Ramaayanam | మేము మరీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా ఇంట్లో వంట కోసం ప్రత్యేకంగా ఓ అయ్యగారు ఉండేవాడు. నాన్న వాళ్ల అమ్మమ్మ మంచాన పడినందుకు ఆమెకు సపర్యలు అమ్మే చేయాలనో, మేముచిన్నపిల్లలం గనుక పని ఎక్కువగా ఉంటుందనో.. వంట కోసం ఆయన్ను పెట్టుకున్నారు.
వంటయ్యగారు ఎత్తుగా, లావుగా పెద్ద బొజ్జతో ఉండేవాడు. ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడు. నవ్వుతుంటే బొజ్జ కిందికీ మీదికీ ఊగుతూ తమాషాగా ఉండేది. నుదుటి మీదా, భుజాలకు పెద్దగా పట్టెనామాలు పెట్టుకునేవాడు. వాళ్ల ఊరు జనగామ దగ్గర్లోని వెల్దండ అని చెబుతుండేవాడు. ఆయన పేరు వెంకటరామ నర్సయ్య. పౌరాణిక సినిమాల్లో భీముడిలాగా ఉంటాడని అందరూ ‘భీమయ్య గారు’ అని పిలిచేవారు. చాలాసార్లు నవ్వినా, అప్పుడప్పుడూ.. “నా అసలు పేరుతోటి పిలువాలె గానీ, గిదేంది.. నాకు పేరు లేదా?!” అంటుండేవాడు.
ఓసారి మా ఊర్లో ఎవరో నాటకబృందం వాళ్లు వచ్చి విరాటపర్వం పౌరాణిక నాటకం వేశారు. రెండ్రోజులు అయ్యాక భీముడు పాత్రధారికి విరేచనాలు అయ్యి డీలా పడిపోయాడట. ‘ఇప్పుడెట్లా!?’ అని అందరూ తీవ్రంగా చింతిస్తున్న సమయంలో ఊర్లో వాళ్లు ఎవరో మా ఇంట్లో ఉన్న అయ్యగారి గురించి చెప్పారట. మరునిముషంలో వాళ్లు మా నాన్న దగ్గరికి వచ్చి.. “ఏమండీ, ఏమండీ.. ప్లీజండీ!” అని మొదలుపెట్టారు. మా నాన్న మొదలే ఎవరైనా రెండుసార్లు బతిలాడితే ఎండలో పెట్టిన ఐస్క్రీంలా కరిగిపోతాడు. “సరే లెండి! పంపిస్తాను!” అని వాళ్లకు ముందే హామీ ఇచ్చి అయ్యగారిని పిలిచాడు. పంచె కట్టుకుని పైన అంగీ లేకుండా చేతిలో గరిటె పట్టుకుని అలాగే హడావుడిగా వచ్చిన అయ్యగారిని చూసి.. వచ్చిన వాళ్ల ముఖాలు వికసించాయి.
మొదట్లో ఒప్పుకొక పోయినా.. “మంచి పారితోషికం ఇస్తాం!” అన్నమాట నచ్చి ఒప్పుకొన్నాడు. పద్యాలు తప్ప మాటలూ, నటనా కూడా నేర్చుకుని అదరగొట్టాడు. చివరికి ఆ నాటకం వేసిన వాళ్లు వెళ్లేటప్పుడు.. “మీరు కూడా మా ట్రూపులో చేరండి. వంట చేసినందుకు వేరే, నటనకు వేరే ఇస్తాం!” అన్నారట. “వామ్మో! వీళ్లెంబడి తెనాలి, గుంటూరు అనుకుంట దేశాలు తిరిగితె.. నా పెండ్లాం నా కాళ్లిరగ్గొట్టి ఇంట్లకు కూడ రానియ్యదు!” అని ఆ నాటకాల్లో జోకులు రోజూ అమ్మకూ, నాన్నమ్మకూ
చెప్పి నవ్విస్తూ ఉండేవాడు. .
అప్పట్లో మా ప్రైమరీ స్కూల్లో బీద పిల్లలకు ఉప్మా, పాలు ఇచ్చేవారు. దానికోసమైనా పిల్లల్ని బడికి పంపుతారని ప్రభుత్వం వారు అనుకునేవారేమో! ఎవరూ దొరక్కపోతే ఆ వంటపని మా ఇంట్లోని అయ్యగారికి ఇప్పించాడు నాన్న. మా ఇంట్లో వండిన తరువాత అక్కడ ఉప్మా చేయడానికి వెళ్లేవాడు ఆయన. రెండ్రోజులు వండాడో లేదో.. “వామ్మో! కట్టెలు లెవ్వు, ఏం లెవ్వు. పుల్లలు ఏరుకొచ్చి ఎట్ల ఒండాలె? కష్టమైతుంది. నాతోని గాదు!” అన్నాడు ఇంటికొచ్చి. మా నాన్న వెంటనే.. “అయితే ఏమైంది?! అక్కడ నీకు ఏ రోజు రవ్వ ఆ రోజు కొలిచి ఇస్తరు గద! అది తీసుకొచ్చి మనింట్లనే పొయ్యి మీద ఒండి పట్క పో! పాలపొడి కలుపుడు కోసం ఇక్కడ్నే నీళ్లు కాగబెట్టి తీస్కపో! ఇంకేంది.. నీకు అల్కన అయితది. గా దానికోసం ఇన్నో అన్నో పైసలు అదనంగ ఒచ్చేటివి పోగొట్టుకుంటవా?!” అన్నాడు.. నానమ్మ వెనుకనుంచి కోపంగా చూస్తున్నా పట్టించుకోకుండా.
ఆ తరువాత కొన్నిరోజులకు మా ఇంటి పక్కనే ఉన్న వేదపండితుడు యల్లంభట్ల నర్సయ్య గారి దగ్గర వేదం కూడా నేర్చుకున్నాడు మా భీమయ్యగారు. తరువాతి రోజుల్లో వరంగల్లోని డా.చంద్రమౌళీశ్వర్ రావు గారింట్లో వంటకు కుదిరాడు. మధ్యమధ్య మా ఊరికి వచ్చి పోతుండేవాడు. ఓసారి అలాగే వచ్చినప్పుడు.. “ఏం అయ్యగారూ.. బాగున్నరా!? అక్కడ మీకు వసతి గిన అంత మంచిగనే ఉన్నదా?!” అని అమ్మ అడిగింది.
అంతే! పడీపడీ నవ్వడం మొదలుపెట్టాడు. ఏమైందంటే చెప్పడు. “నీ నెత్తి నవ్వు! ఏం నవ్వది?! నవ్వన్న చెప్పు, చెప్పన్న నవ్వు!” అని నానమ్మ కోప్పడేసరికి చెప్పాడు. ఒకరోజు వాళ్లింట్లో అందరూ వరుసగా కింద కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు ఆ డాక్టర్ గారి తల్లికి వడ్డన చేస్తూ.. “తొక్కెయ్యనా?!” అని అడిగాడట ఈయన. దాంతో ఆవిడకు చాలా కోపం వచ్చి.. “ఏమన్నావిందాక?!” అన్నదట. దాంతో ఈయన మళ్లీ.. “తొక్కెయ్యనా?!” అన్నాడట. ఆవిడకు కోపం పెరిగి..
“ఏంటి ఆచారీ?! నన్ను తొక్కేస్తావా?! నీకెంత ధైర్యం?! ఉండు.. మా అబ్బాయి రాగానే నిన్ను పంపించేయమని చెప్తాను!” అని తీవ్రంగా మండిపడిందట. చివరికి ఎవరో మధ్యలో కలుగజేసుకుని.. “అయ్యో! అతని తప్పేమీ లేదు. తెలంగాణలో రోటి పచ్చళ్లను ‘తొక్కు’ అంటారు” అని సర్ది చెప్పారట. “నాకేం తెలుసునండీ?! ఆ ముసలామెకు గంత కోపం ఒస్తదని? అడిగినాకొద్ది ‘తొక్కెయ్యనా తొక్కెయ్యనా !?’.. అని నేను అంటనే ఉంటి. ఆ తెల్లారి నుంచి ఒంటలల్ల ఉప్పు కారం తగ్గిచ్చిన!” అని చెప్పి మళ్లీ నవ్వాడు.
కొన్నాళ్లకు వరంగల్ నుంచి హైదరాబాద్కు మారాడు అయ్యగారు. వంటలు మానేసి సినిమా వాళ్లుండే ఏరియాలో ఏదో గుడిలో పూజారిగా పనిచేస్తున్నట్టు తెలిసింది. మధ్యలో ఒకట్రెండు సార్లు మా ఊరికి వచ్చి వెళ్లాడు కూడా. ఆ తరువాత కొన్ని సినిమాల్లో పూజారిగా కనిపించాడని అమ్మవాళ్లు అనుకునేవారు. ముహూర్తం షాట్ అప్పుడు కూడా మంత్రాలు చదవడానికి వెళ్తే బాగానే డబ్బులు దొరుకుతున్నాయని అమ్మతో చెప్పాడట. వాళ్ల కొడుకు బాగా తెలివైనవాడనీ ట్యూషన్స్ చెబుతూ సంపాదిస్తున్నాడనీ చెప్పాడట.
2006లో నాన్న చనిపోయాక అ విషయం రెండు నెలల తర్వాత తెలిసి వచ్చాడు. “అయ్యో! నాకెందుకు చెప్పలేదు? నేను ఆఖరి చూపుకన్న అందేటోడిని గదా! నన్ను ఎంత బాగ చూసుకున్నరు దొరవారు!” అని ఏడ్చాడు. అదే ఆఖరిగా ఆయన్ను చూడటం. కొద్దిరోజుల్లోనే అయ్యగారు షుగర్ వ్యాధి ఎక్కువై చనిపోయాడని తెలిసి అమ్మ చాలా బాధపడింది. ఇప్పటికీ టీవీలో పౌరాణిక సినిమాలో ఎప్పుడైనా భీముడి పాత్ర కనిపిస్తే.. మా భీమయ్య గారిని గుర్తుచేసుకుంటాం.
– నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి