Ramaayanam | మా చిన్నప్పటి ఆటలన్నీ సొంతూరు ఘనపూర్, అమ్మమ్మ ఊరు బమ్మెర, నానమ్మ ఊరు కూనూరు, అప్పుడప్పుడూ హైదరాబాద్ .. ఈ ప్రదేశాలకు చెందినవే. బమ్మెరలో మా ఇరవై ఒక్కమంది ఆడ కజిన్స్లో ఇంచుమించు మా ఈడువాళ్లమే పన్నెండు మంది అమ్మాయిలం ఉండేవాళ్లం. మా తరువాతి వాళ్లు ఆరుగురు చిన్నపిల్లలు.
ఇక మగ కజిన్స్ తొమ్మిదిమంది అయినా, ముగ్గురు బాగా పెద్దవాళ్లు, మిగతా అయిదుగురు చిన్నవాళ్లు, మధ్యలో ఒక్కడున్నా మా ఆటల్లో కలుపుకోవడానికి కుదిరేది కాదు. ఇక చూసుకోండి మా ఆడపిల్లలదే రాజ్యమంతా. మేము ఏ ఆటలు ఆడినా గడీ లోపలే ! చార్ పత్తర్, తొక్కుడు బిళ్ల, తుడుం వంటి అవుట్ డోర్ గేమ్స్ సాయంత్రాలు ఆడేవాళ్లం. పగటిపూట బొమ్మల పెళ్లిళ్లు చేసేవాళ్లం.
చార్ పత్తర్ కోసం చతురస్రాకారపు బాక్స్‌లో మళ్లీ నాలుగు గదుల్లా ముగ్గుతో గీసి మధ్యలో ఓ దొంగను నిలబెట్టి కాళ్ల కింద కొన్ని చిన్న రాళ్లు పెట్టేవాళ్లం. ఆ దొంగ అటువైపు చూస్తున్నప్పుడు ఇటు వెనుక వాళ్లూ, ఇటు చూస్తున్నప్పుడు అటుపక్క వాళ్లూ మెల్లగా వెనుకనుంచి రాళ్లు తీసుకునేవారు. అలా తీస్తున్నప్పుడు దొంగ వాళ్లను పట్టుకున్నా, తాకినా ఆ వ్యక్తి దొంగగా ఉండాలన్నమాట. రాళ్లన్నీ అయిపోయేదాకా ఎవరూ దొరక్కుండా ఉంటే, మళ్లీ మొదటి దొంగే కంటిన్యూ అవాలనే రూల్ ఉండేది. ఎవరు ఎక్కువ రాళ్లు కొట్టేస్తే వాళ్లు విజేతలు.
ఇక ఎండిన తాటికమ్మలను నీళ్లలో నానబెట్టి తీనెలు తీసి వాటితో బొమ్మలు చేసి అందంగా బట్టలు కట్టేవాళ్లం. తాటి ఆకులు ఎండినాక తెల్లగా అవుతాయి. వాటితో చేసిన బొమ్మలు తెల్లగా ఉండేవి. ఒకవేళ పచ్చి ఆకులతో చేస్తే ఆకుపచ్చగా ఉండేవి. వాళ్లు నల్లవాళ్లన్నమాట.‘మా పెండ్లిపిల్ల అందంగ ఉన్నది, మీ పెండ్లిపిల్లగాడు నల్లగున్నడు’ అని ఒకరినొకరు అనుకునేవాళ్లు. కానీ, నాకు మాత్రం ఆ ముదురాకుపచ్చ బొమ్మల్లోనే జీవకళ ఉందనిపించేది. మక్కజొన్న బెండ్లతో పల్లకి చేసి పాటలు పాడుతూ అందులో కూచోబెట్టి వధూవరులను ఊరేగించేవాళ్లం. అటుకులు, పప్పు, బెల్లం, పుట్నాలు ఇవే పెళ్లివిందు మాకు. మక్కజొన్న బెండ్లను రకరకాల షేపుల్లో కత్తిరించి, వాటికి మళ్లీ ఆ బెరడు తోనే పుల్లలు చేసి మెష్లాగా అల్లి కుర్చీలు, బల్లలు, మంచాలు, ఊయలలు.. ఇలా బోలెడు బొమ్మ ఫర్నిచర్ తయారు చేసేవాళ్లం.
‘తుడుం’ అనే ఆట మేము తరచూ ఆడేవాళ్లం. చాలాసార్లు చీటీలు వేయడం, అరచేతులు పైకీ కిందికీ చప్పట్లు కొట్టినప్పుడు రిథమ్ తప్పినవాళ్లని గుర్తించడం లాంటి ప్రజాస్వామిక విధానాల ద్వారా మొదట దొంగ ఎవరుండాలో నిర్ణయించేవాళ్లం. లేదా మాలో ఎవరైనా త్యాగరాణి ‘నేనే మొదలు దొంగ ఉంటా’ లాంటి సినిమా టైటిల్‌తో ముందుకు వచ్చి దొంగగా ఉండేవారు. మిగతావాళ్లు దొంగకు ఫలానా చెట్టు ఆకు తేవాలని కొంచెం టైం పట్టేలా టాస్క్ ఇచ్చేవారు. ఉదాహరణకు ‘పెరటి గోడల్లో పత్తిచెట్టు ఆకులు తేవాలె’ అని దొంగరాణికి చెప్పి ఆమె అటు వెళ్లగానే అందరూ మంచాల వెనుకా, బల్లల కిందా, పరుపు చుట్టల చాటున, గాబుల వెనుకా, బురుజు తొర్రలో, కొట్టిడి అర్రలో (స్టోర్ రూమ్), వంట గదిలో, నీళ్లర్ర (బాత్ రూమ్)లో లేదా మూలనున్న సామాన్లపక్కన దుప్పటి కప్పుకొనో దాక్కునేవారు. చురుగ్గా ఉండేవాళ్లూ, రహస్య ప్రదేశాలు తెలిసిన వాళ్లూ తొందరగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోయేవారు.
నాకెందుకో ఎవరు ఎలా దాక్కుంటున్నారో, దొంగ నిజంగానే పెరట్లోకి వెళ్లి చెప్పిన ఆకు తెంపి తెస్తుందో లేదో చూడటమే పెద్ద కుతూహలంగా ఉండేది. చివరికి ఎక్కడో దగ్గర ‘చివరికి మిగిలేది’ అనుకుంటూ ఏదో ఓ స్థావరం వెతుక్కుని దాక్కునేసరికి దొంగకు మొదట నేనే దొరికేదాన్ని. పైగా మన కలర్ కూడా డిస్ అడ్వాంటేజ్‌గా ఉండేది. ‘ఎహె, ఎప్పటికి రమనే దొంగయితుంది పాపం!’ అని జాలిపడి ఎవరో ఒకరు నన్ను తనతోపాటు దాచేవారు. ఆ చీకట్లో, ఇరుకులో, ఉక్కపోతలో… ముఖ్యంగా మాట్లాడకుండా మౌనంగా ఉండటం కన్నా దొరికిపోయి దొంగై … చెట్లూ ఆకులూ వెతకడమే బావుండేది నాకు. చివరికి గుసగుసగా మాట్లాడీ, కదిలీ నేను దొరకడమే కాకుండా నాకు ఆశ్రయమిచ్చిన వారిని కూడా పట్టిచ్చేదాన్ని. మొత్తానికి చాలా ఆటల్లో దొంగ కామన్ క్యారెక్టర్ అన్నమాట.
ఆ తరువాత కొన్నేళ్లకు నేను బైపీసీతో ఇంటర్ చదువుతున్నప్పుడు బోటనీలో లెగూమినేసి, యుఫోర్బియేసి, సోలనేసి కుటుంబాల మొక్కల గురించి చదువుతూ హెర్బేరియం తయారు చేసేటప్పుడు ‘ఈ మొక్కలన్నీ మేము చిన్నప్పుడే చూశాం కదా!’ అనిపించి, ఆనాటి ఆటల అంతరార్థం తెలిసివచ్చింది.
ఒక్కోసారి ఎండాకాలం సెలవుల్లో మా నానమ్మ వాళ్ల ఊరికి వెళ్లేవాళ్లం. అక్కడ మా చిన్నాయనల పిల్లలు, మేనత్తల పిల్లలు అందరమూ పాతిక మందిమి ఉండేవాళ్లం. వాకిట్లో నేల మీద జంపఖానా వేస్తే అందులోనే పడుకుని నిద్రపోయేవాళ్లం. తెల్లవారేసరికి ఆ గాలికి చానిపి దుమ్మంతా ఒంటిమీద పడి ఉండేది.
అక్కడ కూడా బోలెడు ఆటలాడే వాళ్లం. బొమ్మల పెళ్లిళ్లు చేసేవాళ్లం. నాన్న వైపు కజిన్స్లో మేము పదకొండు మంది ఆడపిల్లలం అంతా ఒకే ఈడువాళ్లం కాబట్టి ఆటలకు లోటుండేది కాదు గానీ… మగ కజిన్స్ కూడా పద్నాలుగు మంది ఉండటంతో మా బలం సరిసమానంగా ఉండేది.
వాళ్లలో కొందరు దొంగతనంగా మిద్దె గదుల్లో ‘రమ్మీ’ అని పేకాట ఆడుతుండేవారు. మేము అక్కడకు వెళ్లి పెద్దవాళ్లకు చెబుతామని వాళ్లను బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి ఐస్ ఫ్రూట్స్ కోసం డబ్బులు వసూలు చేసే వాళ్లం. తీరా ఓసారి ఆ పేకాట గ్రూపులో మా తాతయ్యే కనపడ్డారు. పైగా వాళ్లకు ‘అడ్డు షర్త్’ అనే ఆట నేర్పించి మరీ వాళ్లతో ఆడేవాడు. దాంతో మా రౌడీ మామూలు కట్ అయిపోయింది.
ఆ ఊర్లో చాలా మంది చుట్టాల ఇళ్లు ఉండేవి. మా తాతయ్య వాళ్లు ఆరుగురు గనుక వాళ్ల పిల్లలవే గాక ఇంకా చాలా ఇళ్లుండేవి. మేమింకా వాళ్ల ఇళ్లల్లోకి కూడా వెళ్లి ఆడేవాళ్లం. మా పెద్దతాతయ్య మాకు ‘బుర్రిపిల్ల బుర్రిగాడు’ అనే కథను చెప్పి బాగా నవ్వించేవాడు.
కూనూరులో మా తాతయ్య ఇంట్లో బావి నీళ్లు చాలా ఉప్పుగా ఉండేవి. ఊరి చివర ఉన్న మంచినీళ్ల బావికి రోజూ పిల్లలందరమూ ఎవరు మోయగల్గినంత బిందెలు వాళ్లు తీసుకెళ్లే వాళ్లం. మా చిన్నాన్న కూతురు సరస్వతక్క మాకందరికీ తలా ఒక చకిలమో, కారంబిళ్లనో బిందెలో వేసేది. అక్కడికి పోయాక అవి తిని ముచ్చట్లు పెట్టుకుంటూ పాటలు పాడుకుంటూ రావిచెట్టు కింద చాలాసేపు కూర్చునే వాళ్లం. ఆ తరువాత బిందెలు కడిగి నీళ్లు చేది నింపి ఇంటికి మెల్లగా నడుస్తూ మోసుకొచ్చేవాళ్లం. అలా ఎన్నో జ్ఞాపకాలు!
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి