రాత్రి తొమ్మిదవుతున్నది. జోరున వర్షం. కిటికీ పక్కన కూర్చొని, వీధిలైటు వెలుగులో కనిపిస్తున్న వర్షపు చినుకులను చూస్తున్నాను. సవ్యసాచి సంధించి బలంగా వదిలిన శర పరంపరలా.. వాన చినుకులు ధరణికి అభిముఖంగా ఏటవాలుగా కురుస్తున్నాయి. వేసంగి తాపానికి బాగా మగ్గిన శరీరానికి.. తొలకరి చినుకుల్లో తడిసి, మెత్తగా తగులుతున్న చిరుగాలి స్పర్శ ఆహ్లాదకరంగా ఉంది. అప్పుడప్పుడూ ఒకటీ అరా వాహనాలు వైపర్స్‌తో అద్దాలు తుడుచుకుంటూ హడావుడిగా వెళ్తున్నాయి. పక్కింటి ఐటీ వామనరావు వాళ్ల ఇంటిముందు కారు ఆపి, గేట్ తెరవడం కోసం హారన్ కొడుతున్నాడు.
“తాతయ్యా! అమ్మ భోజనానికి రమ్మంటోంది”.
తల తిప్పి చూశాను. మనవరాలు మృదుల నిల్చొని ఉంది. కారు హారన్ సౌండ్‌లో నాకు వినపడలేదు కానీ.. ఆ పిలవడం రెండోసారో, మూడోసారో అనే ధ్వని ఆ పిలుపులో స్పష్టంగా కనిపిస్తున్నది. తలతిప్పి చూసేసరికి మరోసారి డైలాగ్ అప్పజెప్పి.. రివ్వున వెళ్లిపోయింది.
ఒంట్లో నలతగా ఉండి, వాకింగుకెళ్లి రెండు రోజులయింది. కడుపు నిండుగా ఉంది. మధ్యాహ్నం తిన్నది అలాగే ఉన్నట్టుంది. వర్షం పెరగడం లేదు. అలాగని తగ్గడం లేదు. వర్షధ్వని ఒకే లయలో వినిపిస్తున్నది. అయిదు నిమిషాల తర్వాత మృదుల మళ్లీ వచ్చింది.
“తాతయ్యా! అమ్మ త్వరగా రమ్మంటోంది”.
“నాకు ఆకలిగా లేదమ్మా! ఈ పూటకు పాలు తాగి పడుకుంటాలే! మీరు తినండి”.
మృదుల వెళ్లిపోయింది. ‘ఆకలి’ అనే పదం అప్రయత్నంగా మరో రెండుసార్లు నా నోట్లోంచి అస్పష్టంగా వినిపించీ వినిపించక.. బయటికి వచ్చింది. ఆకలి.. డెబ్బయ్యేళ్ల నా జీవితంలో ఆ పదం నా చెవిన పడిన ప్రతిసారీ, వెంటనే ఒకానొక దృశ్యం కళ్లముందు అలా కదలినట్టయి ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోతాను. ఇప్పుడూ అదే జరిగింది. చిన్ననాటి ఆ సంఘటన నా కళ్ల ముందు సినిమా రీలులా కదిలింది.
* * *
అప్పుడు నాకు అయిదారేళ్లు ఉంటాయేమో!?. కర్నూలు సత్యనారాయణ స్వామి గుడి పక్కనున్న బొగ్గు గనులకు ఎదురుగా, నంద్యాల రోడ్డు పక్కన యాప చెట్టుకింద ఒక ఇంట్లో బాడుగకు ఉండేవాళ్లం.
ఆ రోజు పగలు ఎప్పుడు పడుకున్నానో గుర్తు లేదు కానీ, లేచే సరికి బాగా ఆకలేస్తున్నది. బైటికి వచ్చి చూస్తే.. యాప చెట్టు నీడ సూరిగాడి ఇంటిముందు కట్టేసిన మేకపిల్ల మీదకు పోయింది. అంటే.. పైటాల దాటిపోయిందని అర్థం. అందుకే ఆకలిగా ఉంది. బాగా నీర్సంగా గూడా ఉంది. మాయక్క యాడికి పోయింటాది. ఆస్పత్రికే పోయింటది. మా యమ్మకు చయ జబ్బంట. అందుకే పెద్దాసుపత్రిలో చేర్పిచ్చినాం. అసలు మా యమ్మను ఆస్పత్రిలో సూపించనీకే మేము ఈ కర్నూలు వచ్చినామంటా. మా యక్క అప్పుడప్పుడు సెప్తాది.
రోడ్డు శానా ఎత్తు మీదుంది. అందుకే మెల్లగా పాక్కుంటా రోడ్డెక్కినాను. బద్దరంగా రోడ్డు దాటినాను. సత్యనారాయణ స్వామి గుడి కాటికి రాంగానే.. మద్దిలేటి ఓటల్ల రెండు పైసల బిస్కట్ బన్నులు కంటపడినై. ఓటలంటే పెద్ద ఓటలు గాదు. గుడి గోడ నానుకొని చిన్న వారపాకు. దాని కింద ఒక టేబులు. పక్కన నాపరాళ్లతోటి కట్టిన బెంచీ. టేబులు మీద సీసాలో బిస్కెట్లూ, బన్నూ సూడగానే నోరూరింది. ఆ బెంచి మీద కూసోని, గాజు పలకల గిలాసలో, కాపీల బన్ను అద్దుకొని తినాలని.. ఆ ఓటలు సూసినప్పుడల్లా అనిపిస్తది. అట్టా తినేటోల్లను మస్తుమందిని సూసిన. అందుకే ఆడికి రాంగానే అది గుర్తుకొస్తాది. మల్ల మల్ల ఎనుకకు తిరిగి, ఆ బన్నుకెల్లి సూసుకుంటా ముందుకు పోతాంటే, కాలికి రాయి తగుల్కొని బోర్లా పడినా. ఓటలు కాడున్న ఒక మనిసి బెరీత వురికొచ్చి, నన్ను లేపి నిలబెట్టినాడు.
“ముందు సూసి నడ్సు మొగోడా!“ అన్న్యాడు.
మోచేయి కొంచెం దోక్కపోయింది. నోట్లోంచి ఉమ్మి తీసి దానికి రాసినా. దెబ్బ తగిల్తే అట్టా జేయాల్నని మా యమ్మ జెప్పింది. గుండూడి పోయి, సెల్లాడం జారిపోతున్నది. దాన్ని మీద్కి గుంజుకొని, మొల్తాడు ఎక్కిచ్చినా. మెల్లిగా కినాల్ కట్ట దాటినా.
పెద్దాసుపత్రిలోకి పోవాల్నంటే ఆ…డున్న పెద్ద గేటి కాట్కి పో పన్లా. కినాల్ కట్ట దాటినాంక ఆసుపత్రి గోడకు సన్న బొక్క ఉంటాది. దాంట్ల దూరి కాలి బాటెంబడి పోతె.. ఆసుపత్రి ఎనకాల ఎర్రపూల సెట్లకాడ చయ వార్డుంటది. మా యక్కా, నేనూ ఎప్పుడు పోయినా ఇట్టానే పోతం.
తీరా మా యమ్మ కాడికి పోయేతాలికి, మంచమ్మీద మా యమ్మ లేదు. నేను ఉరికి బైటికొచ్చిన. వార్డు పక్కన సెట్టుకింద ఇస్కల మా జేజి కూసోనుంది. నన్ను సూడంగానే..
“పాపోడూ! ఇక్కరా! మీ యమ్మను పరీచ్చలు జేపియ్యనీకి తోల్కబొయినారు” అనింది.
“మల్ల అక్క?”.
“అక్క గూడ్క బోయింది. వస్తార్లె! కూసో… ఇంద… ఈ బన్ను తిను!” అనింది.
‘బన్ను’ అనంగానే మల్ల నోరూరింది. జేజి తన పాతబట్టల ముల్లె ఇప్పి.. దాంట్లోంచి మల్ల ఒక సన్న ముల్లె ఇప్పి, ఎర్రెర్ర గీతలున్య కాయితంలోపల సుట్టి పెట్టిన బన్ను తీసిచ్చింది. ఆ బన్ను తీస్కొని గబుక్కున నోట్ల పెట్టుకొని, తుపుక్కున ఊసేసిన. బన్ను పాసిపోయింది. బాగా వాసనొస్తాంది. నోరంతా ఎట్టనో ఐపోయుండాది. బన్ను అనంగానే.. రెండు పైసల బన్ను లాగుంటది అనుకుంటి.
“పాపోడూ! ఏందిరా అట్ట ఉమ్ముతివి!?” అనింది మా జేజి.
“తూ… వాసనొస్తాంది!” అన్యా.
“వాసన రాని బన్నులు మీ నాయన సంపాచ్చి పెట్టి నాడుపో!” అనింది జేజి.
నాకు ఎంటనే మా నాయన గుర్తుకొచ్చినాడు. గిరుక్కున తిరిగి రోడ్డు మీదికొచ్చినా. మా నాయన సీ క్యాంపిల సుబ్రమన్నెం డిపోల కట్టెలు గొడ్తాడు. నన్ను సూస్తానే గొడ్డలి పక్కన పడేసి…
‘పులిపిల్ల.. పులిపిల్ల వచ్చినాది’ అని ఎదురొచ్చి నన్ను ఎత్తుకుంట్యాడు. కాసేపైనాంక.. ‘పో! సిన్నెంకటి మామ కాడ బెల్లం చెర్కు తెచ్చుకోపో!’ అని.. ‘ఒహోయ్! నీ అల్లుడొస్తున్యాడు బెల్లం చెర్కు కొట్టు’ అంటాడు. కాసేపాగి.. ‘మంచిజ్జూసి కొట్టు’ అని చెప్తాడు.
నేను బొయ్యి బెల్లం చెర్కు తెచ్చుకొని.. అవతాల, ఇవతాల కణుపుల కాడికి మెల్లగా ఈనెలు ఒల్చుకొని నమిలి, నడిమిట్లోది నాయనకిస్చా. ఆయినె రప్పరప్ప ఈనెలు ఒల్చి, కణుపులు కొరికి సన్నసన్న ముక్కలు సేసి నా కిచ్చేటోడు. బెల్లం చెరుకులు తల్చుకొనే తాల్కి నోట్ల నీళ్లూరినాయి.
మెల్లిగా కినాల్ కట్ట దాటినా, మద్దిలేటి ఓటల్ల సూరిగాడు బెంచీ మీద కూసోని, కాపీల బన్ను అద్దుకొని తింటున్యాడు. పక్కన్నే ఆల్ల నాయనున్యాడు. బన్ను సూడగానే, మల్లా కడుపుల ఆకలి గుర్తుకొచ్చినాది. ఎందుకో.. నాకు సూరిగాడికెల్లి సూడబుద్ధి కాలే. ఆన్ని సూడనట్టుగానే నేరుగా ముందుకొచ్చినా. బొగ్గు గనిల ఇనుప చక్కురాల టాక్టారు గని బొక్కల్ని బూడ్చుతాంది. టాక్టారు ముందు పెద్ద ఇనుప రేకు అసొంటిది ఉంటది. దాంతో ఆడీడ మన్ను కువ్వ జేసుకొని, తీస్కబోయి గని బొక్కలోకి నూకుతది. నేను మా యమ్మెంట రెండు మూడు సార్లు, బిర్ల కంపెనీ సబ్బునీళ్ల కాలవల బట్టలు ఉతుకనీకి బోయినప్పుడు సూసినా. ఇప్పుడు ఆ టాక్టారు కాడ జనం మూగినారు. ఏందో అని పోయి సూసిన. టాక్టారు ఒక గనిలోన్కి పోయి ఇర్కపోయింది. బైటికి తియ్యనీకి తంటాలు బడ్తుండారు. నేను శానాసేపు నిలబన్యా. యాశీర్కొచ్చి, కడుపుల ఆకలి గుర్తుకొచ్చి, మల్ల రోడ్డు మీదికి ఒచ్చినా.
రెండు రోడ్ల మధ్య పసుప్పచ్చ సిమెంటు రాయి ఉంది. నడ్సనీకి శాతగాక ఆ రాయిమీద కూసున్నా. దాని మీద అచ్చరాలున్నాయి. ఒక్కెల్లి నంద్యాల అనీ, మరొక్కెల్లి గుత్తి, అనంతపురం అని.. వాటెన్కాల కర్నూలు అని రాసుంటదని మా యన్న సెప్పినాడు. నాకు సదవనీకి రాదు గాని, మా యన్న సెప్పింది గుర్తుంది. మా యన్న ఉస్సుమానియా కాలేజీల పేద్ద సదువు సదువుతున్నడు. మా ఇంట్ల ఉండడు. యాన్నో దూరాన ఆస్టల్ల ఉంటాడంట.. మా యమ్మ జెప్పింది. కిందికి దిగి ఆ రాయి ముందల.. మోకాళ్ల మీద కూసున్న. పచ్చరంగు మీద అచ్చరాల గుంతలుల్ల నల్ల రంగేసినారు. నేను సూపుడు ఏలు అచ్చరాల మీద పెట్టి.. ఆ ఊరు పేర్లు సదువుకుంటా దిద్దుతున్నా. యా రోడ్డు యా ఊర్కు బోతదో నాకు తెల్సు కదా!
“ఓయ్ బొట్టు సామీ! ఆడేం జేత్తున్నావ్?” అని ఇనిపించే తాల్కి.. ఎనిక్కి తిర్గి సూసినా.
సూరిగాడు అంగితో మూతి తుడ్సుకుంటా వస్తున్నాడు.
“ఏం.. ల్యా” అని, మల్ల ఆడు దగ్గరి కొచ్చినాంక.
“మా యక్క ఆసుపత్రి కాడుంది. నాకు బాగా ఆకలైతుంది” అన్యా.
“మద్దిలేటి ఓటల్ల బన్ను రొట్టె తింటవా?” అన్యాడు వాడు.
నాకు నోటెంబడి మాట రాల్యా! తలకాయ మాత్రం ఊపినా. నా మడుసుల.. ‘ఆడు తినిపియ్యడులే!’ అనిపిచ్చింది.
“నువ్వు ఓ పంజెయ్యాల” అన్యాడు.
నాకు కొంచెం ఆశ పుట్టింది.
“ఓ!..” అన్యా.
“ఐతే.. నా యెంట రా!” అన్యాడు.
వానేనకాల్నే నడిసినా. రోడ్డు దాటి మా ఇంటి కాడికి ఒచ్చినాం.
నన్ను మా ఇంటిముందల చిన్న గద్దెమీద కూసోబెట్టి..
“ఉండు ఇప్పుడే ఒస్తా” అని.. ఆళ్లింట్లోకి పోయినాడు.
కాసేపున్యాక ఒక సలాకి తీసుకొచ్చి..
“దీన్ని పట్కున్నవంటే బన్ను రొట్టె తినిపిస్చా!” అన్యాడు.
నేను మరింకేమీ ఆలోచన లేకండా.. టక్కున దాన్ని పట్టుకొన్న. ఎంటనే..
“అమ్మా! సస్తినే..” అని అరచి, చెయ్యి ఇదిలిచ్చుకుంటా కింద మన్నుల వడి దొర్లుతున్నా.
అంతల్నే సూరిగాడు..
“అట్ట వదిలెయ్యగూడ్దు! అట్నే కొంచేపన్నా పట్కోవాలా.. నేను నీకు బన్ను తినిపియ్యను పో!” అని సలాకి పడేసి ఉర్కినాడు.
అప్పుడే మా యన్న సైకిల్ మీద ఒచ్చినాడు. నన్ను అట్ట సూడంగానే.. సైకిల్ స్టాండు గూడ్క ఎయ్యకుండా, ఆడ బడేసినాడు.
ఉరికచ్చి నన్ను లేపి, గద్దె మీద కూసోబెట్టినాడు
“ఏమైంది రా” అని అడిగినాడు.
నేను ఏడ్సుకుంటానే అంతా సెప్పినా. మా యన్న సూరిగాన్ని నానా కూతలు తిట్టి..
“నీకు బన్ను నేను తినిపిస్చా.. పా!” అని, నన్ను మద్దిలేటి ఓటేలు కాడ్కి తోల్క పోయినాడు.
బన్నూ, కాపి గూడ్క ఇప్పిచ్చినాడు. నేను నా సెయ్యికెల్లి సూస్కున్న. సెయ్యంతా మసి అంటినాది. బాగా మంటగుంది. ఇంకా సెయ్యి ఇదిలిచ్చుకుంటా ఎడుస్తానే ఉన్యా. మా యన్న పలకల కాపి గిలాస నా ముందుకు జరిపి..
“తగ్గి పోతదిలే! నాక్కనపన్నీ.. ఆ సూరిగాడి ఈపు వలగొడ్తా! దీంట్ల బన్ను అద్దుకొని తిను.. బాగుంటది” అన్యాడు.
నేను ఆ మసి చెయ్యితోనే బన్నును కొంచెం కొంచెం తుంచి, కాపిల అద్దుకొని తింటున్నా.
కండ్లకెంచి కారిన నీళ్లు.. నా నోట్లోకి ఒచ్చినయ్. సల్లారిపోయిన కాపి, మసి అంటిన బన్ను, కండ్ల నీళ్లు.. అన్నీ కలిసిపోయినై.
బన్ను కడుపుల పన్యాక.. లోపల మంట సల్లారింది.
నేను తింటున్నంత సేపూ మా యన్న గొంతు గూసోని.. నా మొగంలోకే సూడబట్టె!
నేను తిన్యంక మా యన్న పై జోయిలోంచి పది పైసల బిళ్ల మద్దిలేటికిస్తే.. ఆయప్ప సిల్లర తిరిగిచ్చినాడు.
సిల్లర జోయిలేసుకుంటా మా అన్న..
“ఇంగ.. పా” అన్యాడు.
నేనొకసారి నా సెయ్యి జూసుకున్యా. మంట తగ్గిపోయింది. నేను నా సెయ్యికెల్లి సూస్కుంటుంటే..
“నేను మందు రాపిస్చా! తగ్గి పోతది గానీ.. ఇంగ పోదాం రా” అన్యాడు మా యన్న.
నేను ఆన్నుంచి లెయ్యలేదు. మెల్లిగా..
“అన్నా!” అన్యా.
మా యన్న ఏందని నాకెల్లి సూసినాడు.
“నేను కాలెకాలె సలాకి మల్లా పట్టుకుంటన్నా” అన్యా.
మా యన్న గబుక్కున..
“ఎందుకురా?” అన్యాడు.
“ఇప్పుడు శాంచేపు పట్టుకుంటాలే! ఐతే ఈపారి రెండు బన్నులు తినిపియ్యాల” అంటి. మా యన్న మాట్లాడ్ల్యా. కాసేపు గమ్మునుండి, కండ్లల్ల నీళ్లు గార్తుంటే.. మాట్లాడకుండా పోయి రెండు బన్నులు తీసుకొచ్చి ఇచ్చినాడు. “దుడ్లు మల్లొచ్చినప్పుడు ఇస్తా” అని మద్దిలేటికి జెప్పి.. శాంచేపు బంగపోయి కాపి ఇప్పిచ్చినాడు. బన్ను కాపీల అద్దుకొని తింటూంటే.. అన్న నా ముందరొచ్చి కూసున్యాడు. అన్న కండ్ల నుంచి నీళ్లు కార్తానే ఉన్నయి.
అన్న ఎందుకేడ్సి నాడో.. నాకు అప్పుడు అర్థం కాల్యా.
* * *
“తాతయ్యా! ఇదిగో పాలు, ఈ బన్ను ముంచుకొని వేడి చల్లారక ముందే తాగమంది అమ్మ!”..
మనవరాలు ఎంత స్పీడ్‌గా వచ్చిందో.. అంతే స్పీడ్‌గా వెళ్లిపోయింది. బయట వర్షం ఇంకా తగ్గలేదు. నేను గతం జ్ఞాపకాల వెల్లువలో తడిసిన గుర్తుగా.. నా కళ్లనుంచి జారిన కన్నీళ్లు. ఒక బన్నుముక్క పాలల్లో ముంచుకొని, నోట్లో పెట్టుకుంటే.. వెనుకటి రుచి గుర్తుచేసుకోవడంలో నా మనసు మునిగి పోయింది.
– దాసరి వెంకటరమణ
90005 72573