సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ) : నగరంలో సీఎన్జీ గ్యాస్ కొరత 6 నెలల నుంచి తీవ్రంగా వేధిస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తుతున్న డ్రైవర్లు సీఎన్ గ్యాస్ నయమని భావిస్తే.. ఇప్పుడు ఈ ధర కూడా సెంచరీ సమీపానికి చేరుకుంది. కేజీ 97 రూపాయలు ఉన్న సీఎన్జీ రూ.99 చేరింది. పెట్రోల్,డీజిల్‌తో పోలిస్తే సీఎన్జీ అధికమైలేజీతో పాటు కాలుష్య రహితం కావడంతో చాలా మంది వాహనాలను సీఎన్జీకి అనుగుణంగా ఇంధన ట్యాంకులను మార్చుకున్నారు.
గ్రేటర్లో ఇటీవల సీఎన్జీ వాహనాలు అధికంగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ గ్యాస్ ధరలు కూడా పెట్రోల్, డీజిల్ ధరల దరిదాపుల్లోకి చేరుతున్నాయని డ్రైవర్లు చెబుతున్నారు. మరోవైపు సీఎన్జీ ఇంధన కొరతతో నో స్టాక్ బోర్డులు బంకుల్లో దర్శనమిస్తున్నాయి. దీంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 6 నెలల నుంచి ఇంధన కొరత వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇంధన కొరత సమస్యను పరిష్కరించాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.