“నేనుఅబార్షన్ చేయించుకున్నాను. రెండు నెలలైంది”..వంటింటి గుమ్మానికి ఆనుకుని ధీర చెప్పింది వినగానే.. ఒక్కక్షణం అయోమయంగా అనిపించింది. తలెత్తి ధీర మొహంలోకి చూశాను. అలాగే నిశ్చలంగా చూస్తోంది. ఎంత కాజువల్‌గా.. ఎంత ఉదాసీనంగా.. గొంతులో ఎలాంటి భావమూ లేకుండా.. అదేదో తన శరీరం కానట్టు ఎలా చెప్పింది అది? చెప్పటం కాదు.. అది ఒక స్టేట్మెంట్. అంతే!
ఏదైనా జరుగుతుందేమోనన్న భయం మనల్ని భయపెట్టినంతగా.. అది జరగడం అంత భయపెట్టదు. నిజంకన్నా ఊహే ఎప్పుడూ భయంకరంగా ఉంటుందేమో. నిజానికి నా గుండె బద్దలవ్వాలేమో! కానీ, చిత్రంగా నా గుండె ముక్కలేమీ అవలేదు. ఇంకా చెప్పాలంటే ఏదో భారం దిగిపోయినట్టుగా ఉంది. ఇది ఇట్లాగే జరుగుతుందని.. ఇలా కాకుండా ఇంకోలా జరిగినా, చివరికి అదికూడా ఇలాగే ముగుస్తుందని నాకు ముందుగానే తెలిసినట్టుగా అనిపించింది. ధీర విషయంలో నా భయం నిజమైనందుకు సంతోషపడుతున్నానా!? అని ఒక్కక్షణం గిల్టీగా అనిపించింది.ధీరకి పెళ్లిచూపులు అనుకున్నప్పటినుంచీ ఏదో తెలీని టెన్షన్. సగం భయం, సగం సంతోషం కలగలిసిన చిత్రమైన ఫీలింగ్. సిగరెట్లు తాగే, డ్రింక్ చేసే అలవాటున్న కూతురికి పెళ్లిచేయాల్సిన తల్లికి, ఆ పెళ్లిని నాలుగు కాలాలపాటు నిలబెట్టాల్సిన బాధ్యత ఉన్న తల్లికి ఆమాత్రం టెన్షన్ ఉండటం సహజమేనేమో.తను చెప్పిన మాటకి నేను ఏం అంటానా!? అన్నట్టు నా ముప్పయి రెండేళ్ల బాధాశిఖరం.. నా అయిదేళ్ల ఒంటరి దుఃఖం.. నా నిలువెత్తు దిగులు మేఘం.. గుమ్మంలో ఇంకా అలాగే నిలబడి చూస్తోంది.
“ఎవరు?” సాధ్యమైనంత మామూలుగా, క్లుప్తంగా అడిగాను.“ఇట్ డజంట్ మేటర్” ధీర అంతే క్లుప్తంగా చెప్పింది.ఎలాంటి ప్రశ్నకు ఎలాంటి సమాధానం? ప్రపంచంలో ఏ తల్లీకూతుళ్ల మధ్యా ఇంత అద్భుతమైన సంభాషణ జరిగి ఉండదేమో.‘ఇట్ డజంట్ మేటర్’ అంటే.. అదేమంత చెప్పుకోదగ్గ పెద్ద విషయం కాదనా? ఎవరైనా సరే నీకు అనవసరం అనా? ఎవరైనా ఒకటే.. పెద్ద తేడా ఏంలేదు. నీకు సంబంధం లేదు. నువ్వు చెయ్యగలిగిందీ లేదు అనా? బేతాళ ప్రశ్నలు.
