న్యూఢిల్లీ: డిజిటల్ న్యూస్ మీడియా న్యూస్‌క్లిక్(Newsclick)తో పాటు ఆ ఫ్లాట్‌ఫామ్ వ్యవస్థాపకుడు ప్రభిర్ పుర్కయస్తపై నమోదు అయిన మనీల్యాండరింగ్ కేసును ఢిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది. అక్రమ రీతిలో న్యూస్‌క్లిక్‌లో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. షేర్ విలువలను అధికంగా చూపించి, అమెరికాకు చెందిన ఓ సంస్థ నుంచి అధిక మొత్తంలో నిధులను సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ కేసులో ఈడీ విచారణ చేపట్టింది. ఇక మే 29వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఆ కేసులో తీర్పును ఇచ్చింది. ఆర్థిక నేరాల విభాగం కింద నమోదు అయిన ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తూ జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఆ సంస్థపై నమోదు అయిన అన్ని ఫిర్యాదులను అంగీకరించినా, కేసులో కీలకమైన అంశాలను తేల్చలేకపోయినట్లు హైకోర్టు చెప్పింది.
ఐపీసీ చట్టాల ప్రకారం ఎటువంటి ఉల్లంఘన జరగలేదని కోర్టు పేర్కొన్నది. 406, 420 కింద ఉల్లంఘనలు జరగలేదని కోర్టు వెల్లడించింది. ఈ కేసులో సుమారు ఏడాదిన్నర పాటు ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఉద్యోగులకు సమన్లు జారీ చేసింది. కానీ ఎటువంటి ఆధారాలను ఈడీ సమకూర్చులేకపోయినట్లు తెలుస్తోంది. ఎఫ్‌డీఐ నియమావళిని ఉల్లంఘిస్తూ పీపీకే న్యూస్‌క్లిక్ స్టూడియో విదేశీ నిధులను మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఐ అండ్ బీ శాఖ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2020 ఆగస్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
న్యూజ్క్లిక్ సంస్థకు 10 కోట్ల వరకు ఎఫ్‌డీఐ అందినట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన వరల్డ్‌వైడ్ మీడియా హోల్డింగ్ ఎల్ఎల్సీ సంస్థ ఆ డబ్బును ట్రాన్స్ఫర్ చేసింది. దీంతో ఈడీ మనీల్యాండరింగ్ కేసును నమోదు చేశారు. కానీ ఒప్పందం ప్రకారమే వరల్డ్‌వైడ్ మీడియా హోల్డింగ్స్ సంస్థ .. న్యూస్‌క్లిక్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లు తేలింది. దీంతో ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్లో ఎటువంటి ఉల్లంఘనలు జరగలేదని కోర్టు స్పష్టం చేసింది.