భువనగిరి అర్బన్, జూన్ 11 : పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ప్రతీ ఒక్కరు బాధ్యతగా భావించాలని యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి టి.నాగిరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని యాక్షన్ ఎయిడ్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని వెటర్నరీ శాఖ మీటింగ్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పర్యావరణాన్ని రక్షించాలనే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ టి.నాగిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి పీవీ.రమణారెడ్డి, జిల్లా వెటర్నరీ అండ్ యానిమల్ అస్బెండరీ అధికారి డాక్టర్ కె రమేశ్ మాట్లాడుతూ వ్యవసాయరంగంలో రసాయనాలను క్రమంగా తగ్గించి సేంద్రీయ ఎరువులు వాడటం అవసరమన్నారు. రోజు రోజుకు ప్లాస్టిక్ వాడకం పెరిగిపోవడం బాధాకరమని ప్లాస్టిక్ సంచులు, కవర్లు వాడిన తర్వాత గడ్డిలో వేయడం వల్ల పశువులు, మూగ జీవాలు తినడం వల్ల వాటి ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తుందన్నారు. రసాయనాల నియంత్రణ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ప్రతీ ఒక్కరు భాద్యతగా తీసుకోవాలన్నారు.
యాక్షన్ ఎయిడ్ ప్రోగ్రామ్ లీడ్ డాక్టర్ ఇర్ఫాన్ మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాల వల్ల వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం ఉంటుందని తద్వారా ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్నారు. పర్యావరణ మార్పుల వల్ల భూమి వేడేక్కడం, భూగర్భ జలాలు అడుగంటడం, అడవులు క్రమంగా తగ్గిపోవడం వంటి పరిస్థితులను చూస్తున్నామని భవిష్యత్ చాల ప్రమాదకరంగా ఉంటుందని ఇందుకోసం ప్రతిఒక్కరు సామాజిక భాద్యతగా పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుకోవాలన్నారు. ఇందుకోసం యాక్షన్ ఎయిడ్ పని చేస్తున్న ప్రాంతాల్లో గ్రామ స్థాయి నుండి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హ్యూమన్ రైట్స్ డిఫెండర్ సురుపంగ శివలింగం సమన్వయం చేయగా ఎల్ఆర్పీ ప్రతినిధులు, వివిధ సంస్థల నాయకులు బట్టు రామచంద్రయ్య, కె.శ్రీశైలం, వినోద్, ఎల్ఆర్పీ ప్రతినిధులు జె.కవిత. టి.చంద్రకళ, అనూష, శిరీష పాల్గొన్నారు.