చూస్తూ ఉండగానే.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ గడిచి పోయింది. 1976 మార్చిలో పరీక్షలు అయిపోయాయి. ఆఖరి పరీక్ష రోజు అందరం కూర్చుని ఏదో మాట్లాడుతూ ఉండగా, శేషగిరిరావు చిన్నాయన సరదాగా.. ‘ఈ రోజు రమ మనందర్నీ సినిమాకు తీస్కపోతది’ అన్నాడు.
ఆ చిన్నాన్నతో నాకు అంత చనువు లేదు. పైగా తనను చూస్తే ఎందుకో కొంచెం భయం వేసేది కూడా. చిన్నాన్న అచ్చు హీరో కృష్ణలా ఉండేవాడు. ప్రమీల చిన్నమ్మనేమో హీరోయిన్ కృష్ణకుమారిలా ఉండేది. నాకు తనతో చనువు ఎక్కువ. చిన్నమ్మ వాళ్లది నల్లగొండ. తనూ, నేనూ ఒకేసారి హైదరాబాద్‌కు, ఆ ఇంటికి వచ్చాం. తను కొత్తకోడలిగా, నేను విద్యార్థిగా. ఇద్దరికీ నాయనమ్మ అంటే భయం. ప్రమీల చిన్నమ్మ ఫ్రీగా ఉంటుంది. అయితే చిన్నాన్న, చిన్నమ్మ కొత్త జంట గనుక వాళ్లిద్దరే ఎటైనా బయటికి గానీ, సినిమాలకి గానీ వెళ్లేవారు. నేను అప్పుడప్పుడూ రంగారావు చిన్నాన్న, గోపిక చిన్నమ్మ వాళ్లతో బయటికి, వాళ్లు తీసుకెళ్తే సినిమాలకూ వెళ్లేదాన్ని. అది కూడా తక్కువే. గోపిక చిన్నమ్మ వాళ్లక్కయ్య మలక్‌పేటలో ఉండేవాళ్లు. తను రెండు రోజులు సెలవులున్నప్పుడు ఎప్పుడైనా అక్కడికి వెళ్తే.. వాళ్లతో కలిసి సినిమా చూసి వచ్చేది. ఒక్కోసారి పొద్దున వెళ్లి సాయంత్రం వచ్చేట్టుగా ఉంటే నన్ను తీసుకెళ్లేది.
ఇంతకూ చిన్నాన్న అలా సినిమాకు తీసుకెళ్లమని నన్ను అడిగేసరికి నా గుండెల్లో రాయి పడింది. ఆ మర్నాడే నేను మా ఊరికి వెళ్దామనుకున్నాను. నా దగ్గర ఖర్చుపెట్టకుండా దాచుకున్నది కొంత డబ్బే ఉంది. అందరికీ టికెట్లు అంటే ఎంత అవుతుందో ఏమో! ఇటు చూస్తే ఎప్పుడూ అడగని చిన్నాన్న అడుగుతున్నాడు.. ఏం చేసేది!? “అయ్యో! మేము ఉండట్లేదు. ఇవాళ మలక్‌పేటకు పోతున్నాం నేనూ, పిల్లలూ!” అన్నది గోపిక చిన్నమ్మ. “మా అన్నయ్య ఒస్తనన్నడు కొలనుపాక నుంచి, నేను కూడ రాను. అయినా ఆడపిల్ల.. అది తీస్కపోవుడేంది? మీరే దానికి చూపియ్యాలె గాని!” అన్నది నాయనమ్మ. “దానికేం తక్వ? అన్నయ్య, ఒదినెలకు గావురాల బిడ్డ! వాండ్ల నాన దానికి మస్తు పైసలిస్తడు!” అన్నాడు చిన్నాన్న నవ్వుతూ. మొత్తానికి నేనూ, శేషగిరి చిన్నాన్న, ప్రమీల చిన్నమ్మ కలిసి నారాయణగూడలోనే వెంకటేశ థియేటర్ వాళ్లే పక్కనే కొత్తగా కట్టిన శ్రీనివాస థియేటర్లో ‘ప్రేమబంధం’ సినిమాకు వెళ్లాం. టిక్కెట్లు ముప్పై రూపాయలైతే క్యూలో నిలబడి నేనే కొన్నాను.
