Ramayanam | మా ముందు బ్యాచుల వారికి బడిలో ‘వీడ్కోలు దినోత్సవం’ అంటూ జరిపినట్టు మాకు తెలీదు. మా బ్యాచ్ నుంచే మొదలుపెట్టారో కూడా జ్ఞాపకం లేదు. టెంత్ క్లాసు వాళ్లకు అప్పటితో స్కూలు జీవితం అయిపోతుందని, వీళ్లు మళ్లీ జీవితంలో కలుస్తారో లేదోనని ‘వీడ్కోలు సమావేశం’ జరిపే సంప్రదాయం ఒకటుందని కూడా తెలియదు.
ఇక మేము పదో తరగతిలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ.. “మీరిప్పుడు టెంత్! పెద్దగయిన్రు, మంచిగుండాలె, మంచిగ చదువాలె! ఎక్కడికి బోయినా ఏ పనిజేసినా.. ఈ బడిని, సార్లను యాదికి పెట్టుకోవాలె. బడికి, ఊరికి, మీ అమ్మ నాయినలకు చెడ్డ పేరొచ్చే పని జెయ్యొద్దు” అని అందరు సార్లు ప్రతి క్లాసులోనూ పదేపదే చెబుతుంటే.. ‘ఏం పెద్దగైనమబ్బా?! గింత గనం చెప్పుతున్నరు?!’ అనుకునేదాన్ని. సరే! మొత్తానికి మా బ్యాచ్ నుంచే బడిలో వీడ్కోలు దినోత్సవం జరపడం మొదలైంది. అన్ని క్లాసుల కన్నా టెంత్ వాళ్ల పరీక్షలు ముందే అవుతాయి గనుక.. మా పరీక్షలు కూడా ముందే అయిపోయాయి. ఆఖరి పరీక్ష అయిన ఐదు రోజులకు అనుకుంటా.. మాకు ఫేర్వెల్ మీటింగ్ ఏర్పాటుచేశారు.
ఆరోజు బాగా ఎండగా ఉంది. పగలు భోజనాలు అయ్యాక మా అమ్మా, నానమ్మా వంటింటి వైపుండే మనసాలలో చాపలు వేసుకుని నడుం వాల్చారు. నేను కూడా ఓ చాప వేసుకుని ఏదో పుస్తకం చదువుతూ అలాగే నిద్రపోయాను. మంచి గాఢనిద్రలో ఉండగా నాన్న వచ్చి నిద్రలేపాడు. “నీ కోసం బడి నుంచి ఎవరో పిలగాడు ఒచ్చిండు. నిన్ను రమ్మంటున్నరట” అన్నాడు. లేచి చూసేసరికి బయట మా క్లాస్మేట్ యాకూబ్ పాషా నిలబడి ఉన్నాడు. సైకిల్ మీద వచ్చినట్టున్నాడు, చెమటలు కారుతున్నాయి. నన్ను చూడగానే.. “మనకు ఫేర్వెల్ మీటింగ్ ఏర్పాటుచేసిన్రు. మూడు గంటలకు స్కూళ్ల ఉండేటట్టు రమ్మని చెప్పిన్రు. ఇంక ఇటుదిక్కు నలుగురైదుగురికి చెప్పాలె.. పోతున్న” అంటూ వెళ్లిపోయాడు. ‘ఇంత సడన్‌గా ఎలా!?’ అనుకోలేదు. తొందరగా మొహం కడుక్కుని బట్టలు మార్చుకుని వెళ్తుంటే నానమ్మ ఊరుకుంటుందా?!
“గింత ఎర్రటి ఎండల ఎటు పోతున్నవే?! ఎండదెబ్బ తలుగుతది. ఎండ చల్లబడ్డాక పోరాదు!” అన్నది. “బడికి రమ్మన్నరు. మీటింగ్ ఉన్నదట” అన్నాను గొప్పగా.. ‘మీటింగ్’ అన్న మాట ఒత్తి పలుకుతూ. “మళ్లేం బడే?! మొన్ననే పరీక్షలు అయిపాయె! తాతీలు గూడా ఇచ్చిరి” అన్నది వదలకుండా. “పాఠాలు జెప్పుడుగాదు నానమ్మా! ఉత్తగనే పిలుస్తున్నరు” అని.. ఇంకా ఏం ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వకుండా అమ్మకు చెప్పి బయల్దేరాను.
నేను వెళ్లేసరికే రాధ, శ్యామల, భాగ్యలక్ష్మి, ఇంకొందరు వచ్చి ఉన్నారు. మరికొందరు వస్తూ ఉన్నారు. దాదాపు అందరూ వచ్చాక మీటింగ్ మొదలుపెట్టారు. ఎనిమిది, తొమ్మిది తరగతుల వాళ్లను కూడా కూర్చోబెట్టారు. ముందుగా మా హెడ్మాస్టర్ ఎమాన్యూల్ సార్ మాట్లాడాక.. ఇద్దరో ముగ్గురో సార్లు మాట్లాడారు. అందరూ చెప్పిందొకటే.. ‘మీ బ్యాచ్ శాన మంచిది. అందరు మంచిగ చదువుతరు. మీరు చదువు ఇక్కడితోటి ఆపకుండ పెద్ద చదువులు చదువుకుంటె జీవితంల పైకి వొస్తరు. ఏమున్నా లేకున్నా చదువొక్కటుంటె చాలు.. అన్ని సాధించొచ్చు. ఇప్పటికే పెండ్లిండ్లు అయిన ఆడిపిల్లలు కూడ మీ ఇంట్ల ఒప్పుకొంటె మళ్ల చదువుకోండి. మొగపిల్లలు మీ మీ అమ్మనాయినలను కష్టపెట్టకుండ చదువుకుంట కూడ ఏదన్న పనిచేయండి. తప్పు కాదు. బడికి మీరందరు మంచిపేరు తేవాలె!’.. ఇదీ ఆ మాటల సారాంశం.
నాకెందుకో మేమేమిటో చాలా పెద్దవాళ్లం అయిపోయినట్టూ, మా మీద ఎంతో భారం పెట్టినట్టూ అనిపించింది. ఒక్కొక్కళ్లనీ మాట్లాడమన్నప్పుడు చాలామంది మొహమాటపడ్డారు. కొందరు ముందుకొచ్చి కూడా మాట్లాడలేక సగంలోనే వెళ్లిపోయారు. యాదగిరి అనే పిల్లగాడు భోరున ఏడ్చాడు. షర్ట్ కొసతో కళ్లు తుడుచుకుంటూ అతడు ఏడుస్తుంటే.. మాకూ ఏడుపొచ్చింది. ఇద్దరు సార్లు యాదగిరిని పక్కకు తీసుకెళ్లి ఓదార్చారు. వరదారెడ్డి సారు.. “ఏందిరా! ఆడిపిల్లలు అత్తగారింటికి పోయెటప్పుడు ఏడ్చినట్టు ఏడుస్తానవేందిరా! నీకు గంతగనం బడంటే ఇష్టమయితె బాగ చదువుకొని గిండ్లకే సారు లెక్క రారాదు! ఎప్పటికి ఇండ్లనే ఉండొచ్చు” అని అందర్నీ నవ్వించాడు.
ఆ స్కూలు నాకెందుకు ఇష్టమో, మాకు ఆ బడితో ఎంత అనుబంధమో, కొన్ని మరపురాని సందర్భాలను గుర్తుచేస్తూ.. స్కూలును, చదువు చెప్పిన సార్లను ఎన్నటికీ మర్చిపోనని చెప్పాను నేను.
తరువాత ఎవరైనా ఆ సందర్భానికి తగ్గ పాటలు పాడొచ్చని సార్లు చెప్పారు. వెంటనే.. ‘పోవుచున్నావా.. ఔరా యమధర్మరాజా!’ అని పద్మ పాడగానే.. “ఒద్దమ్మా! గా పాట గిప్పుడెందుకు తల్లీ!” అని ఆపేశారు. వెంటనే రాజమౌళి.. ‘టాటా.. వీడుకోలు! గుడ్‌బై.. ఇంక సెలవు! తొలినాటి స్నేహితులారా!’ అంటూ మొదలుపెట్టాడు. కాస్త పాడనిచ్చి.. “ఇగ ఆపు! తరువాత చరణాలు ఏమొద్దు” అన్నారు.
మొదటిసారిగా మాకు బూందీ మిక్చర్, కోవా స్వీటు ఇచ్చారు.
‘ఓహో! మా లెవెల్ పెరిగిందే!’ అనిపించింది. ఆస్థాన ఫొటోగ్రాఫర్, మా క్లాస్మేట్ ప్రభాకర్ వాళ్ల నాన్న వెంకటనారాయణ వచ్చి మాకందరికీ ఒక గ్రూప్ ఫొటో తీశాడు. కంపోజిట్ మాథ్స్ వాళ్లం లెక్కల సార్లతో ఓ ఫొటో విడిగా దిగాం. అందులో నేనొక్కదాన్నే ఆడపిల్లను. అందరమూ ‘బై బై!’ చెప్పుకొని.. ఆడపిల్లలం మధ్యమధ్యలో కలుసుకోవాలనీ, ఉత్తరాలు రాసుకోవాలనీ ప్రామిస్‌లు చేసుకుని ఇంటిదారి పట్టాం. బడి వదిలి వస్తుంటే చెప్పలేనంత బాధ కలిగింది. ఇక మరెప్పుడూ ఈ క్లాస్‌రూమ్స్‌లో కూర్చోము కదా!, ఈ గ్రౌండ్లో తిరిగి ఆడుకోము కదా! ఈ స్నేహితులందరూ మళ్లీ కనిపించరు కదా!.. అనుకుంటే ఎంతో దిగులు కలిగింది.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి