‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రోత్సాహక బహుమతి రూ.3 వేలు పొందిన కథ.
అప్పటివరకూ టీవీలో సినిమా చూస్తున్న సుమకు ఆ దృశ్యం చూడగానే అణచిపెట్టుకున్న దుఃఖమేదో కట్టలు తెగి అలుగులు దుంకసాగింది. మనసులో అలజడి మొదలైంది. ఎప్పటినుండో మరుగుతున్న అగ్నిపర్వతం బద్ధలైనట్లు మనోకంపనం. తెరపై తనను తాను చూసుకుంటున్న దుఃఖ భరితస్థితి.
సంతోష విషాదాల సమ్మిళిత సరిహద్దు గీతగా, స్త్రీ చుట్టూ ప్రకృతి గీసిన లక్ష్మణరేఖను దాటీ దాటలేని సంఘర్షణల సజీవ దృశ్యం.
ఆ దృశ్యం హిందీ సినిమా ‘సుల్తాన్’లోనిది. సినిమాలో భార్యాభర్తలైన అనుష్క శర్మ, సల్మాన్ ఖాన్ ఇద్దరూ రెజ్లర్లే. ఇద్దరి ఆశయం ఒక్కటే. జీవిత స్వప్నంగా భావించే ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో దేశానికి స్వర్ణ పతకాలు సాధించి పెట్టడం. భారతదేశం తరఫున ఇద్దరూ ఆ పోటీలకు నామినేట్ అవుతారు. ఇంతలో అనుష్క శర్మ గర్భం దాలుస్తుంది. ఆ వార్త విన్న భర్త పట్టరాని సంతోషంతో వీధిలో నృత్యం చేస్తుంటాడు. అనుష్క శర్మలో అంతర్మథనం. భర్త సంతోషాన్ని నిజం చేయాలంటే తన చిరకాల ఒలింపిక్స్ స్వప్నాన్ని సమాధి చేసుకోవాలి. అప్పుడు అమ్మతనమే గెలుస్తుంది. బిడ్డను కనడానికి సిద్ధపడుతుంది. అనంత కారుణ్యానికి ప్రతిరూపమైన ఆడతనం త్యాగానికి తలుపులు తెరుస్తుంది. పోటీ నుండి విరమించుకుంటుంది.
సుమది కూడా తన్నుతాను సున్నితపు త్రాసులో తూకం వేసుకుంటున్న పరిస్థితే. మాతృత్వపు మధురిమను వ్యతిరేకించేదేమీ కాదు. స్త్రీలుగా తమకు మాత్రమే అవకాశం ఉన్న సంతానోత్పత్తి ప్రక్రియ పట్ల గౌరవ భావం కూడా ఉంది. కానీ, ఒక కొత్త ప్రాణిని ఈ లోకంలోకి తెస్తున్న క్రమంలో పడే వేదన, కోల్పోయే అవకాశాలు ఎట్లా ఉంటాయో తన అనుభవంలోకి రావడం, వాటిమీద ఇంట్లో తీవ్రమైన రభస జరగడం సుమను కలచి వేసింది.
తాను తన జీవితాశయానికి దూరమవుతున్నానని తలుచుకోగానే పర్వత సానువుల్లోంచి, అగాథ లోయల్లోకి జారిపోతున్న అసహాయ స్థితిలో గతం ఒక్కసారి కళ్ల ముందు కదలాడింది.
సుమది ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని అటవీ ప్రాంతంలోని ఒక గ్రామం. తండ్రి అక్కడే ఉపాధ్యాయుడిగా పని చేస్తుంటాడు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఎందరికో అక్షరాన్ని చేరువ చేయాలన్న అంకిత భావాలు కల ఆదర్శ ఉపాధ్యాయుడు. చిన్నప్పటి నుండే సుమకు చదువు ప్రాధాన్యతను చెబుతూ, కడుపేద కుటుంబాల్లో పుట్టి అక్షరాన్ని నమ్ముకొని ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజినీర్లుగా పెద్దపెద్ద హోదాల్లోకి వెళ్లిన వాళ్ల గురించి ఉదాహరణగా చెప్పేవాడు. సుమ గొప్ప డాక్టరై సమాజంలోని అట్టడుగు వర్గాలకు సేవ చేయాలని, అదే జీవితానికి సార్థకత అని బోధించేవాడు.
తండ్రి ప్రేరణతోపాటు, చిన్నప్పుడు జరిగిన ఓ విషాద ఘటనతో డాక్టర్ కావాలన్న సంకల్పం ఆమెలో బలంగా నాటుకున్నది. తనను అమితంగా ప్రేమించే, తనకు సర్వమూ అయిన తండ్రి తన కళ్లముందే గుండెపోటుకు గురై వైద్యసేవలు అందక మరణించడం, ఆ సంఘటన జరిగిన నెల రోజులకే తీవ్ర మనస్థాపంతో తల్లి కూడా గుండెపోటుతో మరణించడంతో.. తాను డాక్టర్ కావాలన్నది ఒక కోరికగా కాక, చేయాల్సిన యుద్ధంగా తలచింది సుమ.
తమ ప్రాంతంలో కార్డియాలజిస్టులు ఉండేంత పెద్ద ఆసుపత్రులు లేకపోవడం, కరీంనగర్‌కు తీసుకుపోయేలోపు తండ్రి మరణించడం.. కార్డియాలజిస్ట్ కావాలనే నిర్ణయానికి అప్పుడే బీజం పడింది.
పదో తరగతి తరువాత గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియెట్ చదివి, నీట్ ఎంట్రన్స్‌లో మంచి ర్యాంకుతో ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌లో చేరింది. గోల్డ్ మెడల్‌తో డాక్టర్ పట్టా అందుకున్నది. కన్ను మూసినా, తెరిచినా ఒకే లక్ష్యంతో చదివి.. పీజీలోనూ ఉస్మానియాలో జనరల్ మెడిసిన్ సీటు సంపాదించింది.
పీజీ మూడో సంవత్సరంలో ఉండగానే తనకున్న ఏకైక అండ అమ్మమ్మ – తాతయ్య ఒక పెళ్లి సంబంధాన్ని తెచ్చారు. సూపర్ స్పెషాలిటీలో సీటు పొందే వరకూ పెళ్లి ప్రస్తావన వద్దంది సుమ.
“అమ్మా! మేము రాలిపోయే పండుటాకులం. ఎన్నాళ్లుంటామో తెలియదు. మేమున్నపుడే మా బాధ్యత తీర్చుకోనివ్వమ్మా”.. అన్న మాటలకు సుమ కరిగిపోయింది.
సుమంత్ జనరల్ సర్జరీ పూర్తిచేసి హైదరాబాద్‌లోనే ప్రైవేట్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. సుమ కంటే నాలుగేళ్లు పెద్ద. అందగాడు. తనకు అన్ని విధాలా సరిపోయే మ్యాచ్ అవడం వల్ల సరే అంది. కాకపోతే తన ప్రధాన లక్ష్యం కార్డియాలజిస్ట్ కావడమేననీ.. అందుకు అభ్యంతర పెట్టకుండా సహకరించాలన్న కండిషన్‌తోనే ఒప్పుకొంది. పెళ్లి జరిగింది.
పీజీ పూర్తి కాగానే పేరు పొందిన కార్పొరేట్ హాస్పిటల్ సుమకు మంచి ప్యాకేజీతో అవకాశమిచ్చింది. సుమ ప్రాక్టీస్ కొనసాగుతున్నపుడే కొవిడ్ సంక్షోభం వచ్చింది. సుమ అత్తయ్య యాభై ఏళ్లు, మామయ్య అరవై ఏళ్ల వయసులో ఉంటారు. అంతవరకూ ఉన్న పని మనుషుల్ని ఇంట్లోకి రానివ్వలేని అనివార్యత.
ఇద్దరూ డ్యూటీకి వెళ్లాలంటే అత్త మామల్ని చూసుకోవడం పెద్ద సమస్య. ఇద్దరూ బీపీ, షుగర్ తదితర వ్యాధులున్న పేషెంట్లే. ఎవరో ఒకరు ఇంట్లో ఉండక తప్పని పరిస్థితి. నిజానికి కొవిడ్ సమయంలో జనరల్ మెడిసిన్ వాళ్లవే కీలకమైన సేవలు. డ్యూటీకి తప్పక రావాలని ఆసుపత్రి వాళ్ల నుంచి సుమకు ఒత్తిడి. ప్యాకేజీ కూడా సుమంత్ కంటే చాలా ఎక్కువే.
సుమ తాను విధులకు వెళతాను, పెద్దవాళ్ల బాధ్యతను చూసుకొమ్మని సుమంత్‌కు చెప్పగానే.. వినకూడని మాటేదో విన్నట్లు, భూమి ఆకాశం కింద మీద అయినట్లు..
“ఏం మాట్లాడుతున్నావమ్మా! లోకంలో ఎక్కడైనా ఉందా!? మగవాడు ఇంట్లో ఉండుడేంది.. ఆడదానివి బయట డ్యూటీ చేసుడేంది? నలుగురు చూస్తే నవ్వి పోతారు. మా వాడి గౌరవం ఏం కావాలి?” అన్నారు అత్తామామలు.
సుమంత్ కూడా వాళ్లకే వంత పాడాడు. సుమంత్లోని మగవాని ఇగో బయట పడింది. ప్యాకేజీలో ఉన్న తేడాకే తట్టుకోలేక పోతున్నాడు. ఇక సుమను పంపించి తాను ఇంట్లో ఉండటం అంటే.. తల తీసేసినట్లు లోలోపల ఫీల్ అవుతున్నాడు.
సుమ ఆశ్చర్యపోయింది. ఒక డాక్టర్ అయ్యుండీ, కొవిడ్‌లో ఫిజీషియన్ సేవలు ఎంత అవసరమో తెలుసుండీ, పైగా ఇంట్లో ఉన్నది అతని తల్లిదండ్రులే అయినా, కేవలం పురుషుడికుండే అహంతో వ్యతిరేకించడాన్ని తట్టుకోలేక పోయింది. వారం రోజులుగా జరిగిన రసాభాస ఇష్టం లేక మనసు చంపుకొని ఇంటి వద్దే ఉండిపోయింది.
ఎంత పెద్ద హోదాలో ఉన్నా, స్త్రీలకు పెళ్లి ద్వారా ఏర్పడే ప్రతిబంధకాన్ని మొదటిసారి చవి చూసింది.
కొవిడ్ సమస్య సమసిపోయింది. ఇంతలో సూపర్ స్పెషాలిటీ నోటిఫికేషన్ వచ్చింది. నీట్ రాసాక, రెండుసార్లు రాసినా సీటు రాని సుమంత్‌కు గ్యాస్ట్రో ఎంటరాలజీలో, సుమకు కార్డియాలజీలో సీటు వచ్చింది.
సుమ గాలిలో తేలిపోయింది. నాన్నకు ఇచ్చిన మాట నెరవేరుతుందని, తన ఉచ్ఛ్వాస – నిశ్వాసలుగా మారిన సంకల్పం సాకారమవుతుందని పట్టరాని సంతోషంతో ఉంది. అయితే అప్పుడే తెలిసింది సుమకు, తను గర్భం దాల్చానని.
ఇంట్లో మళ్లీ పెద్ద దుమారమే చెలరేగింది. సుమ జాయిన్ అయితే, తన తల్లిదండ్రుల్ని మూడు సంవత్సరాలు పని మనుషులకు అప్పజెప్పడం సుమంత్‌కు నచ్చడం లేదు. కానీ, ఈ విషయం తిన్నగా ప్రస్తావించకుండా, వాదన మరో రకంగా మొదలు పెట్టాడు.
“ఇప్పుడు నువ్వు జాయిన్ అయితే మొదటి సంవత్సరం పూర్తి కాకముందే డెలివరీ వస్తుంది. తరువాత మూడు నాలుగేళ్లు వచ్చేదాకా పాపనో, బాబునో ఎవరు చూస్తారు? చూసుకొనేందుకు అటు మీ వాళ్లు లేరు. మా వాళ్లకు వీలు కాదు. కావాలంటే తరువాత తీరిగ్గా చేసుకో. అంతే కానీ ఇప్పుడు మాత్రం జాయిన్
కావడానికి లేదు” అంటూ శాసించాడు.
“నేను డెలివరీకి ముందు మెటర్నిటీ లీవు తీసుకొని, డెలివరీ తరువాత కొంత గ్యాప్ తీసుకొని ఆలస్యంగానైనా పూర్తి చేసుకునే అవకాశం నాకు ఉంది. ఇది నా లైఫ్ గోల్.. తరువాత సీటు రావచ్చు.. రాకపోవచ్చు”.
“ఏది ఏమైనా అదంతా ఏం కుదరదు. నీ సీటు కోసం పుట్టబోయే బిడ్డను గాలికి వదిలేస్తానంటే ఒప్పుకొనేది లేదు”.. మళ్లీ అధికార దర్పంతో కూడిన శాసనం.
“నువ్వు జాయిన్ అయితే బాధ్యతలను వొదిలేసినట్టు కాదు. కానీ, నేను జాయిన్ అయితే గాలికి వదిలేసినట్టా!? పిల్లల్ని కని ఈ లోకంలోకి తెచ్చే కార్యాన్ని సృష్టి మాకే అప్పగించవచ్చు. పాలిచ్చి పెంచే బాధ్యతా మాదే.. ఒప్పుకొంటాను. కానీ, మాతృత్వపు బాధ్యతలో మా ప్రాధాన్యాలన్నిటినీ కోల్పోవడం.. మా కలలన్నీ కల్లలై పోవడం.. మీరు మాత్రం ఆడా మగా తేడాలు చూపెడుతూ బాధ్యతల నుండి తప్పుకోవడం.. మీ అవకాశాలను దేన్నీ కోల్పోకుండా పదిల పరుచుకోవడం.. ఇదెక్కడి న్యాయం”
వాదనకు దిగితే, తార్కికమైన జవాబు చెప్పలేక సంప్రదాయాలు, కట్టుబాట్లు అడ్డుపెట్టి నోరు నొక్కేస్తున్నారు. ఎంత ఆలోచించినా ఆమెకు ఊతమిచ్చే ఒక్క చేయి కనిపించడం లేదు. బాసటగా నిలిచే ఒక్క బంధమూ వెన్నంటి లేదు.
ఆ ముగ్గురూ ఒకవైపు, సుమ ఒక్కతీ ఒకవైపు అయిపోయి ఏమీ చేయలేని నిస్తేజ స్థితిలోనూ చివరి దాకా పోరాడింది. కానీ, తాము కోరుకున్నట్లే జరగాలని స్థిరీకరించుకున్న వాళ్లను గెలవలేక ఓడిపోయింది. సుమ మనసులో సమాధానాల్లేని ప్రశ్నలెన్నో సర్పాల్లా సంచరిస్తున్నాయి.
‘తల్లి గర్భం నుండి ఆడైనా మగైనా ఒకేలాగ పుడతారు. ఎవరి తెలివితేటలు, కలలు వారికుంటాయి. చేరుకోవాలన్న గమ్యాలు ఎవరివి వారికుంటాయి. కానీ, పెళ్లి అన్న ఒకే ఒక బంధంతో ఆడవాళ్ల చుట్టూ ఎన్ని ఆంక్షల కంచెలు మొలుస్తాయి. మగవారికి మాత్రం ఏ ఆంక్షలూ లేని, ఎవరి అనుమతులకూ తలొగ్గని స్వేచ్ఛ ఎలా ఉంటుంది? సమాన ప్రాతిపదిక మీద ఆలుమగల బంధం మానవీకరించబడే మార్గమే లేదా..’
‘నాన్న నన్ను ఏనాడూ ఆడపిల్ల తక్కువ అన్న భావనతో పెంచలేదు. నేనూ ఏనాడూ ఆ న్యూనతాభావంతో పెరగలేదు. అన్నిటిలోనూ పోటీ పడుతూ ఇక్కడిదాకా చేరుకున్నాక ఇప్పుడు పెళ్లి కాగానే తన రెక్కలు ఒక్కొక్కటి తెగిపోతున్న సంకేతాలు. మెల్లమెల్లగా నా జీవితం నా చేతుల్లోంచి జారిపోనుందా..’
సుమంత్ సూపర్ స్పెషాలిటీలో చేరాక బంధువులూ, స్నేహితులందరిలో గొప్ప గుర్తింపుతో వెలిగి పోతున్నాడు. సుమ మాత్రం ఒక కల చెదిరిపోగా.. బిడ్డను కని తల్లిగా మరో కలను నెరవేర్చుకుంది. కాలం కదలికలో గాయాల వీణను శ్రుతి చేసుకుంటూ మౌన మునిలా మిగిలిపోయింది.
సుమంత్ కోర్సు పూర్తి కావడానికి పట్టిన మూడు సంవత్సరాలు సుమకు పాపను, అత్తా మామలను చూసుకోవడానికే సరిపోయింది. ప్రాక్టీసుకు పూర్తిగా దూరమయ్యింది.
సుమంత్ కోర్సు పూర్తి కాగానే సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుగా ప్రాక్టీస్ మొదలుపెట్టి, మంచి సంపాదనతో బిజీ అయిపోయాడు. పాప సంరక్షణలో సుమ తన సూపర్ స్పెషాలిటీ గురించి పూర్తిగా మరుపు కాకపోయినప్పటికీ, ఆ ఆలోచనకు కాస్త తెరిపినిచ్చిన స్థితిలో ఉంది. ఏడాది గడిచిపోయింది.
ఇంతలో సుమ మళ్లీ గర్భం దాల్చింది. తన అవకాశానికి తానే తలుపులు మూసుకుంటున్న న్యూనత.. మెలకువగా లేనందుకు తనను తాను ఎంత నిందించుకుందో! ఇంతలో తిరిగి నోటిఫికేషన్ వచ్చింది. ఎంట్రన్స్ రాయగానే తాను కోరుకున్న డీఎం కార్డియాలజీలో సీటు వచ్చింది.
ఈసారి సుమలో పట్టుదల పెరుగుతూ వచ్చింది. తన కోసం తాను నిలబడకుంటే ఏం కోల్పోతుందో ఎరుకలోకి వచ్చింది. కానీ, కళ్లముందు తన దేహ శకలమై కనువిందు చేస్తున్న ఒక ప్రాణి. దేహాంతరాన రేపటిని కలగంటున్న మరో ప్రాణి. పెనవేసుకున్న ఈ పేగుబంధాలను దాటి, ప్రాణప్రదమైన తన జీవిత లక్ష్యాన్ని చేరుకోగలనా!? అనే ఆందోళన మొదలైంది.
ఈ ఊగిసలాటను స్నేహితులతో పంచుకుంది. ఏ సెంటుమెంటుకు లోను కాకుండా అబార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చారు వాళ్లు.
ఒక్కసారిగా షాక్‌కు గురైంది సుమ.
‘ఏం చేయాలి? ఇది నాకు దాదాపు చివరి అవకాశం. ముందు ముందు సీటు సంపాదించుకొని పూర్తి చేసే అవకాశం ఉంటుందో లేదో’.. లోలోపల పెనుగులాట. సుమంత్‌ను అడిగింది, ఏం చెబుతాడో చూద్దామని.
“ఏమున్నది.. నువ్వున్న స్థితిలో జాయిన్ అయినా పూర్తి చేయలేని పరిస్థితులే! నీకు అంతగా సూపర్ స్పెషాలిటీయే ముఖ్యమనుకుంటే.. అబార్షన్ చేయించుకో”..
ఊహించని ఆ సమాధానానికి పైనేదో పిడుగు పడినట్లు ఉలిక్కిపడింది సుమ.
“మగవాడు కాబట్టి అమ్మతనపు విలువేంటో తెలియక సునాయాసంగా అనగలిగాడా? లేక తల్లిగా తానెంత సున్నిత మనస్కురాలినో తెలిసి అతని చేతికి మట్టంటకుండా దులిపేసుకున్నాడా?”.. మనసులో ఆలోచనలు తేనెటీగల్లా ముసురుకోగా..
‘అబార్షనే దీనికి పరిష్కారమా? మరో ప్రత్యామ్నాయమే లేదా?’ మనసు వేసుకుంటున్న ప్రశ్నల పరంపర. అందీ అందక గందరగోళాన్ని పెంచుతున్న సందిగ్ధ సమాధానాల సలపరింత.
టీవీ చూస్తున్నదల్లా వర్తమానంలోకి వచ్చింది సుమ. అంతఃచేతనలో అల్లుకున్న సందేహాల సాలెగూళ్లను దాటుకుని క్రమంగా మనసును తేటపరచుకో సాగింది.
‘ఇంతవరకూ నా లక్ష్యాన్ని సాధించే పోరాటంలో ఒంటరిగానే నిలబడ్డాను. ఇప్పుడూ ఒంటరిననే భావించాలి. అంతిమ విజయానికి ఆమడ దూరంలో ఆగిపోకూడదు. గెలవాలి.. నా గెలుపును నాన్నకు అంకితమివ్వాలి’..
కర్తవ్యం కఠిన శిలాశాసనంగా రూపుదిద్దుకుంది. తాను ఓడిపోకూడదు. అమ్మగానూ.. అణువణువునా నిండిన కలను నెరవేర్చుకొనే ఆధునిక మహిళ గానూ..
మరునాడు సుమంత్‌తో తన నిర్ణయాన్ని చెప్పింది స్థిరంగా..
“సుమంత్! నేను జాయిన్ అవుతున్నాను. బిడ్డను కంటాను. తరువాత ఎన్నిరోజులు గ్యాపు తీసుకున్నా సరే, నా కోర్సునూ పూర్తి చేస్తాను”.
“అది సరే! నువ్వు వెళితే మన పాప పరిస్థితి ఏమిటి? ఆమెనెవరు చూస్తారు?” మళ్లీ మమకారపు బంధాన్ని ఆమె మెడకు వేయజూసాడు.
“అదేమిటి? నువ్వున్నావుగా!”
“నాకెలా సాధ్యమవుతుంది? నా ప్రాక్టీస్ ఏమౌతుంది?”
“ఏం.. నీకోసం నేను నా సీటును వదులుకొని, ప్రాక్టీసుకు దూరం కాలేదా? పాపను ఇంతవరకూ సాకలేదా?”
“తల్లిగా అది నీ కర్తవ్యం”
“తండ్రిగా నీకు లేదా ఆ కర్తవ్యం?”
“లోకంలో ఎక్కడైనా ఉంటుందా! ఇంత పెద్ద ప్రాక్టీసును పాప పెంపకం కోసం వదిలేయడం”
“ఆడవాళ్లు వదిలేస్తున్నపుడు మీ మనసుకు ఎలాంటి బాధా ఉండదు. పైగా అదేదో ఆడవాళ్లు తప్పకుండా మోయాల్సిన బాధ్యత అన్నట్లు డిసైడ్ చేస్తారు మీ మగవాళ్లు. పిల్లల్ని కనడం, పాలివ్వడం వరకు మా పనే కావచ్చు. కానీ పెంపకం కేవలం మా స్త్రీల బాధ్యతేనా? ఈ బాధ్యత నుండి తప్పించుకుని మాకు మాత్రమే అంటగట్టడం మీరు చేసిన తెలివైన కుట్ర కాదా?”
“మీ అమ్మా నాన్నల్ని మేం మా అమ్మానాన్నలుగా ఆదరించాలి. అప్పుడు ఆదర్శ మహిళలం. మా తల్లిదండ్రులు మాత్రం చుట్టపు చూపుగా వచ్చిపోవాలి. పెళ్లితో మీ పరిసరాలు,
ప్రాధామ్యాలు, బంధువులు, బంధుత్వాలు, బంధనాలులేని స్వేచ్ఛా ఏవీ మారవు. మాకు మాత్రం పెళ్లి పేరుతో మా స్థితిని, అస్తిత్వాన్ని అన్నీ కోల్పోయి పరాయీకరించబడే పరిస్థితి.
ఇదెక్కడి న్యాయం? ఎవరు రాసిన రాజ్యాంగం? ఒకసారి రాజీ పడ్డాను. ఇప్పుడు మాత్రం జాయినవుతున్నాను అంతే!”..
“నీ అంతట నువ్వు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా?”
“ఇంతకాలం అలా తీసుకోకపోవడం వల్లే మేం నష్టపోయాం. అనేక నిర్ణయాలు మాతో ప్రమేయం లేకుండా మీకు మీరే తీసుకుంటారు. మా వరకు వచ్చేసరికి అది మీ నిర్ణయానికి లోబడి ఉండాలంటారు. నా కలను నెరవేర్చుకొనే కఠిన పరీక్ష ఇది. పాపను ఎలా సాదుతావో సాధన చేసుకో! సాధ్యమవుతుంది. ఆ విషయంలో మేమేం పుడుతూనే ట్రైనింగ్ పొంది పుట్టలేదు”.. ఇంకో మాట మాట్లాడటానికి
అవకాశం ఇవ్వకుండా స్థిరంగా చెప్పింది.
సుమంత్‌కు నోట మాట రావడం లేదు. సుమ ఇప్పుడు సౌకుమార్య సుమంలా కనిపించడం లేదు. తనకు రక్షణగా చుట్టూ కఠిన నిర్ణయాల కంటకాలను పొదుముకొని చైతన్యం గుబాళించే గులాబీలా తోచింది.
సుమకు క్లారిటీ రాసాగింది. తనకే కాదు ఈ లోకంలోని మహిళలందరికీ మాతృత్వం అంటే తాను కాలిపోతూ, కరిగిపోతూ లోకాన్ని వెలిగించే కొవ్వొత్తిలాంటి త్యాగమే.
‘పురిటినొప్పుల బాధ ఈశ్వరా.. తల్లి పార్వతిని అడగరా శంకరా”.. అంటూ ఆవేదన చెందుతాడు కవి ఒక పాటలో. పరమశివునికైనా, పతి దేవుళ్లకైనా ఏం తెలుస్తుంది.. పురుటి నొప్పుల బాధైనా.. పిల్లల్ని పెంచి పెద్ద చేసే యజ్ఞంలో సమిధలుగా మారే తల్లుల వేదనైనా.. శివుడైనా మగాడే కదా..’ అనుకుంది.
‘కుల మతాల నిర్మూలన కోసం సంస్కరణోద్యమాలు జరుగుతాయి. ఆర్థిక అంతరాలు రూపు మాపేందుకు విప్లవోద్యమాలు జరుగుతాయి. కానీ, స్త్రీల ఈ నిశ్శబ్ద నిశీధి దుఃఖం ప్రపంచానికి పట్టని ఓ ప్రహేళికలా మారడం ఎంత విషాదం. కత్తివేటేది కనిపించదు.. నెత్తుటిచుక్క నేలరాలదు. ఇది పరులెవ్వరికీ కనిపించని హింస’.
ఇలా గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తుని మూల్యాంకనం చేసుకున్న సుమ తనదైన తాత్త్విక అవగాహనతో తొణకని కుండలా కనిపిస్తున్నది.
పాపను వదిలి వెళ్లడానికి తల్లి మనసు అంగీకరించకున్నా.. రేపు ఈ అసమంజస సంప్రదాయ సంకెళ్లను తెంచుకొని తన బిడ్డకూడా ఒక యోధగా నిలవాలంటే, ఈ నిర్ణయం ఆమెకు దారిదీపం అవుతుందన్న ధైర్యంతోనే ముందుకు అడుగు వేసింది సుమ. ఆమె గెలిచింది.. అమ్మగానూ.. ఆధునిక మహిళగానూ.
గాజోజు నాగభూషణం
ఉద్యమాలు-సాహిత్యం పరస్పర పూరకాలని నమ్మి.. సాహిత్యంతోపాటు సామాజిక ఉద్యమాలలో నడుస్తున్నారు గాజోజు నాగభూషణం. ఈయన స్వస్థలం కరీంనగర్. ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందారు. కథ, కవిత్వం, పాట, వ్యాసం.. మొదలైన సాహిత్య ప్రక్రియల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. జీవితంలో ఉన్న అనేక సంఘర్షణలను కథలుగా మలచడాన్ని ప్రవృత్తిగా కాకుండా, సాహితీవేత్త బాధ్యతగా భావిస్తారు. అందుకే, ఈయన కథలన్నీ తన అనుభవాల నుంచి వచ్చినవే! ‘ఆమె గెలిచింది’ కథ.. ఆధునిక మహిళల అంతరంగ మథనానికి ప్రతీక. మహిళలు ఎన్నో అడ్డంకులు దాటుకొని, ఎంతో దూరం నడిచి వచ్చినా.. ఇంకా తమచుట్టూ బిగుసుకుంటున్న ఆంక్షల సంకెళ్లను భరించే దుఃఖ స్థితిలోనే ఉన్నారనేది రచయిత అభిప్రాయం. ఇప్పటివరకూ సుమారు 30 కథలు రాసి, 15 బహుమతులు అందుకున్నారు. ‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం కథల పోటీ’లో వరుసగా బహుమతులు గెలుచుకున్నారు. ఇటీవలే మొదటి కథా సంపుటి ‘జీవన సాఫల్యత’ను వెలువరించారు. మట్టి సరిగమలు, ప్రాణ దీపం.. కవిత్వ సంపుటాలు, నెత్తుటి గాయాలు-ఉద్యమ గేయాలు సీడీని వెలువరించారు.
గాజోజు నాగభూషణం
98854 62052