ధీర మొహంలో ఒకలాంటి నిర్లక్ష్యం. ఒకలాంటి ఇన్‌డిఫరెన్స్. అందులో కొంత తెచ్చిపెట్టుకున్న నిర్లక్ష్యం. తనకు నాన్న లేకుండా చేశానని నామీద పెంచుకున్న కోపం. నిజమే.. చిన్నప్పటినుంచీ అది నాన్న అంటే ఎవరో తెలీకుండానే పెరిగింది. అది నా జీవితం. అది నా జీవితానికి సంబంధించిన విషయం అనుకున్నాను. కానీ, అదే విషయానికి తర్వాత ఒకరిముందు నేను దోషిగా నిలబడాల్సి వస్తుందని అప్పట్లో నాకు తెలీదు. విడాకులు తీసుకోవడం నా సొంత విషయం అనుకున్నాను.
జీవితంలో ఒకరితో పంచుకునేవి పంచుకోగలిగినవి ఎన్నో ఉండొచ్చు. కానీ, ఇంకొకళ్లతో పంచుకోలేనిది ఒకటే ఒకటి ఉంది. భార్య భర్తని, భర్త భార్యని. తను అలా పంచుకోలేక పోయింది. తను ఎంతో ఇష్టపడి అమ్మానాన్నల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్న అతను, తన సర్వస్వం అనుకున్న అతను.. ధీరను చూసుకోవడానికి పెట్టుకున్న అమ్మాయితో తన ఇంట్లోనే.. తను ఎంతో అపురూపం అనుకున్న తన బెడ్‌మీదే..
తన చదువు, తన విజ్ఞానం, తన తెలివితేటలు, అతనంటే తనకున్న ప్రేమ, అభిమానం ఏవీ.. ఒక పనిమనిషి పాటి చేయలేక పోయాయి. శరీరాలు మాత్రమే మాట్లాడగలిగిన భాష ఒకటి ఉంటుందని.. అతను కూడా దానికి అతీతం కాదని తెలుసుకోలేక పోయింది. చాలామందికి అంతేనేమో? శరీరాలతోపాటు ఉన్న మెదళ్లు ఇగోని హార్ట్ చేస్తాయేమో? అహంకారానికి అడ్డు వస్తాయేమో? అమ్మ ఎప్పుడూ అంటుండేది..‘మగవాళ్లు తెలివైన అమ్మాయిల్ని స్నేహితులుగా ఇష్టపడతారు. కానీ, తెలివైన అమ్మాయిల్ని భార్యలుగా చేసుకోవడానికి మాత్రం ఇష్టపడరు’ అని.వాళ్లలో ఉండే బోలుతనాన్ని, బలహీనతల్ని, అవలక్షణాలని ఎక్స్‌రే తీసినట్టు తెలుసుకోవడం ఎవరికి మాత్రం సుఖంగా ఉంటుంది? అతను తనతో ఉన్నంతకాలం దేనికోదానికి ఘర్షణ. తర్వాత ఎవరో చెప్పారు.. ఆ అమ్మాయినే తర్వాత అతను పెళ్లి చేసుకున్నాడని, ఒక పాప అని.
అయిదేళ్ల కిందట ఒకరోజు..“నాన్న ఎవరు?” అని అనూహ్యంగా అడిగింది ధీర.ఆయన గురించి చెప్పాక..“ఒకసారి చూడాలని ఉంది. చూసి వస్తాను!” అంది అతని ఇంట్లో ఒకపూట ఉండి వచ్చింది. అతని భార్యాపిల్లలతో కలసి హోటల్‌కు వెళ్లి లంచ్ చేసిందంట. తర్వాత బీచ్‌కి వెళ్లి సరదాగా గడిపారట. అంతా చెప్పి..“ఆ పిల్ల స్థానంలో నేనుకదా ఉండాల్సింది. నువ్వు నన్ను లేకుండా చేశావు” అంది.అక్కడికీ.. జరిగిందేంటో తను చెప్పింది. కానీ, ధీర కన్విన్స్ అవలేదు.“ఇవాళా రేపూ అందరూ అలాగే ఏడుస్తున్నారు. అంతమాత్రానికే డైవోర్స్ తీసుకోవాలా?” అంది.
ఆ బాధ, ఆ దుఃఖం, తనని అహర్నిశలు వెంటాడే పీడకల.. ఎలా చెబితే దానికి అర్థం అవుతుంది? భర్తని ఇంకొకళ్లతో పంచుకోవడం.. అది ఎవళ్లకి వాళ్లకే తెలుస్తుంది? ఆ స్థానంలో ఉన్నవాళ్లకే తెలుస్తుంది. అలా పంచుకోవడం, పంచుకోగలగడం నాగరికత లక్షణమేమో. తను అంత నాగరికత నేర్చుకోలేక పోయింది.
అప్పటినుంచీ ధీర ప్రవర్తన మారిపోయింది. మొండిగా తయారైంది. బ్యాంక్ పీవోగా సెలెక్ట్ అయి.. ముంబై వెళ్లినప్పటినుంచీ ఇద్దరి మధ్యా ఆ అగాధం ఇంకా పెరిగి పెద్దదైంది. ముంబై వెళ్లిన తర్వాత ఆరు నెలలకు ఒకసారి ఇంటికి వచ్చింది.
“ఎలా ఉందే.. బాంబే లైఫ్?”
“అబ్బా! చాలా ఫాస్ట్ లైఫ్ అమ్మా! జర్నీకే సగంరోజు సరిపోతుంది. అసలు ఇంట్లో ఉండేదే తక్కువ. అంతా హడావుడిగా టెన్షన్ టెన్షన్‌గా గడిచిపోతుంది. ఒకటే ఉరుకులు పరుగులు. అన్నట్టు.. నీకు గుండెలు పగిలే విషయం ఒకటి చెప్పనా?”
“ఏంటది?”
“మా రూమ్మేట్స్ లీనా, మేఘన సిగరెట్లు కాలుస్తారు తెలుసా? వీకెండ్స్‌లో డ్రింక్ కూడా చేస్తుంటారు”
“నీ సంగతి…?”
“ఇప్పటివరకైతే లేదు. కానీ, ఎక్కువకాలం రెసిస్ట్ చేయలేననుకుంటా. ఆ ఒత్తిడి తట్టుకోవడం కష్టం” కవ్విస్తున్నట్టుగా అంది.
రెసిస్ట్ చేయలేకపోయిందని తర్వాత దానిని చూసినప్పుడు అర్థమైంది. మన బలహీనతలు, తప్పులు.. అన్నిటికీ పని ఒత్తిడిని, టెన్షన్‌ని సాకుగా చూపించేవాళ్ల జాబితాలోకి ధీర కూడా చేరిపోయింది. తర్వాత కొన్నాళ్లకి ఓరోజు ఫోన్ చేసింది.
“అమ్మా.. నేను ఫ్లాట్ మారదామనుకుంటున్నా!”“ఎందుకే? రెంట్ ఎక్కువ అవదూ ఒక్కదానికి?”“మా రూమ్మేట్స్ ఇద్దరికీ బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు. వీకెండ్‌కి వాళ్లు ఫ్లాట్‌కి వస్తుంటారు. నాకు ఎంబరాసింగ్‌గా ఉంటోంది. అందుకే మారదామని అనుకుంటున్నాను. శాలరీలో కొంత హైక్ కూడా వచ్చిందిలే!”“అయినా.. వాళ్లు అలా ఫ్లాట్‌కి రావడం ఏమిటి?”“వాళ్ల లైఫ్.. వాళ్ల ఇష్టం!”ధీర చెప్పింది విన్న తర్వాత ధీర గురించి, ధీర జీవితం గురించి ఏదైనా అనుకోవాలన్నా, ఆలోచించాలన్నా భయం వేసింది. ఏదీ ఎక్కువ ఆలోచించలేకపోవడం కన్నా ఉత్తమం ఇంకోటి లేదనిపించింది. పెళ్లి చేసేస్తే నా బాధ్యత కొంత తీరిపోతుందని ఆ ప్రయత్నాలు చేస్తే.. అసలు పెళ్లే చేసుకోనని చెప్పేసింది.
ఏదన్నా చెప్పబోతే..
“నా పెళ్లి గురించి నాకులేని బాధ నీకెందుకు?” అంటుంది.అది బాధపడొద్దు అన్నంత మాత్రాన బాధ లేకుండా పోతుందా? దాన్ని ఒంటరిగా ఎలా వదిలి వెళ్లాలనే దిగులు లోపల ఎక్కడో పేగుల్ని మెలిదిప్పి.. పైపైకిపాకి నా మొహంలో దూరి.. నా మొహంలో కాంతిని, వెలుగుని, నా నవ్వుని నాకు దూరం చేసిందని.. నేను నవ్వే నవ్వుల్లో, నేను మాట్లాడే మాటల్లో నేనులేని ఒక శూన్యంలోకి నన్ను విసిరేసిందని చెబితే దానికి అర్థం అవుతుందా? ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా ముప్పయ్యేళ్లు దాటుతున్నా.. దానికి ఇంకా పెళ్లి కాలేదని ఆలోచన వస్తేచాలు.. చేతిలో ఉన్న పని అలాగే వదిలేసి ఉండిపోతున్నానన్న నిజం దానికి ఎలా చెప్పను? ఎవరిదన్నా పెళ్లి అని వింటే సంతోషించే బదులు.. ఒక దుఃఖసముద్రంలో మునిగిపోతున్నానన్న విషయం దానికి ఎలా చెప్పను? నా దుఃఖం నేనే మోసి.. దాని దుఃఖమూ నేనే మోసి.. నేనేమన్నా దుఃఖ నదినా అందరి దుఃఖాలు మోయడానికి? కానీ అది ఎవరు? పరాయిదా? దాని తాలూకు దుఃఖం నా దుఃఖం కాకుండా పోతుందా?
ఎందుకు మనుషులు తమ జీవితానికంతా ఒక్కళ్లనే కేంద్రంగా చేసుకుని బతుకుతుంటారు? ఆ ఒక్క బంధంలో ఏదన్నా తేడా వస్తే తలకిందులు అయిపోతుంటారు? ఇది ముందే తెలిస్తే నా జీవితాన్ని ధీర చేతుల్లో పెట్టేదాన్నా?పలుచని మొహంతో.. మొహంలో సిగ్గు, వినయం కలగలిసిన నవ్వుతో అరవిరిసిన నందివర్ధనంలా ఎంత మనోహరంగా ఉండేది ధీర. ఇంటికి చుట్టాలు ఎవరన్నా వస్తే తుర్రుమని లోపలికి పరిగెత్తుకుని వచ్చి తన చాటున దాక్కునే ధీరే నిన్న మొన్నటి వరకూ గుర్తొచ్చేది. బొంబాయి వెళ్లడానికి రైలు ఎక్కినప్పటి దాని దిగులు మొహం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. కానీ, తర్వాత తర్వాత దాని మొహంలో నేవళం, మృదుత్వం పోయి ఏమాత్రం సున్నితత్వం లేని ఒకలాంటి గండుమొహం.. ఎప్పుడు? ఎక్కడినుంచి వచ్చిచేరిందో గుర్తురావడం లేదు.
చెల్లెలి కొడుకు కిరణ్ ఏడాది కిందట అన్నమాట గుర్తొచ్చింది. పెళ్లిచూపులకి వెళ్లివచ్చిన కిరణ్‌ని..“అమ్మాయి ఎలా ఉంది” అని అడిగింది ఒకసారి.“నాకు ఆ అమ్మాయిలో ఏమాత్రం ఫెమినిటీ కనిపించలేదు పెద్దమ్మా!” అన్నాడు కిరణ్.“అంటే ఏంటిరా?”“అదేంటో నేను చెప్పలేనుగానీ.. మా ఇద్దరినీ కాఫీషాప్‌కి పంపించారు. నాకు నా పక్కన ఇంకో అబ్బాయి ఉన్నట్టే అనిపించింది తప్ప.. అమ్మాయి ఉన్నట్టే అనిపించలేదు” అన్నాడు.కిరణ్ ఆ మాట అన్నప్పుడు నాకు అంతగా అర్థంకానిది.. తర్వాత ధీరని చూస్తున్నకొద్దీ కొద్దికొద్దిగా అర్థమైనట్టు అనిపించింది. నా పాత ధీర నాకు ఇంక కనిపించదని, అది బొంబాయి మహానగరంలో ఎక్కడో తప్పిపోయిందని.మహానగరపు జీవితమా? చుట్టూ ఉన్న పరిసరాలా? వ్యక్తులా?.. ఏది కారణమో తెలీదు. నా ధీర ఇంక పాత ధీర కాదు. దాన్ని నగరం పూర్తిగా ఆవహించింది. దానిలోని మంచిని, భయాన్ని, మొహమాటాన్ని, అలవాట్లను కొంచెం కొంచెంగా మింగిమింగి.. జీర్ణంచేసుకుని చివరకు పనికిరాని పిప్పిని మా మీదకు వదిలినట్టుంది దాన్ని చూస్తుంటే. ధీర మొహంలో ఒకలాంటి ఉదాసీనత. ఇన్‌డిఫరెన్స్. అది జీవితం మీదో, మనుషులమీదో, తనమీద తనకో తెలియని నిర్లక్ష్యం. ఎక్కడో చదివింది..‘ఏదైనా సమస్య వస్తే పరిష్కరించు. నువ్వు పరిష్కరించలేని సమస్య అయితే కాలానికే వదిలెయ్యి’ అని.అలా.. ధీర పెళ్లిని కాలానికే వదిలేసింది.
హాల్లో ఉయ్యాల బల్లమీద కూర్చుని సెల్లో మెసేజ్‌లు చూసుకుంటున్న ధీరని చూస్తే ఓవైపు బాధా, ఓవైపు విరక్తి.. సిగరెట్లు, డ్రింక్ చేయడంతోపాటు అబార్షన్ కూడా చేయించుకున్న కూతురికి పెళ్లిచేయాల్సిన తల్లిగా.. తన బాధ్యత ఇంకా పెరిగినట్టు ఉంది అనుకుంటే, అవార్డు ఫంక్షన్లప్పుడు సినిమా హీరోలు, దర్శకులు అనే మాటలా అనిపించి.వంట చెయ్యడం బోర్. పిల్లల్ని కనడం బోర్. పెంచడం అంతకన్నా బోర్. ఎప్పుడూ సెల్‌తో గడపడం అనేది ఒక ఇంటర్నల్ వ్యాక్యూమ్ లోంచి వచ్చే వ్యాపకం. ఒక వ్యాక్యూమ్‌ని ఇంకో వ్యాక్యూమ్‌తో నింపే ప్రయత్నం. పక్కనున్న మనిషితో మాట్లాడరు కానీ..“రెండ్రోజుల్లో పెళ్లిచూపులు పెట్టుకుని.. వాళ్లని మోసం చేసినట్టు అవదూ?” అంతకన్నా ఇంకేం అనాలో తోచలేదు.“నా పాత రూమ్మేట్ లీనా.. హైమెన్ రీ కన్స్ట్రక్షన్ సర్జరీ చేయించుకుని పెళ్లి చేసుకుంది. మోసం అంటే.. చిరిగిన కన్నెపొరకి సర్జరీ చేయించుకుని వర్జిన్లా పెళ్లి చేసుకోవడం. అందుకే.. ఎందుకైనా మంచిదని నీకు చెప్పాను. అయినా అవతలి వాళ్లుకూడా అంత మడికట్టుకుని ఏమీ ఉండటం లేదులే!”“అబార్షన్ చేయించుకుని పెళ్లి చేసుకోవడం మోసం కాదా?”“అది తప్పేమో కానీ మోసం కాదు”
దేవుడా! ఇంక నావల్ల కాదు. దీన్నంతా భరించే శక్తి ఇవ్వు తండ్రీ. నా బలహీనపు గుండె బద్దలు కాకుండా చూడు స్వామీ!ధీర.. దేన్నయినా ధైర్యంగా ఎదుర్కోవాలని ఏరికోరి అపురూపంగా పెట్టుకున్న పేరు. ఇప్పుడు ఇందుకు పనికివస్తోంది. ఎక్కడైనా గొంగళిపురుగు సీతాకోకచిలుక అవుతుంది. కానీ, సీతాకోకచిలుకే గొంగళిపురుగు అవడం ఎక్కడన్నా ఉంటుందా?అవతలి వాళ్లు అంత మడికట్టుకుని ఉండటం లేదని.. ఇది కూడా ఇట్లా అయిందా? అయినా సృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే! ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు. ఎవరి అస్తిత్వం వారిదే. మగవాళ్లతో సమానం అవ్వాలని ఆడవాళ్లు మగవాళ్లని ఎందుకు అనుకరించాలి? స్త్రీ పురుషులిద్దరూ కలిస్తేనే కదా పరిపూర్ణత్వం సిద్ధించేది. స్త్రీకి సహజసిద్ధమైన సున్నితత్వం, లాలిత్యం, ఆర్ద్రత ఉంటాయి. ఆ లక్షణాలు పోగొట్టుకుని మార్దవంలేని కరకు మగమొహాలు ఎందుకు అరువు తెచ్చుకోవడం? ఐడెంటిటి క్రైసిస్ ఆడవాళ్ల మొహాల్ని కఠినంగా మగమొహంగా మారుస్తోందా?
“ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటావు? వాళ్లకు ఏం చెప్పమంటావు?”“అదేదో నువ్వే డిసైడ్ చేయి”అంటే.. ఇప్పుడు బాల్ తనకోర్టులో ఉందన్నమాట. హామ్లెట్ ‘టుబి ఆర్ నాట్ టుబి’లా ఇప్పుడు నిర్ణయం చేయాల్సిన బాధ్యత తనది. చేసేదంతా అది చేసి.. కూర్చుని తీర్పు తను చెప్పాలి.‘లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్. ఫాలింగ్ డౌన్’.. టి.ఎస్. ఇలియట్ ‘వేస్ట్‌లాండ్’లో అనైతిక సంబంధాల గురించి అన్నమాట గుర్తొచ్చింది. ఒక్క లండన్ బ్రిడ్జేనా కూలిపోతున్నది? అన్ని బ్రిడ్జిలూ కూలిపోతున్నాయి. అన్ని విలువలూ అందులో కొట్టుకుపోతున్నాయి. భర్తలకు తెలియకుండా భార్యలు, భార్యలకు తెలియకుండా భర్తలు, అమ్మానాన్నలకు తెలియకుండా పిల్లలు.. అక్రమమో, సక్రమమో అయిన సంబంధాలు. వాళ్లందరూ పాదాలను సోడానీళ్లతో కడుక్కోవడం మొదలుపెడితే.. ఆ నీళ్లు ఇంకో హిందూమహాసముద్రం అంత అవుతాయేమో. ఆ మహాసంద్రంలో ధీర కూడా ఓ నీటిబొట్టు. అంతేకానీ.. అది సోడానీళ్లతో కాళ్లు కడుక్కున్నంత మాత్రాన దాని కాళ్లు కడిగి కన్యాదానం చేయాలా?
చుట్టూతా ఇంత కమ్ముకున్న విషంలో, ఇంత విషవలయంలో తను ఏ విలువల కోసం పాకులాడుతోంది? ఏ విలువల కోసం ఘర్షణ పడుతోంది? ఏది ఏమైపోతే నాకెందుకు అని ఎందుకు ఉండలేకపోతోంది? అదేమైనా జబ్బా? జబ్బు లక్షణమా?జయకాంతన్.. ‘కొన్ని సమయాలలో కొందరు మనుషుల’కు, తనకు మధ్య ఏదో పోలిక స్ఫురించింది. గంగ అనే అమ్మాయిని డ్రాప్ చేస్తానని కారులో ఎక్కించుకుని అత్యాచారం చేస్తాడు ఒక యువకుడు. గంగ ఈ విషయాన్ని వాళ్ల అమ్మకు చెప్పినప్పుడు ఆమె అరిచి ఏడ్చి ఊరూవాడా ఏకం చేయడంతో.. గంగ పెళ్లికాకుండానే ఉండిపోతుంది. తర్వాత అదే విషయం పత్రికలో కథగా వచ్చినపుడు.. అందులో అత్యాచారానికి గురైన కూతురికి తల్లి తలస్నానం చేయించి.. ‘నీకు అంటిన మైల అక్కడితోనే పోయింది. ఇక దాని గురించి మర్చిపో’ అంటుంది. మా అమ్మ కూడా అట్లా అరిచి గోల చెయ్యకుండా, అలా తలస్నానం చేయించి ఉంటే.. ఇవాళ ఇలా ఉండాల్సి వచ్చేదికాదు కదా అనుకుంటుంది గంగ.
కానీ, ఆ కథలో గంగ వేరు. అది యాదృచ్ఛికంగా జరిగింది. అందులో గంగ ప్రమేయం లేదు. అలా తలస్నానం చేయించి జరిగిన పొరబాటుని కడిగేయించడానికి ధీర.. ‘గంగ’ కాదు.
తన ముందున్నది రెండే ఆప్షన్లు. ధీరకు పెళ్లి చేయకుండా వదిలేయడమా? పెళ్లిచేసి విడాకులు తీసుకున్నా.. బాధపడకుండా ఉండటమా? సిగరెట్లు, మందు తాగుతూ.. అబార్షన్ కూడా చేయించుకున్న కోడల్ని క్షమించే అత్తగార్లు, భర్తలు ఉన్నట్టు చరిత్రలో ఎక్కడా ఆధారాలు లేవు. అయితే పెళ్లి చేస్తే తల్లిగా తను సక్సెస్ అయినట్టు. అక్కడికి తన ప్రాణం ఒడ్డున పడుతుంది. పెళ్లి చేయలేని తల్లిదండ్రుల జాబితాలో అయితే ఉండదు.ప్రతి మనిషి జీవితంలో కొన్ని దౌర్భాగ్యకరమైన క్షణాలు ఉంటాయి. అలాంటి క్షణం ఒకటి మన జీవితంలో లేకుండా ఉంటే బాగుండు అనిపించే క్షణాలు. ఇప్పుడు అలాంటిదే ఓ దౌర్భాగ్యకరమైన క్షణంలో ఉన్నాను. తల్లిగా గెలవడమా? మనిషిగా ఓడటమా? తేల్చుకోవాల్సిన క్షణం. నాకే ఒక కొడుకు ఉంటే.. ధీరలాంటి అమ్మాయిని వాడికి ఇచ్చి చేస్తానా? ఆ అబ్బాయి కూడా నాకు కొడుకులాంటి వాడే కదా!
ఉయ్యాలలో కూర్చుని గోళ్లకు నెయిల్ పాలిష్ వేసుకుంటున్న ధీరని చూస్తే ఏదో తెలియని ఆవేశం. నన్నిట్లా సుడిగుండంలో నెట్టి..గబగబా దాని దగ్గరికి వెళ్లాను.
“చూడు ధీరా! విలువలు అనేవి ఎవరికోసమో ఉండేవి కాదు. ఎవరివి వారికే ఉండేవి. ఒకళ్ల కోసం తెచ్చిపెట్టుకునే విలువ సరైన విలువ కాదు. శాశ్వతమైన విలువలు కొన్ని ఉంటాయి. ఆడవాళ్లకైనా, మగవాళ్లకైనా, లేకపోతే నువ్వు ఈమాట చెప్పాల్సి వచ్చేదే కాదు. చేసినదాన్ని దేన్నయినా ధైర్యంగా ఫేస్ చేయడం నేర్చుకో. అది మంచిదైనా, చెడ్డదైనా! పెళ్లి కావాల్సిన కూతురు అబార్షన్ చేయించుకున్నానని చెబితే.. ఇవాళా రేపూ ఇది మామూలేగా అని తల్లిదండ్రులు అనుకునేంతగా సమాజం మారిపోయిందేమో నాకు ఇంకా తెలీదు. అది నా వెనుకబాటుతనం అనుకుంటే నాకు ఆ వెనుకబాటుతనమే ఇష్టం. నీ గురించి నువ్వు పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకోగలిగినంత పెద్దదానివయ్యావు. నీకు నేను ఇంకా ఏదో చెయ్యగలనని నేను అనుకోవడం లేదు. నీ పెళ్లి నువ్వే డిసైడ్ చేసుకోవడం మంచిది. ఆ పెద్దరికం నాకు వద్దు. తర్వాత నీ ఇష్టం!”
తప్పిపోయిన నా కూతురు మళ్లీ ఎప్పుడో.. ఎక్కడో కనిపిస్తుందని చిన్న ఆశ. తల్లిగా ఆ మాత్రం ఆశపడటంలో తప్పులేదేమో?ప్రతి మనిషి జీవితంలో కొన్ని
దౌర్భాగ్యకరమైన క్షణాలు ఉంటాయి. అలాంటి క్షణం ఒకటి మన జీవితంలో లేకుండా ఉంటే బాగుండు అనిపించే క్షణాలు. ఇప్పుడు అలాంటిదే
ఓ దౌర్భాగ్యకరమైన క్షణంలో ఉన్నాను. తల్లిగా గెలవడమా?మనిషిగా ఓడటమా? తేల్చుకోవాల్సిన క్షణం. నాకే ఒక కొడుకు ఉంటే..ధీరలాంటి అమ్మాయిని వాడికి ఇచ్చి చేస్తానా? ఆ అబ్బాయి కూడా నాకు కొడుకులాంటి వాడే కదా!
జి. లక్ష్మి
ప్రతి మనిషి జీవితంలోనూ కొన్ని దౌర్భాగ్యకరమైన క్షణాలు ఉంటాయి. ‘తల్లిగా గెలవడమా? మనిషిగా ఓడటమా?’ అని తేల్చుకోవాల్సిన క్షణాల్లోనే ఉన్న ఓ తల్లి కథ.. తప్పిపోయిన కూతురు. రచయిత్రి జి. లక్ష్మి. వీరి స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడ. ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి దినపత్రికల్లో సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత గ్రూప్-2 సాధించి.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఉద్యోగంలో చేరారు. జిల్లా రిజిస్ర్టారుగా పనిచేసి.. ఇటీవలే పదవీ విరమణ చేశారు. ఇప్పటివరకూ దాదాపు 60 కథలు, ఒక నవలిక రాశారు. స్వీయ కథా సంకలనాలు ‘పూలు పూయని నేల’, ‘అభయారణ్యం’, ‘జి. లక్ష్మి కథలు’.. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ద్వారా ప్రచురించారు. ఆల్బర్ట్ కామూస్ ‘ది అవుట్ సైడర్’ నవలను ‘అపరిచితుడు’గా, ప్రముఖ జర్మన్ రచయిత కాఫ్కా కథలను ‘కాఫ్కా కథలు’గా తెలుగులోకి అనువాదం చేశారు. ప్రముఖ నోబెల్ రచయితల కథలను ‘నోబెల్ కథలు’గా, నోబెల్ బహుమతి గ్రహీత ఆలిస్ మన్రో కథలను ‘ఆలిస్ మన్రో కథలు’గా అనువదించారు. వీరి కథలు పదిహేను వరకూ హిందీ, తమిళం, కన్నడ భాషల్లోకి అనువాదం అయ్యాయి.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.
-జి. లక్ష్మి
94907 35322