‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రత్యేక బహుమతి రూ.5వేలు పొందిన కథ.
ఉలిక్కిపడుతూ కళ్లు తెరిచాను. పక్కనేవున్న టేబుల్క్లాక్లోకి చూస్తే.. రాత్రి ఒకటిన్నర!
చదువుకుంటూ ఎప్పుడు మగతనిద్రలోకి జారుకున్నానో తెలీదుగానీ, వారంరోజులుగా ఏ కాస్త కునుకు పట్టినా.. తరచూ నాకు వచ్చే అదే ‘కల’ ఇప్పుడు కూడా రావడంతో ఉలిక్కిపడి తేరుకున్నాను. అసలు.. ఈమధ్య నాకెందుకు ఈ కల తరచుగా వస్తోంది?!
మెలకువగా ఉన్నప్పుడు మనసులో అణచివేయబడిన భావాలు.. నిద్రలో ఇలా ‘కలలు’గా వస్తాయంటారు. నిజమేనా? అంటే.. నాకు తెలీకుండానే నేను మానసికంగా ‘తనను’ కోరుకుంటున్నానా? లేక తనే క్రమక్రమంగా నా మనసుని ఆక్రమించేస్తోందా?
అసలిలాంటి ఆలోచన రాగానే..
“నోనో.. అలాంటిదేం లేదు!” అనుకుంటూ నన్ను నేను సంబాళించుకున్నాను. అంతలో..
“అదేంటీ.. మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఏదైనా పీడకల వచ్చిందాండీ?” అని వినిపించేసరికి.. కలవరపడుతూ తలతిప్పి చూసి,
“అబ్బేఁ.. అలాంటిదేం లేదు!” అన్నాను వెంటనే. అంతటి ‘రసవత్తరమైన కల’ని ఆమె ‘పీడకల’ అంటూంటే మనస్కరించక.
“మళ్లీ అదే మాట! అయినా, రాత్రంతా మేల్కొని చదవడమెందుకండీ? పడుకోవచ్చుగా!” మంచం దిగి నావైపొస్తూ అంది. ‘మార్దవం’ అనే పదానికి తన స్వరాన్నే నిర్వచనంగా చూపించొచ్చని చాలాసార్లు అనిపించింది నాకు.
“ఉహుఁ.. అలాంటిదేం లేదు!” అన్నాను ఆమె మాటలకు బదులుగా. తను మరింత దగ్గరికొచ్చి..
“అసలేమైంది మీకు? ఒకేమాట పదేపదే అంటున్నారు?” అంది అనునయంగా.
“లేదు లేదు! అలాంటిదేం..” అంటూ మధ్యలోనే ఆగిపోయి తలెత్తి చూశానామె ముఖంలోకి.
నా చూపులతోపాటు టేబుల్ల్యాంప్ వెలుగు కూడా కిందనుంచి పైకి ప్రసరిస్తూండటంతో.. వెలుగునీడల నడుమ ఆమె ముఖం చంద్రబింబంలా కనిపించింది. చప్పున చూపులు మరల్చుకుంటూ అన్నాను. “రేపటితో మా డిపార్ట్మెంటల్ పరీక్షలైపోతాయ్! నాకు ప్రమోషన్ రావాలంటే ఈ పరీక్షలు రాయాలి మరి!”
కొద్దిక్షణాల మౌనం తర్వాత అంది. “కాఫీ తీసుకురానా?” “ఊ..” నా మనసులోని భావాన్ని కరెక్టుగా పసిగట్టడం ఆమెకెలా అబ్బిందో?!
నా నుంచి బదులు రావడమే ఆలస్యం.. వెంటనే వంటగది వైపు కదిలిన ఆమెవంకే చూస్తూండిపోయాను.
రెండు నిమిషాల తర్వాత.. “నాకైతే తప్పదనుకో! నువ్వెందుకు అర్ధరాత్రి వేళ శ్రమపడటం? పడుకునేముందే ఫ్లాస్క్‌లో కాఫీ పోసి నా టేబుల్‌పై పెడితే నేనే తాగేవాణ్నిగా?!” ఆమెనుంచి కాఫీకప్పు అందుకుంటూ అనకుండా ఉండలేకపోయాను.
“నిద్రమానుకుని మీరింత కష్టపడి చదువుకుంటూంటే.. ఈ మాత్రం కాఫీ కాచివ్వడం పెద్దశ్రమేం కాదులెండి! పైగా, ఈ కారణంతోనైనా మీతో నాలుగు మాటలు మాట్లాడే అవకాశం దొరుకుతుందిగా!” అంది స్వచ్ఛంగా నవ్వేస్తూ. ఆ చివరివాక్యం నా మనసులో ఎక్కడో సూటిగా గుచ్చుకున్నట్లు అనిపించింది. ఆమె ముఖంలోకి చూడలేక తల దించుకుంటూండగా.. అడిగింది, “ఇంకా ఏమైనా కావాలా?” అని.
పుస్తకంలోకి చూస్తూనే తల అడ్డంగా ఊపాను.
“సరే.. మీరు చదువుకోండి! ఏదైనా అవసరమొస్తే నన్ను నిద్రలేపండి!” అని మంచంవైపు నడిచింది.
నేను బదులివ్వలేదు. తల వంచుకొని.. కాదు, కాదు. నాపట్ల ఆమె చూపిస్తున్న ఆదరణ, అనురాగాలకి నా ప్రతిస్పందన గుర్తొచ్చి, తల ‘దించుకుని’ పుస్తకంలోకే చూస్తూండిపోయాను చాలాసేపు. ‘ఈ కారణంతోనైనా నాలుగు మాటలు మీతో మాట్లాడే అవకాశం దొరుకుతుందిగా!’ అన్న తన మాటలే గుర్తొస్తూ.. నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. అలా ఎంతసేపున్నానో తెలీదు. కొద్దిసేపటికి మనసు స్థిమితపరచుకొని..
“నాతో మాట్లాడాలని నువ్వు అంతగా కోరుకుంటున్నావా?” అన్నాను తల పైకెత్తకుండానే.
కాసేపటి వరకూ నాకు బదులు రాకపోయేసరికి తలతిప్పి ఆమె పడుకున్న మంచంవైపు చూశాను.
మంచంపై ఇటువైపు తిరిగి నావంకే చూస్తూ పడుకుని, అలాగే నిద్రలోకి జారుకున్నట్లుంది.. నా మాటలు వినిపించలేదనుకుంటాను. అయితే.. తాను పడుకున్న ‘తీరు’ మాత్రం నన్ను చూపులు మరల్చుకోనివ్వలేదు.
ఓ చేయి తలకింద, మరో చేయి నడుముపై ఆన్చి శేషతల్పంపై శ్రీరంగస్వామిలా పడుకున్న భంగిమలో.. టేబుల్ల్యాంప్ వెలుగులో ఆమె ముఖం ఫ్లోరసెంట్ బల్బులా కాంతులీనుతూంటే.. పసిడివర్ణపు తన మేనిఛాయ రేడియం పులుముకున్న పుత్తడిలా మెరిసిపోతోంది. చక్కటి సౌష్టవంతో పరిపక్వతకొచ్చిన ఆమె యవ్వనం.. సముద్రుడితో ‘సమాగమం’ కోసం ‘నదీముఖ ద్వారం’ వద్ద పోటెత్తుతున్న ‘కన్నె నది’లా పరవళ్లు తొక్కుతోంది. ‘ఇంతటి సౌందర్యరాశి నాకే సొంతం కదా!’ అన్న భావం క్షణంపాటు నా మనసులో స్ఫురించి ఒకింత గర్వం కలిగినా.. ఆ వెంటనే ‘తనని నిర్లక్ష్యం చేస్తున్నాను కదా!’ అన్న ఆలోచన నన్ను కలచివేసింది. “అయామ్ సారీ..” మంచంపై పడుకున్న తనవంకే చూస్తూ నా పెదవులు అస్పష్టంగా గొణిగినా.. ఆ భావం మాత్రం నా మనసులోంచి నిజాయతీగా బయటకి వ్యక్తమైంది. కానీ, ఇవేవీ వినిపించనంత గాఢనిద్రలో ఉంది నా భార్య.. సువర్చల!
‘సువర్చల’ నా మేనమామ కూతురు!
అయితే.. బావామరదళ్ల మధ్యవుండే చనువూ, దగ్గరితనం మామధ్య లేవు. కారణం.. చిన్నప్పట్నుంచీ తనూ, నేనూ పెరిగిన ప్రాంతం, పరిసరాలు వేర్వేరు.
మా మామయ్య మంచి ఆస్తిపరుడు. నా చిన్నప్పుడే మా నాన్న యాక్సిడెంట్లో చనిపోతే.. ఊళ్లోవున్న మావయ్యే నన్నూ, మా అమ్మనూ ఆదుకున్నాడు. నన్ను సిటీలోని సెంట్రల్ స్కూల్లో చేర్పించి, కార్పొరేట్ కాలేజ్‌లో చదివించాడు. మావయ్య నాపై వినియోగించిన ప్రతి రూపాయికీ నా పరిధిలో నేను ఫలితం చూపించాను. ప్రతియేటా మంచి మార్కులూ, ర్యాంకులతో రాణించి, రెండేళ్లక్రితం సెంట్రల్ గవర్నమెంట్లో ఓ మంచి ఉద్యోగం కూడా సంపాదించాను. అన్నీ బాగానే ఉన్నాయి. అయితే.. ఉద్యోగంలో చేరడానికి ముందు ఓ మూణ్నెల్లపాటు ‘పూణె’లో ట్రైనింగ్ ఇచ్చారు మా ఆఫీసువాళ్లు. అప్పుడు పరిచయమైంది.. ‘మాధవి!’
తను కూడా నాలాగే ట్రైనింగ్‌కి వచ్చింది. ఇద్దరమూ తెలుగువాళ్లమే కాబట్టి పూణెలో ఉన్న ఆ మూడు నెలల్లో మంచి స్నేహితులమయ్యాం. ట్రైనింగ్ పూర్తయ్యేనాటికి మా స్నేహం ‘ప్రేమ’గా రూపుదిద్దుకొంది. పోస్టింగ్ వచ్చాక పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం.
ఆ తర్వాత నాకు విజయవాడలో, మాధవికి హైదరాబాద్‌లో పోస్టింగ్స్ వచ్చాయి. ఫోన్లు చేసుకోవడాలు, వీకెండ్స్‌లో కలుసుకోవడాలతో ఏడాదిపాటు మా ప్రేమను పెంచిపోషించుకున్నాం. ఇక ‘పెళ్లి’ గురించి ‘డిస్కస్’ చేద్దామనుకుంటూండగా.. హఠాత్తుగా
‘బాంబు’లాంటి వార్త చెప్పింది. తను ఓ ‘ఎన్నారై’ని పెళ్లాడబోతున్నానని!
నాకు వెంటనే అర్థంకాలేదు. అదే అడిగానామెని.
“ఏముందీ.. ఇంటర్నెట్లో నా ప్రొఫైల్‌ని చూసి ఇంప్రెస్ అయ్యాడట. తర్వాత చాటింగ్‌లో ఇద్దరం కాంటాక్ట్ అయ్యి, ‘డిటెయిల్డ్గా డిస్కస్’ చేసుకుని ఓకే అనుకున్నాం!” అంది. “అదికాదు మాధవీ.. మనం పెళ్లి చేసుకోవాలనుకున్నాం కదా!” అన్నాను.
“అవును.. అనుకున్నాం! కానీ ఎలా? నువ్వు విజయవాడలో, నేను హైదరాబాద్‌లో! ఎలా కాపురం చెయ్యగలం? ఎవరో ఒకరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి. లేదా రిజైన్ చేయాలి.. అవునా?”
“అవును..”
“కనీసం మరో మూడేళ్లదాకా మనం ట్రాన్స్ఫర్కి అప్లయ్ చేసే ఛాన్స్ లేదు. ఇక, నేను మాత్రం నా ఉద్యోగానికి రిజైన్ చేయలేను!” కరాఖండిగా చెప్పేసింది.
“అయితే.. మూడేళ్ల తర్వాతే పెళ్లి చేసుకుందాం!”
“అంతకాలం ఆగటం అవసరమా?” సూటిగా చూస్తూ అడిగింది. “పోనీ.. నేనే రిజైన్ చేసి హైదరాబాద్‌కి వచ్చేస్తాను. సరేనా?” అన్నాను వెంటనే.
“అదికూడా అంత అవసరమా?.. కాస్త ఆలోచించు!” నింపాదిగా అంది. “మరి? నువ్విక్కడ ఉద్యోగం చేస్తూనే.. అమెరికాలో ఉన్న ఆ ఎన్నారైని పెళ్లాడి, ఇక్కడ్నుంచే అతగాడితో కాపురం చేయాలనుకుంటున్నావా?” అన్నాను ఉక్రోషంగా. “లేదు.. జాబ్‌కి రిజైన్ చేసి నేనే అమెరికా వెళ్లిపోతున్నాను!”
“రిజైన్ చేయనని ఇందాకే అన్నావు. ఇప్పుడేమో రిజైన్ చేసి అమెరికా వెళ్లిపోతానంటున్నావ్. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా?” అన్నాను కోపంగా.
“య్యస్స్.. అయామ్ వెరీ క్లియర్ ఎబౌట్ మీ! నీ
విషయంలో నేను రిజైన్ చెయ్యనన్నాను. అతని
విషయంలో చేస్తానంటున్నాను.. అంతే!” చాలా స్పష్టంగా, కాన్ఫిడెంట్‌గా చెప్పింది.
“అంటే..?” నాకు వెంటనే అర్థంకాలేదు.
“ఏముందీ.. ఈ సంబంధం కంటే ఆ అమెరికా సంబంధం ‘బెటర్ ఛాయిస్’ కదా!” లాగిపెట్టి ముఖంమీద కొట్టినట్లు ఆమె అన్నది వింటూనే దిమ్మెరపోయాను. ఏకకాలంలో మెదడుని బ్లాంక్చేసి, మనసుకి తూట్లు పొడిచే మాటలూ, మనుషులూ, సందర్భాలు ఉంటాయని నాకు తొలిసారి అనుభవంలోకి వచ్చింది.
కొద్దిసేపటికిగానీ తేరుకోలేకపోయాను.
“మరి.. మన ప్రేమ?” నా భావమెలా వ్యక్తంచేయాలో నాకు తెలీలేదు. “ప్రేమా..?!” చాలా క్యాజువల్‌గా నవ్వేసింది. ఆ తర్వాత..
“చూడు వంశీ! కొంచెం ప్రాక్టికల్‌గా ఆలోచించు. ఏడాదిక్రితం జరిగిన ట్రైనింగ్‌లో మనం పరిచయమయ్యాం. ఆ సమయం, సందర్భంలో నా స్థానంలో ఏ అమ్మాయి ఉన్నా నీకు పరిచయమయ్యేది. నీ స్థానంలో ఏ అబ్బాయి ఉన్నా నాకు పరిచయమయ్యేవాడు. మూడు నెలల్లో ఆ పరిచయం కాస్తా స్నేహంగా, ఆపై ‘ప్రేమ’గా మారివుండేది. అప్పటి సమయం, సందర్భాల్ని బట్టి ఆ స్థానాల్లో ఉండేవారి పట్ల మన ఫీలింగ్స్ ఉంటాయే తప్ప, ఆయా వ్యక్తుల్ని బట్టి కాదు. సోఁ.. బీ ప్రాక్టికల్! ‘ప్రేమా, దోమా’ అంటూ సెంటిమెంటల్‌గా, ఎమోషనల్‌గా ఫీలవ్వాల్సిన అవసరం లేదంటాను. జీవితంలో మనం వేసే ప్రతి అడుగూ, ఎంచుకునే ప్రతి అంశం, తీసుకునే ప్రతి నిర్ణయం ఆల్వేస్ ‘బెటర్ ఛాయిస్’గా ఉండాలని నా ఉద్దేశం! ఏమంటావ్?” అంది. ఆమె చెప్పింది విన్నతర్వాత ఎలా ప్రతిస్పందించాలో నాకు తోచలేదు. కానీ, ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది.. ఆడది ‘ఆత్మవంచన’ చేసుకోవడం మొదలుపెడ్తే తనవైపు చాలా బలమైన ‘లాజిక్’ని నిర్మించుకుంటుందనీ, ‘అవసరం-అవకాశం’ అనేవే ఆడదాని ఆలోచనలకి పునాదులనీ!
“సార్..” ఎక్కడ్నుంచో లీలగా వినిపించినట్లనిపించి.. ఆలోచనల్లోంచి బయటకొస్తూ తలెత్తి చూశాను.
మా సెక్షన్‌లోని అటెండర్ సింహాద్రి.
“సార్.. మీరు సంతకం పూర్తయితే ఫైలు తీసుకురమ్మన్నారు మేనేజర్ గారు!” అన్నాడు నమ్రతగా.
“ఏ ఫైలు సింహాద్రీ.. ఎక్కడుందీ?” అన్నాను.
“అదేంట్సార్.. మధ్యాహ్నమే మీ టేబుల్ మీదుంచాను కదా! ‘చూసి సంతకం చేస్తాను, తర్వాత రా!’ అన్నారు మీరు. ఇదిగో.. ఇక్కడే ఉంది కద్సార్!” నా టేబుల్‌పై ఓ పక్కగా పెట్టిన ఫైలుని అందుకుని నా ముందుంచాడు.
“ఓహ్.. ఇదా? మర్చేపోయాను!” అంటూ ఆ ఫైలందుకుని, గబగబా చెక్‌చేసి సంతకం పెట్టి అతనికిచ్చాను.
ఏమిటో.. పదిరోజులుగా నేను ‘నేను’గా లేనని తెలుస్తోంది నాకు. మనసులో కలవరం.. మెదడులో అలజడి! ఆఫీసులో ఏకాగ్రతగా పనిచేయలేక పోతున్నాను.. ఇంట్లో స్తిమితంగా ఉండలేక పోతున్నాను.
అయితే, ఒక్కవిషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది నాకు. నా ఆలోచనల్లో ఎక్కువభాగం ఆక్రమిస్తున్నది మాత్రం.. మా మావయ్య కూతురూ, ఏడాది క్రితం నా భార్యగా నా జీవితంలోకి అడుగుపెట్టిన.. సువర్చల!
తను జ్ఞాపకం రాగానే.. నాలో నిజాయతీగా మెదిలిన భావం.. ‘ఎంత అందమైన పేరు! ఉహుఁ.. పేరు మాత్రమే కాదు.. మనిషి కూడా!’
ఏడాదిక్రితం మాధవి ఎన్నారైని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోయాక.. కొన్ని నెలల వరకూ నేను మామూలు మనిషిని కాలేకపోయాను. మనుషుల మీదే ఆసక్తి పోయింది. సరిగ్గా అదే రోజుల్లో.. తన కూతురు సువర్చలను నాకిచ్చి పెళ్లి చేయాలన్న ప్రస్తావన తెచ్చాడు మావయ్య. సువర్చల.. మావయ్య ఒక్కగానొక్క కూతురు. చూడ్డానికి బాగానే ఉంటుంది. ఊళ్లోనే చదువుకుంది. కానీ, పదోక్లాసు పరీక్ష మాత్రం గట్టెక్కించలేక పోయింది. నాలుగైదుసార్లు పోరాడి విఫలమై.. ఇక తనవల్ల కాదని మానుకుంది.
అయినా.. ఇవేవీ కాదు నా సమస్య! మాధవిని ప్రేమించి, ఆమెతో వైవాహిక జీవితం గురించి మనసులో కట్టుకున్న కలల మేడలన్నీ కుప్పకూలిపోయేసరికి.. నాకు జీవితమే లేదనిపించింది. మరో అమ్మాయితో పెళ్లి గురించి ఆలోచించడానికే మనస్కరించలేదు. అందుకే సువర్చలను చేసుకోలేనని అమ్మతో చెప్పాను.
“వంశీ! మీ నాన్న పోయాక, మా అన్నయ్యే ఆదుకోకుంటే ఈ రోజు నువ్వీ స్థితిలో ఉండేవాడివి కాదురా! మీ మావయ్య కోరిక తీర్చడం నీ బాధ్యతరా! సువర్చల పెద్దగా చదువుకోకున్నా.. అందం, అణకువ, ఆస్తీ ఉన్న పిల్ల. అసలు మీ మావయ్య తల్చుకుంటే సువర్చలకి మనకంటే గొప్ప సంబంధాన్ని తెచ్చి చేయగలడ్రా!” అంది అమ్మ. “మరి, చేయొచ్చు కదమ్మా!” అని నేను విసుగ్గా అంటూండగానే, వెంటనే చెప్పింది అమ్మ..
“కానీ, సువర్చలకి నువ్వంటే ఇష్టమటరా! నిన్నుతప్ప ఇంకెవర్నీ చేసుకోనని కచ్చితంగా చెప్పేసిందట!”
“కాఫీ తీసుకోండి!” అని వినిపిస్తే.. గతంలోంచి బయటికొస్తూ తల పైకెత్తాను.. సువర్చల!
“ఏమిటండీ.. పరాకుగా ఉన్నారు? ఆఫీసులో ఏదైనా సమస్యా?” అంది.. చేతిలోని కాఫీకప్పు నాకందిస్తూ.
‘అదేం లేదు’ అన్నట్లుగా తల అడ్డంగా ఊపాను.
“ఏమిటో.. మీరీమధ్య అదో మాదిరిగా ఉంటున్నారు!” అని.. “గీజర్ ఆన్ చేస్తాను. ఆఫీసులో బాగా అలసిపోయారేమో! వేడి నీళ్ల స్నానం చేస్తే అలసట తగ్గుతుంది!” అంటూ బాత్రూమ్ వైపు కదిలింది.
“సువర్చలా..!” అసంకల్పితంగా నా పెదవుల్నుంచి వెలువడిన ఆ పిలుపు నా చెవులకే వింతగా
అనిపించింది.
తను గిరుక్కున వెనక్కితిరిగి.. “మీరు.. నన్ను పిలిచారా?” అంది అబ్బురంగా చూస్తూ. “అవును.. పిలిచాను. ఎందుకలా అడుగుతున్నావ్?” అన్నాను అర్థంకాక. “ఎందుకంటే.. మన పెళ్లయ్యాక మీరు నన్ను పేరుపెట్టి పిలిచింది ఇదే మొదటిసారి కాబట్టి!”
ఎందుకో.. గిల్టీగా అనిపించి తలొంచుకున్నాను.
“అదిసరే.. చెప్పండి.. ఏమిటీ?” అంటూ దగ్గరికొచ్చింది. “ఒకటడుగుతాను.. నిజం చెప్తావా?” అన్నాను సీరియస్‌గా. “మీరలా అంటూంటే భయమేస్తోంది! ఇంతకీ.. ఏమిటండీ అదీ?” అంటున్న తనని చూస్తూంటే ముచ్చటేసింది. తన ముఖంలోకే చూస్తూ..
“నీకు నాపై కోపం లేదా?” అనడిగాను.
“కోపమా? ఎందుకూ..?” మరింత ఆశ్చర్యంగా చూసింది. తను అలా సూటిగా అడిగేసరికి తడబడ్డాను.
“ఎందుకంటే.. నిన్ను నేను సరిగ్గా చూసుకోవడం లేదుకదా.. అని!”
“అదేంటీ.. మీరు నాకేం తక్కువ చేశారనీ?”
ఎలా చెప్పాలో తెలీక..
“అంటే.. నేను నీతో సరిగా మాట్లాడటం లేదు. నీతో సరదాగా ఉండటం లేదుకదా..?!” నా మాటలు పూర్తికాకముందే.. “దాందేముంది లెండి! మీరు పెద్దచదువులు చదివి, గొప్ప ఉద్యోగం చేస్తున్నారు. నేనేమో పదోక్లాసు ఐదుసార్లు ఫెయిలైన మొద్దుని. మీ ఆలోచనలు నాకు అర్థంకావని నాతో ఎక్కువగా మాట్లాడటం లేదేమో.. అంతేగా!” అంది.
“అదికాదు సువర్చలా! భర్తగా నిన్ను దగ్గరికి తీసుకోవడంగానీ, ఇప్పటివరకూ కనీసం నిన్ను ముట్టుకోవడం గానీ.. ఐ మీన్..” చెప్పేందుకు సతమతమయ్యాను.
ఆమె నావంకే కాసేపు ఆర్ద్రంగా చూసి, ఆ తర్వాత ఆర్తిగా నవ్వేస్తూ.. “మిమ్మల్ని తప్ప మరొకర్ని చేసుకోనని పట్టుబట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానే కానీ.. నేనంటే మీకిష్టమో, కాదో నేను తెలుసుకోలేదు. చదువులో, జ్ఞానంలో మీతో ఏమాత్రం సరితూగని నన్ను చేసుకోవడం మీకు ఇష్టం లేకున్నా.. మా నాన్నమాట కాదనలేక నన్ను పెళ్లిచేసుకొని ఉంటారు మీరు. కాబట్టి నన్ను మీరు ఇష్టపడేంతవరకు నేను ఎదురుచూడాల్సిందే కదా! చూస్తానండీ.. ఎంతకాలమైనా ఎదురుచూస్తాను!” అని, అక్కడ్నుంచి కదిలింది. ఆమె మాటలు నన్ను మరింత ఆత్మన్యూనతకి గురిచేశాయి.
దాదాపు ఏడాది క్రితం.. మా శోభనం రాత్రి.. “నా మనసేం బాగాలేదు..” అంటూ నేను తనకి ‘దూరంగా..’ ఉన్నప్పుడు కూడా తను ఇలాగే చెప్పింది.
మా పెళ్లయ్యాక.. సిటీకి వచ్చి కొత్తకాపురం మొదలుపెట్టి ఏడాది కావస్తున్నా.. ఇన్నాళ్లూ అవసరానికి మించి నేను తనతో మాట్లాడకపోయినా.. ప్రతిరోజూ తనపట్ల ముభావంగా ఉంటున్నా.. కనీసం తనను తాకకపోయినా.. ఏ రోజూ తనలో చిరాకు గానీ, పరాకు గానీ, కనీసం విసుగు సైతం నాకు కనిపించలేదు. ఇప్పటివరకు తన ముఖంలో చిరునవ్వు, కళ్లల్లో అభిమానం, మాటల్లో అనురాగం తప్ప మరో భావాన్ని నేను చూడలేదు.
కొత్తకాపురం తొలిరోజుల్లో నా దినచర్య, నా మూడ్‌లను గమనించిన తను.. నాపట్ల ఓ అవగాహన ఏర్పడ్డ తర్వాత, తలలో నాలుకలా నా దైనందిన జీవితంలో తానొక భాగంలా కలిసిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘ప్రేమ’ అంటే తీసుకోవడం కాదు.. ఇవ్వడమే!’ అన్న సత్యానికి నిదర్శనంలా నిలిచింది.. సువర్చల!
‘అవును.. తను సాధించింది.. నాపై, నా మనసుపై విజయం సాధించింది!’ నిజాయతీగా అనుకున్నాను నాలో నేనే! ఇలా అనుకున్న తర్వాతే.. కొద్దిరోజులుగా నన్ను కలవరపెడుతున్న నాలోని ‘సందిగ్ధత’ కాస్త తగ్గినట్లనిపించింది. ఔను.. నా ‘ఓటమి’ కూడా నాకెంతో సంతృప్తిని ఇస్తోందిప్పుడు.
“శుభోదయం..” మగతగా కళ్లు తెరిచి, ఎదురుగా కనిపించిన అపురూప దృశ్యాన్ని అబ్బురంగా చూస్తూండిపోయాను.
సువర్చల.. తలస్నానం చేసి, పూజాపునస్కారాలు కూడా ముగించుకొచ్చినట్లుంది. నేతచీరలో, నుదుట తిలకం కింద అద్దుకున్న దేవుడి కుంకుమతో, సహజంగానే పసిమి వర్ణంలో మెరిసిపోయే ముఖం.. కిటికీలోంచి పడగ్గదిలోకి వాలుగా పడుతున్న ఉదయపు నీరెండ కిరణాలలో మరింతగా వెలిగిపోతూంటే.. వదులుగా వేసిన జడలోని ముంగురులు ఫ్యాన్‌గాలికి అల్లరిచిల్లరగా ఎగిరిపడుతూ తన ముఖాన్ని సుతారంగా ముద్దాడుతూంటే.. లేలేత సూర్యకాంతికి ఆమె తలవెంట్రుకలు బంగారుతీగల్లా మిరుమిట్లు గొలుపుతూంటే.. చేతిలో కాఫీకప్పుతో నన్ను మేల్కొలుపుతున్న సువర్చల.. దేవకన్యలా ఉంది.
“ఏఁవండీ.. మిమ్మల్నే..” ఎన్నిసార్లు పిలిచిందో! కాస్త బిగ్గరగా వినిపించిన పిలుపుతో నేను తేరుకుని.. ఆమె చేతిలోని కాఫీకప్పు అందుకుంటూ “ఏఁవిటీ.. ఈరోజు చాలా స్పెషల్‌గా కనిపిస్తున్నావ్?” అనడిగా..
“అవునా! నిజంగానే ఈరోజు నా జీవితంలో చాలా స్పెషల్ రోజండీ!” అంది ఎంతో మురిసిపోతూ.
“అలాగా.. నీ పుట్టిన రోజా? అయామ్ సారీ.. నాకు తెలీదు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే!” అని..
“సాయంత్రం ఆఫీసునుంచి వచ్చేప్పుడు ‘బర్త్‌డే కేక్’ తెస్తాను. ఇంట్లోనే సెలబ్రేట్ చేద్దామా?” అన్నాను ఖాళీ చేసిన కప్పు అందిస్తూ.
“నాకోసం ఆమాత్రం చేయాలని ఇన్నాళ్లకి మీకు అనిపించిందంటే.. నిజంగా ఆ దేవుడి దయే! నా పూజలు ఫలిస్తున్నాయన్నమాటే! కానీ, ఈరోజు నా పుట్టినరోజు కాదండీ.. మన పెళ్లిరోజు!” అంది.
చివుక్కున చూశాను తన ముఖంలోకి.
‘ఇది కూడా నేను మర్చిపోయానా?’ అన్న ‘గిల్టీనెస్’ నాలో! కానీ, సువర్చల ముఖంలో ఎప్పటిలాగే అదే ప్రశాంతత, అదే చిరునవ్వు, అదే ‘ఆత్మవిశ్వాసం!’
“కేకులూ, గట్రా వద్దు గానీ.. సాయంత్రం మీరు కాస్త త్వరగా ఇంటికొస్తే ఇద్దరం గుడికి వెళ్లొద్దామండీ..!”
నేను బదులివ్వలేదు. సుడులు తిరుగుతున్న భావాలతో మనసు, ముప్పిరిగొంటున్న ఆలోచనలతో మెదడు.. స్తబ్దుగా అయిపోవడంతో మారుమాట్లాడకుండా మంచం దిగి, బాత్రూమ్ వైపు కదిలాను. ఫ్రెషప్ కావడానికి.
గంట తర్వాత.. హాల్లో కూర్చొని మొబైల్ ఫోన్ తిరగేస్తున్న నాకు టిఫిన్ అందిస్తూ..
“ఏఁవండీ.. సాయంత్రం ఆఫీసు నుంచి త్వరగా వచ్చేస్తారు కదూ!” అంది సువర్చల. కళ్లెత్తి ఆమె ముఖంలోకి చూస్తూ తల అడ్డంగా ఊపాను.
కళకళలాడుతున్న తన ముఖం ఒక్కసారిగా వెలవెలబోయినట్లయ్యింది. అప్పటికే మనసులో ‘చెలియలి కట్ట’ దాటేందుకు ఉబలాటపడుతున్న నాలోని భావావేశాన్ని అతికష్టమ్మీద ఉగ్గబట్టుకుంటూ.. ఫోన్ పక్కనబెట్టి, ఓ చేత్తో ఆమె చేతిలోని టిఫిన్ ప్లేట్ అందుకొని, మరో చేత్తో ఆమె చేయి పట్టుకుని నా పక్కన కూర్చోబెట్టుకుంటూ.. ఉద్వేగంగా అన్నాను..
“సువర్చలా! ‘మేరేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్’ అంటారు. అనవసరంగా మనం బెంబేలుపడ్తాం కానీ.. ఆ భగవంతుడు మనుషులకెప్పుడూ మంచే చేస్తాడు. ఎవరికెవర్ని భాగస్వామిని చేయాలో ముందుగానే నిర్ణయిస్తాడు” సువర్చల నావంక అయోమయంగా చూస్తూంటే.. “ఎందుకలా చూస్తున్నావ్ ? అర్థంకాలేదా?” అన్నాను మళ్లీ.
“అవునండీ.. అర్థంకాలేదు..” అంది నా కళ్లలోకే మార్చిమార్చి చూస్తూ.
“సరే.. నీకు అర్థమయ్యేట్లు చెప్తా” అని, ఆమె కళ్లలోకి ఆరాధనగా చూస్తూ.. “సువర్చలా! నేను ఓడిపోయాను. నీ సహనంతో, ప్రేమతో నాపై, నా మనసుపై నువ్వు పూర్తిగా గెలిచావు. నా ఈ ఓటమి కూడా నాకెంతో తృప్తినిస్తోంది!” అని, అరచేతుల్తో ఆమె ముఖాన్ని దగ్గరికి తీసుకుని..
“సువర్చలా! ఇన్నాళ్లూ నిన్ను బాధపెట్టినందుకు వెరీసారీ! సాయంత్రం ఆఫీసు నుంచి నేను త్వరగా రావడం కాదు.. ఈరోజు నేనసలు ఆఫీసుకే వెళ్లను. రోజంతా మన ‘పెళ్లిరోజు’ని ఘనంగా జరుపుకొందాం..” అంటూ.. తన నుదుటిపై ఆర్తిగా చుంబించాను.
ఊహించని హఠాత్సంఘటనకు కొద్దిసేపటివరకు తేరుకోలేక పోయిందామె. ఆ తర్వాత ఉద్వేగాన్ని ఆపుకోలేక.. అలాగే నా గుండెల్లో తల దాచుకుంటూ ఒదిగిపోయింది. తన మానసిక స్థితిని అర్థం చేసుకున్నవాడిలా ఆమెనలాగే పొదివిచేర్చుకుని తల నిమురుతూ ఉండిపోయాను నేను కూడా.
పొంగిపొరలే నదీకెరటాలు ‘చెలియలి కట్ట’ దాటినట్లుగా.. ఆనందోద్వేగాలు ‘మనసు గట్టు’ దాటిన మనిషి స్థితి ఎలా ఉంటుందో నా స్వానుభవంలోకి వచ్చింది. అంతేకాదు, నా ఎదురుగా కూడా స్పష్టంగా కనిపిస్తోంది.. సువర్చలలో!!
యస్వీ కృష్ణ
సాహిత్యం – రచనా వ్యాసంగాలనే వృత్తి- ప్రవృత్తులుగా మలచుకొని జీవనయానం సాగిస్తున్నారు యస్వీ కృష్ణ. రచయితగా, ప్రచురణకర్తగా సుపరిచితులు. రసాయన శాస్త్రంలో ఎమ్మెస్సీ చదివారు. న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. ఫైన్ ఆర్ట్స్ (శిల్పం)లో బీఎఫ్ఏ డిగ్రీ, శాస్త్రీయ సంగీతం (కర్ణాటక వయొలిన్)లో బీఏ చేశారు. శాస్త్రీయ నృత్యం (కథక్)లో డిప్లొమా చేసి జాతీయ ప్రదర్శనలూ ఇచ్చారు. ఇక సాహిత్యంలో.. కవి, కథా – నవలా రచయిత, వ్యాసకర్త, విమర్శకుడు, ప్రచురణకర్త కూడా. ‘జయంతి పబ్లికేషన్స్’ ప్రచురణ సంస్థను స్థాపించి..460కి పైగా పుస్తకాలు
ప్రచురించారు. తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలలోనూ రచనలు చేస్తున్నారు. వీరి రచనలు దాదాపు అన్ని ప్రముఖ దిన-వార-పక్ష-మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆథర (ఇన్సా)’ సంస్థకు రెండు తెలుగు రాష్ర్టాల తరపున సమన్వయకర్తగా ఉన్నారు. పలు జాతీయ- అంతర్జాతీయ సాహితీ సదస్సులలో పాల్గొన్నారు. ‘నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీపీఠం’ ఏటా నిర్వహిస్తున్న కథలపోటీలలో.. ఈయన కథ బహుమతి సాధించటం వరుసగా ఇది మూడోసారి.
యస్వీ కృష్ణ
93999 39302