సినిమా కథ, పాటలు బాగున్నాయి. జంధ్యాల కామెడీ డైలాగ్స్ మరీ బాగున్నాయి. శోభన్ బాబు, వాణిశ్రీ హీరోహీరోయిన్లు. అప్పుడే కొత్తగా వస్తున్న జయప్రద.. వాణిశ్రీ చెల్లెలుగా వేసింది. ఆమె పక్కన నెగటివ్ క్యారెక్టర్ దేవదాస్ కనకాల వేశాడు. కె.విశ్వనాథ్ దర్శకుడు. జయప్రదను చూసి ప్రమీల చిన్నమ్మ.. “అబ్బ! ఎంత అందంగ ఉన్నదో! ఈమె తొందరగ టాప్ హీరోయిన్ అయితది” అన్నది. నిజంగా జయప్రద చాలా అందంగా ఉంది. ఆ సంవత్సరమే ఆమె బాపు గారి ‘సీతా కళ్యాణం’, కె.విశ్వనాథ్ ‘సిరిసిరి మువ్వ’, కె.బాలచందర్ ‘అంతులేని కథ’.. అలా మూడు మంచి సినిమాల్లో నటించింది. మొత్తానికి కొత్త ఏసీ థియేటర్లో, కొత్త సీట్లలో, కొత్త జంటతో, పద్నాలుగేళ్ల వయసులో కొంచెం బిడియపడుతూ (వాళ్లిద్దరి మధ్యా నేనెందుకు అని) చూసిన సినిమాగా.. ‘ప్రేమ బంధం’ గుర్తుండి పోయింది. రంగారావు చిన్నాన్న, గోపిక చిన్నమ్మతో అలా ఎప్పుడూ మొహమాటంగా అనిపించలేదు.
సినిమాలు ఎప్పుడైనా ఒకటీ అరా చూడటమే తప్పా.. మేము సినిమాబోతులం కాము. మా ఊరు పల్లె, పట్నం కాకుండా మధ్యతరగతి ఊరు. ఆ ఊరంతటికీ ఒకటే సిన్మా టాకీసు. అందులోకి ఏదొస్తే అదే సినిమా గనుక మాకంటూ పెద్దగా ఎంపిక ఏదీ ఉండేది కాదు. ఆ థియేటర్లో గోడలకు బల్లులూ, సీట్లల్లో నల్లులూ, ఆవరణలో కుక్కపిల్లలూ, అప్పుడప్పుడూ పిల్లులూ ఉండేవి. ఇక దోమలూ, చీమలూ మామూలే. ఇవికాక గోడలకు పాన్ ఉమ్ముళ్ల మరకలూ, హాల్లో సిగరెట్, బీడీల ధూళిమేఘాల పొగలూ తప్పనిసరి. అయితే, ఇవేవీ మా సంతోషాన్ని తగ్గించేవి కావు. ఇన్ని బఠానీలో, పల్లీలో కొనుక్కున్నామా, కూచుని సినిమా చూశామా.. అంతే! మా దగ్గరికి వచ్చే సినిమాలన్నీ సెక్‌ండ రన్ వే! ఒక్కో సినిమా పది పదిహేను రోజులు నడిచేది. చాలాసార్లు మరీ పాత తెలుపు-నలుపు సినిమాలు వచ్చేవి. ఎన్టీయార్, ఏయన్నార్ హిట్ సినిమాలన్నీ అక్కడే చూసాము.
మా ఊరి టాకీసులో అప్పుడప్పుడూ హిందీ సినిమాలు కూడా వచ్చేవి. ఘరౌందా, బాంబే టు గోవా, అస్లీ నక్లీ, హీరా పన్నా, చిత్ చోర్, రజనీగంధ, అర్ధసత్య వంటి ఎన్నో సినిమాలు చూసాం. సిన్మాల మధ్య గ్యాప్ ఉండి ప్రింట్లు దొరక్కపోతే.. ఓ వారం కోసమే హిందీ సిన్మాలు తెచ్చేవారు. ‘ఘరౌండా’లో రూనా లైలా, భూపేంద్ర పాడిన ‘దో దివానే షహర్ మే’ పాట చాలా నచ్చింది నాకు. ‘హీరా పన్నా’లో ‘పన్నాకి తమన్నా హై కి హీరా ముఝే మిల్ జాయే, చాహే మేరా జాన్ జాయే, చాహే మేరా దిల్ జాయే’ పాట టంగ్ ట్విస్టర్‌లా ఉండి.. నేను ఊరికే హమ్ చేస్తూ ఉండేదాన్ని.
సినిమా మారగానే ప్రతి సినిమాకు వెళ్లాలని మేమేం కంకణం కట్టుకునేవాళ్లం కాదు. ఏడాదికి నాలుగైదు సిన్మాలు చూసేవాళ్లం అనుకుంటా. అసలు మేమే సినిమాకు వెళ్తామని ఇంట్లో అడిగేవాళ్లమే కాదు. పెద్ద నిర్బంధం కూడా ఉండేది కాదు గానీ, మా వెంట ఎవరెవరు వస్తున్నారనీ, సినిమా పేరేంటనే విషయాలు తప్పనిసరిగా అడిగేవారు. ‘మంచి మనుషులు’, ‘మంచి మనసులు’ లాంటి పేరులో మంచి ఉన్న సినిమాలో.. మా నానమ్మ వస్తానంటే భక్తి సినిమాలో.. అవీ కాకపోతే బాలనాగమ్మ, భట్టి విక్రమార్క వంటి ఫాంటసీలో.. బొబ్బిలి యుద్ధం, మహామంత్రి తిమ్మరుసు వంటి చారిత్రాత్మక సినిమాలో అయితే “సరే, పోండి!” అనేవాడు నాన్న. ‘ప్రేమ’ అనే పేరుంటే చాలు.. “ఊరికే ఏం సిన్మాలు? చదువుకోక!” అనేది అమ్మ. ‘ముత్యాల ముగ్గు’, ‘కార్తీక దీపం’ లాంటివి ఈజీగా పాసై పోయేవి.
‘మన్మథ లీల’, ‘అమర ప్రేమ’, ‘లైలా మజ్ను’ ఇట్లాంటి పేర్లు ఉన్నాయంటే ఇంక అంతే సంగతులు! ఆ సినిమాలకు వద్దనేవారు. నిజానికి ముందు చెప్పిన సిన్మాల్లో కూడా ప్రేమ సన్నివేశాలు ఉండేవి. కానీ, కొన్నిటి పేరును చూసే నిర్ణయించేవారు. ఇక శోభన్ బాబు సినిమాల్లో ప్రేమ కాస్త అతిగా, కొన్నిసార్లు ఎబ్బెట్టుగా కూడా ఉండేది. అప్పట్లో దూర దూరంగా ఉండి ప్రేమించుకోవడమో, హీరోహీరోయిన్ల ముఖాలు దగ్గరగా రాగానే ఓ పెద్ద పొద్దుతిరుగుడు పువ్వును కెమెరాకు అడ్డంగా చూపించడమో, గాలికి ఊగుతున్న రెండు జంట పువ్వులను చూపించడమో జరిగేది. ‘ఓహో! వీళ్లు ప్రేమించుకుంటున్నారు కాబోలు!’ అనుకునేవాళ్లు.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి