‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.
తెల్లారేందుకు ఇంకా చాలా టైముంది..
వీధిలైట్ల వెలుతురుకూ, మిగులురాత్రి చీకటికీ నడుమ జరిగే యుద్ధంలో పరిసరాలు మసకమసగ్గా ఉన్నయి.
ఆ పిల్లకు పన్నెండేళ్లకన్నా ఎక్కువుండవు. మసక చీకట్లో రోడ్డుపక్కన ప్రాణం పోసుకున్న నీడలా కదులుతోంది. మధ్యమధ్య కాసేపు ఆగుతూ.. వీపుమీద వేలాడుతున్న సంచీ కిందికి దించుతూ.. తిరిగి భుజమ్మీద వేసుకుంటూ సాగిపోతోంది.
ఆమె చూపులు చుట్టూ చురుగ్గా గమనిస్తున్నయి. చేతులు యంత్రాల మాదిరి కదుల్తూ చెత్తలో పారేసిన వస్తువుల్ని పోగేసుకుంటున్నయి.
ప్లాస్టిక్ బాటిళ్లు, సీసాలు, చిత్తు కాగితాలు, అట్టడబ్బాలు, పైపు ముక్కలు, ఇనుప తుక్కుసామాన్లు, చిరిగి పాడైన బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, ఫ్యాన్ల రెక్కలు, అప్పుడప్పుడూ బ్రెడ్ ముక్కలు.. ఒక్కటేమిటి పనికొస్తుందనుకున్న వస్తువేది దొరికినా ఎత్తి సంచిలో వేస్తోంది.
సన్నగా బక్కపల్చని ఆకారం. పాలిపోయిన ముఖం. ముక్కుకి, నోటికి అడ్డంగా కట్టుకున్న బట్ట. కాళ్లకి రెండు వేర్వేరు సైజుల్లో పాత చెప్పులు. అవికూడా ఎక్కడో పెంటకుప్పల్లో దొరికినవే. నడిచేందుకు ఇబ్బంది పడుతూ అట్లాగే నడుస్తున్నది.
తెల్లారేందుకు ఇంకా సమయముంది..
చలికి వొణికే నగరం ఒకవైపు వొత్తిగిలి పీడకలల మధ్య కలతనిద్ర పోతోంది. నగరానికి వడ్డాణంలా చుట్టుకొని మట్టిపాములా ప్రవహించే మురికి నది.. కాలుష్యాన్ని కడుపులో మోస్తూ విషకన్యలా కదులుతోంది.
అన్ని ఊర్లలాగే ఆ ఊరుకూ తనదైన ఉనికి ఉంది. తనవనుకునే పగళ్లూ రాత్రుళ్లూ. మంచిదో చెడ్డదో ఏళ్ల తరబడి సృష్టించుకున్న సంస్కృతి. ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల భవనాలు. చెట్లకు బదులు నిలబడి ఉన్న కరెంటు, టెలిఫోన్ స్తంభాలు. అభివృద్ధి పేరిట విస్తరించిన కాంక్రీట్ అడవులు. పగలు ఇరుకుగా, రాత్రుళ్లు విశాలంగా మారే రహదార్లు. వన్య ప్రాణుల్లా అక్కడక్కడా వృద్ధాప్యం మీదపడ్డ వృక్షాలు. రోబోల్లా బతికేస్తున్న మనుషులు. పొద్దుపొడిస్తే ఊరుకులూ పరుగులూ.
తెల్లారేందుకు ఇంకొంత వ్యవధి ఉంది..
మానవ గూళ్లు ఇంకా నిద్రలోనే జోగుతున్నయి. రోడ్ల పక్కన ఫ్లోరోసెంట్ లైట్లు అలసటగా చీకటితో పోరాడుతున్నయి. ఉపనదుల్లా పారుతున్న తారురోడ్లు చొక్కాకు కుట్టిన గుండీల మాదిరి నగరాన్ని అనుసంధానం చేస్తున్నయి. కొమ్మల్ని ఊపుతూ కదలాడే అలవాటు మర్చిపోయిన నగర చెట్లు దిష్టిబొమ్మల్లా నిల్చుని దిక్కులు చూస్తున్నయి.
ఇవేం పట్టించుకోకుండా రాజమ్మ నడుస్తోంది. వీధుల్లో మూలమూలల్లో చెదపురుగులా తిరుగుతోంది. ఫుట్పాతులు, సెల్లార్లు, పీడబ్ల్యూడీ నిర్లక్ష్యంగా వొదిలేసిన గుంతలు, దుర్వాసనల్ని వెదజల్లే మురికి కాల్వల్ని దాటుకుంటూ పోతోంది. నట్టనడి శీతాకాలపు చలి గజగజ వణికిస్తున్నా ఆమెకి ఖాతరు లేదు.
తెల్లారేందుకు కనీసం ఇంకో గంట గడువుంది..
ప్రతిదినం కోడికూయక ముందే లేచి రోడ్డెక్కుతుంది రాజమ్మ. తన పని అట్లాంటిది. వీధిమూలలు, ఖాళీస్థలాలు, డస్ట్ బిన్స్, చెత్తకుప్పలే ఆమె ప్రపంచం. పారేసిన, పనికిరాని వస్తువుల కోసం నిద్రకళ్లతోనే గాలిస్తూ తిరుగుతుంది.
ఆమె దినచర్య చెత్త ఏరుకోవడంతో మొదలై.. పోగేసుకున్న వస్తువుల్ని స్క్రాప్ డీలరుకు అమ్ముకోవడం, అతనిచ్చే డబ్బులతో కొంపకు చేరుకోవడంతో ముగుస్తుంటుంది.
అన్ని వృత్తుల్లో మాదిరే చెత్త ఏరుకోవడంలోనూ పోటీ ఉంది. ఎవరికివారే ముందుగా వచ్చి వీధుల్లో గాలింపులు జరుపుతారు.
ఆలస్యంగా రోడ్లమీదకొస్తే దొరికేది ఏమీ ఉండదు. రాజమ్మకు ఈ సంగతి బాగా తెలుసు. అందుకే చీకటితోనే లేచి బయటపడుతుంది.
దేశమేదైనా.. ప్రాంతమేదైనా చెత్త ఎక్కడైనా చెత్తనే! పనికిరాని వస్తువులు ప్రతిచోటా ఉండేవే. భిన్నప్రాంతాల సంస్కృతులు భిన్నంగా ఉండొచ్చు. కానీ, పారేసిన చెత్త సంస్కృతి ఎక్కడైనా ఒకే తీరు. అట్లాగే చెత్త ఏరుకొని బతుకులు సాగించే జీవులంతా సేమ్ టు సేమ్.
నానారకాలైన కుళ్లు, వెగటు వాసనల్ని పీలుస్తూ గంటలు గంటలు జనం అసహ్యించుకునే ప్రదేశాల్లో తిరగడం. అలుపొస్తే ఏ ఫుట్పాత్ మీదో, మెట్ల కిందనో ఒకింత సేద దీరడం. తిరిగి అదే వేటలో సాగిపోవడం.
పెంటకుప్పల్లో చేతులుపెట్టి వెతకడం. నాలాల్లో.. మురుగునీళ్లలో తేలియాడే వస్తువుల్ని కూడా పట్టుదలగా సమీకరించడం.
కొన్నిసార్లు చెత్తను కెలుకుతుంటే చేతులకి అంటరాని వ్యర్థాలు, మలమూత్ర అశుద్ధాలు అంటుకుంటయి. రాజమ్మ విసుక్కోదు, అసహ్యించుకోదు. తనకు మామూలైనట్టు పనిలో మునిగిపోతుంది.
చీదరించుకుంటే ఎవరికి నష్టం..? తిండికి దొరక్కుంటే ఆకలి ఎవరికి..?
మనిషి రోగాలతో చచ్చినా ఫరవాలేదు, ఆకలితో చావకూడదు కదా..? అట్లా ఎవరూ కోరుకోరు కూడా. ఏదోవిధంగా బతికెయ్యాలి. బతకడం కోసం అన్నీ భరించాలి. మూత్రమైనా, మలమైనా, అది మనిషిదైనా జంతువుదైనా చేతుల్తో ముట్టుకోవాలి. అంటుకోనివ్వాలి. తనకలాంటి హీనస్థితి కల్పించిన దేవుణ్ని రాజమ్మ ఎప్పుడూ తిట్టుకోదు. అసలు తిట్టుకునేందుకో మెచ్చుకునేందుకో ఆమెకు తీరిక ఉండదు.
అప్పుడప్పుడే తెలతెల్లవారుతోంది..
పాత ఏడాదికి వీడ్కోలు చెపుతూ రాత్రంతా విందులూ వినోదాల్లో మునిగి తేలిన నగరం, కొత్త ఏడాదిలో తొలిరోజు కొంచెం ఆలస్యంగా మేలుకుంటోంది. రాజమ్మకు ఒకింత సంతోషంగా ఉంది. ఆ దినం ఖాళీ సీసాలు, ప్లాస్టిక్ బాటిళ్లు, అట్టడబ్బాలు కొంచెం ఎక్కువే దొరుకుతున్నయి. ఆమె వయసుకూ, ఎత్తుకూ ఏమాత్రం పొంతన లేనట్టు మోసుకొస్తున్న పెద్దసంచీ క్రమేపీ నిండిపోతోంది.
బరువెక్కిన సంచీతో నడవడం కష్టంగా ఉంది. అయినా భారంగా అడుగులేస్తూ వీధులు కలియ తిరుగుతోంది.
అట్లా నడిచి ఆ ప్రాంతంలోని అతిపెద్ద చౌరస్తాకు చేరుకుంది. నాలుగు దిక్కులనుంచి విశాలమైన రోడ్లు అక్కడ ఒకే దేహానికి అతికించినట్టు కలుస్తున్నయి. ఒక పక్కన సర్వీసు రోడ్డులోకి తిరిగిందామె. వరుసగా దుకాణాలు, షాపింగ్ మాల్స్. షాపుల ముందు మెట్లపక్కన ఉన్న చెత్తడబ్బాలు వెతుకుతూ వెళుతున్నది. ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో చేయిపెట్టి కెలుకుతూ వెతికింది. నాలుగైదు ఖాళీ వాటర్ బాటిళ్లు దొరికినయి. మరోచోట కొన్ని అట్టడబ్బాలు, డిస్పోజ్డ్ టీ గ్లాసులు, పారేసిన మద్యం సీసాలు కనిపిస్తే సంచీలో వేసుకుంది.
అప్పటికి పూర్తిగా తెల్లారిపోయింది..
నగరం మెల్లగా తూర్పు దిక్కుకు తిరుగుతోంది. రాజమ్మ నిశ్శబ్దంగా తనపని చేసుకుపోతోంది. ఓచోట లెక్కలేనన్ని అంతస్తులతో ఒక భారీ అపార్టుమెంటు నిర్మాణం జరుగుతోంది. తలెత్తిచూస్తే అంతెత్తున ఇంకా నిర్మాణం పూర్తికాని ఫ్లాట్స్ కింద నుంచి పిచ్చుకగూళ్ల మాదిరి కనిపిస్తున్నయి. భారీ యంత్రాలు, క్రేన్ల సాయంతో రాత్రీ పగలూ ఏకధాటిగా కడుతున్నారు. మేస్త్రీలు, వర్కర్లు నిర్విరామంగా పనిచేస్తున్నారు.
సరిగ్గా దానికి ఎదురుగా ఉన్న టీకొట్టు దగ్గరకొచ్చింది రాజమ్మ. భుజం మీది సంచి ఓ పక్కన దింపేసి అటు చూస్తూ నిలబడింది. ఆ పిల్లకి చాయ్ తాగితే బాగుంటదనిపించింది. కానీ డబ్బుల్లేవు. టీలు చేసి అందిస్తున్న వ్యక్తి కేసి చూసింది. అతడూ ఆమెని చూశాడు.
రాజమ్మ కదలక మెదలక తదేకంగా చూస్తుంటే కొద్దిసేపటికి అతనే అడిగాడు..
“చాయ్ తాగుతవా పోరీ..?”
ముందు వద్దన్నట్టు తల అడ్డం ఊపింది. తర్వాత తడబడుతూ చిన్నగా అంది..
“నా దగ్గర పైసల్లేవన్నా!”
అతడేమనుకున్నాడో మరేమీ ఆడక్కుండా చిన్న ప్లాస్టిక్ గ్లాసులో టీ పోసి అందించాడు. రాజమ్మ సంతోషంగా తీసుకుంది. అలసిన ముఖంలో వెలుగు. కృతజ్ఞతగా చూసింది. చాయ్ తాగుతూ ఓ మూల ఒదిగి నిలబడింది.
టీకొట్టతను పక్కన కస్టమర్లతో చెపుతున్నాడు.
“ఎంత పెద్ద అపార్టుమెంటు కడ్తున్నరో చూసిన్రా? ఒక ఊరంత ఉన్నది. దీంట్ల ఎన్ని కుటుంబాలుంటయో!?”
“అవునవును.. కోట్ల రూపాయల ముచ్చట”
“దాన్ని కట్టిస్తున్న ఓనర్ నాకు తెలుసు”
“తెలుసా.. అంత గొప్పోడు నీకెట్ల ఎరుక?”
“అతనిది మా ఊరే. ఒకప్పుడు బాగ పేదోడు. చదువుకోలేదు. ఆవారాగా తిరిగిండు. తండ్రి చిన్నప్పుడే సచ్చిపోయిండు. కూలినాలి చేసుకుంట తల్లే అతణ్ని పెంచింది. ఆమె కూడ పోయినంక సిటీకొచ్చి పడ్డడు. ఇక్కడికొచ్చి పది పన్నెండేండ్లు కావొచ్చు. ఇంత తక్కువ టైములో ఎక్కడున్నోడు ఎక్కడికో పెరిగి పోయిండు”
“ఇంత మార్పు ఎట్ల జరిగింది” ఎవరో అడిగారు.
“కొంతకాలం అక్కడక్కడ చిన్నచిన్న పనులు చేసుకుంట ఉన్నడు. తర్వాత ఒక పేరున్న బిల్డరు తానికి పనిలోకి పోయిండు. అక్కడ నమ్మకంగా ఉండి ఈ రంగంలో కిటుకులన్నీ నేర్చుకున్నడు. తర్వాత సొంతంగ బిల్డరు అవతారమెత్తిండు. తంతెలెక్కినట్టు పైపైకి పోయిండు. గంతనే..! సూస్తుండంగనే సీన్ మొత్తం మారిపోయింది. తర్వాత అతడు సిటీల ఎన్నో అపార్టుమెంట్లు, భవంతులు కట్టిండు. ఇంకోపక్క కాంట్రాక్టరు పనులు మొదలుపెట్టి చాలాచోట్ల రోడ్లేసిండు, వంతెన్లు కట్టిచ్చిండు. అట్లా పల్లెటూరు నుంచి పొట్ట చేతవట్టుకొని ఎలుకపిల్ల లెక్క వొచ్చిన మనిషి ఏనుగంత అయిండు. పదేండ్ల కింద పేదవాళ్లల్ల ఒకడిగ ఉండేటోడు. ఇప్పుడుసూడు యాడున్నడో!?”
“అంతే అన్నా..! అదృష్టం చిత్రమైంది. మనలాంటోళ్ల మీద ముసురు లెక్క రాలిపడి ఇంకొందరి మీద కుంభవృష్టి తీర్గ కురుస్తది”
“అట్లెందుకు అనుకోవాలె..? మనకంటే నికృష్టంగ ఎందరు లేరు? అదృష్టం ముఖం కూడా చూడకుండ బతుకంతా దరిద్రంలో మగ్గుతున్నోళ్లు చాలామంది ఉన్నరు”
“ఏం జేస్తం? ఎవడి రాత వాడిదే. దేవుడు జన్మ ఇచ్చినప్పుడు చచ్చేదాక బతికితీరాలె. అది మనిషి తీర్గనో, కుక్క తీర్గనో”
రాజమ్మ అందరి మాటలు విన్నది. తర్వాత అక్కణ్నుంచి మెల్లగా కదిలింది. చెత్తలో గాలింపు సాగిస్తూనే అదృష్టాన్ని గురించి తన చిన్న బుర్రతో తలపోసింది.
ఈ లోకంలో ఎంతమంది చెత్తవాళ్లు ధనికులయ్యే అదృష్టాన్ని పొంది ఉంటరు? పెంటకుప్పల్లో పనికిరాని వస్తువులు ఏరుకునే వాళ్లకు అదృష్టం ఏ రూపంలో వొచ్చి తలుపు కొడుతుంది? బహుశా పెంటకుప్పల నుంచే పుట్టుకరావాలి. చెత్తలోనే ఏదైనా విలువైన వస్తువు దొరికితే ఎంత బాగుంటది?
ఆమెకి చెత్తలో ఎప్పుడో అరుదుగా ఒకటీ ఆరా కొంచెం విలువైన వస్తువులు దొరుకుతుంటయి. కానీ, అవేవీ బతుకుల్ని సమూలంగా మార్చివేసేవి కావు. అట్లా మార్చగల విలువైనవి ఎప్పటికైనా దొరుకుతాయన్న ఆశ ఉంటుంది. తనకే కాదు, చెత్త ఏరుకుని బతుకుతున్న అందర్లోనూ ఉంటుందని ఆమె అనుకుంటది.
ఇప్పటివరకైతే అలాంటి పెన్నిధి ఏదీ రాజమ్మకు తగల్లేదు.
తననింకా అదృష్టం వరించలేదని భావిస్తుంది.
ఎవరు చెప్పగలరు..? అటువంటి ఒకరోజు.. ఒక గొప్ప సందర్భం రావచ్చు. కానీ ఏ రూపంలో? వెండి బంగారు మూటలు, నోట్లకట్టలతో నిండిన బ్యాగులెవరైనా పారేసుకుంటారంటే ఆమె నమ్మదు. డబ్బు విషయంలో మనుషులు అంత నిర్లక్ష్యంగా ఉంటారన్న అత్యాశకు పోదు. కానీ, ఎప్పుడో ఒక్కక్షణం అనిపిస్తుంది. ఏమో.. ఎవరూ ఊహించని అద్భుతం జరగొచ్చు. అప్పుడు దశ తిరిగి పోతుంది. తనూ, తన కుటుంబమూ సంపన్నుల్లో చేరుతారు. డబ్బులున్న వాళ్లయి పోతారు. ఏదీ అసాధ్యం అనుకోవడానికి లేదు.
బతుకైనా అదృష్టమైనా చిత్రమైంది. కనికరిస్తే అది దేవత. తప్పించుకుని తిరిగితే దయ్యం.
ఆమె చిన్న ప్రపంచంలో ఎన్నెన్నో కలలు. అవి ఆకాశమంత విశాలం, చెత్తకుప్పలంత విస్తారం.
తెల్లవారి ఏడు గంటలు దాటిపోయింది..
మబ్బుల నడుమ లేత సూర్యుడు తప్పటడుగులు వేస్తున్న పిల్లాడిలా హుషారుగా ఉన్నాడు. ఎండ కొద్దికొద్దిగా వేడెక్కుతూ చలిని తరిమేస్తోంది. కడుపు ఉబ్బిపోయి బరువెక్కిన సంచీ రాజమ్మ భుజం మీద భారంగా ఊగుతోంది.
ఆమె బాగా అలసిపోయింది. నిజానికి ఆరోజు ఎక్కువే తిరిగింది. సంచీ నిండినమాట నిజమే, కానీ అందులో రాబడి ఎక్కువగా వొచ్చే వస్తువులేవీ లేవన్న సంగతి ఆమెకు గ్రహింపు ఉంది. రాజమ్మ తనకు చెత్త కుప్పల్లో దొరికిన ప్రతి వస్తువూ అమ్మకాని కోసమనే భావిస్తుంది. అది తప్ప ఇంకో యోచన రాదు. దాచుకోవడం, వాడుకోవడం వంటివి తెలియవు.
లేనోడు దేన్నయినా అమ్ముకునేందుకు సిద్ధపడతాడు. ఉన్నోడు ఎంత విలువైనదైనా కొనడానికి రెడీగా ఉంటాడు. ప్రతిదీ అమ్మకానికో, కొనుగోలుకో పనికొచ్చే వ్యావహారిక వ్యవస్థలో బతుకుతున్నామనే నిజాన్ని చెత్తవృత్తి పాఠాలు నేర్పుతూ వొచ్చింది. పదిలంగా దాచుకునే వస్తువేదీ చెత్తకుప్పల్లో ఉండదని రాజమ్మ నమ్మకం.
అంతేకాదు, దొరికిన వస్తువు విలువైనదా కాదా అనే తేడాలు కూడా ఆమె దృష్టిలో లేవు. దొరికిందల్లా సంచిలో వేస్తుంది. వాటిలో కొన్ని వస్తువులు ఎందుకూ పనికిరానివి కూడా ఉంటయి. వాటిని కొనేందుకు సేఠ్ ఒప్పుకోడు. అవెంత బరువైనవైనా తీసి పడేస్తాడు.
చెత్తలో దొరికే పనికిరాని వస్తువేదైనా రీసైక్లింగ్ జరగాల్సిందే. వాటిని కరిగించి తిరిగి కొత్త వస్తువుల్ని తయారు చేస్తారన్న సంగతి రాజమ్మ వినివుంది. ప్రస్తుతం పగిలిన, విరిగిన, పాడైపోయి ఉన్నవన్నీ తర్వాత మరో రూపాన్ని పొందేవే.
రాజమ్మ చూపు సైతం చిత్రంగా ఈ నేపథ్యం లోంచే ఉంటుంది. సంపూర్ణమైన వస్తువులేవీ ఆమె చూపులకు ఆనవు. చూసినా పట్టించుకోదు. అలాంటివి తనకు అస్సలు పనికిరావు. ఏం చేసుకుంటుంది? తీసుకపోయి ఇంట్లోనో, మ్యూజియంలోనో పెట్టలేదు.
ఆమె కళ్లు చెత్త వస్తువుల్ని చూసేందుకే అలవాటు పడ్డయి. శిథిలాలు, ముక్కలు, పనికిరాని వాటికే చూపులు అతుక్కపోతయి.
చెత్తలో దొరికేది ఏదైనా అమ్మకానికి పనికొస్తుందా, డీలర్ కొంటాడా అన్నదే గమనిస్తుంది.
కాసిన్ని డబ్బులు కూడా ఇవ్వలేనివి కండ్లబడ్డా పట్టించుకోదు. వొదిలేసి ముందుకు పోతుంది. పాడైపోయిన తుక్కులు, ముక్కలే ఆమెకు విలువైనవి. ఆమె దృష్టిలో అవి పూర్తికాని చిత్రాలు. కరిగించి రీసైక్లింగ్ చేస్తే కొత్త చిత్రాలవుతయి. వాటికి పునః ప్రతిష్ఠ జరుగుతుంది.
ఉదయం ఎనిమిది గంటలు దాటింది..
ఎన్నోచోట్ల తిరిగి తిరిగి చివరగా డంప్ యార్డుకు చేరుకుంది రాజమ్మ. ఆ రోజుకి అదే ఆఖరి మజిలీ. అక్కణ్నుంచి నేరుగా డీలర్ దగ్గరకు పోవడమే. పనికొస్తాయనుకున్న వాటిని తూకమేసి పైసలిస్తడు సేఠ్. ఆ పైసలు తీసుకొని కొంపకు పోతుంది.
డంప్ యార్డ్ భయం గొలిపేలా ఉంది. ఏవో రెండు రాజ్యాల మధ్య భీకర యుద్ధం జరిగినట్టుంది పరిస్థితి. ఎటుచూసినా చెత్తకుప్పలు. నరకాన్ని మోసుకొచ్చే గాలి. భరించలేని దుర్గంధం. ముక్కుపుటాలు అదిరి కొత్తోళ్లయితే అక్కణ్నుంచి పారిపోతరు. బాల్యం నుంచి మురికి, దుర్గంధంలోనే గడిపిన రాజమ్మకు పెద్ద ఫరక్ పడలేదు.
కొన్నిచోట్ల చెత్తకుప్పలు చిన్నచిన్న కొండల్లా పెరిగిపోయి ఉన్నయి. రాబందుల్ని తలపిస్తూ ఊరకుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నయి. గార్బేజ్ ట్రక్కు ఒకటి అప్పుడే చెత్త డంప్ చేసి వెళ్లింది.
రాజమ్మ అటు నడిచింది. సంచీ పక్కన పడేసి వొంగి చెత్తలో వెతకసాగింది.
తడితడిగా.. చీదరగా.. రకరకాల దుర్గంధాలు కలగలిసి ఊపిరాడనట్టుంది. తడిచెత్త పొడిచెత్త వేరుచేయాలని మున్సిపాలిటీ చెపుతుంది. కానీ ఎవరూ పట్టించుకోరు. సబ్బండ రకాల చెత్తంతా ఒకేచోట.
చెల్లాచెదురుగా పడున్న పెద్దపెద్ద క్యారీ బ్యాగు మూటల్ని ఒక్కొక్కటీ విప్పి చూస్తోంది. బ్యాగుల్లోపలికి చేయిపెట్టి ఒక్కొక్కటీ బయటికి లాగుతుంది. ఒక పెద్ద నల్లరంగు ప్లాస్టిక్ బ్యాగు విప్పింది. లోపల బాగా తడిసిన చెత్త కుక్కినట్టుంది.
చేతికి ఏదో మెత్తగా తడిగా జిగటగా అంటుకుంది. దాన్ని బయటికి తీసింది. తట్టుకోలేనంత దుర్వాసన, రక్తంతో కూడిన నీచువాసన ఒక్కసారి గుప్పుమంది. అంత మొత్తంలో మాంసాన్ని మూటకట్టి అట్లా ఎందుకు పారేశారో ఆమెకు అర్థంకాలేదు. బహుశా పాడైపోతే పారేసి ఉంటారని అంతవరకే భావించింది.
చేతుల్ని చిత్తు కాగితాలతో తుడుచుకొని మళ్లీ బ్యాగులో చేయిపెట్టి చూసింది. అడుగున నల్లగుడ్డలో చుట్టిన మరో మూట దొరికింది. అది ఇంకొంచెం పెద్దది. విలువైనవి ఏవైనా ఉన్నాయేమోననే ఆశతో బయటికి లాగి విప్పింది. చూసిన మరుక్షణం భయంతో వణికిపోయింది.
ఆ మూటలో ఓ పసికందు శవం. కొన్ని గంటల వయసున్న రక్తపు గుడ్డు. చచ్చిపోతే అట్లా మూటకట్టి చెత్తబ్యాగులో వేశారో, లేక కావాలని శిశువు ప్రాణాలు చిదిమేసి వదిలించుకున్నారో తెలియదు.
బిత్తరపోయి పెద్దగా అరిచింది రాజమ్మ. ఆమెకు ఊపిరి ఆడలేదు. ఒక్కఉదుటున లేచి నిలబడింది. క్షణం ఏం చెయ్యాలో తోచలేదు. తర్వాత మైకంలోంచి బయటికొచ్చినట్టు రక్తశిశువుకేసి తేరిపార చూసి బాణంలా అక్కణ్నుంచి పరుగుతీసింది. తన సంచీ అక్కడే వదిలేసి ఎటు వెళుతున్నదీ చూడకుండా దూసుకుపోయింది.
నగరంలో తొమ్మిది గంటలకు జనం సందడి మొదలైంది..
ఎంతోదూరం ఆగకుండా పరుగెత్తి అలసిపోయిన రాజమ్మ ఆయాసంతో ఒక దుకాణం మెట్లపైన కూలబడింది. గుండె వేగంగా కొట్టుకుంటుంటే తేరుకునేందుకు చాలాసేపు పట్టింది.
ఎంత పారేసేవైనా అసలు పనికిరాని వస్తువేదీ ఉండదని రాజమ్మ ఇప్పటివరకూ నమ్ముతూ వొచ్చింది. పాత వస్తువు సరికొత్త రూప పరివర్తనకు దోహదం చేస్తుంది. ఏదీ నశించదు, కేవలం రూపం మార్చుకుంటుంది.
పాత ప్లాస్టిక్ నుంచి కొత్త ప్లాస్టిక్ సామాన్లు, చిరిగి పాడైన పాత బ్యాగులేమో వేర్వేరు రూపాల్లో సరికొత్త బ్యాగులు, తుప్పుపట్టిన తుక్కు రేకులు కొత్త డబ్బాలై, పాత లెదరంతా తళతళ మెరిసే చెప్పులు, షూలు తదితర నయా అవతారాలుగా రూపొందుతయి.
పాత బంగారాన్ని కరిగించి జిగేల్మనే సరికొత్త ఆభరణాల్ని తయారుచేస్తారు. చిన్నపిల్లలు పెరిగి పెద్దవారై కొత్త మనుషులుగా, పరిపూర్ణులుగా మారిపోతారు.
అట్లా కొత్తదేదీ స్వతహాగా కొత్తది కాదు. పాతదానితో అనుసంధానం అయ్యే ఉంటుంది.
మరైతే డంప్ యార్డు చెత్తలో కనిపించిన మృతశిశువు..? ఆ పసిగుడ్డు కొత్త వస్తువా? లేక పాత వస్తువా..? ఏమనుకోవాలి?
ఏ రూపాంతరం జరక్కుండానే పాతదిగానే ముగిసింది. కాదు, ముగించేశారు. చెత్తలో కలిపేశారు.
చెత్తను నమ్ముకొని బతికే ఆమెకు సైతం ఉపయోగపడని చెత్తవస్తువు కంటే హీనాతిహీనం చేశారు.
అన్నిటిలా ఆ పసిగుడ్డు దేహానికి రీసైక్లింగ్ లేదు. ఏం చేసినా మరో రూపానికి రాదు. అసలు పరివర్తనే లేదు.
పదిగంటల ఎండ వేడెక్కి చురచురమంటోంది..
రాజమ్మ తలెత్తి మొగులు వైపు చూసింది. పైన సూర్యుడు వెండి కడియంలా మెరిసిపోతున్నాడు.
డాక్టర్ ఎ. సంతోష్ రెడ్డి
డంప్ యార్డులో పడేసే వస్తువులన్నీ రీసైక్లింగ్ అవుతాయి. అలా.. కొత్త వస్తువులన్నీ పాతవాటితో అనుసంధానమయ్యే ఉంటాయి. మరి.. ‘చెత్తకుప్పల్లో దొరికే మృతశిశువు? ఆ పసిగుడ్డు కొత్త వస్తువా? లేక పాత వస్తువా? ఏమనుకోవాలి?’.. అంటూ రీసైక్లింగ్ కథ ద్వారా ప్రశ్నిస్తున్నారు డాక్టర్. ఎ. సంతోష్ రెడ్డి. ఈయన స్వస్థలం హైదరాబాద్లోని కొత్తపేట్. ప్రస్తుతం వృత్తిరీత్యా న్యూఢిల్లీలో ఉంటున్నారు. ఎంబీబీఎస్, డీఎన్బీ (రేడియాలజీ) చేశారు. న్యూఢిల్లీలోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో రేడియాలజీ చీఫ్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. సాహిత్య పఠనం పట్ల అభిరుచి పెంచుకున్నారు. ‘రీసైక్లింగ్’.. ఈయన మొట్టమొదటి కథ మాత్రమే కాదు, మొట్టమొదటి రచన కూడా! నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీపీఠం కథల పోటీలో.. తన తొలి కథకే బహుమతి రావడం ఎంతో ఆనందంగానూ, ప్రోత్సాహకరంగానూ ఉందని చెబుతున్నారు రచయిత. సాహితీ రచనలో ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని నమ్ముతున్నానని అంటున్నారు.
డాక్టర్ ఎ. సంతోష్ రెడ్డి
9704129159