HomeStoriesRamayanam By Writer Nellutla Ramadevi 29 09 2024
Ramayanam | భూ.. భూ.. భూకంపం!
ఎండకాలం.. సాయంత్రం దాటి రాత్రి అడుగుపెడుతున్న సమయం. మా ఇంటి వాకిట్లో ఎప్పటిలాగానే నీళ్లు చల్లి.. నులక మంచాలు, వాటిమీద దుప్పట్లూ పరిచారు.
ఎండకాలం.. సాయంత్రం దాటి రాత్రి అడుగుపెడుతున్న సమయం. మా ఇంటి వాకిట్లో ఎప్పటిలాగానే నీళ్లు చల్లి.. నులక మంచాలు, వాటిమీద దుప్పట్లూ పరిచారు. ఆరోజు నేనూ, నాన్న ఏడింటికే అన్నం తినేసి.. ఎవరి మంచంపైన వాళ్లం పడుకున్నాం.
అప్పటికి మూడు రోజులైంది.. అక్క మా చిన్న మేనత్తవాళ్ల ఊరికి వెళ్లి. ఆడుకోవడానికి అక్క లేదనే బెంగ కలిగింది. మంచంలో పడుకొని ఆకాశంలో నక్షత్రాలను లెక్కబెడుతూ.. నాన్నను ఏవో పనికిమాలిన ప్రశ్నలు అడుగుతున్నాను. నాన్న ఏ మాత్రం విసుక్కోకుండా జవాబులు చెబుతున్నాడు. అమ్మ, నానమ్మ వంటింట్లో అన్నాలు తింటున్నారు. అప్పటికే రాములు వచ్చి పశువుల దొడ్డిలో బర్రె పాలు పిండుతున్నాడు.
ఇంతలో అకస్మాత్తుగా పెద్ద శబ్దం! మేము ఎటో కదిలి పోతున్నట్టుగా అనిపించింది. కరెంట్ పోయినట్టుంది. స్ట్రీట్ లైట్ ఆరిపోయింది. మేఘాలు ఉరిమినట్టూ, కొండలు విరిగిపడ్డట్టూ, సముద్రాలు పొంగినట్టూ.. ఒకటే చప్పుడు! దెబ్బకు లేచి, మంచంలోనే కూర్చుని చెవులు మూసుకున్నాను. హైద్రాబాదులో చూసిన లవకుశ, మాయాబజార్ సినిమాల్లో యుద్ధాలప్పుడు చూసినట్లుగా చాలా పెద్దగా చప్పుడైంది. ఉన్నట్టుండి పక్క మంచం వచ్చి.. నేను పడుకున్న మంచానికి దడదడా కొట్టుకుంది.
అలాగే నానమ్మ పడుకునే మంచం కూడా.. పక్కనున్న మరో మంచానికి కొట్టుకుంటూ.. టక్కుటక్కుమని చప్పుడు చేస్తున్నది. చూస్తే అక్కడ ఎవరూ లేరు. దయ్యాలు, భూతాల సినిమాల్లోలా మంచాలు వాటికవే కొట్టుకుంటున్నాయి. మాయాబజార్ సినిమాలో తల్పం ఉన్నట్టుండి గిల్పం అయి బోర్లా పడ్డట్టు.. ఈ మంచాలెందుకు ఇలా కొట్టుకుంటున్నాయో నాకు అర్థం కాలేదు. ఇక వంటింట్లోంచి గిన్నెలు, కంచాలు, బిందెలు అమాంతం కింద పడ్డట్టుగా పెద్ద చప్పుళ్లు వినిపించాయి. నాన్న మంచంలోంచి గబుక్కున లేచి, దర్వాజా దాకా పరిగెత్తి ఇంట్లోకి విన్పించేలా.. “దబ్బున బయటికి రాండి. చేతులు కడుక్కోకుంటె మానె! దబ్బున ఉరికి రాండి, భూకంపం ఒచ్చేటట్టున్నది!” అని అరిచాడు. అమ్మా, నాన్నమ్మ బయటికి వచ్చేలోపునే.. మళ్లీ నాన్నకు ఏం గుర్తొచ్చిందో ఏమో.. పశువుల కొట్టం దగ్గరికి పరిగెత్తుకు వెళ్లాడు. అప్పటికే ఆవులు, ఎద్దులు, బర్రెలు ‘అంబా’ అని అరుస్తున్నాయి. గుంజలకు కట్టేసి ఉన్న పశువులన్నీ పలుపు తాడు తెంపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి.
ఇంతలో పాలు పిండుతున్న రాములు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి.. “అయ్యా! గిప్పుడే పాలు పిండి పట్టుకస్తాంటె ఎవలో నూకేశినట్టు అయింది. నా చేతుల చెంబు అమాంతం కిందపడ్డది. నేనూ ఎవలో తోసేసినట్టు పడ్డ. పాలన్నీ కిందబోయినయి!” అని చెబుతూ వణికిపోతున్నాడు. నాన్న వెంటనే.. “మొదలు రేకుల కొట్టంల ఉన్న గొడ్ల తలుగులు ఇప్పుదాం పా!” అంటూ తనుకూడా పరిగెత్తి రాములుతోబాటు కలిసి పశువుల తాళ్లన్నీ గబగబా విప్పేశాడు. ఈలోగా అమ్మ వచ్చి నన్ను దగ్గరికి తీసుకుంది. నానమ్మ కూడా ఎన్నడూ లేనిది పరిగెత్తి వచ్చింది.
ఇంతలో ఊర్లో కొందరు ఆసాములు దుడ్డుకర్రలు పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. “అయ్యా! ఎవరన్న దొంగలు వచ్చిండ్రా? ఏమన్నా అయిందా? ఏందో బాగ సప్పుడు అయితాంది. ఊరంత ఎవలో ఉరికినట్టు ఇనబడ్డది” అని నాన్నను అడిగారు. అప్పటికి మంచాలు కొట్టుకోవడం, హోరుమనే శబ్దాలు తగ్గిపోయినాయి. నాన్న వాళ్లతో.. “ఏం భయపడకండి. భూకంపం ఒచ్చింది. మీ ఇళ్లకు పోండి. కాకపొతే జాగ్రత్త. ఇండ్లల్ల ఎవ్వరు ఉండకండి, ఒకవేళ మళ్ల ఒస్తే రావచ్చు!” అని చెప్పాడు. “గట్లనా!? మన ఊరి మీదికి దొంగలు గిట్ల పడ్డరు గావచ్చు అనుకుంటానం. గీ బూకంపం అంటె ఏందయ్యా?!” అని వాళ్లు ఆశ్చర్యపోతూ అడిగారు. అప్పుడు నాన్న వాళ్లకు వివరించి చెప్పాడు. ఇక నానమ్మకు అమ్మకు మళ్లీ వంటింట్లోకి వెళ్లాలంటేనే భయమేసింది. నేను కాసేపటికి నిద్రపోయాను గానీ.. నాన్న, అమ్మ మళ్లీ భూకంపం వస్తుందేమోనని ఆ రాత్రంతా నిద్రే పోలేదట.
మాది చాలా పాత ఇల్లు. కట్టి అప్పటికే దగ్గర దగ్గరగా వంద సంవత్సరాలు అయి ఉండవచ్చని నాన్న చెబుతూ ఉండేవాడు. ఆ మర్నాడు ఇంట్లోకి వెళ్లి చూస్తే.. రెండుమూడు దూలాలు పూర్తిగా వంగిపోయి, వాసాలు ఒకటి రెండు విరిగి కిందపడి ఉన్నాయి. నాన్న ఏమాత్రం కంగారు పడకుండా వడ్రంగులను పిలిపించి.. ఆ దూలాలకు సపోర్టుగా పొడవాటి గుంజలు ఏర్పాటు చేయించాడు. “పాత ఇల్లు గదా.. దీన్ని పడగొట్టి కొత్తిల్లు కట్టుకోండి దొరా!” అని ఊరివాళ్లు ఎప్పుడూ చెబుతుండేవారు. అయినా కూడా మేము ఆ ఇంట్లోనే ఇంకో పదేళ్లు ఉన్నాం.
అయితే నాకు ఒకపక్కన అక్క దగ్గరలేదనీ, తనకు ఎంత భయం అయిందోననీ, తనతో ఈ విషయం పంచుకోవాలనీ, మరోపక్క ఆ ఊర్లో కూడా ఇలాగే భూకంపం వచ్చిందా!? వేరేలాగా వచ్చిందా!? అని తెలుసుకోవాలనీ అనిపించింది. నాన్న మర్నాడే ఒక ఉత్తరం రాసి.. ఓ మనిషికి బస్సు చార్జీలు ఇచ్చి అమ్మాపురం పంపాడు. ఆ మర్నాడు మనిషి వచ్చి అందరూ బాగానే ఉన్నారని చెప్పేదాకా.. నాన్న పైకి చెప్పకపోయినా ఎంతో కంగారు పడి ఉంటాడు. అమ్మ సరేసరి! ‘ఈ సమయంల పిల్ల దూరంగ ఉండె. భయపడ్డదో ఏమో!’ అని ఎన్నోసార్లు అనుకుంది.
ఆ మర్నాడు వార్తల సమయానికి మేమందరం రేడియో చుట్టూ కూర్చొని ఎంతో ఆసక్తితో వార్తలు విన్నాం. తీరా ఆ సంగతి రెండే నిమిషాల్లో చెప్పారు. ‘నిన్న రాత్రి ఏడుగంటలకు మహారాష్ట్రలో భూకంపం వచ్చింది. ఈ భూకంపం ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని దక్కనులో కనిపించింది. భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులయ్యారు!’ అని విన్నాక.. నాకు భూకంపం వచ్చిందన్న భయం కన్నా.. ‘మన దగ్గర జరిగిన విషయం వార్తల్లో వచ్చిందే!’ అని చెప్పరానంత థ్రిల్ కలిగింది! లాతూరు భూకంపం, ఇండోనేషియా సునామీ వంటి విపత్తుల గురించి విన్నప్పుడల్లా.. నా చిన్నతనంలో వచ్చిన ఆ భూకంపమే గుర్తుకువస్తుంది.