‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రత్యేక బహుమతి రూ.5 వేలు పొందిన కథ.
కుమారస్వామికి నిద్ర పట్టలేదు. పదేపదే వైకుంఠప్ప అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. అతను పడే వేదనలో అర్థముంది. కడుపునిండా తిని, కంటి నిండా నిద్రపోయే వాళ్లకు ఈ విధమైన ఆలోచనలు ఉండవు. వైకుంఠప్ప పనికి వచ్చినా రాకపోయినా.. అతను లేవనెత్తిన అంశమైతే తీసివేయదగ్గది కాదు. పనోడు చెప్పినా, మనోడు చెప్పినా.. హితకరమైనదైతే వినాలి, ఆచరించాలి. కొందరు మహానుభావులతోపాటు ప్రకృతిలో ఉన్న చెట్టూ-చేమ, పురుగూ-పుట్రల్ని చూసి మనిషి తనను తాను చాలా మార్చుకున్నాడు.
రాత్రి పన్నెండు గంటలు దాటింది. తాగునీళ్ల కోసం అటుగా వచ్చిన కుమారస్వామి కొడుకు మిథున్.. అమ్మానాన్నల గదిలో ఇంకా లైటు వెలుగుతుండటం చూసి, చిన్న అనుమానంతో..
“అమ్మా.. నాన్నా!” అంటూ తలుపు తట్టాడు.
కుమారస్వామి భార్య రేణుకకు అప్పుడప్పుడే నిద్ర పట్టింది. తలుపు కొడుతున్న చప్పుడు వినబడేసరికి
లేవబోయింది.
“నేను వెళ్తాలే.. నువ్వు పడుకో” అని శ్రీమతిని వారించిన కుమారస్వామి, వెళ్లి తలుపు తీశాడు.
ఎదురుగా మిథున్ నిలబడి ఉన్నాడు.
“ఏంటి నాన్నా! రోజూ పది గంటలలోపే నిద్రపోయేవారు. ఇంతవరకు మేలుకున్నారేంటి? ఏమైనా హెల్త్ ప్రాబ్లమా!” అన్నాడు.
“అదేం లేదు చిన్నా! పట్టించుకుంటే పెద్దది, చూడనట్టు వదిలేస్తే చిన్న సమస్య. కానీ విలువైనది” అన్నాడు కుమారస్వామి.
“వావ్ ఇంట్రెస్టింగ్! ఏమిటది?” తెలుసుకోవాలన్న ఉత్సుకతతో అడిగాడు మిథున్.
“ఇప్పటికిప్పుడు తొలగిపోయేది కాదులేరా. బాగా పొద్దుపోయింది. రేపు పొద్దున్నే చెప్తాను. అయినా.. నువ్వింకా నిద్ర పోలేదా” అన్నాడు కొడుకుని.
“కెనడాలో ఉన్న సాయికిరణ్ చాన్నాళ్ల తర్వాత ఫోన్ చేశాడు నాన్నా. వాడితో మాట్లాడుతుంటే ఇంతసేపయింది. సరే నాన్నా.. నేను వెళ్తాను. గుడ్ నైట్!” అంటూ తన గదివైపు వెళ్లాడు మిథున్.
మిథున్ బెంగళూరులో పేరుగాంచిన ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఉద్యోగంలో చేరి రెండేళ్లు అయింది. దూర ప్రాంతాల్లో జాబ్ ఆఫర్స్ వచ్చినా వెళ్లలేదు. భవిష్యత్తులో విదేశాలకు వెళ్లే ఆలోచన అస్సలు లేదు. జీతం తక్కువైనా సొంత ఊరికి దగ్గరగా ఉంటున్నాడు. అమ్మానాన్నలంటే అతనికి పిచ్చి ప్రేమ. ఉన్న ఏకైక సంతానంపై రెండు ప్రాణాలు పెట్టుకున్న కొండంత ప్రేమకు ప్రతిరూపం మిథున్. కొడుకు ఒక్కవారం ఇంటికి రాకపోయినా విలవిల్లాడుతారు కుమారస్వామి-రేణుక. సాధారణంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు వారానికి ఐదు రోజులు కంప్యూటర్ ముందు కష్టపడి.. వారాంతంలో పూర్తిగా రెస్ట్ తీసుకొంటుంటారు. లేకుంటే మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రకృతి యాత్రలు చేస్తుంటారు. మిథున్ అలా కాదు. కొంచెం డిఫరెంట్‌గా ఆలోచిస్తాడు. మంచి సబ్జెక్టు దొరికితే ఫ్రెండ్స్‌తో కలిసి వాటికి తగ్గ లొకేషన్స్ వెతుక్కుని సందేశాత్మకమైన షార్ట్ ఫిలిమ్స్ తీస్తుంటాడు. నేషనల్ లెవెల్లో కొన్నిటికి అవార్డ్స్ కూడా వచ్చాయి. ఒకరకంగా పని రాక్షసుడు అనవచ్చు. ఈసారి వారాంతంతోపాటు సోమవారం పండగసెలవు రావడంతో ఇంటికి వచ్చాడు.
