Ramaayanam | కోడి ఒక కోనలో II
Ramaayanam | మా చుట్టుపక్కల ఇళ్లలోని కోళ్లు.. రోజంతా మా ఇంటి చుట్టూనే తిరిగేవి. ఓ కోడిపెట్ట, చిన్నచిన్న కోడిపిల్లలు.. భలే ముద్దొచ్చేవి. ఇక కొన్ని కోడిపెట్టలైతే.. మా పెరట్లోనే గుడ్లు పెట్టేవి. మా ఆర్థిక పరిస్థితులు దిగజారిన సమయంలో.. మాకూ కోళ్లను పెంచాలనే ఆలోచన వచ్చింది.
Ramaayanam | మా చుట్టుపక్కల ఇళ్లలోని కోళ్లు.. రోజంతా మా ఇంటి చుట్టూనే తిరిగేవి. ఓ కోడిపెట్ట, చిన్నచిన్న కోడిపిల్లలు.. భలే ముద్దొచ్చేవి. ఇక కొన్ని కోడిపెట్టలైతే.. మా పెరట్లోనే గుడ్లు పెట్టేవి. మా ఆర్థిక పరిస్థితులు దిగజారిన సమయంలో.. మాకూ కోళ్లను పెంచాలనే ఆలోచన వచ్చింది. ఇంట్లోవాళ్లు ఎలాగూ ఒప్పుకోరు అనుకున్నాం. కానీ.. మా నాన్నే.. “పోనీ తియ్యి! పిల్లలు ఖాయిష్ పడుతున్నరు” అన్నాడు అమ్మతో. “ఆఁ! వీండ్లదంత ఆరంభశూరత్వం. ఆ కోళ్లను కమ్ముడు, పొద్దున్నే ఒదిలిపెట్టుడు, గింజలేసుడు, ఎక్కడ గుడ్లు పెట్టినయోనని ఎతుకుడు, పొదుగేసుడు.. గివన్నీ వీండ్లతోని ఐతదా? నాలుగు రోజులు కాంగనె.. మళ్ల నా నెత్తి మీదికి తెస్తరు. నేనైతెజూడ!” అని అమ్మ కరాఖండిగా చెప్పేసింది.
“ఇప్పుడు పెంచకున్నా మనింట్ల వేరేటోళ్ల కోళ్లు ఒస్తలేవా? గట్లనే గివ్వి కూడ పెరుగుతయ్!” అన్నాం మేము. “ఆఁ పెరుగుతయ్! ఊరికె గద్దెత్క పోతదో, పిల్లెత్క పోతదో అని చూడొద్దా? పక్కోళ్లు కోడి కోస్కుంటెనే ‘అయ్యో అయ్యో!’ అనేటోళ్లు.. వీళ్లు కోళ్లను సాది అమ్ముతరు గూడనా?!” అని.. వాకౌట్ చేసేముందు ప్రతిపక్షనాయకుడిలా ఖండించింది అమ్మ. అప్పుడు మా ఇంట్లో పనిచేసే కనకమ్మ.. మాకు బేషరతుగా మద్దతిచ్చింది. “కోళ్లను నేను కమ్ముత తియ్యిన్రి. మీరు కొనండి. ఏం కాదు!” అని అభయమిచ్చింది. అప్పటికసలు మాకు కోళ్ల గురించి ఏ మాత్రం.. పెట్ట, పుంజు తేడాలు కూడా తెలియదు గనుక, డబ్బులిస్తే కనకమ్మే వాటిని కొనుక్కొచ్చింది.
మా ఇంట్లో పనిచేసే కనకమ్మ సహకారంతో.. మేమూ కోళ్లను పెంచాలని డిసైడ్ అయ్యాం. “మంచివాడులే మా నాన్న.. మా మాటే వింటాడోయీ!” అని పాట పాడి.. నాన్నను బతిమిలాడి, కోళ్లకోసం చిన్న గూడు కట్టించుకున్నాం. రెండు ఫీట్ల ఎత్తుతో, మూడు పక్కలా గాలి రావడానికి కిటికీలతో, పైన గూన పెంకులతో, కోడి పట్టేంత ద్వారంతో ఒక మేస్త్రీ దాన్ని కట్టాడు. కర్ర తలుపు పెట్టడమే కాదు.. పిల్లి దూరకుండా దానికి అడ్డుగా ఒక రాయి పెట్టేవాళ్లం. కొన్నాళ్లు ఇదంతా బాగానే సాగింది.
బడి నుంచి రాగానే కోళ్లు ఎక్కడ గుడ్లు పెట్టాయోనని వెతుక్కునేవాళ్లం. గుడ్డు కనిపిస్తే థ్రిల్ అయ్యేవాళ్లం. మళ్లీ కనకమ్మే ఆ కోడిగుడ్లను మార్కెటింగ్ చేసేది. మొదట్లో ఒక గుడ్డు ధర పది పైసలు. ఆ తరువాత పదిహేను పైసలకు పెంచాం. అమ్ముడుపోగా మిగిలిన గుడ్లను కనకమ్మే పొదిగేది. ఆమెకూ కొన్ని డబ్బులిచ్చేవాళ్లం. అలా బిలబిలా బోలెడు కోడిపిల్లలు అయ్యాయి. ఒక్కో కోడికి మొదట్లో ఇరవై దాకా పిల్లలుంటే.. పోయీ పోయీ
చివరికి మూడో, నాలుగో దక్కేవి. సాయంత్రం కమ్మేటప్పుడు కౌంట్ చూస్తే.. ఒకటో రెండో పిల్లలు మిస్సింగ్! చాలా బాధేసేది. అంతేకాదు.. కోళ్లకు జబ్బు వస్తే నాన్న మా పోరుపడలేక పొలం పని ఆపి, ఒక జీతగాణ్ని
పశువుల ఆసుపత్రికి పంపి, ఎర్ర రంగులో ఉండే ఒక మందు తెప్పించేవాడు. ప్రతి కోడినీ పట్టుకుని.. కనకమ్మ దాని నోరు తెరిస్తే, మేము ఇంక్ ఫిల్లర్తో ఆ మందు వేసేవాళ్లం. గుడ్లు అమ్మగా.. మా దగ్గర అరవై డబ్భు రూపాయలు జమ అయ్యేసరికి.. టాటా – బిర్లాల్లా ఫీల్ అయ్యేవాళ్లం. నాన్నకు అప్పుడప్పుడూ వడ్డీ లేకుండా అప్పు కూడా ఇచ్చేవాళ్లం.
అలా మాకు ‘లేత మనసులు’ సినిమాలోని.. ‘కోడి ఒక కోనలో.. పుంజు ఒక కోనలో’ పాట అభిమాన గీతమైంది. రేడియోలో ‘పాడి పంటలు.. పాలూ – చేలూ’ వంటి కార్యక్రమాల్లో, ‘కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ కార్యక్రమం వస్తుంటే శ్రద్ధగా వినడం మొదలైంది. ఇలా సాఫీగా సాగిపోతున్న మా కోడిపురాణంలో అనుకోని సంఘటన మా జీవితాలను.. కాదు కాదు.. మా కోడి జీవితాలను మార్చేసింది. మా కోళ్లకు కోడిపేను సోకింది. ఇక చూడండి.. ఆ పేను వల్ల మా బట్టల నిండా సన్నటి నూగు పురుగులు పడటమే కాదు, విపరీతమైన దురద మొదలైంది. కోళ్లకు ఏ మందు వాడినా తగ్గలేదు. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా నాలుగైదు రోజులు మేనేజ్ చేశాం. కానీ, అదే పనిగా గోక్కుంటుంటే వాళ్లకు అనుమానం, మాకు చిరాకూ కలిగాయి. చివరికి నాన్నే.. కనకమ్మకు చెప్పి కోళ్లను ఏదో ఒక ధరకు అమ్మేయించాడు. ఈ పరిణామానికి మా అమ్మ ఎంతో సంతోషించి ఉంటుందని మా భావన.
నేను డిగ్రీ చదివే రోజుల్లో ఏదో ఒకటి చేసి నాన్నకు సపోర్ట్ చేయాలని కలలు కంటూ ఉండేదాన్ని. ఓ సారి మా ఊళ్లో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్కు వెళ్లి, బీడీఓను కలిసి.. “నేనొక పౌల్ట్రీఫామ్ పెడదామని అనుకుంటున్న. నాకు లోన్, సబ్సిడీ, ఇతర గైడెన్స్ కావాలె సార్!” అని అడిగాను. ఆయన కుర్చీలోంచి కిందపడబోయి తమాయించుకుని.. “నువ్వు ఎవరి బిడ్డవమ్మా?!” అని నా వివరాలు తెల్సుకుని.. “ఓ! పట్వారీ సాబ్ బిడ్డవా?! సరే.. నీకు లోనిస్త. నీకిప్పుడు పదిహేడేండ్లు. ఒచ్చే ఏడు లోన్ ఇస్తామనుకో.. ఆ తరువాత నీకు పెండ్లి అయితది. నువ్వు పొయ్యి మీ అత్తగారింట్ల పడుతవ్.. లోన్ కట్టమంటె మీ నాన్న ‘నాకేం సమ్మందం!’ అంటడనుకో.. మేమెవర్ని అడుగాలె? అయిన గూడ నీ ఇంట్రెస్ట్ జూసి శాన సంతోషం అయితుంది. నేను మీ నాన్నతోని మాట్లాడుతలే!” అని వెనక్కి పంపించాడు. ఆయన మాట్లాడాడో లేదోగానీ.. “నా తిప్పలేవో నేను పడుత. నీకెందుకమ్మ గా పనులు? మంచిగ చదువుకో!” అన్నాడు నాన్న. దాంతో కోళ్లతో నా అనుబంధం కట్ అయింది.
– నెల్లుట్ల రమాదేవి ( Nellutla Ramadevi ), రచయిత్రి
Read More :
Ramaayanam | బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
Ramaayanam | సంగీత జ్ఞానం (గాత్రం)
Ramaayanam | చెంబులకొద్దీ నీళ్లు ముంచి ఇస్తుంటే.. బడికి పోయినా బాగుండె అని అనిపించింది!
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

