ఎవరైనా సరే, పాఠ్యపుస్తకాల్లోని పాఠాలు నేర్చుకున్నంత మాత్రాన సరిపోదు. జీవితంలో ఒక్కో అనుభవం ఒక్కో పాఠాన్ని నేర్పుతుంది. కొన్ని పరిస్థితులు, కొందరు మనుషులు, కొన్ని పరిసరాలు మనకు ఎన్నెన్నో నేర్పిస్తాయి. అలా జీవితాంతం మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే వుంటాం.
హైదరాబాదు జీవితం నాకు పదిహేనేళ్ల వయసులోనే జీవితపు బడిలో తరగతి గదిలా వుపయోగపడింది. మనుషులు పైకొకటి, లోపలొకటిగా ఎలా వుంటారో, వంకర మాటలు, వెటకారపు మాటలు, ఎగతాళి మాటలు, దురుసు మాటలు మాట్లాడి మనసుల్ని ఎలా గాయపరుస్తారో తెలిసింది. కొందరు కొంచెం కటువుగా మాట్లాడినా మన మంచికోసమే చెబుతారు. ఇంకొందరు నవ్వుతూ మాట్లాడినా వారి మాటల్లో ఏదో వెక్కిరింత దాగి వుంటుంది. కొందరు బోళాగా మనసులో ఏదున్నా పైకి చెప్పేస్తూ వుంటారు. ఇంకొందరు మనమంటే మనసా వాచా ఇష్టపడి ఆ వాత్సల్యాన్నీ, ప్రేమనూ తమ చేతల ద్వారా తెలుపుతుంటారు. ఇవన్నీ అనుభవంతోనే తెలుస్తాయి. కొందరికి ఎన్నేళ్లయినా తెలియదు కూడా.
హైదరాబాదు నాయనమ్మ చాలా మంచిది. మాట సూటిగా వుండేది, కొన్నిసార్లు కటువుగా అనిపించేది. కానీ, ఆమె చాలాసార్లు వాస్తవమే మాట్లాడేది. ఓరోజు ఉదయాన్నే నేను కాలేజీకి, గోపిక చిన్నమ్మ పిల్లలు హరిత, సీను స్కూలుకు వెళ్లాల్సి ఉంది. కానీ, వేణ్నీళ్లు కాగలేదు. పిల్లలిద్దరూ హిమాయత్‌నగర్‌లో ఉన్న స్కూల్‌కి వెళ్లాలి, నా కాలేజీ కూడా తొమ్మిది గంటలకే. వాళ్లిద్దరూ చేశాక నేను స్నానం చేసేసరికి నీళ్లు కాగలేదు.
అది చలికాలమో, వర్షాకాలమో అనుకుంటా. వాళ్లింట్లో బప్కాలో ( బాయిలర్) నీళ్లు కాగబెట్టేది. ఇత్తడిదో, రాగిదో సరిగా గుర్తులేదు గానీ, పైన పెట్టి తీసేలా మూత ఉండి ఓ పక్కగా నల్లాతో సిలిండర్ ఆకారంలో ఆ బప్కా వుండేది. అది మూడు కాళ్ల ఇనుప స్టాండు మీద నిలబెట్టి వుండేది. మధ్యలో నిలువుగా ఒక ఇనుప గొట్టం. దాని చివర అడుగున ఇనుప క్లిప్స్ మధ్యలో ఇమిడేలా ఒక పొడవాటి కాడతో ఉన్న వెడల్పాటి జాలీ గరిటె. కింద బొగ్గులు వేసి, కొంచెం కిరసనాయిలు (గ్యాసునూనె) పోసి వాటిని అంటించాక పైనున్న గొట్టం నుంచి సన్నటి కట్టెలు రెండు మూడు వేస్తుంటే అవి మెల్లగా అంటుకుని మండి బప్కాలో నీళ్లు కాగేవి. ఎవరు నీళ్లు తీసుకున్నా పైన మూతకున్న పెద్ద రంధ్రంలోంచి మళ్లీ నీళ్లు పోసేవాళ్లం.
ఇంతకూ నేను చన్నీళ్లతో స్నానం చేసిన విషయం నాయనమ్మకు తెలిసిందేమో, ఆమె అన్న మాటలు నా చెవినబడ్డాయి. ‘గా చన్నీళ్లు చేసుడెందుకు? పొద్దున ఎట్లాగూ లేస్తునే ఉండే, గా బప్కా అంటుపెడితె తప్పా? ఆడపిల్లాయే, పని నేర్చుకుంటె మంచిదే గద! ఎంత గార్వంగ పెరిగితేంది, రేపు అత్తగారింటికి పోతె చేసుకోవొద్దా?’ అని. ఆ మాటలు నన్ను ఉద్దేశించి అన్నవేనని నాకు అర్థమయింది. ఆ ఇంట్లో ఏమేం పనులుండేవో నాకు తెలియదు. రోజూ నాయనమ్మే మడి కట్టుకుని వంట చేసేది. చిన్నమ్మలు టీ టిఫిన్లు చేయడం, కూరగాయలు కోసివ్వడం వంటి పనులు చేసేవారు. ఇల్లు ఊడ్చి, అంట్లు తోమి, బట్టలు ఉతకడానికి పనిమనిషి వుండేది. ఇంక నాకు పనేమి వుంటుంది? అక్కడికీ ఆమె తోమిన గిన్నెలు మళ్లీ నల్లా దగ్గర తొలిచి యింట్లో పెట్టేదాన్ని.
మొక్కలకు నీళ్లు పెట్టేదాన్ని. మార్కెట్‌కు వెళ్లి అప్పుడప్పుడూ కూరలు తెచ్చేదాన్ని. సీనూని ఎత్తుకుని ఆడించేదాన్ని. అయినా ఈ పని చెయ్యి అని నాకు చెబితే చేస్తాను గానీ, చెప్పకుంటే నాకు ఎలా తెలుస్తుంది అని ఎంతో బాధపడ్డాను. ఆ మర్నాటి నుండే ఒకటి రెండు సార్లు చెయ్యి కాల్చుకుని మరీ రోజూ బప్కా నేనే అంటుపెట్టడమే కాదు, కింద బూడిద దులపడం లాంటివి కూడా చేసేదాన్ని. నిజానికి నాయనమ్మ అన్న విధానానికి బాధేసింది కానీ, ఎవరింటికైనా వెళ్లినపుడు వాళ్లకు ఏదైనా పనిలో సహాయం చేయాలనీ, కనీసం వాళ్లను అడగాలనీ ఒక పాఠం నేర్చుకున్నాను.
ఆ ఇంటి వెనుక భాగంలో కూడా కొంచెం ఎత్తు తక్కువలో గోడనానుకుని వరుసగా మూడో నాలుగో గదులుండేవి. అందులో నాయనమ్మ తమ్ముడు, మరదలు, వాళ్ల ముగ్గురు పిల్లలుండేవారు. ఆయన బొల్లారమో, బోయినపల్లినో స్కూల్లో టీచర్‌గా పనిచేసేవాడు. ఆ అమ్మమ్మ పిలిస్తే అప్పుడప్పుడూ వెళ్లి వాళ్లింట్లో కూర్చునేదాన్ని. ఒకరోజు ఆమె ‘నువ్వు బప్కా అంటించుడు నేర్చుకున్నవు గద, మెల్లగ అన్నిపనులు నేర్చుకో’ అంటూ మొదలుపెట్టి ‘మరి మీ ఇంట్ల బప్కా లేదా?’ అనడిగింది. మా ఊరు, మా ఇల్లు అనగానే ఉత్సాహంతో.. ‘మా ఇంట్ల గీ బప్కా వుండదు, మా పెరట్ల బాగ కట్టెలు పేర్చి వుంటయి. పెద్ద రాళ్లున్న కట్టెల పొయ్యి మీద కొప్పెర ఉంటది. పొద్దున్నే దాన్నిండ నీళ్లు చేది నింపి మా జీతగాడే నీళ్లు కాగపెడతడు. మేము తోడుకోని మళ్ల నీళ్లు పోస్తం. మా అమ్మ, నానమ్మ కూడా నీళ్ల పొయ్యి అంటుపెట్టరు’ అని చెప్పాను.
మరో రెండ్రోజులకు అనుకుంటా.. ఓ రోజు సాయంత్రం అందరూ వుండగానే చిన్న చిన్నాయన నాతో ఏంది? మా మామయ్య వాళ్లింటికి పొయ్యి మీ గొప్పలన్నీ చెప్తున్నవట గద! ‘మాకు అవన్ని లేవని ఇన్సల్ట్ చేసినట్టే కద!’ అని మామయ్య ఫీల్ అయితున్నడు. నువ్వసలు వాళ్లింటికి పోవుడు ఎందుకు? ఆ ముచ్చట్లన్ని పెట్టుడెందుకు? చదువుకుంటు కూచోక!’ అన్నారు. నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమే నన్ను పిలిచి అన్ని విషయాలూ అడిగింది చిన్నాయనా!
అని చెప్పాలని నా అభిప్రాయం, కానీ ఏదో భయం వల్ల నా నోట మాట పెకల్లేదు. అక్కడినుంచి వచ్చేసాను.
తరువాత ఆలోచిస్తే కొంచెం కఠినంగా అనిపించినా చిన్నాయన మాటలో తప్పేం లేదనిపించింది. నా కోసమే కదా చెప్పారు అనుకున్నాను. మన విషయాలు మనకు బావుంటాయి గానీ, అవతలివాళ్లకు ఏం గొప్ప? అలా పిలిస్తే వెళ్లినా, అడిగితే చెప్పి నా మన గొప్పలు మనమే చెప్పుకోకూడదు అని అర్థమయింది. చిన్నమ్మలు మాత్రం ఏ విషయంలోనూ నన్ను ఏమీ అనలేదు, పైగా నాతో ఎంతో ఫ్రెండ్లీగా వుండేవారు. ఇంటికొచ్చినవారితో ఎలా మాట్లాడాలో, మర్యాదగా ఎలా ప్రవర్తించాలో వాళ్లను చూసి నేర్చుకున్నాను.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి