నేను ఇంటర్ సెకండ్ ఇయర్‌కు వచ్చేసరికి మా కజిన్ వకుళ కూడా ఘనపూర్‌లో టెంత్ పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు వచ్చింది. తను వాళ్ల మేనమామ ఇంట్లో ఉండి చదువుకునేది. వాళ్లిల్లు నారాయణగూడా, హిమాయత్ నగర్ మధ్యలో.. తాజ్ మహల్ హోటల్ పక్క సందులో.. ఎప్పుడూ వచ్చిపోయేవారితో సందడిగా ఉండేది.
నేనుండే ఇంటి నుండి ఆ ఇల్లు.. అప్పటి నా వయసుకి చాలా తేలిగ్గా నడవగలిగే దూరమే. చిన్నప్పట్నుంచీ పక్కపక్క ఇళ్లలో పెరిగిన వాళ్లం, ఓకే స్కూల్లో చదివిన వాళ్లం, పైగా కజిన్స్‌మి. తనను రోజూ కలవొచ్చని సంబరపడ్డాను. కానీ, అదంత తేలిక కాదని అర్థమయింది. ఎందుకంటే.. నా అంచనాలకు విరుద్ధంగా అక్క మా కాలేజీలో కాకుండా రామ్ కోఠిలోని వనితా మహా విద్యాలయలో చేరింది. నిజానికి వాళ్లింటికి మా కాలేజీ దగ్గర. అయితే అప్పట్లో ‘రెడ్డి కాలేజీలో సీటు రావాలంటే ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయితేనే వస్తుంది’ అనేవారు. అందుకని రాలేదేమో అనుకున్నాను. కానీ, “రెడ్డి కాలేజీ ఇదివరకటి స్టాండర్డు లేదట. ఇప్పుడు బాగలేదని నాన్న ఒద్దన్నడు” అంది వకుళక్క. తను ఇంటెలిజెంటే. ఈ కాలేజీ వద్దనుకునే ఇక్కడ చేరనట్టుంది అనుకున్నా, ‘అయ్యో! మేమిద్దరం ఒక జట్టుగా ఉండేవాళ్లమే!’ అనిపించింది.
తను ఎందుకో గానీ, నేనుంటున్న నారాయణగూడా ఇంటికి ఎక్కువగా వచ్చేది కాదు. అడపాదడపా వచ్చినా, ఇక్కడ ఏమీ తినేది కాదు. అందుకు నాయనమ్మ చాలా ఫీలయ్యేది. నేను వాళ్లింటికి వెళ్లి రాగానే.. “అక్కడ ఏం తిన్నవే?” అని నాయనమ్మ అడిగేది. నేను ఏదైనా తిని వచ్చినపుడు ఆ మాట చెప్పేదాన్ని. “అది మనింట్లో తినదు గానీ, నువ్వు తిని ఒస్తవా?” అని నాయనమ్మ అంటుంటే.. ఏం జవాబు చెప్పాలో నాకు తెలిసేది కాదు. అలా అని ఓసారి వకుళక్కను కారణం అడిగితే.. “మా నాన ఎవరింట్ల ఏం తినొద్దన్నడు” అని చెప్పింది. “వీళ్లు ఎవరు ఎందుకైతరు? నీకు నాయనమ్మ, చిన్నాయనలే కదా!” అన్నాను. “ఏమో! నాన చెప్పింది ఇనాలె గద!” అంది. నేనింకో ప్రశ్న వేయలేకపోయాను.
మామూలు రోజుల్లో నా కాలేజీ వేరు, తనది వేరు. ఆదివారాల్లో అప్పుడప్పుడూ నేను వకుళక్క దగ్గరికి వెళ్లేదాన్ని. వాళ్లింట్లో అందరూ నాతో బాగానే మాట్లాడేవారు. కానీ, ఆ కాంపౌండ్‌లో వాళ్ల మామయ్య ఇల్లుతో పాటు, అత్తయ్య వాళ్ల పుట్టిల్లు పెద్ద బంగళా ఉండేది. నేనెప్పుడు వెళ్లినా ఈ ఇంట్లోనో, ఆ ఇంట్లోనో రెండిళ్ల ఆడవాళ్లూ మాట్లాడుకుంటూ ఉండేవారు. సినిమాలు, షికార్లు, బట్టలు, నగలు, బంధువులు.. ఇలా ఎన్నో విషయాలు దొర్లేవి. నాకు వాటి తలా తోకా తెలియదు, ఆసక్తీ ఉండేది కాదు. వకుళక్క, నేను విడిగా మాట్లాడుకునే అవకాశం దొరికేది కాదు. అప్పుడప్పుడూ ప్రేమ చిన్నమ్మ.. అంటే వకుళక్క వాళ్లమ్మ హైదరాబాద్‌కు వచ్చి రోజులకొద్దీ ఉండేది.
చాలాసార్లు నేను వెళ్లేసరికే వాళ్లంతా ఎటో వెళ్లడానికి బయల్దేరుతూ సిద్ధంగా ఉండేవారు. సినిమాకో, షాపింగ్‌కో, హోటల్‌కో.. వకుళక్కతో సహా! అలాంటప్పుడు నేను వెళ్లడం వాళ్లకూ, నాకూ కూడా ఇబ్బంది కలిగించేది. “ఒస్తవానే?” అనేది వకుళక్క. వాళ్లందరితో నేనేం వెళతాను? నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. వాళ్ల దగ్గర తీసుకోనూ లేను. “ఏ.. ఉత్తగనే నిన్ను కలుద్దామని ఒచ్చిన! నేను ఇంకో రోజు ఒస్తలే. నువ్వు పో!” అని వెనక్కు తిరిగేదాన్ని.
ఒకసారి ఇంటర్ కాలేజీ వ్యాసరచన పోటీలకు నవజీవన్ కాలేజీకి వెళ్లినప్పుడు వకుళక్క కలిసింది. “ఇక్కడ మాకు తెలుగు ఎవరు జెప్తరు తెల్సా?” అన్నది. “నాకెట్ల తెలుస్తది?” అన్నాను. “ సి.ఆనందారామం అని కథలు, నవలలు రాస్తరు చూడూ.. ఆమెనే!” అన్నది. “అబ్బ! నువ్వెంత లక్కీనే! ఆమెను రోజూ చూస్తవు! ఆమె స్వాతి మంత్లీల ‘మమతల కోవెల’ అనే నవల రాసిన్రు. దాన్ని జయసుధ హీరోయిన్గ ‘జ్యోతి’ అనే సిన్మాగ తీస్తే మస్తు హిట్ అయింది” అని నేను చాలా ఎక్సైట్ అయ్యాను.
అయితే నాకు చాలా రోజులదాకా ప్రముఖ రచయిత్రి, పరిశోధకురాలు ముదిగంటి సుజాతారెడ్డి గారు మా కాలేజీలో పనిచేస్తారనీ, ఆమె కూడా బోలెడు కథలూ, నవలలూ, ఆత్మకథ కూడా రాసారనీ తెలియదు. ఎందుకంటే ఆమె తెలుగు బోధించేవారు, నేను సంస్కృతం తీసుకున్నాను. అప్పట్లో తెలంగాణ, ఆంధ్రా భేదాలు అంతగా లేవో, లేక నాకు తెలియదో గానీ.. ఎందుకో మాదిరెడ్డి సులోచన, పోల్కంపల్లి శాంతాదేవి గార్లకు వచ్చిన ఆ కాస్త పేరు కూడా మిగతా తెలంగాణ రచయిత్రులకు రాలేదని తరువాత రోజుల్లో అనిపించింది.
రెండ్రోజుల తర్వాత నాకు వచ్చిన మొదటి బహుమతి నవజీవన్ కాలేజీ ప్రిన్సిపాల్తోబాటు ఆనందారామం గారి చేతుల మీదుగా తీసుకున్నాను. అయితే, అప్పుడు కెమెరా లేదు గనుక ఆ ఫొటో నా దగ్గర లేదు. మొత్తానికి వకుళక్క హైదరాబాద్‌కు వచ్చినా తనను తరచూ కలుసుకోవడం గానీ, మనసులో మాటలు పంచుకోవడం గానీ కుదిరేది కాదు. ఎప్పటిలా వారానికో, రెండు వారాలకో పద్మ చిన్నమ్మ వాళ్లింటికి వెళదామంటే నేను ఎండకాలం సెలవుల్లో ఊరికి వెళ్లి వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్లో చేరేసరికి.. వాళ్లు గౌలీగుడాలోని ఇల్లు వదిలి వేరే ఇంటికి వెళ్లిపోయారు. అది చాలా దూరం. నేను మునుపటిలా వారానికో, రెండు వారాలకో వెళ్లేలా లేదు.
ఓసారి మళ్లీ లక్ష్మి, హైమక్క కలిసి వచ్చి నన్ను వాళ్లింటికి తీసుకెళ్లారు. చార్మినార్ దాటి అవతల ఇంకా వెళితే హరిబౌలి బేలా చౌరస్తా మూల మీద ఉన్న పెద్ద దేవిడీ అది. ముందు పెద్ద జాగాతో, గుల్ మొహర్ చెట్లతో, ఫౌంటైన్తో ఉన్న తెల్లటి రాజభవనం లాంటి ఇల్లు. ముందు పోర్టికో, చుట్టూ కారిడార్, గుండ్రంగా ఉన్న గోల్ గుంబాజ్ లాంటి గది, టేకు కర్ర మెట్లు, పెద్ద హాల్స్, విశాలమైన రూమ్స్‌తో, పైన ఇంకో అంతస్తులో కూడా హాల్స్, గదులు, ఆ పైన టెర్రస్, రూఫ్ గార్డెన్ ఉన్నాయి.
కార్ షెడ్స్, సర్వెంట్ క్వార్టర్స్, పొగడ, పొన్న వంటి చాలా చెట్లు, వెనక కూడా పెద్ద జాగాతో అందంగా ఉన్న అలాంటి ఇంటిని.. నేను సినిమాల్లో తప్ప చూడలేదు. వాళ్లు ధనవంతులని తెలుసు గానీ, అంత అనుకోలేదు.
“మరి అంత సెంటర్ల ఉన్న ఇల్లు ఇడిచిపెట్టి ఇంత దూరం ఎందుకు ఒచ్చిన్రక్కా?”.. నిజంగానే నా అమాయకత్వం, బాధ కలగలిసి అడిగాను. “తర్వాత చెప్తా!” అన్నది హైమక్క.. నోటి మీద వేలుంచుకుని. మళ్లా నేనెప్పుడూ అడగనూ లేదు, తను చెప్పనూ లేదు. కానీ, ఓ రాజకీయ నాయకుడు, ఓ పైరవీకారు, మరొకరు వాళ్లను బాగా మోసం చేసి డబ్బులు కాజేశారనీ, అప్పులు ఎక్కువ అవడం వల్లనే వాళ్లు గౌలీగూడాలోని మూడంతస్తుల ఇల్లు అమ్మేసి ఇక్కడికి వచ్చారని చాన్నాళ్లకు తెలిసింది.
నేను అక్కడికి వెళ్లాలంటే నారాయణగూడా వైఎంసీఏ దగ్గర సిటీ బస్సెక్కి, చార్మినార్ వద్ద దిగి అక్కడి నుండి ఓ రిక్షా మాట్లాడుకుని బేలాకు వెళ్లాల్సి వచ్చేది. అది ఖర్చు, శ్రమ కూడా! ఏదేమైనా నేను తరచు వెళ్లి సేదతీరే ఒక గూడు దూరమైనందుకు మనసులోనే ఎంతో బాధపడ్డాను.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి