Ramayanam | నారాయణగూడలో నాయనమ్మ ఇంటి పక్కన దయాశంకర్ అనే ఎల్ఐసీ ఏజెంటు ఇల్లు ఉండేది. అది ఒకప్పుడు మా వాళ్లదేనట. దయాశంకర్ అంకుల్ ఇంటి పక్కనే కోదాటి రంగారావు గారిల్లు ఉండేది. వాళ్లు దూరపు బంధువులవుతారని నాయనమ్మ చెప్పేది.
కోదాటి రంగారావుగారు చనిపోయారు గానీ, ఆయన కోడలు జమున గారు అప్పుడప్పుడూ మా ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉండేవారు. ఆమె ‘భక్త తుకారాం’ సినిమాలో నటించిందని చిన్నమ్మ వాళ్లు చెప్పారు. ఆమె కూతురు అభినవ మల్లిక తరువాతి రోజుల్లో టీవీ యాంకర్‌గా చేసేది.
ఓరోజు నేను కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి కోదాటి రంగారావు గారి భార్య నాయనమ్మతో మాట్లాడి వెళ్తూ కనిపించింది. ఆమె ఎందుకో నన్ను కిందికీ మీదికీ పరిశీలనగా చూసినట్టు నాకు తోచింది. నేను ఇంట్లోకి వెళ్లగానే నాయనమ్మ నవ్వుతూ.. “వాండ్ల కొడుకునట చేసుకుంటవానే? మంచిగ బోలెడు ఆస్తి, ఇంకేంది? ఆమెనే అడిగింది.
కట్నం గూడ ఒద్దట!” అన్నది. “మన పిల్ల మంచిగ చదువుకుంటుంటే ఇప్పుడే పెళ్లేంది అత్తయ్యా! అయినా ఆయనేం చిన్న పిల్లగాడా? ఇరవై అయిదేళ్లుంటయి. ఈమెకు పద్నాలుగు. ఏమడగటం?” అన్నది గోపిక చిన్నమ్మ. “అవును! ఇప్పుడే పెళ్లేంది? అయినా మన రమకు సూట్ కాడు. ఏం బాగుంటడు? నల్లగ! ఏజ్ గ్యాప్ కూడా శాన ఉంటది” అని ప్రమీల చిన్నమ్మ సమర్థించింది. “ఆ! మొగోండ్లకు అందమేంది, వయసేంది? మా కాలంల ఎవడన్న చేసుకుంట అనుడే ఆలిస్యెం.. ఇచ్చుడే! గిన్ని మాటలున్నాయా?” అనుకుంటూ వంటింట్లోకి వెళ్లింది నాయనమ్మ.
ఆ తరువాత అక్క వచ్చిన రెండుమూడు రోజులకు మళ్లీ ఓసారి ఆవిడ నాయనమ్మను అడిగిందట. “చిన్నపిల్లను ఇయ్యమంటే వయసు తేడా అంటిరి. మరి వాండ్ల అక్కను ఇస్తే చేసుకుంటం. ముద్దుగ ఉన్నది ఈ పిల్ల కూడా!” అని. “ఆ పిల్లకు గూడ ఏమంత వయసని? పదహారే! అది గూడ చదువుకుంటున్నది. వాండ్ల అమ్మా నాయినలు ఇప్పుడే పెండ్లి చేయరట!” అని ఏదో సర్ది చెప్పిందట నాయనమ్మ. కానీ, ఆ పరంపరలో అక్కకోసం నాలుగైదు సంబంధాలు వచ్చాయని నాయనమ్మ చెప్పింది. ఆ తరువాత కాలేజీకి వెళ్తూ ఆయన్ని రెండు మూడుసార్లు వాళ్లింటి గేటు ముందు చూసాను. మా చిన్నాయనంత వయసు, మామూలుగానే ఉన్నాడు. అయినా, అప్పుడు మగవాళ్లను అంతగా తేరిపార చూసేంత ధ్యాస నాకు లేదు. ఆయనేమీ ప్రత్యేకంగా నన్ను చూసినట్టు నాకూ అనిపించలేదు. నిజానికి వాళ్లమ్మ అలా అడిగినట్టు అతనికి తెలుసో లేదో కూడా!
రెండు మూడు రోజుల తరువాత లక్ష్మి వాళ్లింటికి వెళ్లాం. అప్పటికే వాళ్లింట్లో కింది అంతస్తును ‘గంపా ప్రింటింగ్ ప్రెస్’ వాళ్లకు అద్దెకు ఇచ్చినట్టున్నారు. నేనూ, అక్కా పైకి వెళ్లాం. ఆ మర్నాడు ప్రెస్ యజమాని భార్య ఊరికే చిన్నమ్మతో మాట్లాడ్డానికి పైకి వచ్చింది. గుడికి వెళ్లి వచ్చినట్టుంది. పెద్ద బొట్టుతో, తలలో వేలాడే పొడవాటి పూలదండ పెట్టుకుని, ఏదో సిల్కు చీర కట్టుకుని ఉంది. మెడలో మూడు నాలుగు నగలు, చెవులకు పెద్ద కమ్మలు, రెండు చేతులకూ చెరో డజను గాజులూ వేసుకుని క్యాలెండర్లో లక్ష్మీదేవిలా ఉంది. కాకపోతే, ఈవిడ కొంచెం నల్ల లక్ష్మీదేవి.. అంతే!
