‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.5 వేల బహుమతి పొందిన కథ.
నీలాకాశంలో ప్రకాశిస్తున్న చంద్రుడు.. తన వన్నెల వెన్నెలను ఆ ప్రదేశమంతా ఒలకబోస్తున్నాడు. ఆ వెన్నెల వెలుగులకు బిక్కబోయిన నక్షత్రాలు.. చంద్రుడితో పోటీపడలేక అతనికి దాసోహమన్నట్లుగా మిణుకు మిణుకుమంటున్నాయి. సముద్రతీరంలో కొందరు హాయిగా సేదతీరుతున్నారు. మరికొందరు యువతీయువకులు గుంపులు గుంపులుగా విహరిస్తున్నారు. కొంతమంది పిల్లలు ఇసుకలో ఆటలాడుతున్నారు.
అక్కడే కొంచెం దూరంగా వెల్లకిలా పడుకుని ఉన్న ఏడుకొండలు మనసులో సంతోషం సముద్రపు అలల్లా ఎగసెగసి పడుతున్నది. సముద్రం మీదినుంచి రయ్యిమంటూ వీచే గాలికి అతని తలవెంట్రుకలు చిందరవందరగా అవుతున్నా.. ఇసుక రేణువులు ఎగిరొచ్చి మీదపడుతున్నా అతను పట్టించుకోలేదు. పుట్టి బుద్ధెరిగినప్పటినుంచీ అతనికి ఆట పాటలన్నీ ఆ సముద్రంతోనే! నురగలతో నాట్యం చేస్తున్న ప్రియనేస్తమైన సముద్రమంటే అతనికి తగని ఇష్టం. ఆ సముద్రం తర్వాత మళ్లీ అతనికి మరో ప్రియాతిప్రియమైన స్నేహితుడున్నాడు. అతనే ఓబులేసు. ప్రస్తుతం అతని మనసు సంతోషంతో ఉప్పొంగిపోవడానికి కారణం.. ఆ స్నేహితుని నుంచి ఫోన్ రావడమే. చిన్నతనంలో తనతో కలిసి పెరిగిన తన స్నేహితుడు ముంబయిలో ఉన్నాడని మాత్రమే అతనికి తెలుసు. ఎన్నో ఏళ్లుగా ఒక్కసారి కూడా కనిపించని ఓబులేసు.. తననెప్పుడో మరిచిపోయి ఉంటాడని అతను అనుకున్నాడు. అయితే.. ‘అతని ఆలోచన అబద్ధం’ అని రుజువు చేస్తూ ఒకరోజు అతనికో ఫోన్ వచ్చింది.
అతను లిఫ్ట్ చేసి..
“హల్లో.. ఎవురూ?” అని అడిగాడు.
“ఎవరు మాట్లాడేది? ఏడుకొండలేనా?”
అవతల నుంచి ప్రశ్న వచ్చింది.
“అవును! తమరెవురు?” అడిగాడతను..
కాస్త బెరుగ్గా.
“ఎవరేంట్రా.. నేను ఓబులేసుని. గుర్తుపట్టావా?” అన్నాడు అవతలి వ్యక్తి.
చిరపరిచితమైన ఆ గొంతు వినగానే అతనికి
ఒక్కక్షణం నోట మాట రాలేదు. మెల్లిగా గొంతు
పెగుల్చుకుని..
“ఎవురూ? ఓబులేసు గారేనా?” అనడిగాడు.
“ఒరే ఫూల్! ‘గారు’ ఏంట్రా? నేను నీ స్నేహితుణ్నిరా. నన్ను ‘ఒరే ఓబులేసు’ అని పిలవరా” అని వినిపించడంతో అతను ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
“నువ్వూ.. నువ్వేనా? నేన్నీకు గుర్తున్నానా?” అనుమానంగా అడిగాడు.
“గుర్తుండటానికి నిన్నసలు మర్చిపోతే గదరా! నేను వచ్చే బేస్తవారం నిన్ను కలవడానికి మన ఊరికి వస్తున్నా. అందుకే ముందుగా చెప్తున్నా” అన్నాడు.
