన పిక్కలు పట్టేసినట్లయి రొప్పుతూ.. దగ్గరున్న బండరాయిపై కూలబడ్డాను. గుట్టపైనుంచి చూస్తే చుట్టూ చిక్కని పచ్చని వనం.. ఒకవైపు మొండివాగు పాయ, మరోవైపు నల్లవాగు ఝరి.. ద్వీపం లాంటి ఈ గుట్టపై బైరాపూర్ తండా..
రేపు నేను ప్రారంభం చేయబోయే ప్రాథమిక పాఠశాల స్కూల్ రిజిస్టర్ నా సూట్‌కేస్‌లో అల్లావుద్దీన్ అద్భుత దీపంలా తనలో ఎవరి పేర్లు ఎక్కుతాయో చూద్దామన్నట్టుగా నిరీక్షించసాగింది.అటూ ఇటూ దూరంగా.. దగ్గరగా.. ఎత్తుగా పల్లంలో పాకలు.. వెదుళ్లపాకలు.. గుడ్డిదీపాలు.. దూడమూతి పచ్చి పాలవాసన లాంటి ఆ తండా.. ఆరనిమంటల కథలకు కేంద్రంలా అనిపించింది.
మాగన్నుగా నిద్రించిన నాకు ఉదయం పూట ఎవరో చెద్దరు బలంగా లాగుతున్నట్టయి చప్పున మెలకువ అయ్యింది. నా మొహంలో మొహం పెట్టి చూస్తున్న తొర్రిపళ్ల చిన్నారులు, ముక్కుపుడక, కాళ్లకు కడియాలు, చేతులకు వెండిగాజులు.. చిరుగడ్డంపై పచ్చబొట్లు.. రెండు రిబ్బన్లు వీస్తున్న గాలికి ఊగుతుంటే.. అసలుసిసలైన బంజారా బాలికలు. నా మొహం ఆనందంతో విప్పారింది.. ఆ ఆకుపచ్చ చందమామలను చూడగానే..
వారి కళ్లలో పసితనం.. వదనంలో నిర్మలత్వం చూడగానే గొప్ప ఉత్తేజపు అలజడి నాలో..
బంజారా మహిళలు, మగవాళ్లు వ్యవసాయ పనుల్లో, మూగజీవాల్ని మేపుక రావడంలో పగలంతా అడవిబాట పడితే, ఇంట్లోనున్న ఎడపిల్లల్ని సాకడానికి జవసత్వాలుడిగిన వృద్ధులను కనిపెట్టుకొని ఉండటానికి ఈ ఆడపిల్లలే ఆధారమని అర్థమవడానికి ఎక్కువసేపు పట్టలేదు నాకు.
లిపిలేని భాష గోర్ బోలి మాట్లాడేవాళ్లకు మన వర్ణమాల, సంఖ్యలు, గుణింతాలు, ఎక్కాలు, సైన్స్ పరిజ్ఞానం, నీతికథలు ఎలా చెప్పాలి? అన్న ఆశ్చర్యార్థక ప్రశ్న నాలో ఉదయించి ఆవిరయ్యింది.అందులో చురుకుగా ఉండే రూప్లి, పీరుబాయి, ఖింణిబాయి అంటే భలే ఇష్టం నాకు.గళ్ల నుడికట్టు జవాబు తెలిసిపోయిందన్న చందాన వాళ్లతో మిళితమై, ముందుగా నేను గోర్ బోలి భాష నేర్చుకుంటే తప్ప వాళ్లకు తెలుగులో చదవడం, రాయడం నేర్పలేననే సూత్రం కొద్దిరోజుల్లోనే అవగతమైంది.వాళ్ల మనసులోకి దూరే రాచమార్గంగా, పిల్లలను బడికి రప్పించే తాయిలంలా వారి స్థానిక భాషే నాకు ఆయువుపట్టు అన్న నిజాన్ని ఇట్టే పట్టేశాను.
రోజూ పీరుబాయి, రూప్లి, ఖింణిలతో మాట్లాడేదాన్ని. వాళ్ల ఇష్టాలు, అభిరుచులు, కుటుంబం గురించి అడుగుతుంటే ఆ పసికళ్లలో కోటి ఆహ్లాదాలు వెల్లివిరిసేవి. నేను వారి భాషలో మాట్లాడబోయి తడుముకుంటూ తడబడితే తప్పుదిద్ది, ఉచ్చారణను సరిదిద్ది తొర్రిపళ్లతో తుంటరి నవ్వులు రువ్వేవారు ఆ నెలవంకలు.
‘పెండ్లీడు ఆడపిల్లవు.. అక్కడే ఉంటే నీకెలా వివాహం చేయాలి? సంబంధాలు వస్తున్నాయి.. నీవేమీ పలక్కపోతే పోతున్నాయి కూడా.. మధ్యమధ్యలో ఇంటికొచ్చి కన్పించి వెళ్లు!’.. అంటూ అమ్మ మందలింపుతో కూడిన అభ్యర్థన.
వేసవి సెలవుల్లో వెంటతెచ్చే వేసంగి పప్పులు, తండావాసులు అభిమానంతో, ఇష్టంతో ఇచ్చిన అటవీ ఉత్పత్తుల్ని, నెయ్యి, జున్నులాంటివి తీసుకెళ్తే అమ్మ పెదవులపై చిరుదరహాసరేఖ కదలాడేది. లెక్కలేని దయాభావం, కృతజ్ఞతతో వారు అలా నా దోసిలి నింపుతూనే ఉన్నారు. వారి ఔదార్యానికి వెలకట్టలేం! సరికదా.. నవనాగరికులమైన మనం వారికి సరితూగలేమనీ అనిపించింది.
మెరుపు మెరిసినపుడు పట్టుకున్న జ్ఞాపకాల ఆనవాలులా అదే అదను అనుకొని నేను వెళ్లినచోట కచ్చితంగా రెండుమూడేళ్లు అయినా పనిచేయాలనీ, అప్పుడే ట్రాన్స్ఫర్ అర్హత వస్తుందనీ, ఆ తర్వాతే పెళ్లి అంటూ నిక్కచ్చిగా దాటవేశాను.
వర్షాకాలం రాకముందే ఆ తండావాసులు దగ్గర్లోని మండల కేంద్రంలో సరుకులు కొనుగోలు చేసి తెచ్చుకునేవారు. నేనూ అలాగే.. సరుకులతో బాటు ఆ తండా పుణ్యమాని నాలోని చదువరి మరిన్ని పుస్తకాలను మస్తిష్కంలోకి ఎక్కించుకుంటూ.. నేనూ ఆ అడవికి.. తండాకు అలవాటుపడ్డాను. చీకట్లోంచి చూస్తే తండా గుడిసెలు ఆకారంలేని ముద్దల్లా.. నల్లవాగు.. మొండివాగు నీటిపాయల కదలికలు జలతరంగిణి వాద్యంలా.. రాత్రిపూట అడవిలోంచి వినిపించే జంతువుల వింత శబ్దాలకు నిర్భయంగా నిద్రించడం నేర్చుకున్నా!
చంప్లీ ఆతిథ్యంలో.. అజ్ఞాతవాస చంద్రోదయాలు.. అరణ్యవాస సూర్యోదయాలు చూడటం నేర్చుకున్నా!
తూరుపుగాలి కోస్తుంటే పెచ్చులూడిన గుడిసె గోడలు, బీటలువారిన మట్టి వాకిండ్లు, అడవితీగ వనాల ఆదివాసీ మూలాలను దర్శిస్తున్నా!
అక్షరాలను దిద్దమంటే బుర్రగోక్కునే రూప్లి.. ‘అమ్మ ఏది? (యాడి కత్?)’ అని ఏడ్చేది. కొద్దిగా పెద్దదైన ఖింణి మాత్రం ఏకసంథాగ్రాహి.. చెప్పిందే తడవుగా మందనుంచి విడిపోని లేగదూడలా బుద్ధిగా నాదారికి వచ్చేది. ఏవో నాకున్న కొద్దిపాటి ఆలోచనల కాల్వలతో భయపెట్టే సిలబస్‌ను సరళీకృతం చేసేదాన్ని. ఎండుమక్కలు, పెసర్లు, ఎర్రకందుల్ని చార్ట్‌లపై అతికించి వర్ణమాలను, సంఖ్యామానాన్ని వర్ణరంజితం చేస్తే.. ఇంద్రమాలికలా వారి కళ్లలో ఫెటీల్మని ప్రతిఫలించిన ఆశ్చర్యంతో.. స్తబ్ధతను వీడుతూ మెల్లిమెల్లిగా రాయడం, చదవడం నేర్చుకోసాగారు చిన్నారులు.
ఓరోజు కట్టతెగిన తటాకంలా ఏడుస్తూ వచ్చింది ఖింణి. పీరు అక్కకి నల్లతేలు కుట్టింది. గుడిసెలో ఉంది. కడుపునొప్పి దానికి.
“పీరు బాయిన కాలో విచ్చు కాటో, ఓణ్ పేటేమా దూగ్రీ కచ” అంది వెక్కుతూ..
“వద్దు.. ఆ వైపు వెళ్లవద్దు!” అన్నారు తండా పెద్దలు..
ముట్టడినో.. కట్టడినో ఛేదించుకుంటూ వెళ్లాలని ఉన్నా.. నా ఏకాంత ద్వీపవాసం ఇలా.. నాకు అడ్డుకట్ట వేసింది. నాకు తెలుసు నాముందు ఉన్నది చీకటిలోని బావి అని.. నాలాంటి వాళ్లకే కనిపించే బావి అది! కనిపించడం నా తప్పుకాదు గదా!
“ఆ అమ్మాయికి మైల రోజులు.. ముట్టుడు ఇది మా ఆచారం (ఈ హమార్ రివాజ్ ఛ) ఎవరైనా రుతుస్నాత అయితే అక్కడే ఉండాలి. అన్నం, నీళ్లు అక్కడే (ధాణ్ పాణి ఒత్తజ్) ఇది ఇక్కడి నిర్బంధ బహిష్కరణ!” అంటూ తండాపెద్ద లంఖ్యానాయక్ హుంకరించాడు.
మరో రెండురోజుల్లో ఆ పిల్లకు నిలువెల్లా విషపు జెరం సోకి శరీరం ఉబ్బిపోయి మరణించింది. కట్టుబాట్ల పేరుతో నిండుప్రాణాన్ని బలిగొన్న అనాచారానికి దుఃఖితనయ్యాను. ఖింణి వదనంపై విషాద వీచికలు.. మ్రాన్పడిపోయింది.. మరో వారం రోజులకు గానీ మామూలు కాలేదు ఆ అమ్మాయి.
వన్యమృగాల దాడి, అంటువ్యాధులు, గర్భిణుల ప్రసవవేదన, అకాల మరణాలు.. అలా ఆ తండాలో మరో ఐదారు మరణాలు సంభవించాయి. గుండె పగిలేలా ఆక్రోశిస్తూ నేను.. వాటన్నిటికీ సాక్షీభూతమై నిలిచాను.
అయినా.. అన్నిటినీ కళ్ల గవాక్షాలకవతల విసిరిపారేస్తూ.. మొక్కవోని ఆశతో.. గుండె చిక్కబట్టుకొని ప్రతీ వేసవి సెలవుల అనంతరం పిల్లలకు అవసరమైన నోటుబుక్కులు, పెన్నులు, తెల్లకాగితాలు తెచ్చేదాన్ని.
నాకు అవసరమైన రంగుల చాక్పీస్లూ, ఓ నల్లబల్ల, మరికొన్ని రిజిష్టర్లను పోగు చేసుకొని.. ఆ ఏకోపాధ్యాయ పాఠశాలలో ఓ అడుగు ముందుకేసి కాస్తో కూస్తో ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచగలిగాను.
అలా ఓ మూడు వసంతాల కష్టం పిమ్మట.. నా పోస్టింగ్ జిల్లాకేంద్రానికి సమీపంలోని.. బస్ రూట్ గల గ్రామంలో వేసేసరికి ఊపిరి పీల్చుకున్నాను. నా కంటే అమ్మ ఆనందం రెట్టింపు అయ్యింది అనడం సబబు.. పెట్టే, బేడా సర్దుకొని అడవి బిడ్డలకు ఆఖరి వీడ్కోలు పలుకుతుంటే.. ఖింణి నా చీర కుచ్చిళ్లలో తలదూర్చి..
“మీరెల్లోద్దు టీచర్ (తూ జో మత్ టీచర్)!” అంది సజల నయనాలతో.
తల్లి ఆవునుంచి విడిపోయిన లేగదూడలా బెంగటిల్లుతూ నా చేయిని వదలనంటున్న రూప్లి చూపుల స్వచ్ఛతకు.. ఒక క్షణం వివశురాలైనప్పటికీ.. మార్పు అత్యంత సహజమన్న మది అలజడే గెలిచింది.
“రాంపూర్.. రాంపూర్.. దిగండి!” అంటూ ఆర్వో గొంతు పీలగా వినిపించేసరికి ఈ లోకంలోకొచ్చి పడ్డాను. ఒక్క కుదుపుతో బస్సు రాంపూర్‌లో ఆగింది.
చుట్టూ ఎర్రరేగడి మట్టిదిబ్బలు.. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాల రెండుగదుల భవనంలో మా పోలింగ్ బూత్‌లు.. పక్కనేనున్న ఆఫీస్ రూమ్, స్టాఫ్ రూంలో మా బస ఏర్పాట్లను గ్రామస్తులు గావించారు.
మొత్తం ఆరుబూత్లు. ప్రతీబూత్కు ముప్పైకి మించని ఓట్లు. రెండవబూత్లో వార్డ్ మెంబర్ ఏకగ్రీవ ఎన్నిక అయ్యారని కేవలం గులాబీరంగు సర్పంచ్ బ్యాలెట్ మాత్రమే ఇవ్వాలి అంటూ.. మధ్యాహ్నం రెండు వరకే ఎన్నికల సమయం.. భోజనానంతరం కౌంటింగ్ ప్రక్రియ షురూ! ఆనక సర్పంచ్, ఉపసర్పంచ్ ప్రమాణ స్వీకారాలు అన్నీ ఐదుగంటల వరకు అయిపోతే.. మిగతా గ్రామాల సిబ్బందిని ఎక్కించుకొని మండల కేంద్రానికి మనం చేరుకోవాలంటూ.. ముందే సిద్ధం చేసుకున్న ప్రణాళికలను మా ముందు ఉంచాడు ఆర్వో. రెండుగదుల ప్రాథమిక పాఠశాలలో ఒక్కోగదిలో మూడు బూత్‌లు..
మండల కేంద్రంలో బ్యాలెట్ బాక్సులను తుదివిడతగా చెక్ చేసి బస్‌లోకి ఎక్కుతున్న క్లాస్ ఫోర్ ఎంప్లాయీ కాళిదాస్ని నాకు క్లర్క్‌గా వేసి చేతులు దులుపుకొన్నారు అధికారులు. నాకు అలాట్ అయిన క్లర్క్ ఇంకా రిపోర్ట్ చేయలేదు. మూడు ఫేజ్‌లలో నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు, వరుసపెట్టి అందుతున్న ఆర్డర్లకు సిబ్బంది సరిపోవడం లేదు అన్నదానికి ఈ సంఘటనే మచ్చుతునక.. కొంతమంది లేట్‌గా వెళ్తారు. రిజర్వ్ డ్యూటీ ఉంటుందన్న లేజీ భరోసా సాకు కావొచ్చు.
సమయం అయిపోవస్తున్నదని.. ఒకవేళ పోలింగ్ క్లర్క్ గనుక వస్తే అతణ్ని రిజర్వ్‌లో ఉంచి మరుసటి రోజైనా పంపించగలమన్న హామీతో చేతులు దులుపుకొన్న అధికారుల మెలకువలకు ‘ఔరా!’ అనుకోక తప్పలేదు నాకు..
గత్యంతరం లేక కాళిదాస్‌కు.. బ్యాలెట్ ఎలా చింపాలి, ఎలా మడవాలి, ఇండెలిబుల్ ఇంక్ ఎడమ చూపుడు వేలిపై ఎలా పెట్టాలి అని.. వివరంగా చెప్పి, ఉదయం ఏడు లోపలే పోలింగ్ సామగ్రి అంతా సర్దుకొని కూర్చున్నాం.
అన్ని బూత్‌లను కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లుగా చుట్టబెడుతున్న మా ఆర్వో గంటగంటకోసారి వచ్చి.. మేల్, ఫీమేల్ ఓటర్ల సంఖ్య అడుగుతూ, ఫోన్లో.. తన పై అధికారులకు ఈ వివరాలను మెసేజ్ చేయసాగాడు.
కాళిదాస్ నుదుటన చెమటను తుడుచుకుంటూ ఓసారి ఆర్వో దగ్గరకెళ్లి అర్జంట్ ఫోన్ చేసుకొని వస్తానంటూ వెళ్లడం, వచ్చాక మరింత నర్వస్తో.. ఆందోళనగా పనిచేస్తూ ఇండెలిబుల్ ఇంక్ కాస్తా ఒలకపోయడంతో నాకు కోపం తారస్థాయిలో పెరిగిపోయింది.
అదిగో! అప్పుడే మా పోలింగ్ గదిలోకి..
అడవిమల్లెల పరిమళం గప్పున వ్యాపించగా గజ్జెల చప్పుడుతో.. గులాబీరంగు పెద్ద లంగా (ఫేట్యా), గవ్వలు, పూసలు, వెండిరూపాయలతో కుట్టిన ప్రత్యేక పైట (టుక్రి), తలనిండుగా కప్పుకొన్న చిక్కని రంగుదారాల అల్లికతో మెరిసిపోయే ఆకుపచ్చరంగు గూంగట్, అదేరంగు పెద్దపెద్ద మెరిసే అద్దాలతో కుట్టిన జాకెట్ (కాళి) మోచేతులవరకు అలంకరించుకున్న ఏనుగుదంతపు గాజులు, నున్నని తల చెంపలపైదాకా దువ్వి జారవిడిచిన పెద్దపెద్ద జుంకీలు, సంపెంగ ముక్కుపై ముచ్చటగా ఒదిగిపోయిన ముక్కుపుడక (పూళి) తీరైన అవయవ సౌష్టవంతో.. పచ్చని పసిమి ఛాయలో ఓ రూపసి అడుగిడింది.
గదిలో పరుచుకున్న పరిమిత విద్యుత్ కాంతిలో ఆమె వనదేవతలా శోభిల్లింది. ఆ కాంతి తన ముఖంపై సగం పడుతూ ఉంటే, అవాక్కయిన నా ముఖ కవళికలను సరిపోల్చుకొని ఆహ్లాదకరమైన నవ్వుతో.. ఆ అమ్మాయి నా టేబుల్ దగ్గరికి వచ్చి..
“మేడంజీ! గుర్తుపట్టారా? నేను ఖింణిబాయి. (హారదేచ్చుక మ ఖింణి).. వోటర్ నంబర్ ఇరవైమూడు!” అంది గోర్ బోలి ఆనందాన్ని గొంతులో రంగరిస్తూ..
సగం తెరిచిన నాకళ్లలో ముందుగా నమ్మలేనిది అన్న ఆశ్చర్యం.. ఆ తర్వాత సత్యం బోధపడింది అన్న కదలిక.. సూచనగా..!
తేరుకున్న నేను తన ఓటర్ స్లిప్ నెంబర్, ఓటర్ పేరు సరిచూసుకొని, ఆధార్ కార్డ్ నంబర్ రాసుకొని, ఆ అమ్మాయి సంతకం తీసుకొని, బ్యాలెట్ ఇష్యూ చేశాను. కాళిదాస్ ఇంతలో టేబుల్ క్లీన్ చేసి ఉన్న కాస్త ఇండెలిబుల్ ఇంక్‌ను సర్దుతూ..
“మాది పక్కనేనున్న శాంతాపూర్. కేవలం మూడు కిలోమీటర్లే మేడం.. నేను వెళ్లి అక్కడ ఓటు వేసిరావాలి. మా అమ్మ సర్పంచిగా నిలబడింది అక్కడ!” అన్నాడు బెదురుతున్న కళ్లతో..
అతడి అర్జంట్ ఫోన్ కాల్స్ రహస్యం వీడిపోయింది. ఖింణిబాయి ఓటు చివరిది.. ఇంకెవరైనా వస్తే చూసుకోవచ్చునన్న నమ్మికతో ఎంతైనా.. ఓటు వజ్రాయుధం కదా.. అతణ్ని పంపక తప్పలేదు నాకు. తొందరగా రావాలన్న షరతు మాత్రం విధించాను.
ఖింణిబాయి ఓటువేసి వచ్చి చేతులు జోడించింది అభిమానంగా. కనుబొమలతో ప్రోత్సాహకమిస్తూ.. ఎలక్షన్ అయ్యాక మాట్లాడదామని పంపించాను.
మరో అరగంటలో కాళిదాస్ వచ్చేశాడు. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. దాదాపు తొంభై శాతం ఓట్లు పోలయ్యాయి.
బ్యాలెట్ బాక్సులకు సీలువేసి తెల్లటి గుడ్డసంచీలో దించి కుట్లువేసి మా పోలింగ్ బూత్ నెంబర్ అతికించి, నా సంతకాలు చేసేశాను.
అన్ని బూత్‌ల బ్యాలెట్ బాక్సులను ఆర్వోగదిలో పోలీస్ ఎస్కార్ట్‌తో ఉంచి భోజనాలకు వెళ్లాం మేమంతా..
మధ్యాహ్నం రెండు తర్వాత ఆర్వో ఆధ్వర్యంలో బ్యాలెట్ బాక్సుల సీళ్లు విప్పి ఒక్కో ప్రిసైడింగ్ ఆఫీసర్ సమక్షంలో.. ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ ప్రకారంగా పోలైన ఓట్ల లెక్కింపులు జరగసాగాయి.
ఖింణిబాయి మిగతా వార్డు మెంబర్లు, ఆ తండా పెద్దమనుషులు నలుగైదుగురు అక్కడే నిలబడి ఓటింగ్ సరళిని సమీక్షించసాగారు. మొదటినుంచీ ఖింణీదే లీడింగ్! ట్రైబల్ మహిళా రిజర్వేషన్లో రాంపూర్ ప్రథమ మహిళగా ఖింణీబాయి సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేసింది. తనతోబాటే ఉపసర్పంచ్ ఎన్నిక, ప్రమాణస్వీకారాలు పూర్తయ్యాయి. రిజిస్టర్లో సంతకం చేశాక.. సంతోషం పట్టలేక ఖింణీ నన్ను గట్టిగా కౌగిలించుకుంది. వనం మైసమ్మ పచ్చిగడ్డి మోపుల వాసనతో ఉక్కిరిబిక్కిరయ్యాను.
బయట ఎదురుచూస్తున్న మీడియాతో ఖింణి మాట్లాడుతూ.. తాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశాననీ, చదువు అయ్యాక తనకు రాంపూర్ వాసి బంశ్యానాయక్తో పెండ్లి జరిగిందని, తగిన పత్రాలతో తన ఓటు హక్కును బైరాపూర్ తండానుంచి ఇక్కడి రాంపూర్ గ్రామపంచాయతీకి మార్పించుకున్నానని చెప్పింది.
బైరాపూర్ తండాకు ఇప్పటికీ సరైన రహదారి లేక అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉండిపోయింది అంటూ..
విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలకు నోచుకోని తమ తండావాసుల గోడు ఎన్నేళ్లయినా ఇంతేనా? అంటూ ఆవేదన పడింది. చదువు విలువ తెలిసిన తెలివైన భర్త లభించడం తనకు ఒక గొప్ప వరమైతే.. తాను చిన్ననాడు విన్నపాఠం మూడంచెల స్వపరిపాలన అంటే తనకు ఎంతో ఇష్టమని.. గొప్పగా చదువుకొని తండా పెద్దగా మన్ననలు అందుకోవాలన్న ప్రేరణను ఆ పాఠం కలగజేసిందంటూ..
చదువుకోవాలన్న తమ తపనకు పాదులు చేసి నీళ్లు పోసి బతికించిన తన టీచరే తనకు ప్రేరణ అంటూ ఆర్ద్రంగా మెత్తబడిన కంఠంతో పలికింది.
జీరో ఎన్రోల్మెంట్.. అంటూ ఇటీవల మూతబడిన తమ తండాల్లోని పాఠశాలలను.. రీ ఓపెన్ చేయిస్తానని, డ్రాపవుట్ పిల్లలనూ తిరిగి చదువులమ్మ ఒడికి పంపించాలని, తమ తండాల్లోని బాలికల విద్య కోసం స్పెషల్ గర్ల్స్ ప్రైమరీ స్కూల్‌ను భవిష్యత్‌లో ఏర్పాటు చేసుకుంటామని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్తున్న.. ఆమె మాటల్లోని ధీరత్వంలో వనం సూర్యుడి తేజం.. అక్బర్‌ను ఎదిరించిన గోండురాణి దుర్గావతి శౌర్యపరాక్రమాలు ప్రతిఫలించసాగాయి.
ఈ వెచ్చటి సూర్యాస్తమయ కాంతిలో ఆమె ఒక కంటిలో ఆరని జ్వాలను.. మరొక కంటిలో సతత హరిత వనాలను దర్శించసాగాను.
ఖింణి మాటల్ని అక్కడి తండా రిపోర్టర్ యువకుడెవరో వీడియో తీసి, లోకల్ న్యూస్ చానెల్‌కు పంపిస్తున్నాడు. కాళిదాస్ వదనం కోటి వసంతాలతో వెలిగిపోసాగింది.
“మేడం మా అమ్మ గెల్చింది!” అన్నాడు ఆనందం పట్టలేక.. అతనికి అభినందనలు తెలుపసాగారు అందరూ..
ఖాళీ అయిన బ్యాలెట్ డబ్బాలను విధిగా బస్‌లోకి ఎక్కించసాగాం.. మదినిండిన బోలెడన్ని సంతోషాలను మూటగట్టుకొని మండల కేంద్రంవైపుగా మా ఎన్నికల బస్సు పరుగులు తీసింది. నా చేతిలో ఖింణి ఇచ్చిన వారి సంప్రదాయ లడ్డూ.. ఎలాంటి అరమరికలు లేకుండా, హేతుబద్ధంగా, సముదాయింపుగా, అటు ప్రకృతినీ, ఇటు మానవ ప్రకృతిని పూర్తిగా ఆహ్వానిస్తూ దేనిని, వేటినీ, ఎవరినీ తోసిపుచ్చకుండా, నేలమీదే నిలుస్తూ.. నిలబడుతూ.. ఎటో తేలిపోకుండా వారి ఆచారాలు, సంస్కృతిని పరిరక్షించుకుంటూ, భేషజాలు లేని స్వచ్ఛమైన ఆ ఆదివాసీ తండాల తేనెజల్లు నా మదిలో మధుర సుధలై కురియసాగింది.
అవును.. ముప్పై ఏళ్లు ముందుకీ, వెనక్కీ నెట్టబడిన ఈ జ్ఞాపకాల ముక్కలా అస్తవ్యస్తపు సముదాయమే గడిచిన జీవితం కాబోలు..
మా బస్సు మెల్లగా ఎర్రరేగడి మట్టిదిబ్బ రోడ్డు పక్కన ఉన్న పాక హోటల్ నుంచి అటువైపు వెళ్తోంది.. ఎర్రటి దుమ్మును ఛేదిస్తూ.. హారన్ మోగిస్తూ.. నిగనిగలాడే తారురోడ్డు ఎక్కాలన్న తాపత్రయం దానిది..
వ్యక్తిగతం.. వృత్తిగతమంటూ.. బహుపాత్రల్ని పోషించే ఈ బోహీమియన్ జీవితంలో ఊపిరి సలపలేనంత పని..
కాలువగట్టు వెంబడి వేసిన పాలకూర మళ్లను.. అంగార వర్ణంతో మెరిసిపోయే సాయం సంధ్యా సూర్యుడిని చూస్తూ.. సాంత్వన పొందసాగాను.
విద్యార్థులంతా తమతమ నిండైన వ్యక్తిత్వాలతో కాలం ఫ్లోలోకి వెళ్లిపోయి స్థిరపడిపోతుంటే.. ఆ సంతోషంతో గొప్పగా రీచార్జ్ అవసాగాను.
ఆకులపై రాలిన చినుకుల అలికిడి నాలో.. తన తండాకై చేసిన సోగణ్ (ప్రమాణం) గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. గెలిచి నిలిచిన వనం ఆకుపచ్చని చందమామ..! చల్లని వెన్నెల కిరణం.. ఖింణీబాయికి అభినందనలంటూ..
“వద్దు.. ఆ వైపు వెళ్లవద్దు!” అన్నారు తండా పెద్దలు..ముట్టడినో.. కట్టడినో ఛేదించుకుంటూ వెళ్లాలని ఉన్నా.. నా ఏకాంత ద్వీపవాసం ఇలా.. నాకు అడ్డుకట్ట వేసింది. నాకు తెలుసు నాముందు ఉన్నది చీకటిలోని బావి అని.. నాలాంటి వాళ్లకే కనిపించే బావి అది!
కనిపించడం నా తప్పుకాదు గదా!“ఆ అమ్మాయికి మైల రోజులు.. ముట్టుడు ఇది మా ఆచారం ఎవరైనా రుతుస్నాత అయితే అక్కడే ఉండాలి. అన్నం, నీళ్లు అక్కడే! ఇది ఇక్కడి నిర్బంధ బహిష్కరణ!” అంటూ తండాపెద్ద హుంకరించాడు.
జీరో ఎన్రోల్మెంట్.. అంటూ ఇటీవల మూతబడిన తమ తండాల్లోని పాఠశాలలను.. రీ ఓపెన్ చేయిస్తానని, డ్రాపవుట్ పిల్లలనూ తిరిగి చదువులమ్మ ఒడికి పంపించాలని, తమ తండాల్లోని బాలికల విద్య కోసం స్పెషల్ గర్ల్స్ ప్రైమరీ స్కూల్‌ను భవిష్యత్‌లో ఏర్పాటు
చేసుకుంటామని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్తున్న.. ఆమె మాటల్లోని ధీరత్వంలో వనం సూర్యుడి తేజం.. అక్బర్‌ను ఎదిరించిన గోండురాణి దుర్గావతి శౌర్యపరాక్రమాలు ప్రతిఫలించసాగాయి.
బి.కళాగోపాల్
చదువు విలువను చాటే కథ.. సోగణ్! రచయిత్రి బి. కళాగోపాల్. పుట్టి పెరిగింది నిజామాబాద్. ఎం.ఎ (ఇంగ్లిష్), బీఈడీ చేశారు. ప్రస్తుతం ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. పుష్కరకాలంగా కవితలు, కథలు రాస్తున్నారు. వీరు రాసిన 50 కథలు, 550కిపైగా కవితలు వివిధ వార, మాస, సాహిత్య పత్రికలలో ప్రచురితమయ్యాయి. వాటిలో 20 కథలు, అనేక కవితలు.. వివిధ సందర్భాల్లో అవార్డులను పొందాయి. నిజామాబాద్ రేడియో ఎఫ్ఎంలో 20కిపైగా కథానికలు, 40కిపైగా వ్యాసాలు ప్రసారమయ్యాయి. 25 వ్యాసాలు వివిధ పత్రికల్లో వచ్చాయి. 2015లో వీరి కవితా సంపుటి ‘మళ్లీ చిగురించనీ’, 2022లో ప్రథమ కథాసంపుటి ‘కొత్తఊపిరి’ ప్రచురించారు. రాధేయ, ఎక్స్‌రే, భిలాయ్వాణి, కలహంస, భూమిక, సాహితీకిరణం, ద్వానా, వాల్మీకి, మల్లెతీగ, గుర్రంజాషువా, వాసాప్రభావతి, కవి సంధ్య వారి నుంచి కవితా పురస్కారాలు అందుకున్నారు. సోమేపల్లి, వట్టికోట ఆళ్వారుస్వామి, జలదంకి పద్మావతి, వాసా ప్రభావతి, అనసూయ రత్నావతి స్మారక కథా పురస్కారాలను పొందారు.
బి.కళాగోపాల్
94416 31029