‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రత్యేక బహుమతి రూ.5 వేలు పొందిన కథ.
ఆఫీసు నుంచి వస్తూనే నీరసంగా సోఫాలో చతికిలబడింది అంజలి. తోడికోడలి పరిస్థితి చూసి గబగబా వెళ్లి చల్లని నీళ్లలో ఓఆర్ఎస్ కలిపి తీసుకొచ్చి ఇచ్చింది కమల.
“ముందు ఇది తాగక్కా! కాస్త కుదుటపడుతుంది. కాసేపుండి వేడిగా టీ తాగుదువు గానీ” అంది.
“టీ వద్దు కమలా.. ఎర్ర ద్రాక్షలు తెచ్చిపెట్టు!” అంది అంజలి.
“ద్రాక్ష పళ్లా… లేవక్కా! అయిపోయినట్టున్నాయి!” కమల తడబడుతూ అంది.
“అయిపోయాయా!? అదేమిటి. పొద్దున నేను వెళ్లేవేళకి ఉన్నాయే! నా కోసమని పాపం రాజీవ్ తను తినడం కూడా మానేశాడు!” నిష్ఠూరంగా అంది అంజలి.
కమల మాట్లాడలేదు. నిశ్శబ్దంగా తల వంచుకుని కూచుంది.
“సరేలే! ఏం చేస్తాం? టీయే ప్రాప్తం అనుకుంటాను. అల్లం వేసి టీ పెట్టమని చెప్పు.. గిరిజకి!” అంటూ లేచి వెళ్లిపోయింది అంజలి.
కమలకి ఎంత అణచుకున్నా ఆగని నిట్టూర్పు గుండె లోతుల్లోంచీ తన్నుకొచ్చింది.
రాజీవ్, అంజలి ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ.. నెలకి ఐదు లక్షల దాకా సంపాదించుకుంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో మూడు బెడ్రూముల ఇల్లు కొనుక్కుని ఉంటున్నారు. ఇప్పుడు కోట్ల ఖర్చుతో విల్లా కట్టించుకుంటున్నారు. రాజీవ్ తమ్ముడు రాఘవ్‌కి అన్నలా చదువు అబ్బలేదు. బీకాం చదివి ఏవో కంప్యూటర్ కోర్సులు చేశాడు. విజయవాడలో చిన్న ఉద్యోగంలో ఉన్న అతనికి ఈ మధ్యే హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో అరవై వేల రూపాయల జీతంతో ఉద్యోగం రావడంతో కమలని తీసుకుని భాగ్యనగరం వచ్చాడు. తమ్ముణ్ని వేరేచోటుకు వెళ్లనివ్వలేదు రాజీవ్.
“నా ఇల్లు మన నలుగురికీ హాయిగా సరిపోతుందిరా. ఇక్కడున్నావంటే నాతోపాటు కార్లో తీసుకుపోతాను. నీకు నాలుగు డబ్బులు మిగులుతాయి. నలుగురం కలిసుందాం” అన్నాడు అభిమానంగా.
అంజలికి అంత ఇష్టం లేకపోయినా పైకి ఏమీ అనలేదు. దాంతో వాళ్లతో కలిసి ఉమ్మడి కాపురం ప్రారంభించారు కమల-రాఘవ్.
“నెలకి పదిహేను వేలు ఇస్తానంటున్నాడు తమ్ముడు. నేను వద్దన్నా వినడం లేదు!” అంటూ రాజీవ్ చెప్పిన మాటకి కాస్త తేలికపడింది అంజలి.
“ఇవ్వనీ రాజీవ్! ధరలెలా మండిపోతున్నాయో నీకూ తెలుసు. అందులోనూ మనం కొనేవన్నీ ఖరీదైన ఆర్గానిక్ సరుకులు. వాళ్లు విడిగా కాపురం పెట్టుకుంటే ఇలాంటివి కొనగలరా? మనకి ఫుల్‌టైమ్ హెల్పర్ ఉంది కాబట్టి, కమల పని కూడా చెయ్యక్కర్లేదు. మనం వాళ్లకి ఏ గ్రేడ్ భోజనం, సదుపాయాలూ అందిస్తున్నప్పుడు పదిహేను వేలేమిటి.. పాతిక వేలైనా తీసుకోవచ్చు. తప్పు లేదు! విల్లా కోసం లోన్ పెట్టాం గుర్తుందా! అంచేత మనకి కూడా డబ్బవసరం ఉంది!” అంది.
రాజీవ్ మరింక మాట్లాడలేదు.
కమల-రాఘవ్ వచ్చిన నెల్లాళ్లకే అంజలి నెల తప్పింది. పెళ్లయి ఆరేళ్లవుతున్నా రాని గర్భం.. ఇప్పుడు రాఘవ్-కమల రావడంతోనే వచ్చిందంటూ వాళ్లిద్దరినీ పొగిడేశాడు రాజీవ్. అంజలి కూడా సంతోషాన్ని ప్రకటించింది. తమవల్ల మంచి జరిగినందుకు రాఘవ్-కమల ఆనందించారు.
ఆ తర్వాత నెమ్మదిగా కమలకి పాట్లు మొదలయ్యాయి. అంజలి నెల తప్పిన దగ్గర్నించీ ఖరీదైన పళ్లూ, డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చి పెడుతున్నాడు రాజీవ్. కడుపుతో ఉన్న మనిషి తింటుంది గదా అని కమల గానీ, రాఘవ్ గానీ వాటి జోలికి వెళ్లేవారు కాదు. అది చూసి.. ‘మీరు కూడా తినండి ఫర్వాలేదు’ అంటూ రాజీవ్, అంజలి ఒకటికి రెండుసార్లు చెప్పారు. సరే! అంతలా చెబుతున్నారు గదా అని జిహ్వచాపల్యం కొద్దీ ఎర్రటి ద్రాక్షపళ్లు తీసుకుని తింది కమల. రెండు కమలాలు తీసుకుని రాఘవ్‌కి జ్యూస్ చేసి ఇచ్చింది.
ఆ సాయంత్రం ఇంటికొస్తూనే ద్రాక్షపళ్లు తగ్గిపోవడం చూసి చిరాకు పడింది అంజలి. తినండి ఫర్వాలేదని తను అన్నమాట కూడా మర్చిపోయింది. ముష్టి పదిహేను వేలు పడేసి ఇన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారు… ఇంకా పళ్లు కూడానా!? పప్పు ఉప్పు అంటే ఏమో… పళ్ల ఖరీదేమైనా తక్కువా… కివీ ఒక్కొక్కటి ముప్ఫై రూపాయలు. ఎర్ర ద్రాక్షలైతే పావుకిలో వందా నూటపాతికా. తనంటే సంపాదించుకుంటోంది. పైగా గర్భిణి. ఉత్తికుత్తినే వాళ్లకి పళ్లు కూడా సరఫరా చేస్తూంటే అయినట్టే! అనుకుంటూ…
“ఇదేమిటి ఇంత తక్కువున్నాయి.. ఇంకా బోలెడుండాలే…” అంది కాస్త విసుగ్గా.
ఆ మాట వింటూ, ఆ విసుగు చూస్తూ చప్పున.. ‘నేనే తిన్నాను’ అని చెప్పలేకపోయింది కమల. మరిక పళ్ల జోలికి వెళ్లకూడదని మాత్రం నిర్ణయించుకుంది. అయినా అంజలి అన్నీ లెక్క చూసుకోవడం మానలేదు.
ఇంట్లో ఉండేది ఐదుగురు. తాము నలుగురూ గాక, గిరిజ అనే పాతికేళ్ల ఆడమనిషి రోజూ పొద్దున్నే వచ్చి ఇంట్లో పని మొత్తం చక్కబెడుతుంది. ఆమె అంజలి దగ్గర దాదాపు మూడేళ్ల నుంచీ చేస్తోంది. పదో తరగతి దాకా చదువుకుంది. బంగారమైనా, బంగాళాదుంపలైనా దేనికీ కక్కుర్తి పడదనీ, చాలా నమ్మకస్తురాలనీ అంజలికి గిరిజ పట్ల ప్రత్యేకమైన అభిమానం. పళ్లు మొత్తం అయిపోయినా గిరిజని కల్లో కూడా అనుమానించదు. ఆమె అనుమానం ఎప్పుడూ కమల, రాఘవ్‌ల మీదే. ఖరీదైన ఆహారపదార్థాలు కొనుక్కునే స్తోమత లేనివాళ్లు, తమతో సమానంగా తినే హక్కున్నవాళ్లు గనుక అంజలి అనుమానపు చూపులు ఎప్పుడూ కమలని వెంటాడుతూనే ఉంటాయి. అప్పుడప్పుడూ రాఘవ్ వైపు కూడా ఓ నిశిత వీక్షణం విసురుతూ ఉంటుంది.
