“ఉమేర్.. పొద్దు శానెక్కింది! ఉఠో బేటా! గీ దినం జుబేర్ మామ వస్తాడన్నవ్ కదా! లేవు మరి!” నిద్ర లేపుతున్నది అమ్మి.జుబేర్ మామ పేరు ఇనంగనే.. గూడు ఇడ్సిన కాకి లెక్క ఎగిరివోయింది నిద్ర. నిన్న శివరాత్రి.. దోస్తులతో కల్సి తెల్లార్లూ జాగారం జేసిన. కండ్లు మంటగున్నయి.
“జరసేపాగి లేస్తతీ అమ్మీ!” అన్చెప్పిన.కొన్ని రక్త సంబంధాలు ఉన్నా లేనట్టే ఉంటయి. జుబేర్ మామ ఆ బాబతోడే. అమ్మమ్మ వాళ్లకు జుబేర్ మామ, అమ్మీ.. ఇద్దరే సంతానం. మా తాత ఊరి చౌరస్తల సైకిల్ పంచర్లు ఏసే పనిచేసేటోడంట. ఆ పని చేస్కుంటనే మామను డిగ్రీ దాకా సద్వించినడంట. ఆరు సదివిన అమ్మిని దూరపు సుట్టమైన మా అబ్బుకిచ్చి పెళ్లి జేసినడంట. ఖాళీగా ఉన్న జుబేర్ మామ జాబ్ ప్రయత్నం చేస్తున్నడంట. ఆ టైంలనే నల్గొండ జిల్లాస్థాయి ‘ఇస్తెమా’ జరుగుతుంటే..
‘ఇస్తెమాకు వోయి నల్గొండలనే ఏదన్న పని సూస్కుంట!’ అన్చెప్పి నల్గొండకు వోయిన మామ.. బాయిలేసిన రాయిలెక్క గాయబ్ అయినడంట. చేతికొచ్చిన కొడుక్కు ఏం జరిగిందో తెల్వక అమ్మమ్మ – తాత శాన గుబులువడ్డరంట. చాన్నాళ్ల తర్వాత మామ నల్గొండల ఎవరో ఆస్తిపరుల ఇంటికి ఇల్లటం అల్లుడుగ వోయిండని ఎర్కయింది. అత్తగారోల్లే గవర్నమెంటు కొలువుగుడా ఇప్పించినరంట. కొన్నాళ్ల తర్వాత అడపాదడపా వచ్చివోయేటోడంట గనీ, తల్లితండ్రిని బాధ్యతగా సూస్కున్న పాపాన వోలేదంట. కొడుకు మనాదిలనే నౌశి మంచానవడి ఏడాది తేడాతో తాత – అమ్మమ్మ సచ్చివోయినరంట.
ఐదు పూటల నమాజ్ సద్వే మామ ఎందుకిలా మారిండో ఎవల్లకర్థం కాలే. అమ్మమ్మ – తాత వాళ్లు సచ్చివొయినప్పుడు వచ్చివొయిన మామ.. తిరిగి ఊరి ముఖం సూళ్లే.
మా అమ్మికి నేను, చెల్లెలు నాజియా ఇద్దరమే పిల్లలం. నాజియా పది చదివింది. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే నాజియా పెళ్లయి అత్తారింటికి వొయింది. పేదోల్ల సంతోషాలు సూసి కాలం గుడా ఓర్వదేమో అన్పిస్తది. చెల్లె పెళ్లయి ఏడాది గడవకముందే అబ్బు నడిపే ఆటోను లారీ గుద్ది, విధి అబ్బును మానుంచి దూరం చేసింది. పుట్టెడు దుఃఖంల మునిగివొయింది మా కుటుంబం. మా పక్కింటి నర్సమ్మ పెద్దమ్మనే మాకు పెద్ద దిక్కయింది. అబ్బు అంతిమ కార్యక్రమాలైందాక అమ్మకు దగ్గరుండి ధైర్యం చెప్తుండింది నర్సమ్మ పెద్దమ్మనే. మామ దూరపోనిలెక్కనే వచ్చివొయిండు. యాక్సిడెంట్ చేసిన లారీ పత్తా దొరకలేదు. అబ్బులేని బాధ ఒక దిక్కయితే.. అసలు బతుకుడెట్లా అనే గుబులు ఇంకో దిక్కు.
‘నూ పెద్ద సద్వులు సదివి గవర్నమెంటు కొలువు చేయాలె బేటా!’ అనేటోడు అబ్బు. అందుకే నాకు డ్రైవింగ్ నేర్పలే. చెల్లె పెళ్లికి అబ్బు చేసిన అప్పుంటే.. ఆటో అమ్మి తీర్చినం. ఇల్లు గడవడం కష్టమైంది. నేను కాలేజీ మానేసిన. అది తెల్సిన నా దోస్తులు మహేశ్, జార్జి ఇంటికొచ్చి..
“ఉమేర్! మాకు సదువబ్బక ఆటోలు నడ్పుకొంటున్నం! నూ మంచిగ సదూతవ్ గదరా! కాలేజీ మానెయ్యమాకు! నీకు డ్రైవింగ్ నేర్పించి లైసెన్స్ ఇప్పిస్తం! పార్ట్ టైం ఆటోలు నడుపుకొంట డిగ్రీ కంప్లీట్ జేస్కో!” అన్నరు.
నాకు కొండంత ధైర్యమొచ్చింది. వాళ్ల ఆటోలనే కాలేజీకి పోతూ వస్తూ డ్రైవింగ్ నేర్చుకున్న. డ్రైవింగ్ లైసెన్స్ వాళ్లే ఇప్పిచ్చింరు. బతుకు భయం వోయింది. నేనిప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్.
ఈ ఏడుగుడా నల్గొండల సాలానా ఇస్తెమా జరుగుతుంటే నేను వోయిన. ఆడ జుబేర్ మామ అగువడ్డడు.
“సలాం!” చేసిన.
“అమ్మి బాగుందా?” అనడిగిండు.
“మంచిగనే ఉంది మామ!” అన్చెప్పిన.
“ఏం పని చేస్తున్నవ్?” అనడిగిండు.
“డిగ్రీ ఫైనలియర్!” అన్చెప్పిన.
“చదువుకుంటున్నవా.. ఏ సబ్జెక్ట్?” అనడిగిండు.
“బీఎస్సీ కంప్యూటర్స్!” అన్చెప్పిన.
నమ్మకం కుదరక పక్కకు తీస్కవొయి..
“డిగ్రీ కంప్లీట్ చేసినాక ఏం చేయాలనుకుంటున్నవ్?” అనడిగిండు.
“లా చేయాలనుకుంటున్న మామ!” అన్న.
“ఎమ్మెస్సీ రిలెవెంట్ సబ్జెక్ట్ కదా?” అన్నడు.
“కరెక్టే మామా! కానీ, నేను సివిల్స్‌కు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న!” అన్న.
మామనోట ఇంకో ప్రశ్న రాలే.
మూడోరోజు ఇస్తెమా ముగిసినంక మామ కల్సి తన కార్ల వాళ్లింటికి విల్సుకవోయిండు. అది రెండంతస్తుల బిల్డింగ్. గేటు లోపట ట్రాక్టర్, వ్యవసాయ పనిముట్లున్నయి. ఇంట్లెకు వోయినం. కూకోమని లోపలికి వోయిండు మామ. కొద్ది సేపట్లనే అత్తమ్మ వచ్చింది.
“అమ్మి ఆరోగ్యం బాగుందా?” అనడిగింది.
“బాగానే ఉంది మామి!” అన్చెప్పిన.
మామగుడా వచ్చి నా పక్కనే కూకుండు. కొద్దిసేపటి తర్వాత టీ, స్నాక్స్ ట్రే వట్కొని ఓ అమ్మాయి వచ్చి.. టీపాయ్ మీద ట్రే వెట్టి నిలవడింది.
నేను జవాబిస్తూ ఆమె వైపు చూసిన. నా కళ్లు చెదిరి వోయినయి. ఎంత అందంగా ఉందో! వీనస్ అంటే ఇలాగే ఉంటుందేమో! ఆమె తిరిగి లోపలికెళ్లింది. ఆమె తన రెండో కూతురని, నీట్ కోచింగ్‌కు వెళ్తున్నదని, పెద్దమ్మాయి – అల్లుడు ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగులని చెప్పిండు మామ. ఆయినె చెప్తుంది వింటూ.. టీ తాగిన. కొద్దిసేపు గడిచినాంక..
“నేను బయలుదేర్తా మామ!” అన్న.
“పోయొస్తా!” అని అత్తమ్మకు చెప్పిన.
తన కార్లనే నల్గొండ బస్టాండ్ల దింపిండు మామ. మిర్యాలగూడ బస్సు రెడీగ ఉంది. ఎక్కి కూకున్న.
“అమ్మికి సలాం చెప్పు! వీలు చూసుకొని వస్తానని చెప్పు!” అన్నడు.
“చెప్త మామ!” అన్న.
నా సెల్ నెంబర్ తీస్కొని నా ఫోన్‌కు రింగ్ ఇచ్చి, ఫీడ్ చేసుకోమన్నడు. చేస్కున్న. బస్సు కదిలింది. మామలో ఏదో మార్పు కన్పడుతున్నది. అదేందో అర్థంకాలే. ఇంటికొచ్చేసరికి రాత్రి తొమ్మిది దాటింది.
పొద్దున లేసినాంక అమ్మితో నల్గొండలో జుబేర్ మామ కల్సి వాళ్లింటికి విల్సుకవోయిండని, వీలు సూస్కొని వస్తానన్నాడని చెప్పిన. అమ్మి బవు ఖుషీ అయింది. ఇది జరిగి మూడు నెలలైతున్నది.
నిన్న మామ ఫోన్ చేసి.. ఈ దినం వస్తున్నానని చెప్పిండు. గా ముచ్చట అమ్మికి చెప్పిన. తన అన్న ఎప్పుడొస్తడా!? అని ఎదురు చూస్తున్నట్లుంది అమ్మి.
“ఉమేర్.. ఉఠోనా!” అంటూ.. లేపుతున్నది మల్ల.లేసి ఫ్రెషప్పయి వచ్చి టిఫిన్ చేసి కూకున్న. టైం పదకొండైతుంది. ఇంతల్నే బయటి దర్వాజ తట్టింరెవరో. దర్వాజ కాడ ఏ సప్పుడైనా మామ వచ్చినట్లే ఫీలయితున్నది అమ్మి. వోయి దర్వాజ తీసిన. నన్ను నెట్టుకుంటూ మహేష్గాడు లోపలికొచ్చి..
“ఇగో చిన్నమ్మా! అమ్మ శివరాత్రి పండక్కు చేసిన పిండి వంటలు పంపింది!” అన్నడు చేతిలో సంచి అమ్మికందిస్తూ. అమ్మి సంచి తీస్కోని లోనికివోయింది.
“ఉమేర్.. నాకో చిన్న హెల్ప్ చేయాల్రా! మా పక్కింట్ల ఉండే జగదీశ్ సార్ ఎర్కే కదా? వాళ్ల మామకు బాగ లేదంట. వాళ్లది హుజూర్నగర్ పక్కన ఏదో పల్లెటూరంట! పండగకు ఇంటినిండా సుట్టాలొచ్చి ఉన్నరు! నేను ఆటోకు వోతే బాగుండదు! అందుకే నూ అర్జెంటుగ సార్ వాళ్లనక్కడ డ్రాప్ చేసి రావాల్రా!” అన్నడు మహేష్.
నేను సరేనని నిన్న పండక్కు కుంకుమ సల్లుకున్న ప్యాంటు షర్టే ఏస్కొని, అమ్మికి చెప్పి బయటవడ్డ.
జగదీశ్ సార్ వాళ్లను డ్రాప్ చేసి తిరిగొచ్చేసరికి రాత్రి ఎనిమిదైంది. జుబేర్ మామ వచ్చి ఇంట్లె ఉన్నడు.
“ఎంత సేపైంది మామా.. వచ్చి?” అనడిగిన.
“గంటైతుంది వచ్చి!” అన్నడు.
స్నానం చేద్దమని షర్ట్ ఇప్పుతుంటే షర్ట్ పైనున్న మరకల్ని సూసి..
“ఏంటా కుంకుమ మరకలు? కాలేజీలో ఎన్నికలేమైనా జరిగినయా?” అనడిగిండు మామ.
“లేదు! శివరాత్రి నాడు దేవుని ఊరేగింపులో దోస్తులతో కల్సి సల్లుకున్న కుంకుమ మరకలయ్యి!” అన్నది అమ్మి. జరగరాని ఘోరమేదో జరిగినట్టు అసహనంగా తల ఊపి..
“మన ముస్లిం పిల్లలకు పట్టుకున్న దరిద్రం ఇదే! కొంతైనా ‘దీన్’ గురించి తెలుసుకోవాలే! ఆచరించాలే! అప్పుడే చేసే పనిల బర్కత్ ఉంటది!” అన్నడు మామ.
అయి ఉత్త కుంకుమ మరకలు కావని, నా ప్రియ నేస్తాల తీపి గురుతులని, అయి ఏ మత డిటెర్జెంట్ బిళ్లతో ఉతికినా చెరిగిపోవని జుబేర్ మామకు తెలిసే అవకాశమే లేదు.
స్నానం చేసొచ్చిన. రాత్రి తొమ్మిదైతుంది. నర్సమ్మ పెద్దమ్మ దావత్ క్యారేజి తెచ్చిచ్చివొయింది. ప్రతి ఏటా శివరాత్రి ఎల్లిన మరుసటి రోజు నర్సమ్మ పెద్దమ్మనే దావత్ ఇస్తది. ఘుమఘుమలాడ్తున్న బగార అన్నం, యాటకూర వాసనకు నా ఆకలి రెట్టింపైంది. చాలా సేపట్కెల్లి ఎందుకో అమ్మి కిచెన్లనే ఉంది. నేను వొయి..
“ఆకలి దంచేస్తంది అమ్మి!” అన్న.
“మామ కోసం అన్నం ఖాగినా వండుతున్న బేటా! జరసేపాగు!” అన్నది అమ్మి. నేను ఆశ్చర్యవొయి..
“అదేందీ.. నర్సమ్మ పెద్దమ్మ క్యారేజి తెచ్చిచ్చింది కదా?” అన్న.
“ష్.. గట్టిగ అనకు! గుర్వయ్య పెద్దయ్య గప్పుడెప్పుడో ముడ్దార్ యాటకూర తీస్కవోతుంటే మామ సూసినడంట. అప్పటికెల్లి ఆ ఇంట్లె నుంచి ఏది తెచ్చిచ్చినా తినడు!” చెప్పింది అమ్మి.
“గుర్వయ్య పెద్దయ్య గప్పుడు ఎవల్లకోసం తీస్కవోయిండో ఏమో! నర్సమ్మ పెద్దమ్మ దర్గాలకు వోతది. ప్రతి జుమ్మాకు ఫాతెహాలిప్పిస్తది. వాళ్లు ముడ్దార్ తినరని నీకెర్కే కదా అమ్మీ! మామకు చెప్పకవొయినవా? పెద్దమ్మ వాళ్లకు సర్దార్ మామ మటన్ షాప్‌ల నేనే మటన్ తెచ్చిచ్చిన!” అన్న.
“ఇంగవోని! వండిన గదా!” అన్నది అమ్మి.
నా మనసెందుకో ఏదోలా అయింది. ఆటవిక దశలో జంతువులను వేటాడి తిన్న మనిషి, కులాలుగా మతాలుగా విభజించుకొని, వేష భాషలు మార్చుకొని, తోటి మనిషి ఆహారపు అలవాట్లను నిరసిస్తూ ద్వేషిస్తూ.. శెత్! ఏ శాశ్వత సుఖాలకోసం ఈ వెర్రి? ఇలా ఏవో ఆలోచిస్తూ ఉండిపోయిన. అమ్మి కిచెన్‌లోంచి వచ్చి ముందుగా మామకు వడ్డించింది. మామ తిని లేచాక నేను, అమ్మి తిన్నం. కొద్దిసేపటి తర్వాత..
“సాబెరా! మీతో ఓ మాట మాట్లాడి పోదమని వచ్చిన!” అన్నడు మామ.
“బోలో భయ్యా!” అన్నది అమ్మి.
“మాకు ఇద్దరు ఆడపిల్లలు.. మీకు తెలుసు కదా! పెద్దమ్మాయికి మీ వదిన తరఫు చుట్టాల సంబంధం చేసినం. చిన్నమ్మాయిని మన ఉమేర్కు ఇద్దామనుకుంటున్నం! ఈ విషయమే మీతో మాట్లాడి పోదమని వచ్చిన!” అన్నడు మామ.
మామ నోట ఊహించని మాట విన్న అమ్మి నా వైపు సూసింది. ఆ చూపులు తన లేగను ఎత్తుకపోటానికొచ్చిన పులిని చూసిన గంగిగోవు చూపుల్లెక్కున్నయి. అమ్మి ఏం మాట్లాడకుండా ఉండివొయింది.
“ఏం మాట్లాడ్తలేవు సాబేరా?” అడిగిండు మామ.
“నేనేం మాట్లాడ్త భయ్యా! మేము మీ తాహతుకు తగినోల్లం కాదు! మీరే ఇంకోపాలి ఆలోచించుకోరి!” అన్నది అమ్మి.
“బాగా ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నం సాబెరా! ఉమేర్ పెద్ద చదువులు చదవుతానంటున్నడు. దానికి బోలెడు ఖర్చు వస్తది. మీకంత ఆర్థిక స్తోమత లేదు! ఉమేర్ చదువుకయ్యే ఖర్చులు మేమే భరిస్తం! మా అమ్మాయి మెడిసిన్ చదువు పూర్తిచేస్తది. మన రెండు కుటుంబాల మంచి కోరే ఈ నిర్ణయం తీసుకున్నం!” అన్నడు మామ.
“నీ అల్లున్నే అడుగు భయ్యా! పిల్లనిచ్చేది నువ్వు. చేసుకునేది వాడు! వాని ఇష్టమే నా ఇష్టం!” లౌక్యంగా తప్పుకొన్నది అమ్మి. మామ నా వైపు సూసిండు.
‘ఇంత అదృష్టం కలిసి వస్తూంటే కాలదన్నుకుంటవా!?’ అన్నట్లున్నయి ఆ చూపులు.
“ఇప్పుడే కదా మామా.. నువ్వు చెప్పింది! కొంత టైమివ్వు. ఆలోచించుకొని చెప్తం! పన్నెండు కావస్తున్నది మామ! నిద్రొస్తున్నది.. పడుకుందాం!” అన్న.
మాది సిమెంటు రేకుల చిన్న ఇల్లు. రెండు గదులు, ఒక వంట గది ఉంటది. లోపట గదిలో ఒకటే మంచముంటది. ఆ గదిలో మామను పడుకోమని చెప్పి, ముంగటి గదిలో అమ్మి, నేను పడుకున్నం.
మామతో నిద్రొస్తున్నదని చెప్పిన గని.. పడుకున్నంక నిద్రొస్తలేదు. మామ కూతురే కండ్లల్ల తిరుగుతున్నది. ఎవరో గొప్ప శిల్పి చెక్కిన శిల్పంలా ఎంత అందంగా ఉందో! ఒకటే ఆలోచనలు. నిద్ర – మెలుకువ కాని స్థితి. అమ్మి వైపు చూసిన. మాటి మాటికీ పక్క మారుతున్నది. అమ్మి గుడా ఏదో ఆలోచిస్తున్నట్లున్నది. కంటికి కునుకు పట్టకుండానే తెల్లారింది.
మామ ఐదింటికే లేసిండు. ఫజర్ నమాజ్ సదువుకున్నడు. నేనూ, అమ్మిగుడా లేసి ఫ్రెషప్ అయినం.
ఇద్దరం టీ తాగినం.
“సాబెరా! మీరు ఎంత తొందరగా మీ నిర్ణయం చెప్తే అంత మంచిది! రెండు నెలల్లో పెళ్లి పెట్టుకుందాం! రెండువైపుల ఖర్చులు మేమే పెట్టుకుంటం! పెళ్లి గ్రాండ్గ చేద్దాం!” అన్నడు. అమ్మి తలొంచుకొని..
“సరే.. అట్టనే చెప్తంలే భయ్యా!” అన్నది.
నేను, మామ ఇంట్లె నుంచి బయటవడి బస్టాండ్ చేరుకున్నం. బస్సు గంట లేటుగ వస్తదని తెల్సింది.
కొద్దిసేపటి తర్వాత..
“ఉమేర్! నువ్వు కష్టపడి చదువుకుంటున్నవ్ బాగనేవుంది గని, ఈ నాన్ ముస్లిం దోస్తానా జర తగ్గిస్తె మంచిగుంటది!” అన్నడు మామ.
మామ మాటల్లోని తత్వం నాకర్థమైంది. నేనింకా మేనల్లున్నే. ఇంటి అల్లున్ని కాకముందే మామ నాపై ఆంక్షలు విధిస్తున్నట్లు అన్పించింది. నేను విన్న ఇస్తెమాల్లో మౌల్వీలు, ముఫ్తీలు గుడా అన్ని మతస్తుల వారితో మమేకమై.. గంగా జమున తహెజీబ్ లెక్కనే కలిసిమెలిసే ఉండాలంటరు. కానీ, మామ ఎందుకిలా మాట్లాడుతున్నడో అర్థమైతలేదు.
“హిందు దోస్తులెంట తిరిగితే అల్లా నారాజ్ అయితడా మామ?” అనడిగిన.
“అలా అని కాదు! హిందూ దేవుళ్ల ఊరేగింపులకు కుంకుమ జల్లుకొని ఊరేగడం మన ముస్లిం ధర్మం ఒప్పుకోదు!” అన్నడు మల్ల.
“సారీ మామ! మనమున్న సమాజంలో గిరిగీసుకొని బతకడం కుదరదు! మనది కలివిడి సమాజం మామ! ఒకరి ధర్మాన్ని ఒకరు గౌరవించుకుంటూ, కలిసిమెలిసే బతకాలి! ఓ మాట చెప్త విను మామ! చెల్లెలికి పెళ్లి చేసినాంక మాకు అప్పులైనయి! ఇంట్లె పూట గడవడమే కష్టమైంది! అప్పుడే కరోనా వచ్చింది! మా పక్కింటి నర్సమ్మ పెద్దమ్మ మమ్ముల ఒక్కపూట గుడా పస్తులు పడుకోకుండ ఆదుకుంది! మా అబ్బు హిందు దోస్తులు కూడా ఎంతో సహాయం చేసింరు! ఒకవేల వాళ్లు మనకెందుకులే అనుకొని ఉంటే.. మా పరిస్థితి ఏమయ్యేదో ఓసారి ఆలోచించు!” అన్న.
“కావచ్చు! నేను కాదనను! కానీ, నీకు తెలీని దైవిక సత్యం ఒకటుంది! అదేంటంటే మనకు అవసరమైన రిజఖ్ను అల్లాయే నిర్ణయిస్తాడు. అది ఎవరి ద్వారా మనకు చేరవేయాలో అల్లానే చేరవేస్తాడు! మీ అబ్బు నాన్ ముస్లిం దోస్తుల ద్వారా, నర్సమ్మ ద్వారా అల్లా మీ రిజఖ్ మీకు చేర వేసిండు అంతే! ఇందులో వాళ్ల గొప్పతనమో.. త్యాగమో ఏమీ లేదు!” అన్నడు మామ.
“ఒప్పుకొంట మామ! వాళ్లు వాళ్ల దేవుళ్లకు, దేవతలకు పెట్టుకొని.. యాటలు, కోళ్లు బలిస్తరు! ముడ్దార్ తింటరు! మా రిజఖ్ను ముడ్దార్ తినేటోళ్ల ద్వారా అల్లా ఎందుకు పంపినట్టూ? మీలాంటి పవిత్ర నమాజీల ద్వారా ఎందుకు పంపలేదు?” అనడిగిన.
మామ ఖంగుతిని సమాధానం చెప్పలేకవొయిండు.
“రాత్రి నర్సమ్మ పెద్దమ్మ తెచ్చిచ్చిన దావత్ అన్నం నువ్వు తినలేదు! నాకు బాధేసింది మామ! మన నమ్మకాలు మనవే.. కాదనను. ఒకటడుగుతా చెప్పు! నీ తలకు పెట్టుకున్న టోపి, కాళ్లకేసుకున్న చెప్పుల వరకు ఎవరి చేతి ఉత్పత్తులో నీకెర్కేనా? మన దేశ జనాభాలో హలాల్ తినేవాళ్లు పద్దెనిమిది శాతం మంది ఉంటే, ఎనభై శాతం పైచిలుకు ముడ్దార్ తినేవాళ్లే ఉంటరు! మనం తినే ఆహార పదార్థాల ఉత్పత్తిలో, ఔషధాల ఉత్పత్తిలో, సేవల రంగంలో.. ఇట్లా చెప్పుకొంటూ పోతే ప్రతి రంగంలోనూ ఎనభైశాతం మంది ముడ్దార్ తినేవాళ్ల శ్రమ, నైపుణ్యమే ఉంటది. వాటి వినియోగం మానేయగలమా? ఇక హలాల్ తినేవారి శ్రమ, ఉత్పత్తులను వినియోగించకుండా.. సోకాల్డ్ హిందూ వేర్పాటువాద భావజాలం కలవారు మనగలుగుతారా? ఎవరు తినేదైనా ఆహారమే మామ! సమష్టి శ్రమ, ఉత్పత్తి, వినియోగంతోనే సమాజం మనగలుగుతుంది! ఇదే ప్రాపంచిక సత్యం! పరమత సహనం లేనివారు, సాటి మనిషి ఆహారపు అలవాట్లను ద్వేషించేవారు నా దృష్టిలో అజ్ఞానులు మామా!” అన్న.
మామ విస్మయంగా నా వైపే చూస్తుండు.
ఇంతల్నే బస్సు వచ్చి ఆగింది. మామ ఎక్కి కూకుండు. పెళ్లి విషయంలో నా అభిప్రాయాన్ని రాసి పెట్టుకున్న చీటి. బస్సు కదిలేటప్పుడు మామ చేతికిచ్చిన. బస్సెళ్లిపోయింది.
తిరిగి ఇంటికొచ్చిన.
“మామ ఎలివోయిండా బేటా?” అనడిగింది అమ్మి.
ఆ మాటల్లో ఏదో దుఃఖపు జీర.
“ఆ.. ఎలివోయిండు!” అని అమ్మి కండ్లవైపు చూసిన.
ఉబికి ఉబికి వస్తున్న కన్నీళ్లను దాచే ప్రయత్నం చేస్తున్నది అమ్మి. కొడుకు నిర్లక్ష్యానికి గురై.. నానా గోసవడి చచ్చిన అమ్మమ్మ – తాత యాదికొచ్చి ఉంటరేమో? నేను దగ్గిరకువొయి అమ్మి ఒళ్లో చిన్న పిల్లాడిలా పడుకొని ఆమె కళ్లు తుడిచి..
“అమ్మీ! నాకు మేనమామ సాలు రాలే! మామ మన పేదరికంతో రిశ్తే ఎప్పుడో తెంపుకొన్నడు! అనుబంధాలనేవి డబ్బుతో కొనేవి కావని మామకు తెలుస్తలేదు! నా చదువుకు పెళ్లి ఆటంకం కాకూడదనుకొన్న. అందుకే మామకు తన కూతురితో పెళ్లికి ‘సారీ’ చెప్పి వచ్చిన!” అనేసరికి అమ్మి ఆశ్చర్యవొయింది.
బస్సు కదిలేటప్పుడు నేను మామ చేతికిచ్చిన చీటి అదే.
సౌదికి వోయి జుబేర్ మామ రెండుసార్లు ‘హజ్’ చేసి వచ్చినడంట. కానీ, నేను ప్రతిరోజూ అమ్మి రెండు కండ్లల్లో.. ‘మక్కా – మదీన’ లను చూస్తుంట.
సయ్యద్ గఫార్
ప్రేమానుబంధాలకు కులం, మతం అడ్డుకాదనీ.. డబ్బుతో బంధాలను బలపర్చలేమని ‘రిశ్తే’ కథ ద్వారా సమాజానికి చాటారు రచయిత సయ్యద్ గఫార్. ‘కథ’కు సామాజిక ప్రయోజనం ఉండాలని ఆశించే రచయిత ఈయన. ఆ ఆశయంతోనే 1973 నుంచీ కథలు రాస్తున్నారు. ఈయన స్వస్థలం నల్లగొండ జిల్లా వాడపల్లి. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఎనిమిదేళ్లపాటు ‘పంచాయతీ రాజ్ లీడర్’ స్థానిక సంస్థల విశ్లేషణ మాస పత్రికను నడిపించారు. స్టేజీ నాటకాల్లో నటన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీపీఠం ఇప్పటివరకూ నిర్వహించిన అన్ని కథల పోటీలలోనూ బహుమతులు గెలుచుకున్నారు. రెండుసార్లు కన్సొలేషన్ బహుమతులు, ఒకసారి విశిష్ట, మరోసారి ప్రత్యేక బహుమతి పొందగా.. ఇప్పుడు ‘రిశ్తే’ కథకు తృతీయ బహుమతి దక్కించుకున్నారు. 2017లో ‘జనన వాంగ్మూలం’ అనే కవితా సంపుటిని తెచ్చారు. ప్రస్తుతం ‘ఖుర్బాని’ కథల సంపుటి ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్నది.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో తృతీయ బహుమతి రూ.10 వేలు పొందిన కథ.
–సయ్యద్ గఫార్
81432 53116