నవరసాల్లో అద్భుతం ఒకటి. గారడి విద్య మనుషులను ఆ అద్భుతరసంలో ఓలలాడిస్తుంది. ఇంత అసామాన్య కళ నేర్చినవారు, ఎందుకు పేదరికంలో ఉంటారు. ప్రాణాంతకమైన విద్యను ప్రదర్శించి, ఎందుకు అడుక్కుంటారో తెలియక ఎంతోమంది జానపద కళలను చులకన చేస్తారు. ఆ కళాకారులను అవమానిస్తారు. విషాదమేమంటే… ఇది ఇప్పటికీ జరుగుతున్నదే! ఈ ఇతివృత్తానికి దేశభక్తిని జోడించిన నాటిక ‘గారడి’కి మరింత వన్నె తెచ్చింది.
‘నేర్చుకున్న విద్యతో ప్రజలను అలరించాలి. ఆలోచింపజేయాలి. జాగృతం చేయాలి. ప్రజల ఆదరణతోనే బతకాలి. కళని బతికించుకోవాలి. ప్రజలను మోసగిస్తూ… అడ్డదారులు తొక్కకూడదు. అదే కళా జీవిత పరమార్థం’ అనే నమ్మిక గలవారు గారడి కళాకారులు.
గారడీ కళాకారులు తిమ్మిని బమ్మి చేసే నేర్పరులు. అద్భుతంగా పాడుతారు, అంతే ఇదిగా ఆడుతారు. నటిస్తారు.. అనూహ్య విన్యాసాలు చేసేస్తుంటారు. ఎత్తులో బిగించిన తాడుపై గడ పట్టుకుని పడిపోకుండా వీరి పిల్లలు నడుస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ రంగభూమిపై సమయస్ఫూర్తితో కుటుంబ సమేతంగా చేసే స్వైర విహారం చేస్తూ ఆహూతలను కట్టిపడేస్తుంటారు. ‘ఇన్ని అద్భుతాలు ఎట్లా చేశారయ్యా?’ అని అడిగితే.. ఒక ఈల వేసి… ‘తావీజు మహిమ’ అంటూ తన కష్టానంతా ఏ మహత్తూ లేని తాయత్తుకు అంటగడతారు. నడివీధులే వీరి రంగస్థలం. గారడి విద్య ప్రదర్శించేవారు నిరుపేదలు. ఎక్కువమంది సంచార జాతులవారు. తరతరాలుగా పారంపర్యంగా వస్తున్న జానపద కళల్లో ఇదొకటి.
ఆ గారడి కళనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఓ కుటుంబ గాథ ఇది. గారడి ప్రదర్శించే నిరుపేద దంపతులకు ఒక్కగానొక్క కొడుకు ఉంటాడు. బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంటారు. విద్యాబుద్దులు నేర్పిస్తారు. కొడుకు ఉన్నదాంట్లోనే సర్దుకుంటూ ఉన్నత చదువులు చదువుకుంటాడు. అతనికి సరైన ఉద్యోగం దొరకదు. ఉద్యోగం రాని అసంతృప్తి, తమ వృత్తి గురించి, సామాజిక జీవన స్థితి గురించి తోటి స్నేహితుల మధ్యన చెప్పుకోలేక అసహనంతో ఉంటాడు. డబ్బు సంపాదిస్తే చాలు జీవితంలో ఎన్ని అడ్డంకులైనా దాటవచ్చని భావిస్తాడు.
ఆ డబ్బుతో ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చని నమ్ముతాడు. ఉగ్రవాద ముఠాలు ఇలాంటి యువకుల కోసం ఎర వేస్తుంటాయి. దేశంలో దళారీలకు బ్రోకర్లకు ఏం కొదువ? ఆ ముఠాల ఎరకు చిక్కుతాడు ఈ యువకుడు. హైదరాబాద్లో బాంబు దాడికి పాల్పడతాడు. ఆ సమయంలో అదే ప్రాంతంలో ఉన్న యువకుడి తల్లికీ గాయాలవుతాయి. ఆమెకు రెండు కాళ్లు చచ్చుపడిపోతాయి. భర్త సపర్యలు చేస్తుంటే ఆమె భారంగా బతుకీడుస్తుంటుంది!
కొన్ని రోజులకు ఆ యువకుడు డబ్బుతో తిరిగి ఇంటికి వస్తాడు. తల్లి పరిస్థితిని చూసి హతాశుడవుతాడు. జరిగిన ఘోరం తెలిసి.. అందుకు తానే కారణమని తెలిసి కుమిలిపోతాడు. కానీ, ఉగ్రవాదుల ఊబిలో పీకలదాకా కూరుకుపోయిన యువకుడు అచేతనుడిగా మిగులుతాడు. కొడుకు దురాగతాలను పసిగట్టిన తండ్రి, స్వహస్తాలతోనే తల్లి ఎదుటే కొడుకును అంతం చేస్తాడు. కన్న కొడుకైనా దేశద్రోహిగా మారితే అంతం చేయాల్సిందే అని నాటకం సందేశాన్నిస్తుంది. ‘ఎగరాలి ఎగరాలి మన మువ్వన్నెల జెండా ఎగరాలి’ పాట సాగుతుండగా ఆ తల్లి కాళ్లకు సత్తువ రావడంతో నాటకం ముగుస్తుంది.
నాటిక మధ్యమధ్యలో మెలో డ్రామా సాగినా, ఉగ్రవాద ప్రమాదం వెన్నంటి ఉండటం వల్ల నాటిక ప్రేకక్షుల్ని మెప్పిస్తుంది. దాదాపు పదిహేను ఏండ్ల కిందట పుట్టి, ఎన్నో బహుమతులు గెలుచుకున్న గారడి నాటిక విజయవాడ హనుమంత గ్రంథాలయంలో వేదిక ఆధ్వర్యంలో మళ్లీ ప్రదర్శించారు. టికెట్ కొని నాటకం చూడాలన్న లక్ష్యం కలిగిన రసరంజని (హైదరాబాద్) బాటలోనే… వేదిక (విజయవాడ) సంస్థ ప్రదర్శన నిర్వహించడం అభినందనీయం.
ప్రదర్శన పేరు: గారడి
నిర్వహణ: వేదిక
సమర్పణ: ఉషోదయా కళానికేతన్
రచన, దర్శకత్వం: చెరుకూరి సాంబశివరావు
పాత్రధారులు: అమృతవర్షిణి, సూర్య,
డాక్టర్ బాబు, వేంకటేశ్వరరావు,
సాంబశివరావు, విశ్వం, మణికంఠ
…? కె. శాంతారావు, రంగస్థల నటుడు, విశ్లేషకుడు