చూపుల తూపులు గాక అప్పుడప్పుడూ అంజలి విసిరే వాగ్బాణాలకి నిప్పుల కుంపటి మీదున్నట్టే అనుభూతి చెందుతోంది కమల. అయినా ఆమెకి అంజలి మీద కోపం మాత్రం రాలేదు. అవును, అంత డబ్బు పెట్టి కొనుక్కునే వస్తువుని మరొకళ్లకి అప్పనంగా తినబెట్టడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు?! తమలాంటి మధ్యతరగతి మనుషులు రెండు పూటలా ఇంత కూరా అన్నం తింటున్నందుకే సంతోషించాలి గానీ, ఖరీదైన పళ్లు కొనుక్కునేంత సీనెక్కడుంది? పదిమందీ కొనుక్కునేవి చవగ్గా వచ్చే అరటిపళ్లు మాత్రమే. వాటితోనే తృప్తి పడాలంతే.
ఇలా రోజులు గడుస్తూ ఉండగా.. కమల కూడా నెల తప్పినట్టు తెలిసింది అంజలికి.
‘మరింకేం… పళ్ల బుట్టలు మరింత తొందరగా ఖాళీ అవుతాయి!’ అనుకుంది మనసులోనే.
రాజీవ్ మాత్రం..
“కమలా! నువ్వు కూడా రోజూ పళ్లు తిను. నేను తీసుకొచ్చి పెడతాను. మొహమాటపడకు. నేను వాడికి కాదు, నీకే అన్నయ్యననుకో!” అంటూ అభిమానంగా మరదలికి చెప్పాడు.
మరొక పదిహేను రోజులు గడిచాయి. కమల నాలుగు రోజులుండి వస్తానంటూ పుట్టింటికి వెళ్లింది. అంజలి వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తోంది.
ఆ రోజు ఉదయం పదకొండు గంటల వేళ, అంజలికి యాపిల్ ముక్కలు కోసి ఇచ్చింది గిరిజ. అంజలి రెండు ముక్కలు తీసి గిరిజకిస్తూ..
“తిను!” అంది.
“వద్దమ్మా! మీరు తినండి. అసలే నీరసం అంటున్నారు కూడానూ” అంది గిరిజ అభిమానంగా.
అంజలి వెంటనే..
“నాకు తెలుసు గిరిజా! పండు ఒలిచి చేతిలో పెట్టినా కూడా నువ్వు మళ్లీ నా నోట్లోనే పెడతావు. ఎక్కడెక్కడివాళ్లో హక్కుదారులమని ఇల్లు దోచుకుపోతూంటే.. నాకు ఇంత చాకిరీ చేస్తున్నదానివి నువ్వు తినడానికేం… తిను!” అంటూ బలవంతంగా గిరిజ చేతిలో యాపిల్ ముక్కలు పెట్టింది.
గిరిజ మాట్లాడలేదు. తలవంచుకుని వెళ్లిపోయింది. ఆ సాయంత్రం నాలుగు గంటల వేళ..
“అమ్మా! ఒక్కసారి మా ఇంటికి వెళ్లొద్దాం వస్తారా… ” అంది గిరిజ.
ఆమె మొహం వాడిపోయి ఉండటం చూసి కంగారుపడుతూ..
“ఏమైంది గిరిజా! ఇంటినుంచి ఏమైనా ఫోనొచ్చిందా” అంది అంజలి.
“అదేం లేదు. మీరు రండి చెప్తాను. చిన్న పని. అరగంటలో మళ్లీ వచ్చేద్దాం” అంది గిరిజ.
అంజలి మరి కాదనలేదు. ఇద్దరూ కార్లో బయల్దేరారు.
ఇంటికెళ్లాక గిరిజ పక్కింటినుంచి కుర్చీ తీసుకొచ్చి అంజలిని కూచోబెట్టి తను ఆమె పాదాల దగ్గర కూచుంది. ఆ పక్కనే ఉన్న మంచం మీద ఒక చంటిపిల్లాడు పడుకుని నిద్రపోతున్నాడు. అంజలి వాణ్ని చూస్తూ..
“ఎవరా పిల్లాడు?!” అంటూ ప్రశ్నించింది.
“చెప్తానమ్మా. మీకసలు వాణ్ని చూపించాలనే ఇక్కడికి తీసుకొచ్చాను” అంటూ ప్రారంభించింది గిరిజ.
“పొద్దున మీరు.. ఎక్కడెక్కడివాళ్లో హక్కుదారులమంటూ వచ్చి ఇల్లు దోచుకుపోతున్నారన్నారు. మీరు కమలమ్మని ఉద్దేశించే ఆ మాటలు అన్నారని నాకు అర్థమైంది. కానీ, మీరు అనుకుంటున్నది నిజం కాదమ్మా. కమలమ్మ ఎంత గొప్పదో… ఎంత మంచిదో మీకు తెలీదు. చెబుతున్నా వినండి. నా మొగుడు పచ్చి తాగుబోతు. సంపాదించిందేదో ఆడి తాగుడుకే సరిపోతుంది. ఇక నాకేం పెడతాడు? పెళ్లయిన వెంటనే నాకు నెల తప్పింది. విపరీతమైన ఆకలేసేది. ఏవేవో తిందామని పిచ్చి కోరిక పుట్టేది. కానీ, తినడానికి డబ్బేది? నా పుట్టింటోళ్లు ఈ పక్కనే. మా అన్నయ్య బాగానే సంపాదిస్తున్నాడు. మా వదిన ఇరుగమ్మకీ పొరుగమ్మకీ గిన్నెల్లో పెట్టి అందిస్తుంది గానీ, నాకు పట్టెడన్నం పెట్టాలంటే మాత్రం ఏడ్చిపోతుంది. ఏ జంతికలో చేస్తే అలమర్లో పెట్టి తాళం వేసేది. అక్కడికీ ఒకటి రెండుసార్లు మా అమ్మ దొంగతనంగా నాకు తెచ్చిపెట్టి, కోడలి చేత ‘దొంగ’ అనిపించుకుంది. మొత్తం మీద ఆ తొమ్మిదినెలలూ నాకు సరైన తిండే లేదు. ఆపరేషన్ చేసి బిడ్డని తీశాక వాడు ఏడవలేదు. బతికున్న గుర్తుగా సన్నగా మూలిగి ఊరుకున్నాడు.. వీడే!” అంటూ లేచి మంచం మీదున్న బిడ్డ మీద కప్పిన దుప్పటి తీసింది గిరిజ.
దాదాపు రెండడుగుల పొడవున ఎముకల పోగులా ఉన్న ఆ శాల్తీని చూడలేక భయంతో కళ్లు మూసుకుంది అంజలి.
నిర్వికారంగా మళ్లీ బిడ్డ మీద దుప్పటి కప్పేసి వచ్చి కూచుంది గిరిజ.
“వాడి వయసెంతో తెలుసామ్మా… నాలుగేళ్లు. నేను తిండి తినని కారణంగా లోపల బిడ్డ మెదడు ఎదగలేదంట. అంచేత వాడి బతుకంతేనని చెప్పేశారు డాక్టర్లు! గెంతుతూ తిరగాల్సిన పిల్లాడు, గట్టిగా ఏడవను కూడా ఏడవకుండా అలా మంచంలో పడి ఉంటే.. చూసి ఏడ్చీఏడ్చీ రాయినైపోయాను నేను. నా మొగుడు మాత్రం హాయిగానే ఉన్నాడు. ఈ పిల్లాడికి కనీసం రెండుపూటలా ఇన్ని పాలైనా పడదామని, చేతనైన వైద్యం చేయిద్దామని మీ దగ్గర పనిలో చేరాను. తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో మరింక పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్నాను. కానీ, చీమూ రక్తం ఉన్న వెధవలం కదా! నాకు మళ్లీ కడుపొచ్చింది. ఇప్పుడు నాలుగో నెల. తొలిచూలు బిడ్డ కడుపున పడ్డప్పుడు ఎంత ఆనందించానో ఇప్పుడు అంతగా భయపడ్డాను. అబార్షన్ చేయించేసుకుందామని అనుకున్నాను. కానీ, ఇప్పుడు నాకంటూ సంపాదన ఉంది కదా… అందుకని శుభ్రంగా తిని చక్కని బిడ్డని కనాలన్న ఆశతో గర్భాన్ని ఉంచుకున్నాను. ఆ క్షణం నుంచీ నేను చేస్తున్న పనేమిటో తెలుసామ్మా… మీ ఇంట్లో ఆహారం దొంగతనంగా తీసుకుని తినడం.
ముందుముందు అవసరాల కోసం జీతం దాచుకుని, మీ ఇంట్లో దొంగతనంగా పళ్లూ, పాలూ ఒకటేమిటి అన్నీ తింటున్నాను. నాకు ఇష్టం లేకపోయినా బిడ్డ కోసం తప్పదు అనుకుని తింటున్నాను. మామూలుగా అయితే నా దొంగతనం ఇట్టే బయటపడి పోయేదే. కానీ, ఇంట్లో కమలమ్మ ఉండటం వల్ల మీరు అవన్నీ ఆయమ్మే తింటోందని అనుకుంటున్నారు. నిజానికి ఆ తల్లి ఒక్క పండు కూడా నోటబెట్టడం లేదు. తను నెల తప్పిన దగ్గర్నించీ పెనిమిటి చేత అప్పుడప్పుడూ కొన్ని పళ్లు తెప్పించుకుని తింటోంది. అంతే కాదు, నా దొంగతనాన్ని ఆమె ఏనాడో పసిగట్టి నిలదీసింది. ఇదంతా ఆమెకీ చెప్పుకొని ఏడ్చాను. జాలిపడింది. ‘నీకు ప్రసవం అయ్యేదాకా ఇలాగే తిను గిరిజా! అక్క నన్ను దొంగ అనుకుంటే అనుకోనీ. మరేం ఫర్వాలేదు. నేను ఎటూ ఆమెతో కలిసి ఉండను. వేరే వెళ్లిపోయి మా బతుకులేవో మేం బతుకుతాం. అంచేత నువ్వు శుభ్రంగా తిని పండులాంటి బిడ్డను కను!’ అంది. పప్పు, కూర అవీ కాస్త ఎక్కువ చేయించి నాకు కొసరి కొసరి భోజనం కూడా పెడుతోంది. ఏదైనా సరుకు అయిపోతే పెనిమిటి చేత తెప్పిస్తోంది! ఒక్కోసారి తను కొనుక్కున్న పళ్లలోంచి ఓ నాలుగు పళ్లు ఈ బిడ్డకి పెట్టమని నాకిచ్చి పంపిస్తోంది…”
గిరిజ మాటలు వినిపించడం మానేశాయి అంజలికి. చెవుల్లో ఖంగుమంటూ తాతగారి గొంతు వినిపిస్తోంది…
‘అమ్మలూ! మనిషికి ముఖ్యంగా కావలసింది ఆహారం. ఎంతకీ తీరని క్షుద్బాధ మనిషిని పిచ్చివాణ్ని చేస్తుంది. పౌష్టికాహారలోపం వల్ల మనిషి నిర్వీర్యుడైపోతాడు. అందుకే గురజాడ అప్పారావుగారు తిండి కలిగితే కండ కలదోయ్ కండ గలవాడేను మనిషోయ్ అన్నారు. పాడిపంటలు పొంగిపొర్లేలా పాటుబడమన్నారు. ఈసురోమని మనుషులుంటే దేశం బాగుపడదని హెచ్చరించారు. ఏం తిన్నా సరే, పక్కవాడికి పెట్టకుండా మనం ఒక్కళ్లమే తినకూడదని వేద సంస్కృతి మనకి హితవు చెప్పింది. సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై… !! ఆహారాన్ని ఎవరికీ పెట్టకుండా తనొక్కడే తినేవాడు, తర్వాత రాక్షసజన్మ ఎత్తుతాడు. ఒకరికి పెడితేనే మనం తినడానికి నోచుకుంటాం. పూర్వం అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లలో స్తోమత గలవాళ్లు లేనివాళ్ల పిల్లల్ని తమ ఇళ్లలో ఉంచుకుని పోషించేవారు. రానురాను మనిషిలో స్వార్థం పెరిగి, అయినవాళ్లని పట్టించుకోవడం మానేస్తున్నాడు. పూర్వం అందరికీ ఒకే రకమైన ఆహారపదార్థాలు దొరికేవి. ఇప్పుడు డబ్బున్నవాళ్లకి నాణ్యమైన సరుకు… లేనివాళ్లకి పురుగులు పట్టేసే పదార్థాలు.. ’
ఆలోచనా స్రవంతిలో కొట్టుకుపోతున్న అంజలికి, మేనత్త గుర్తొచ్చింది. అమ్మ పోయాక రెండేళ్లపాటు తనని దగ్గరుంచుకుని ఇష్టమైనవన్నీ చేసి తినిపిస్తూ తల్లిని మరిపించిన మేనత్త! ఆ తర్వాత తండ్రి రెండోపెళ్లి చేసుకున్నాడు. సవతితల్లే అయినా కన్నతల్లి కంటే ఎక్కువగా తనని ఆదరించి కావలసినవన్నీ వండిపెట్టింది పిన్ని! పనిమనిషి కడుపుతో ఉంటే, తమ ఆవుపాలల్లోంచి రోజూ ఒక గ్లాసు పాలు దాని చేత తాగించేదావిడ. దానికి కొడుకు పుట్టాక ఆ బిడ్డని తెచ్చి పిన్నికి చూపించి..
“మాలో ఇంత చక్కని బిడ్డ ఎవ్వరికీ లేదమ్మా. మీరెట్టిన కూడూ, తాపిన పాలూ నాకింత మంచి బిడ్డనిచ్చాయ్. మీ రుణం తీర్చుకోలేను తల్లీ” అంటూ ఆనందబాష్పాలు రాల్చిందది.
ఆ ఉత్తములందరికీ వారసురాలు తను..!!
ఒక మనిషికి తిండి దొంగతనం చెయ్యవలసిన అవసరం ఏర్పడిందంటే దానికి సమాజం మొత్తం బాధ్యత వహించాల్సి ఉంటుందని బల్ల గుద్ది చెప్పింది ఇటలీ న్యాయస్థానం. ఆహారం దొంగతనం నేరమే కాదని విస్పష్టంగా ప్రకటించింది! పెట్టగలిగే శక్తి ఉండీ అన్నార్తులకు ఆహారం పెట్టకపోవడమే నేరమని స్పష్టీకరించింది! సమాజమంటే తనలాంటివాళ్లే. నేరస్థులు తామే!!
రెండేళ్ల తర్వాత…
పట్టాల మీద తిరుగుతున్న రైలు బొమ్మని చూపిస్తూ తన కూతురికీ, మరిది కొడుక్కీ పప్పు అన్నం తినిపిస్తోంది అంజలి. ఆరోగ్యంగా ఉన్న ఆ పసివాళ్లిద్దరూ ఆనందంగా కేరింతలు కొడుతూ అంజలి పెడుతున్న గోరుముద్దల్ని తింటున్నారు. ఆ దృశ్యం చూస్తూ కలయో వైష్ణవమాయయో అని లక్షోసారి అనుకుంది కమల.
ఒకప్పుడు రెండు పళ్లు లెక్క తగ్గితే చిర్రుబుర్రులాడిన తోడికోడలు, తను నాలుగు రోజులు పుట్టింట్లో ఉండి వచ్చేసరికి..