కుమారస్వామి ఉదయం ఆరుగంటలకు వాకింగ్‌కు వెళ్తాడు. చాలా ఏళ్లుగా అది అతని దిన చర్య. మిథున్ ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేస్తాడు. లేదా తన షెడ్యూల్‌ను బట్టి బయటికి వెళ్తాడు. ఆరోజు తండ్రి వెంట వాకింగ్‌కు వెళ్లాలనుకుని ముందే రెడీ అయి కూర్చున్నాడు.
వాళ్ల నాన్న రాగానే..
“నేనూ మీతో వస్తా నాన్నా” అన్నాడు.
“ఎప్పుడూ రానిది ఇప్పుడేమిట్రా! ఓకే!” అన్నాడు మిథున్ వీపు తడుతూ.
“నాన్నా.. మీరు రోజూ వెళ్లే జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌కు కాకుండా చెరువు కట్టవైపు వెళ్దాం. చాలా కాలమైంది అటువైపు వెళ్లి” అన్నాడు.
కొడుకుతో కలిసి వాకింగ్ చేస్తుంటే.. ఆరోజు ఎందుకో కొత్తగా ఉంది కుమారస్వామికి. తండ్రితో కలిసి నడుస్తున్నందుకు మిథున్ కూడా అదే అనుభూతికి లోనవుతున్నాడు. ఇద్దరూ చెరువుకట్టను సమీపించారు. చెరువులో మట్టితోడి రెండు ట్రాక్టర్లలో వేస్తున్న నలుగురు కూలీలు తప్ప.. నరసంచారం ఏదీ లేదక్కడ. రకరకాల చెట్లున్న కొండ వైపునుంచి వస్తున్న చల్లటి గాలి, జంట గుట్టల మధ్య లేస్తున్న సూర్యుని వెచ్చటి కిరణాలతో మనసును పులకింపజేసే వాతావరణం ఉందక్కడ.
“ఇప్పుడు చెప్పండి నాన్నా! రాత్రి మీ నిద్రలేమికి కారణం ఏంటి?” అన్నాడు మిథున్.. శిథిలావస్థలో ఉన్న తూమువైపు చూస్తూ.
“చిన్నా! కర్నాటక సరిహద్దులో ఉన్న ఈ ఊరు.. చుట్టుపక్కల ఇరవై గ్రామాలకు మండల కేంద్రంగా ఉన్నా, పెద్దగా ఎదుగూబొదుగు లేకుండా నిలిచిపోయింది. ఇప్పుడు మన క్లాత్ షోరూమ్‌కు ఎదురుగా మొన్నటిదాకా ఒకపెద్ద వేపచెట్టు ఉండేది. దానికింద మా నాన్న రెండు కుక్కి మంచాలు వేసుకొని బట్టల వ్యాపారం చేసేవాడు. ఆయన దగ్గరే నేను వ్యాపారానికి సంబంధించిన కొన్ని కిటుకులు నేర్చుకున్నాను. మా నాన్న ఉన్నట్లే నేను మన షోరూం ఉన్న స్థలం కొన్నాను. ఆయన చనిపోయిన పదేళ్లదాకా నాకు షాపు కట్టడానికి కావలసిన డబ్బు సమకూరలేదు. వ్యాపారం అంత మందకొడిగా సాగేది. షోరూం కట్టిన ఐదేళ్ల తర్వాత కొంత సొమ్ము మిగిలొచ్చింది.
ఎవరో అవసరానికి అగ్గువగా అమ్ముతున్నారని తెలిసి ఊరి బయట ఎకరం స్థలంకొన్నాను. బెంగళూరు నగరం దగ్గర ఉన్న పుణ్యమేమో! ఈ నాలుగైదేళ్లుగా చుట్టుపక్కల చిన్నాపెద్దా ఫ్యాక్టరీలు పడుతుండటం వల్ల.. ఈ ప్రాంతం అభివృద్ధిలో కదలిక మొదలైంది. జనసంచారం బాగా పెరిగింది. రోడ్ల వెడల్పులో భాగంగా మన షాపు ఎదురుగా ఉన్న వేపచెట్టును కొట్టేశారు. అప్పుడు మా నాన్న ఇంకోసారి చనిపోయిన బాధ కలిగినా.. ‘ఇప్పుడు బట్టల వ్యాపారం బాగా సాగుతోంది. అభివృద్ధి ఊపందుకుంది కదా!’ అని సంతోషించాను. ఈ ఊర్లో శుభకార్యాలు చేయడానికి అనువైన ఫంక్షన్ హాలు ఒకటీ లేదు. కోట లోపల రెండు హాళ్లు ఉన్నా.. అవి ఇప్పుడు చాలా పాతబడ్డాయి. ఎక్కువమంది అతిథులు వస్తే అకామిడేషన్, పార్కింగ్ సౌకర్యం కూడా లేదు. అందరూ దూర ప్రాంతాల్లోని మండపాలను బుక్ చేసుకొని వెళ్తున్నారు. అందుకే ఊరి బయట ఉన్న మన ఎకరా స్థలంలో కల్యాణ మండపం కట్టాలని నిశ్చయించుకున్నాను. తర్వాత పనులు ఎలా చకచకా జరిగాయో, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారి చేతులమీదుగా ఎలా ప్రారంభోత్సవం జరిగిందో, ఆ మరుసటి రోజునుంచే మన మండపం ఎలా ప్రజాదరణకు నోచుకుందో నీకు తెలుసు.
కల్యాణమండపం అంటే మాటలా.. వంటవాళ్లు, డెకరేషన్ చేసేవాళ్లు, శుభకార్యాలు జరిగినప్పుడు పని చేసేవాళ్లు అందుబాటులో ఉండాలి. అవన్నీ సమకూర్చుకోగలిగాను గానీ రెగ్యులర్‌గా మండపం దగ్గర ఉంటూ పనిచేసే వాళ్లను వెతుక్కోలేక పోయాను. ఈ విషయం మనకు రోజూ పాలు పోసే బసంపల్లి రాంరెడ్డికి చెప్పాను. అతను వైకుంఠప్ప-నారాయణమ్మ అనే అరవై ఏళ్లు పైబడిన దంపతుల్ని పిలుచుకొని.. మన షాపు దగ్గరికి వచ్చి పరిచయం చేశాడు.
‘అన్నా! నాకు బుద్దొచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. వీళ్లు మా ఊరి పొలాల్లో దినకూలీలుగా పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. పాపం పిల్లోళ్లు పుట్టలేదు. ఒకరికి ఒకరు.. వాళ్లే పిల్లోళ్లు. మా ఊరు పొలాలు తప్ప బయట ప్రపంచం వీళ్లకు అంతగా తెలీదు. కూలీకి పిలిచిన యజమాని చేనులో ఉన్నా లేకున్నా శ్రద్ధగా పనిచేస్తారు. ఊర్లో వీళ్లకు ఆస్తి పాస్తులు ఏమీ లేవు. ఉంటున్న గుడిసె కూడా కూలిపోయే స్థితిలో ఉంది. మా ఊరి వాళ్లకు ఇప్పటి నుంచీ వీళ్లు లేని లోటైతే పూడ్చలేనిదే. అయితే గాలికి, ఎండకి కొట్టుకొని ఎన్నాళ్లని పనిచేస్తారు. ముసలి ముప్పున అయినా నీడ పాటున
ఉంటారని ఒప్పించి తీసుకొచ్చాను’ అన్నాడు.
నేను వాళ్లకు మండపం పక్కన కట్టిన రెండు గదుల ఇంటిని చూపించి అందులో ఉండమని చెప్పాను. వాళ్లు నిత్యం చేయాల్సిన పనులు వరుసగా చెప్పి.. ‘ఇద్దరికీ కలిపి నెలకు పదివేలు జీతం ఇస్తాను. ఫంక్షన్లు చేసుకునే వాళ్లుకూడా అంతో ఇంతో ఇచ్చిపోతారు. ఇంకా ఏమైనా అవసరమైతే మొహమాటం లేకుండా నన్ను అడగండి’ అని చెప్పాను.
కొత్త కల్యాణ మండపం సకల సౌకర్యాలతో ఆకర్షణీయంగా ఉంది. ముహూర్తాలు లేనిరోజులు మినహా.. నెలలో ఇరవై రోజులు మండపం సందడిగా ఉంటోంది. వైకుంఠప్ప దంపతులు సొంత ఇంటిలా మండపాన్ని చూసుకుంటున్నారు. ఇట్లా ఒక నెల దినాలు గడిచాయి.
ముప్పై ఒకటో దినం వైకుంఠప్ప వచ్చి మండపం తాళం చెవులు నా చేతిలో పెట్టి, కారణం చెప్పకుండా..
‘మేము ఇక్కడ ఉండలేము సారూ..’ అని జీతం కూడా అడక్కుండా భార్యను పిలుచుకొని వాళ్ల ఊరికి వెళ్లిపోయాడు.
నాకు ఏమీ పాలు పోలేదు. లోపం నాలో అయితేలేదు. మరెక్కడుంది? అసలేమి జరిగింది? ఏదైనా కనుక్కోవాలని రాంరెడ్డిని వెంటపెట్టుకొని వైకుంఠప్ప ఇంటికి పోయాను.
అప్పుడు వైకుంఠప్ప అన్న మాటలే నన్ను రాత్రి నిద్రకు దూరం చేశాయి”..
ఆసక్తికరంగా సాగుతున్న కుమారస్వామి మాటలు అక్కడ ఆగిపోయాయి.
వాకింగ్ చేస్తున్న అతను ఒక చెట్టు కింద నిలబడిపోయాడు.
“ఏమైంది నాన్నా. ఏం మాటలవి?” నిలబడి ఉన్నచోట పైనుంచి పండుటాకులు రాలుతుండగా అడిగాడు మిథున్.
మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు కుమారస్వామి..
“నేను మీపై నమ్మకంతో ఏదో ఈ వయసులో మీకు సులకాగ ఉండే పని కల్పిద్దామని ఈ పూరిగుడిసెకు దూరంగా మంచి ఇల్లు ఇప్పించి పని చూపిస్తే.. ఏంది వైకుంఠప్పా! నాకు చెడ్డ పేరువచ్చేలా ఇట్లా చేస్తిరి మీరు” విచారంగా అన్నాడు రాంరెడ్డి.
“అయ్యా! మీరు దయ చూపించినదైతే నిజమే! మీ రుణం తేర్చుకోలేనిదే! కానీ, మాకు అక్కడ ఉండటానికి మనసొప్పడం లేదు”..
లోలోన నలుగుతున్నట్లుగా అన్నాడు వైకుంఠప్ప.
“ఏమి వైకుంఠప్పా! ఒంటరిగా ఏమైనా ఉండమన్నామా! ఆలుమగలు ఇద్దరూ కలిసేకదా ఆడన ఉన్నారు. అడవిలో ఏమైనా ఇడిచిపెట్టినామా!? మనుషుల మధ్యనే కదా ఉండమన్నాము. ఏమీ తోచకపోతే ఊర్లోకి కూడా అట్లా పోయి సినిమానో గినిమానో చూసిరావచ్చు కదా! ఈ ఊర్లో మీకు ఏమి ఆస్తులు ఉన్నాయని బెంగపెట్టుకుని ఎనక్కి వచ్చినారు? ఆ ఏరియాలో దెయ్యాలు ఏమైనా కనిపించినాయా? ల్యాక ఎవరైనా బెదిరించినారా?” కాస్త దురుసుగానే అన్నాడు రాంరెడ్డి.
“మా బాధ అది కాదయ్యా! ఈ నెల దినాల్లో శానా ఫంక్షన్లు జరిగినాయి. మాకు మూడు పూటలా తిండి గడిచింది. అంతో ఇంతో దుడ్లు కూడా ఇచ్చినారు. లోటు చేశారని లొట్టకూతలు కూయకూడదు. ఈ ముసలి ప్రాణాలకు దెయ్యాలు, మనుసులతో యా భయమూ లేదు. మేము గాదిరాకు, బలుసాకు తినిపించిన కరువు కాలం నుంచీ ఈ భూమిపైన ఉంటాన్నాము. సంగటి కడికి దిక్కులేక కావుకావుమని కాకుల్లా అరిచినాము. బువ్వ లేనప్పుడు బావినీళ్లు తాగి బోర్లా పడుకున్నాం. నీళ్లు లేక ఎండిన చెరువుల్ని చూసినాము. చేన్లనూ చూసినాము. ఇప్పుడేదో కాలం మారిపోయి కూలికి పోయినా, పోకపోయినా.. గవుర్నమెంటు స్టోరు బియ్యం వొనగూడి ఉపాసమైతే ఉంటలేము”..
వైకుంఠప్ప ఏదో విడమరిచి చెబుతున్నాడని, కుమారస్వామి, రాంరెడ్డి ఇద్దరూ చెవులొగ్గి వింటున్నారు.
“నీకు తెలీదా రాంరెడ్డీ! ఒక ధాన్యం గింజ పండించడానికి కూలీలు ఎంత కష్టపడతారో! రైతులు ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారో! ఎన్ని గాయాలు తగిలించుకుని ప్రాణాలు అడ్డుగా పెడతారో! ఒగొగ గింజా ఏకమైతేనే కదప్పా పిడస బువ్వ అయ్యేది. బువ్వంటే ఎంత అపురూపం. బువ్వే కదా.. మనుసుల ప్రాణాలు నిలిపేది. బువ్వనే కదా మనం పూజించాల్సింది. పదిమందికీ పెట్టి సంతృప్తి పడేది. అట్లాంటి బువ్వను ఏందయ్యా.. ఆ మండపంలో పెళ్లిళ్లకి పేరంటాలకి వొచ్చిన సుట్టాలు, పట్టాలు ఏందో కాలితో తన్నినట్లు అట్లా వృధా చేస్తాన్నారు? అంతంత బువ్వ పెట్టించుకోవడం యాలనో, పారేయడం యాలనో! అదేమీ కడుపుమంటో! పెట్టినోడు నాశనమై పోనీ అన్నట్లు ఉంటాంది వాళ్ల వాలకం. పాడు కడుపు ఒక పూట తిన్నా ఉంటుంది. తినకున్నా తట్టుకుంటుంది.
ఒకపక్క ‘బీపీ ఉంది. సుగరు వ్యాధి ఉంది’ అంటుంటారు. ఇంకోపక్క ప్లేటు నిండుగా బువ్వ పెట్టించుకుని పారేస్తుంటారు. ఒకపూట కడుపు నింపడానికి కార్యాలు చేసేవాళ్లు అన్నన్ని రకాల తిండి పదార్థాలు పెట్టడం అవసరమా చెప్పు! పల్లెల్లో అయితే తట్టల్లో మిగిలింది కుడితికి పోస్తే జీవాలు తిని తాగుతాయి. యక్కడా మెతుకు పక్కకి పోదు. ఎవరూ తినకుండా నేలపాలు చేసేది ఏందయ్యా!? దీనివల్ల డబ్బులు పెట్టినోడు బాగు పడినట్లనా, పారేసినోడు బాగుపడినట్లనా?”..
మనసులోని బాధ మాటల ద్వారా బహిర్గతమవుతున్నా.. ఇంకా దేన్నో భరిస్తున్నట్టు చెప్పాడు వైకుంఠప్ప.
వైకుంఠప్ప ఆవేదనలో అర్థం ఉంది. కుమారస్వామి ఆలోచనలో పడ్డాడు.
“పెద్ద మండపాల్లో శుభకార్యాలు చేస్తున్నారంటేనే.. వాళ్లు రవంత కలిగినోల్లని తెలుసుకోవాల! నీ జీతం నువ్వు తీసుకొని గమ్మనుండల! అంతేగానీ వాళ్లు ఏమి తింటేనేమి? ఏమి పారేస్తేనేమి? ఐటమ్లు తగ్గిస్తే.. ‘పీనాసి నాకొడుకు ఏమీ పెట్టలేదు’ అంటారు. దండిగా ఆకు నిండా నింపితే.. ‘వానికేం తక్కువ! పెట్టనీలే’ అంటారు. దేనికని ఓర్చుకునేది. పూర్వానికి పెద్దవాళ్లు చెప్పినారుకదా.. పెట్టి, పోసి గొప్పవాళ్లు అనిపించుకోలేమని! అయినా తప్పదుకదా.. పడితీరల కాలానికి తగ్గట్టు మారిపోవాల!” అన్నాడు రాంరెడ్డి.. వైకుంఠప్పతో.
“మేము ఏందైనా ఓర్చుకుంటాము గానీ.. బువ్వ పారేస్తే సహించలేమయ్యా! అందుకే ఆ బిల్డింగులో కన్నా మా గుడిసెనే బాగుందని వచ్చేసినాము”.
ఆ మాటలకు..
“ఓర్నీ! మీరెక్కడి తెల్లబట్ట మనుసులయ్యా!” అనే ఒక్కమాట అని, నాలుక తడారిపోయినట్టు ఊరుకున్నాడు రాంరెడ్డి. కుమారస్వామికి తలసుడిలో వెంట్రుకలు గిర్రునతిరిగినాయి.
“ఇంకేమీ మాట్లాడొద్దు! రాంరెడ్డీ పోదాం పదా!?” అని అక్కడినుంచి వచ్చేసినారు.
“మనం నాగరికలమని చెప్పుకొంటున్నాం గానీ.. అసలైన నాగరికం వాళ్లను చూసే నేర్చుకోవాలి. నాకు కళ్లలో నీళ్లు తిరిగినాయి. వాళ్లు ఎలాగూ రారు. బలవంతం బాధ్యత ముందు పనిచేయదు. అయితే సమస్యమాత్రం పరిష్కారం కావాల!” అంటున్న కుమారస్వామి.. తండ్రి మాటలు వింటున్న మిథున్ కళ్లలోనూ నీళ్లు తిరిగాయి.
అనుకోకుండా కడుపుని అరచేత్తో తడిమి చూసుకున్నాడు.
ఇంటికి పోయి స్నానం చేసి అమ్మ పెట్టిన టిఫిన్ తింటున్నప్పుడు కూడా వైకుంఠప్ప మాటలే గుర్తుకొస్తున్నాయి మిథున్‌కు. ఎప్పుడూ ఎంతో కొంత ఆహారం ప్లేట్లో వదిలేసే అలవాటున్న అతను.. ఈరోజు కొంచమే వడ్డించుకుని పూర్తిగా తినేశాడు. వాళ్ల అమ్మ ఆశ్చర్యంగా చూసింది. కుమారస్వామి ఇది గమనించాడు.
మిథున్ ఆదివారం రాత్రి బయలుదేరి బెంగళూరులోని ఆఫీసుకు వెళ్లాలి. కానీ వారం రోజులు సెలవు పెట్టినాడు.
“సెలవు ఎందుకు పెట్టావురా!?” అని నాన్న అడిగితే.. తర్వాత చెప్తానన్నాడు.
ఎక్కడికో వెళ్తున్నాడు వస్తున్నాడు.
ఐదు రోజుల తర్వాత పది నిమిషాల నిడివి గల ఒక వీడియోతో కుమారస్వామి ముందునిలిచాడు మిథున్. దాన్ని చూస్తున్నంత సేపూ వైకుంఠప్పే కనిపించాడు కుమార స్వామికి. ప్రపంచంలో ఎంతోమంది ఒక్కపూట ఆహారం దొరక్క అలమటిస్తున్నారు. బువ్వ కోసమే చాలా సంసారాలు తట్ట బుట్ట నెత్తినెత్తుకొని వందల మైళ్లు వలసబోతున్నాయి. కానీ తావలో కావలి కాస్తున్నాయి. ధాన్యం పండించడానికి రైతులు, రైతు కూలీలు రేయింబవళ్లు వాతావరణ మార్పులకు తట్టుకుంటూ ఎలా కష్టపడతారో.. హృదయ విదారకంగా వివరణాత్మకంగా ఉందా వీడియోలో. చివర్లో.. ‘మండపంలో మిగిలిన ఆహారం వృద్ధాశ్రమాలకు, అనాథాశ్రమాలకు పంపిస్తాం! దయచేసి ఆహారం వృథా చేయకండి’ అనే విన్నపాన్ని జతచేశారు.
“నాన్నా! దీన్ని మన కల్యాణమండపం డైనింగ్ హాల్లో అందరికీకనిపించేలా ప్రొజెక్టర్ ద్వారా టిఫిన్లు, భోజన సమయాల్లో ప్రసారం చేద్దాం. దీన్ని చూశాక కూడా మారనివాళ్లను మూర్ఖులని కచ్చితంగా చెప్పొచ్చు. మార్పు వస్తుందనే ఆశిద్దాం. దీనికి ఏర్పాట్లు చేస్తాను. అలాగే నీటి ప్రాముఖ్యతను తెలిపే ఫ్లెక్సీలను అవసరమైన చోట ఏర్పాటు చేద్దాం. భోజనాలు వడ్డించే వారికి కూడా మితంగా వడ్డించమని గుర్తుచేసే బాధ్యత కూడా మనమే తీసుకుందాం. దీనివల్ల అటు వినియోగదారులకూ మేలు చేసినట్లు అవుతుంది. మన మండపం పట్ల సదభిప్రాయం కూడా కలుగుతుంది” అన్నాడు మిథున్.
కొడుకును మనసారా అభినందించాడు కుమారస్వామి.
బసంపల్లి సర్పంచ్ కూతురు కృష్ణవేణి పెళ్లి.. కుమారస్వామి కల్యాణమండపంలో జరపడానికి తలపెట్టినారు. పెండ్లికి ట్రాక్టర్లో కూర్చుని వైకుంఠప్ప భార్యా సమేతంగా వచ్చినాడు. డైనింగ్ హాల్లో ప్రసారం అవుతున్న వీడియోను చూశాడు. భోజనాలు చేస్తున్న జనాలు ఇప్పుడు చాలా ఆకుల్లో మెతుకు మిగల్చడంలేదు. సర్వం సద్వినియోగం అవుతోంది.
కుమారస్వామిని కలిసిన వైకుంఠప్ప..
“శానా మంచి పని చేశారయ్యా! ఇదే నేను కోరుకున్నది” అన్నాడు.
“అంతా నీచలవే వైకుంఠప్పా! మొత్తానికి భూమిపైన ఉండాల్సిన వాడివే. ఇప్పటికైనా ఇక్కడ ఉండటానికి మీరు ఒప్పుకొంటారా” అన్నాడు కుమారస్వామి.
“సంతోషంగా ఉంటామయ్యా!”.. చేతులెత్తి నమస్కరిస్తూ చెప్పాడు వైకుంఠప్ప.
యాములపల్లి నరసిరెడ్డి
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యాములపల్లి నరసిరెడ్డి.. ఆకలి, మెతుకు విలువ తెలిసిన రచయిత. ఆ నేపథ్యంలోనే ‘బువ్వ’ కథను అందించారు. ఈయన స్వస్థలం ఉమ్మడి అనంతపురం జిల్లా సోమందేపల్లి మం చాకర్లపల్లి. బీఏ చదివారు. ప్రస్తుతం హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా సాహిత్య సేద్యం చేస్తున్నారు. మన్నే మాతరం, శిలావృక్షం (కవితా సంపుటాలు), వొరుప్పోటు, రాగులసీమ (దీర్ఘ కావ్యాలు), ఎనుముల గడ్డ కథలు (కథా సంపుటి) వెలువరించారు. వ్యంజకాల సంపుటిని ప్రచురణకు సిద్ధంగా ఉన్నది. ఈయన రాసిన విమర్శ వ్యాసాలు (కథ, కవిత, నవల) పలు పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆచార్య ఎన్జీరంగా, ఎక్స్ రే (నాలుగు సార్లు), మల్లెతీగ, విశాలాక్షి, రంజని-కుందుర్తి(రెండు సార్లు), ‘చం’ స్పందన, తపస్వి మనోహరం-వేమన కవితామయం, బాల నాగయ్య, సాహితీ కిరణం, విశాలాక్షి , జన రంజక కవి వంటి 42 కవిత్వ పురస్కారాలు, బహుమతులతోపాటు వెల్చేరు, పైనేని మునెమ్మ, విడుదల నిహారిక ఫౌండేషన్, ఆళ్ల దాశరథ రామిరెడ్డి మొదలైన సంస్థల నుంచి కథా పురస్కారాలను అందుకున్నారు.
యాములపల్లి నరసిరెడ్డి
96037 59059