“అలగలాగే! నీకోసం ఎయిటింగ్ సేస్తుంటా!” అన్నాడు ఏడుకొండలు.
ఓబులేసు వస్తున్నాడన్న సంతోషంలో అతని కాలు ఒకచోట కుదురుగా నిలవలేదు. చిన్ననాటి మధుర జ్ఞాపకాలు అతని మనసులో సుడులు తిరగసాగాయి.
పక్కపక్క ఇళ్లలో పుట్టిన ఏడుకొండలు, ఓబులేసు మధ్య బాల్యంనుంచే విడదీయరాని బంధం ఏర్పడింది. చిన్నప్పుడు మామిడి తోపుల్లో కాయలు దొంగతనం చేసి పంచుకున్న దగ్గర్నుంచీ, సముద్రం ఒడ్డున ఇసుకలో ఆడుతూ పాడుతూ కబుర్లు చెప్పుకొన్న వారి స్నేహం సముద్రంకన్నా లోతైనది. ఒకరికోసం ఒకరు ప్రాణం ఇచ్చేంతగా గాఢ స్నేహం వారి మధ్య అల్లుకుంది.
చిన్నతనంలోనే తమ కులవృత్తి అయిన చేపలు పట్టడం కూడా ఇద్దరూ కలిసే నేర్చుకున్నారు. పెద్దవాళ్లతో కలిసి ఇద్దరూ సముద్రంలోకి వేటకు వెళ్లేవారు. ఏ పనిచేసినా, ఎక్కడ చూసినా ఇద్దరూ కలిసే కనిపించేవాళ్లు. వాళ్ల వయసుతోపాటే వాళ్ల స్నేహం కూడా దినదిన ప్రవర్ధమానమైంది. పన్నెండేళ్ల వయసులో ఇద్దరూ సముద్రంలోకి వేటకు వెళ్లారు. వాళ్లు సొంతంగా వేటకు వెళ్లడం అదే మొదటిసారి. వారి తండ్రులు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ, ఇద్దరూ వేట పూర్తిచేసి తిరిగి రావడం.. గూడెం వాళ్లందరిలోనూ ఆనందాన్ని నింపింది. సముద్రం మీద వాళ్లు ఆడింది ఆటగా, పాడింది పాటగా చేపల వేట సాగేది.
ఒకరోజు ఎప్పటిలాగే సముద్రంలోకి వెళ్లారు. అయితే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సముద్రం ఆరోజు భీకరరూపం దాల్చింది. అప్పటికే వాళ్లు తీరంనుంచి చాలాదూరం లోపలికి వెళ్లిపోయారు. ఒక్కసారిగా సముద్రం అల్లకల్లోలమైంది. వాళ్ల పడవ తలకిందులైంది. ఇద్దరూ నీళ్లలో చెరొకవైపు పడిపోయారు. ఇద్దరూ ఈదుతూ తమ పడవ దగ్గరికి చేరుకున్నారు. అయితే ఏడుకొండలు పడవ ఎక్కుతుండగా ఒక పెద్ద అల అతణ్ని మళ్లీ సముద్రం లోపలికి లాగేసింది. అది గమనించిన ఓబులేసు ఎంతో చాకచక్యంతో వ్యవహరించి, అతణ్ని పడవలోకి లాఘవంగా లాగేశాడు. ఓబులేసే గనక లేకుంటే..
ఏడుకొండలు జీవితం ఆ రోజుతో ముగిసిపోయి ఉండేది. ఆ సంఘటన తర్వాత వాళ్ల మధ్య స్నేహం మరింత బలపడింది. అయితే ఒకానొక దుర్దినాన ఒక అనుకోని ప్రమాదంలో ఓబులేసు తల్లిదండ్రులు మరణించడంతో, అతని మనసు వికలమైపోయింది. ఎవరెంత చెప్పినా వినకుండా ఊరొదిలేసి ఎటో వెళ్లిపోయాడు. దొరికిన చోట, దొరికిన పనల్లా చేస్తూ చివరికి ముంబయి చేరుకున్నాడు. రకరకాల పనులు చేస్తూ అక్కడే స్థిరపడిపోయాడు. అదృష్టవశాత్తూ ఓబులేసు చేపట్టిన వ్యాపారం కలిసివచ్చి, అతనికి విపరీతమైన లాభాలను తెచ్చిపెట్టింది. దాంతో అనతికాలంలోనే అంచెలంచెలుగా పైకెగబాకాడు. క్రమేణా అతని కనుసన్నల్లో ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యమే ఏర్పడింది. అలాంటి గొప్పవాడు తనకోసం ప్రత్యేకంగా ముంబయి నుంచి వస్తుండటంతో ఏడుకొండలు సంతోషానికి హద్దులేదు. అతను చెప్పిన వార్త విని గూడెం వాళ్లంతా ఎంతో సంతోషించారు.
మిత్రుడు వస్తున్న విషయం భార్యకు చెప్పి..
“ఆనికి మనింట్లోనే భోజనం ఏర్పాటుసెయ్యి. సిన్నప్పుడు రొయ్యల ఇగురు శానా ఇట్టంగా తినేటోడు. గాబట్టి అది సెయ్యటం మర్సిపోవొద్దు” అని చెప్పాడు ఏడుకొండలు.
“మీ దోస్తు గురించి నువ్వింతగనం సెప్పాల్నా? ఓబులెసన్న అంటే నీకెంత ఇట్టమో ఎన్నిసార్లు నువ్వు సెప్పలేదు నాకు. అదంతా నేను సూసుకుంటా” అని భరోసా ఇచ్చిందామె.
ఆ గురువారం ఖద్దరు బట్టలు వేసుకుని, నల్ల కళ్లద్దాలు సవరించుకుంటూ వచ్చిన ఓబులేసు, దూరంగా నిలబడి తననే తదేకంగా చూస్తున్న ఏడుకొండలుని చూసి..
“అరే ఏడుకొండలూ! మై జిగిరీ దోస్త్! ఏంటింకా అట్లా దూరంగానే ఉన్నావ్? రా రా” అంటూ దగ్గరికి పిలిచాడు.
అతణ్ని చూసిన ఆనందంలో ఏడుకొండలు కళ్లవెంట నీరు ధారాపాతంగా కారిపోసాగింది. అది చూసి..
“ఏమిట్రా పిచ్చోడా? ఎందుకీ కన్నీళ్లు?” అంటూ ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు ఓబులేసు.
ఆరోజు అతణ్ని తమ ఇంట్లో భోజనానికి రమ్మని పిలిచాడు ఏడుకొండలు. రాకరాక తమ ఇంటికి వచ్చిన అతణ్ని లక్ష్మి సాదరంగా ఆహ్వానించింది.
భోజనాలయ్యాక ఓబులేసు లక్ష్మితో..
“వీడు నా ప్రాణస్నేహితుడు. ప్రేమాభిమానాలు కురిపించడంలో నువ్వుకూడా వాడికి తగ్గ భార్యవనిపించుకున్నావు. నువ్వు చేసిన రొయ్యల ఇగురు నాకెంతో ఇష్టం. నిజంగా ఇట్లాంటి భోజనం చేసి ఎన్నాళ్లయిందో! మీ ఇద్దరికీ చాలాచాలా థాంక్స్” అన్నాడు.
“గదేందన్నా అట్లంటవ్. నీ అసుంటి గొప్పోడు మా ఇంటికి వొచ్చుడే ఎక్కువ. ఇది మా అదురుట్టం” అని లక్ష్మి అనడంతో అతను నవ్వేశాడు.
తర్వాత ఏడుకొండల్ని చూస్తూ..
“సర్లే! నీ గురించి చెప్పు. ఎట్లా ఉంది నీ పని? వేట లాభసాటిగా ఉందా?” అనడిగాడు.
“ఎందుకుండదు? ఆ సముద్దరాన్ని నమ్ముకున్నాను. ఆ తల్లే ఇంత కూడు బెడుతున్నది. నా సంగతి సరే.. నువ్వు బొంబై బోయి ఎన్ని తిప్పలు వడ్డవో ఏమో తెల్వదు గానీ, మొత్తానికి గొప్ప యాపారయేత్తవైనావని అందరూ సెప్పుకొంటుంటే ఇన్నాను. శానా సంతోసం ఏసినాది” అన్నాడు.
“ఈ బిజినెసుల్లో ఎన్ని తలనొప్పులో నీకేందెల్సు. సర్లే.. ఈ గొడవ ఎప్పుడూ ఉండేదే! అట్లా బీచికి వెళ్లి కాసేపు కబుర్లు చెప్పుకొందాం పద” అంటూ అతణ్ని బయల్దేరదీశాడు. లక్ష్మికి వీడ్కోలు చెప్పి ఏడుకొండలుతో కలిసి ఓబులేసు వెళ్లేసరికి, బీచ్ చాలా సందడిగా ఉంది. ఇద్దరూ వాళ్లు చిన్నతనంలో ఆడుకునే చోటుకే వెళ్లి కూర్చున్నారు. కొద్దిసేపు ఆ మాటా ఈమాటా మాట్లాడుకున్న తర్వాత..
“ఒరే! నీ పడవ తియ్యరా. సముద్రం మీదికి వెళ్లి చాలా రోజులైంది” అన్నాడు ఓబులేసు. అతనలా అడగడం ఆలస్యం.. ఏడుకొండలు వెంటనే అతణ్ని తన పడవ దగ్గరికి తీసుకెళ్లాడు. సముద్రం చిన్నచిన్న అలలతో నవ్వుతూ ఆ స్నేహితులిద్దరినీ ఆహ్వానించింది. అలా వాళ్లు మాటల్లోపడి తీరం నుంచి కాస్త దూరంగానే వెళ్లారు. ఆ సమయంలో ఉన్నట్లుండి అక్కడి వాతావరణంలో ఏదో మార్పు వచ్చింది.
రక్తంతోనూ, సముద్రపు నీళ్లతోనూ తడిసిపోయి ఉన్న ఓబులేసు శరీరాన్ని ఏడుకొండలు భుజంపైన వేసుకుని రావడం చూసిన గూడెం జనం.. “ఏటయినాది…” అంటూ అతని చుట్టూ గుమిగూడారు. ఓబులేసు శరీరాన్ని నేలపైకి దించిన ఏడుకొండలు, మౌనంగా ఆ శవాన్నే చూస్తుండిపోయాడు. అతను ఏడవడం కూడా మర్చిపోయేంతగా దిగ్భ్రాంతిలో మునిగిపోయి ఉన్నాడనీ అందరూ అర్థం చేసుకున్నారు. క్షణాల్లో అక్కడ పోలీసు వ్యాను ప్రత్యక్షమైంది.
ఏమైందన్న పోలీసుల ప్రశ్నకు అతికష్టంమీద..
“సముద్దరంలో సరదాగా శికారు సేద్దామని మా ఓబులేసు అడిగితే కాదనలేక పడవ తీసినాను సారూ! కాసింత లోపలికెల్లినంక ఒక పెద్ద అల వొచ్చి మా పడవను ఎంత గట్టిగా తాకిందంటే.. ఆ దెబ్బకు అది గింగరాలు తిరుగుతూ పైకి ఎగిరింది. మేము దాన్లోంచి నీళ్లల్లో పడిపోయినం. కానీ, దురదుట్టం ఏటంటే.. ఆ పైకెగిరిన పడవ సరిగ్గా వొచ్చి మా వోడి తలమీద పడినాది. దాంతో ఆడి తల పగిలినాది. ఎంటనే ఈడ్ని ఒడ్డుకు తెచ్చేసినా. కానీ, అప్పటికే రక్తం శానా కారిపోయినాది. ఒడ్డుకు తెచ్చేలోపల ఆడు..” ఇక ఏడుకొండలు నోట మాట పెగల్లేదు. ఇంకా పెళ్లికూడా కాని ఓబులేసు, అలా పుట్టిన ఊరిలోనే మట్టిలో కలిసిపోవడం అందరినీ ఎంతగానో కదిలించింది. అతని అంత్యక్రియలు ఏడుకొండలు చేతుల మీదుగానే జరిగాయి.
అందరూ శ్మశానాన్ని విడిచిపోతున్నా ఏడుకొండలు మాత్రం అక్కడే స్నేహితుని చితికి కాస్త దూరంలో కూలబడి ఉండటం చూసి, అందరి మనసులూ ద్రవించాయి. తన ప్రాణాన్ని రక్షించిన ఓబులేసు, తన కళ్లముందే చనిపోవడం చూసిన అతను.. దిగ్భ్రాంతికి గురయ్యాడని అక్కడ అందరికీ అర్థమైంది. అతణ్ని ఓదార్చడం అక్కడ ఎవ్వరి తరమూ కాలేదు.
“ఇక గూడేనికి పోదాం రా!” అంటూ ఎవరెంత బతిమిలాడినా అతను అక్కణ్నుంచి కదలలేదు. అతని వ్యధ అంత తేలిగ్గా తీరేది కాదనుకుంటూ ఒక్కొక్కరూ అక్కణ్నుంచి వెళ్లిపోయారు.
“మనం ఎంత బాధపడినా పోయినోడు తిరిగొత్తాడా సెప్పు. పొద్దుగాలనుంచి పిల్లలు బువ్వకూడా సరిగ్గా తినలేదు. నేనింటికెల్తన్నా. నువ్వూ సీకటడకముందే వచ్చేయ్” అని చెప్పి.. అతని భార్య కూడా వెళ్లిపోయింది. అక్కడ అతను ఒంటరిగా మిగిలిపోయాడు. జరిగిందంతా అతనికి ఒక కలలాగా అనిపించసాగింది. ఒకసారి అది మొత్తం అతని కళ్లముందు గిర్రున తిరిగింది.
ఓబులేసును పడవ ఎక్కించుకుని కొంతదూరం పోయాక..
“ఇప్పుడు సెప్పు. ఇంకేటి సంగతులు!” అని అడిగాడు ఏడుకొండలు.
“మన బెస్త గూడేలన్నిటికీ నువ్వే నాయకుడివి కాబట్టి నువ్వో పనిచేయాలి. అది చెబుదామనే నిన్నింత దూరం తెచ్చింది” అన్నాడు ఓబులేసు.
“సెప్పు. నీకోసం ఏటైనా సేస్తా!” అన్నాడు ఏడుకొండలు.
“చెప్తాను. నేనీ ఊర్లో ఒక ఫైవ్‌స్టార్ హోటల్లో దిగాను. అసలు నిన్నే అక్కడికి పిలుద్దామని అనుకున్నాను. కానీ గోడలకు చెవులుంటాయి. మా బిజినెస్‌లో ఎవ్వడినీ నమ్మకూడదు. కానీ, నువ్వు నా ప్రాణస్నేహితుడివి. అందుకే నిన్ను నమ్మాను. నా బిజినెస్ పార్ట్నర్గా చేయి కలుపుతానని మాటివ్వు” అన్నాడు ఓబులేసు.
“నువ్వేటి సెబుతున్నావో నాకొక్క ముక్కగూడా అర్థం కాలేదు!”.
“అక్కడికే వస్తున్నా. నేను ముంబయిలో చేసే బిజినెస్‌కు కావాల్సింది అమ్మాయిలు..” అని ఒక్క క్షణం ఆగాడు ఓబులేసు.
“అంటే.. అమ్మాయిలకు ఉజ్జోగాలు ఇచ్చే బిగినెస్సా?” అనడిగాడు ఏడుకొండలు.. పడవ తెడ్డు వేస్తూ.
“ఓరి వెర్రి మొఖమా! నేను చెప్పేది పూర్తిగా విను. అరబ్బు దేశాల్లో మనదేశం అమ్మాయిలకు చాలా డిమాండుంది. డబ్బు ఆశ ఉన్నవాళ్లనూ, పేదవాళ్లనూ నేను ఎరవేసి పట్టుకుని, వాళ్లకు అరబ్బు దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి తీసికెళ్లి.. అక్కడ షేకులకు అమ్మేస్తుంటాను” అంటూ చెప్పాడు ఓబులేసు.ఆ మాట వినగానే ఏడుకొండలు నిశ్చేష్టుడయ్యాడు.
“గదేం బిగినెస్? పాపం కాదా?” అనడిగాడు.
“పాపం – పుణ్యం అంతా ట్రాష్. డబ్బు ఒక్కటే నిజం. ఇక్కడ మన వాళ్లందరికీ నువ్వే లీడర్వు కాబట్టి.. ఇక్కడున్న మన కులపోళ్లలో మంచి వయసులో ఉన్న అమ్మాయిల్ని మెల్లిగా మాయమాటలు చెప్పి, ముంబయిలో నా దగ్గరికి పంపించు. కొద్దిరోజుల్లో నాలాగే నువ్వూ లక్షాధికారివై పోతావు!”.
“సీ.. సీ.. అంత నీతిమాలిన పని నేను జేస్తానని ఎట్టా అనుకున్నావు రా?”.. ఛీత్కారంగా అన్నాడు ఏడుకొండలు. అప్పటిదాకా ఎంతో గౌరవంగా మాట్లాడిన మిత్రుడు.. ఒక్కసారిగా ఏకవచనంలోకి దిగడం ఓబులేసు గమనించాడు. అయినా దాన్ని పట్టించుకోకుండా..
“ఇంకా ఈ నీతీ నిజాయితీ ఏంట్రా? చిన్నప్పటి నుంచీ నువ్వీ గర్భదరిద్రంలో మగ్గుతున్నావు. నిన్నెవరైనా కాపాడారా? నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కాబట్టి నీకు లక్షలు సంపాదించే మార్గం చూపిస్తున్నాను. నువ్వూ నా దారిలోకి రా. కొద్దిరోజుల్లోనే నీ దశ తిరిగిపోతుంది” ఆశపెట్టాడు ఓబులేసు.
“వొద్దురా! ఈ దరిద్రపు పని నేను సెయ్యను. నువు గూడా దీన్ని ఇక ఆపేసి ఇక్కడే నాతో ఉండిపో! నియ్యతిగా మనకొచ్చింది తిని బతుకుదాం” స్పష్టంగా చెప్పాడు ఏడుకొండలు
“ఏంటీ.. వ్యాపారం ఆపెయ్యాలా? ఇక్కడే ఉండిపోవాలా? ఎంత తేలిగ్గా చెప్పావురా. ఇప్పుడు నేను ముంబయ వెళ్లకపోతే ఎన్ని డీల్స్ ఆగిపోతయో.. నాకెన్ని లక్షల నష్టం వస్తుందో తెలుసా? ఇక్కడ నువ్వు కాకపోతే ఇంకొకడు సహాయం చేస్తాడు. నాకు బోడి సలహాలు ఇవ్వడం మాని.. నాతో చెయ్యి కలుపుతావో లేదో చెప్పు” నిష్కర్షగా అడిగాడు ఓబులేసు.
“నేను నీతో సెయ్యి కలపను. ఇంకోన్ని కలపనివ్వను”.. అంతకంటే నిష్కర్షగా అన్నాడు ఏడుకొండలు.
అంతే.. ఒక్కసారిగా అక్కడి వాతావరణంలో మార్పు వచ్చేసింది. గాలి గంభీరమైపోయింది. ఓబులేసు పడవలో లేచి నిలబడి..
“కలపనివ్వనంటే.. ఏం చేస్తావు? అసలు నువ్వేం చేయగలవు? ఆఫ్టరాల్ ఒక అర్భక జాలరిగాడివి. నేను పెట్టిన ప్రాణభిక్షతో బతుకుతున్నవాడివి. నాకు నువ్వు పనికి వస్తావని ఇక్కడికి వచ్చానే గానీ, నీ మీద ప్రేమతో రాలేదు. నేనెంత కర్కోటకుడినో నీకు తెలీదు. నాలో జాలి – దయ అన్నవి ఏ కోశానా లేవు. నేను తలచుకుంటే నిన్నిక్కడే ఇప్పుడే జలసమాధి చేసి వెళ్లిపోగలను” అన్నాడు కర్కశంగా.
అది విని ఏడుకొండలు..
“అబం సుబం తెలీని ఆడబిడ్డల ఉసురు పోసుకుంటున్నావని తెలిసినప్పుడే నువ్వెట్టాంటోనివో నాకు అర్థమైంది. ఒకప్పుడు నువ్వు నాకు పేణబిచ్చ పెట్టింది నిజమే గావొచ్చు. అంతమాత్తరాన నువ్ సెప్పే నీతిమాలిన పని సేస్తానని ఎట్టా అనుకున్నావు? నేను ఒక నాయకున్నే కాదు, మానవత్వం ఉన్న మడిసిని కూడా! అందుకే ఎంతోమంది ఆడబిడ్డల్ని రచ్చించడం కోసం ఉప్పుడు నేనీ పని సెయ్యక తప్పడంలేదు. ఎందుకంటే నీలాంటోడు బతికుంటే ఇంకెంతమంది ఆడబిడ్డల బతుకులు బుగ్గిపాలు అవుతయో తెల్వదు” అంటూ.. అదాటున పోటెత్తిన అలలా లేచి, తన చేతిలో ఉన్న పడవ తెడ్డుతో ఓబులేసు తలపైన బలంగా ఓ దెబ్బ వేశాడు. ఒకే ఒక దెబ్బ. అంతే.. దాంతో ఓబులేసు తల రెండుగా విచ్చుకుంది.
“అబ్బా..” అని పెద్దగా ఆర్తనాదం చేస్తూ అతను పడవలోంచి నీళ్లలోకి జారిపోయాడు.
“నేను సేసిన ఈ పని ఏమాత్తరం తప్పుగాదని నాకు దెల్సు. ఒకేల తప్పయినా.. ఆ దేవుడు నన్ను తప్పకుండా సెమిస్తాడు!” అంటూ ఏడుకొండలు నీళ్లలోకి దూకి, ఓబులేసు శరీరాన్ని పడవలోకి ఎక్కించి, తీరానికి చేర్చాడు. ఆ ఓబులేసే ఒకప్పుడు ఏడుకొండలుకు ప్రాణభిక్ష పెట్టాడన్న సంగతి పోలీసువాళ్లకు గూడెంవాళ్లు చెప్పారు. అందుకే జరిగిందంతా దాచి, కొత్తగా కట్టుకథ అల్లి చెప్పిన ఏడుకొండలు మాటలను పోలీసులు కూడా విశ్వసించారు. వాళ్లకు అతనిపైన అణుమాత్రం అనుమానమైనా రాలేదు. జరిగిందంతా గుర్తుకు రావడంతో ఏడుకొండలు గాఢంగా నిట్టూర్చాడు. వెనుకనున్న సముద్రం మాత్రం అసలు అక్కడ ఏమీ జరగనట్లు, తానేమీ చూడనట్లు ప్రశాంతంగా ఉంది.
‘సంపాదన కన్నా.. నమ్ముకున్న విలువలే మిన్న!’ అని నమ్మిన ఓ నిరుపేద జాలరి కథ ‘పోటెత్తిన అల’. రచయిత గండ్రకోట సూర్యనారాయణ శర్మ. ‘సూర్య గండ్రకోట’ పేరుతో రచనలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో పుట్టిపెరిగారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ (తెలుగు సాహిత్యం) చదివారు. తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో ఏజీఎంగా పనిచేసి, పదవీ విరమణ పొందారు. వివిధ ప్రక్రియల్లో రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా ఎంచుకున్నారు. ఈయన రాసిన కథల్లో 80 వరకు కథలు ప్రచురితమయ్యాయి. పాతిక పైగా కథలు వివిధ పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాయి. ముప్ఫై వరకు కవితలు, గజల్స్ వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. ఆనంద హేల, కలలు కౌముది, జాబిల్లి కోసం ఆకాశమల్లె నవలలు రాశారు. ‘అసుర మేధం’ 24 వారాల సీరియల్‌గా ప్రచురితమైంది. ‘ఆనంద హేల’ నవల పుస్తకరూపంలో విడుదలైంది. నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీ పీఠం నిర్వహించే కథల పోటీలో బహుమతి గెలుపొందడం ఇది రెండవసారి.
– గండ్రకోట సూర్యనారాయణ శర్మ 96669 03960