“ఎక్కడున్న పళ్లు అక్కడే ఉన్నాయి. నువ్వేమీ తినడం లేదా కమలా? నీకు రత్నంలాంటి బిడ్డ పుట్టాలా వద్దా… కడుపు నిండా ఇంత ఆవకాయన్నం తినేస్తే కాదు. పౌష్టికాహారం తీసుకోవాలి!” అంటూ బలవంతంగా తనచేత అన్నీ తినిపించడం ప్రారంభించింది. పాలల్లో ప్రొటీన్ పౌడర్ తనే కలిపి ఇచ్చింది.
“మంచికో చెడ్డకో నలుగురం కలిసి బతకడం ప్రారంభించాం. మీరిక్కడ ఉన్నంతకాలమూ మాతోనే..” అంటూ విల్లాకి కూడా తమని తీసుకొచ్చేసింది. మరోవైపు గిరిజకి టైలరింగ్ నేర్పించి, తన చేత బొటీక్ పెట్టించింది. పండులాంటి తన చిన్న కొడుకుని తీసుకుని వారంవారం తమ దగ్గరకి వస్తుంది గిరిజ.
ఏమిటిదంతా… కలయో, వైష్ణవమాయయో,
ఇతర సంకల్పార్థమో..!! ఏదైతేనేమీ, కలిసికట్టుగా
ఎదుగుతున్న బతుకుల్లో వెన్నెల పువ్వుల్లా కళకళ్లాడుతున్న పిల్లల మధ్య కల్పవృక్షంలా కూర్చుని ఉన్న
తోడికోడలిలో దైవాన్ని చూస్తూ మనసులోనే చేతులు జోడించింది కమల!!
‘అమ్మలూ! మనిషికి ముఖ్యంగా కావలసింది ఆహారం. ఎంతకీ తీరని క్షుద్బాధ మనిషిని పిచ్చివాణ్ని చేస్తుంది. పౌష్టికాహారలోపం వల్ల మనిషి నిర్వీర్యుడైపోతాడు. అందుకే.. గురజాడ అప్పారావుగారు ‘తిండి కలిగితే కండ కలదోయ్ కండ గలవాడేను మనిషోయ్’ అన్నారు. ఈసురోమని మనుషులుంటే దేశం బాగుపడదని హెచ్చరించారు. ఏం తిన్నా సరే, పక్కవాడికి పెట్టకుండా మనం ఒక్కళ్లమే తినకూడదని వేద సంస్కృతి మనకి హితవు చెప్పింది. సహనావవతు, సహనౌ భునక్తు!
లక్ష్మీ గాయత్రి
పక్కవారికి పెట్టకుండా ఒక్కరే ఆహారం తినకూడదని వేద సంస్కృతి చెబుతున్నది. ‘సహనావవతు-సహనౌ భునక్తు’ సారం కూడా అదే! రచయిత్రి లక్ష్మీ గాయత్రి. సాగర నగరం విశాఖపట్నం.. వీరి స్వస్థలం. ఇంగ్లిష్ లిటరేచర్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. విశాఖలోని స్థానిక పత్రికలో పన్నెండేళ్లపాటు పాత్రికేయురాలిగా బాధ్యతలు నిర్వహించారు. 1983 నుంచీ ‘చందమామ’ పిల్లల మాసపత్రికలో అనేక కథలూ, సీరియల్స్ రాశారు. ‘చందమామ’ ఆగిపోయేదాకా.. 30 ఏండ్లపాటు అక్కడే పనిచేశారు. ఆ తర్వాత పదేళ్ల పాటు రచనకు విరామం ఇచ్చిన లక్ష్మీ గాయత్రి.. రెండుమూడేళ్ల నుంచి కథలు రాస్తున్నారు. వివిధ సాహితీ సంస్థలు, పత్రికలు నిర్వహిస్తున్న కథల పోటీల్లో.. ఇప్పటివరకు మూడు ప్రథమ బహుమతులు, ఒక ద్వితీయ బహుమతి, ఒక తృతీయ బహుమతి, కొన్ని ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం కథల పోటీలో బహుమతి రావడం ఇది మూడోసారి.
లక్ష్మీ గాయత్రి
63025 55947