కోల్‌కతా: ఆరంభంలో వరుస పరాజయాలతో నిరాశపరిచి తర్వాత వేగం పుంజుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ మరో అద్భుత విజయం అందుకుంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో పంజా విసిరింది. వరుసగా ఐదు విజయాలతో ప్లేఆఫ్స్‌కు గెలుపు దూరంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు షాకిచ్చింది. సొంతగడ్డపై తమ వందో మ్యాచ్‌లో ఫిన్ అలెన్ (35 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 93), అంగ్క్రిష్ రఘువంశీ (44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 82 నాటౌట్) విధ్వంసం సృష్టించడంతో ఈడెన్ గార్డెన్స్‌లో శనివారం రాత్రి జరిగిన హై స్కోరింగ్ పోరులో కేకేఆర్ 29రన్స్ తేడాతో విజయం సాధించింది.
తొలుత కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 247/2 భారీ స్కోరు చేసింది. కామెరాన్ గ్రీన్ (28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 నాటౌట్) కూడా రాణించాడు. అనంతరం జీటీ ఓవర్లన్నీ ఆడి 218/4 స్కోరు చేసి ఓడింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 85), జోస్ బట్లర్ (57), సుదర్శన్ (53 నాటౌట్)పోరాడినా ఫలితం లేకపోయింది. రెండు కీలక వికెట్లు తీసిన సునీల్ నరైన్ (2/29)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
అలెన్, రఘువంశీ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో కేకేఆర్ భారీ స్కోరు చేసింది. పేలవ బౌలింగ్‌కు తోడు చెత్త ఫీల్డింగ్‌తో ఏకంగా నాలుగు క్యాచ్‌లు జారవిడిచిన గుజరాత్ మూల్యం చెల్లించుకుంది. 14, 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద క్యాచ్ డ్రాప్‌ల నుంచి బయటపడ్డ అలెన్ జీటీ బౌలర్ల భరతం పట్టాడు. సిరాజ్ వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన అలెన్.. రబాడ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లతో టాప్ గేర్ అందుకున్నాడు. కెప్టెన్ రహానే (14)ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేసి జీటీకి తొలి బ్రేక్ ఇచ్చినా.. వన్‌డౌన్‌లో రఘువంశీ రాకతో నిప్పుకు గాలి తోడైనైట్టెంది. రషీద్ వేసిన ఏడో ఓవర్లో వరుసగా 6,6,4 కొట్టిన అలెన్ 21 బంతుల్లోనే ఫిఫ్టీ అందుకోగా.. ఇంకోఎండ్లో రఘు సైతం భారీ షాట్లు కొట్టడంతో 9 ఓవర్లకే స్కోరు వంద దాటింది. అర్షద్ ఖాన్ వేసిన 11 ఓవర్లో మూడ సిక్సర్లు, ఫోర్ కొట్టిన ఫిన్ శతకం చేసేలా కనిపించాడు.
కానీ, సాయి కిశోర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రషీద్‌కు క్యాచ్ ఇవ్వడంతో రెండో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో రఘుకు గ్రీన్ తోడవడంతో జీటీ బౌలర్లు తలలు పట్టుకున్నారు. కిశోర్ బౌలింగ్‌లో 6,4, 6.. రషీద్ ఓవర్లో 4,6తో గ్రీన్ మెరుపులు మెరిపించగా.. హోల్డర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన రఘు ఐపీఎల్లో ఏడో ఫిఫ్టీ పూర్తి చేశాడు. సిరాజ్ వేసిన 19వ ఓవర్లో రఘు 6, 6, 6, 4 సహా 25 పరుగులు పిండుకున్నాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 108 పరుగులు జోడించడంతో కేకేఆర్ భారీస్కోరుచేసింది.
కెప్టెన్ గిల్ ఖతర్నాక్ షాట్లతో చెలరేగినా లక్ష్యం మరీ పెద్దది కావడంతో టైటాన్స్ ఓటమి తప్పలేదు. భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు దూకుడుగా ఆడింది. ఐదు ఫోర్లు, ఓ సిక్స్ బాదిన ఓపెనర్ సుదర్శన్ మూడో ఓవర్లో కార్తీక్ త్యాగి ఆఖరి బంతి మోచేతికి బలంగా తగలడంతో రిటైర్డ్ హర్ట్‌గా డగౌట్ చేరాడు. ఐదో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన నరైన్ తన తొలి బంతికే నిశాంత్ సంధు (1)ను ఔట్ చేసి కేకేఆర్ శిబిరంలో జోష్ నింపాడు. ఈ దశలో బట్టర్ తోడుగా గిల్ దూకుడుగా ఆడాడు.
నరైన్ బౌలింగ్‌లో 6,6.. అనుకూల్ రాయ్ బౌలింగ్‌లో 6,6,4 బాదిన అతను పది ఓవర్లకే స్కోరు వంద దాటించడంతో పాటు 33 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 14వ ఓవర్లో చక్రవర్తిని టార్గెట్ చేసి రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 22 పరుగులు రాబట్టాడు. చివరి ఐదు ఓవర్లలో 85 రన్స్ అవసరం అవగా.. అప్పటిదాకా నెమ్మదిగా ఆడిన బట్లర్.. త్యాగి బౌలింగ్‌లో 4,6తో వేగం పెంచి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కానీ, 17వ ఓవర్లో అనుకూల్ పట్టిన క్యాచ్‌తో గిల్‌ను ఔట్ చేసిన నరైన్ ఐదే రన్స్ ఇచ్చి జీటీ వేగానికి కళ్లెం వేశాడు. ఈ దశలో మళ్లీ క్రీజులోకి వచ్చిన సుదర్శన్, బట్లర్ చెరో ఫోర్, సిక్స్‌తో ఆశలు రేపారు. కానీ, 19వ ఓవర్లో బట్లర్‌ను ఔట్ చేసి 5 రన్స్ మాత్రమే ఇచ్చిన సౌరభ్ దూబే కేకేఆర్ విజయం ఖాయం చేశాడు.
కోల్‌కతా: 20 ఓవర్లలో 247/2 (అలెన్ 93, రఘువంశీ 82, గ్రీన్ 52*, సిరాజ్ 1/50) గుజరాత్: 20 ఓవర్లలో 218/4 (గిల్ 87, బట్లర్ 57, నరైన్ 2/29)