మేము ఆ సమయానికి ఏవో ముచ్చట్లు చెప్పుకొని విరగబడి నవ్వుకుంటున్నాం. ఇంతలో చిన్నమ్మ పిలవడంతో గప్‌చుప్‌గా బయటి హాల్లోకి వచ్చి నిలబడ్డాం. ఆమె ఏ మాత్రం సంకోచం లేకుండా స్కానింగ్ చేసినట్టుగా మమ్మల్ని కిందికీ మీదికీ చూడటం మొదలుపెట్టింది. ఆ చూపులు నన్ను ఎంతో ఇబ్బంది పెట్టినా ఏమీ చేయలేక, కాసేపు అక్కడే ఉన్నట్టు చేసి ఒక్కొక్కళ్లమూ బయటపడ్డాం.
ఆవిడ వెళ్లిపోయాక దేవన్న వచ్చి.. “కంగ్రాట్యులేషన్స్!” అని నాతో అన్నాడు. “ఎందుకూ?” అన్నాను నేను అయోమయంగా. చిన్నమ్మ ముసిముసిగా నవ్వుతోంది. “అయ్యో! నువ్వెంత లక్కీనో తెలుసునా? మంచిగ కోటీశ్వరులు నిన్ను చేసుకుంటరట. బొచ్చెడు బంగారం, ఒంటినిండ నగలు ఏసుకోవచ్చు. ఇంకేంది!” అని నన్ను బనాయించడం మొదలు పెట్టాడు. నేనింకా ఎడ్డి మొహం వేసాను. పద్మ చిన్నమ్మ నవ్వాపుకొని.. “ఇంతకుముందు ఒచ్చినామెకు మన రామయ్య (అంటే నేనన్న మాట) బాగ నచ్చిందట. వాండ్ల కొడుక్కు చేసుకుంటదట. కావాల్నంటే ఎదురు కట్నం ఇస్తదట. మొత్తం బంగారమంత పెడతదట. తెల్ల పిల్లను చేసుకుంటె తెల్ల పిల్లలు పుడతరట. వాండ్ల ఇండ్లల్ల ఎక్వమంది నల్లగ ఉంటరు గద!
ఎట్లనన్న ఒప్పియ్యమని అడుగుతుంది. చదువుకుంటె చదివిస్తరట!” అన్నది. నాకు ఎందుకో ఆ పెళ్లి మాటలు, ఆ వ్యవహారం అంటే చిరాకు పుట్టింది. “ఆమె అనుకుంటె చాలా? నేను జేసుకుంటనా!? నాకిష్టం ఉండొద్దా?” అన్నాను కోపంగా. ఒక పక్కన దేవన్నేమో.. “పాపం, చేసుకోరాదు! బాగ ఆశపడుతుంది. మంచిగ ఒంటి నిండ బంగారం పెట్టుకోవొచ్చు. చదివిస్తరట గూడ! తెల్ల పిల్లలు పుడితే ఎత్తుకొని ఆడిస్తది. ఎప్పుడన్న మేం గూడ ఒచ్చినప్పుడు ఎత్తుకుంటం. అన్నట్టు పొద్దున ఏం నగలేసుకుంటవు, మధ్యాన్నం ఏవి, సాయంత్రం ఏవి? రోజొక రకమా? పూటకొక రకమా?” అని నవ్వడం మొదలు పెట్టాడు. “ఏ! ఆ పిల్లగాడు ఏం బాగుండడు. నల్లగ తుమ్మ మొద్దు తీరుగ ఉంటడు. అయినా, ఎందుకట్ల రమను అంటున్నరు?” అని నా రెస్క్యూకి వచ్చింది లక్ష్మి.
ఇంకా నవ్వుతున్న దేవన్నను చూసి నాకు చిర్రెత్తుకొచ్చింది. అయినా మొదట్నుంచీ నేను జోకుల్ని స్పోర్టివ్‌గానే తీసుకునేదాన్ని. “సరేలే! నవ్వితే నవ్వినవ్ గానీ, ఆ పిల్లగానికి ఓ అక్కో, చెల్లో ఉంటె చూడరాదు. నువ్వు చేసుకుందువు! మంచిగ నీకు కూడా బోలెడు కానుకలిస్తరు. ఇద్దరికి అత్తగారిల్లు ఒక్కటే ఉంటది!” అన్నాను నవ్వుతూనే. “అబ్బో! నిజంగ అయినట్టే! నన్ను ఏమంటుందో చూడమ్మా!” అని చిన్నమ్మకు ఫిర్యాదు చేసాడు. “మరి! ఆమెనంటే ఊర్కుంటదా! మంచిగన్నవురా!” అని చిన్నమ్మ నన్ను సపోర్టు చేసింది. మొత్తానికి ఆమె రెండు మూడుసార్లు అడిగి వదిలేసింది. అక్కడ మిగతా వాళ్లుండగా ఆమె నన్నే ఎందుకు టార్గెట్ చేసిందో నాకు అర్థం కాలేదు.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి