మధ్యాహ్నం ఒంటిగంట. ప్రమీల ఇల్లంతా కలియ తిరుగుతున్నది. తన ఆత్రుత.. ఆమె చూపులను పదేపదే గుమ్మంవైపు చేర్చుతున్నది. క్షణాలు గడిచేకొద్దీ ఆ చూపులు ఎదురు చూపులవుతున్నాయి..! తల్లి కంగారుపడటం చూస్తూ నవ్వింది కూతురు వాసంతి. “ఏంటే.. ఆ నవ్వు? నా కంగారు నీకు నవ్వులాటగా ఉందా?” అంది తల్లి!“అదేం లేదమ్మా.. ప్రశాంతంగా ఉండు!” అంటూ తల్లి చేయి పట్టుకుని తన ఎదురుగా కూర్చోబెట్టుకుంది.
“అమ్మా! సంబంధం చూస్తున్న రోజుల్లోనే మనీ ఆశించని మనిషి ఉంటే చూడు.. కళ్లు మూసుకుని తాళి కట్టించుకుంటానని చెప్పాను. వింటేగా? ‘అబ్బాయి బాగున్నాడు! బాగా ఉన్నోడు! వాళ్లడిగినవి ఇస్తాం.. ఏం భయం లేదు!’ అని ముడేశారు. ఇప్పుడేమైంది? ఆడపిల్లని పెంచి, పెద్దచేసి, ఆ ఫ్యామిలీ ఇరవై ఏళ్ల కష్టం పోగేసి కట్నకానుకలుగా ఇస్తారని తెలిసి కూడా కట్నమడిగే ప్రతి మగాడిదీ తప్పు. అది తప్పని తెలిసి తాహతుకి మించి కట్నమిస్తామని ఒప్పుకొంటున్న తల్లిదండ్రులది ఇంకా పెద్ద తప్పమ్మా!” అంటూ చెప్పుకొచ్చింది కూతురు.
“నువ్వు చెప్పింది నిజమేనే! కానీ, ఏ ఆడపిల్లకైనా పెళ్లి వరమవ్వాలి. శాపంలా మారకూడదు. అత్తారింటిలో కూతురు బాగుండాలనే ఆశే కదా ప్రతి తల్లిదండ్రులది. అందుకే తల తాకట్టు పెట్టయినా తాహతుకి మించి కానుకలు ఇస్తారు. అయినా, కట్నకానుకల్లో మీ ఆయనకు లక్షలేమన్నా ఎగ్గొట్టామా? పెళ్లయిన ఆడపిల్ల అత్తింట్లో కన్నా పుట్టింట్లో ఎక్కువగా కనిపిస్తే చూసేవాళ్లు ఏమనుకుంటారు? అయినా, ఈరోజు గడిస్తే చాలమ్మా! మీ ఇంటికి నువ్వు వెళ్లిపోతావు” అంది తల్లి.
ఆ మాటకు ఒక్క ఉదుటున వచ్చి తల్లిని కౌగిలించుకుంది. ఆమె కళ్ల నుండి జారిన బాధల చినుకులు ప్రమీల భుజాన్ని తడిపాయి.
“పిచ్చితల్లి! ఎక్కడికి పోతావే! ఫోన్‌కాల్ దూరంలోనే ఉంటావు కదా!” అంటూ.. చెమర్చిన తన కళ్లను చీరకొంగుతో తుడుచుకుని, కూతురిని ఓదార్చింది ప్రమీల.
“చెల్లికి ఫోన్చేయి! వెళ్లి చాలా సేపయ్యింది. లగేజీ మొత్తం సర్దేసుకో.. మళ్లీ అక్కడికెళ్లి ‘అది లేదు! ఇది లేదు!’ అని నా ప్రాణాలు తీయొద్దు.. చెల్లి రాగానే అల్లుడుగారికి ఫోన్‌చేసి రమ్మని చెప్పు” అంది.
అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. వాసంతి వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా చెల్లి మహతి. “ఎందుకే.. ఇంత లేట్!?” అంటూ ఆమె భుజానికున్న హ్యాండ్‌బ్యాగ్ లాక్కొని..“అమ్మా!” అంటూ ఇంట్లోకి పరుగెత్తింది వాసంతి. బ్యాగ్ లాక్కెళ్తుందని ఊహించని మహతి.. “అక్కా! అక్కా! ఆగు..” అంటూ వెనకాలే వెళ్లింది. మహతిని చూసిన తల్లి..“ఇంత లేట్ అయ్యిందేంటమ్మా! బ్యాంకులో డబ్బుల్లేవా?”.. డబ్బులు వచ్చాయన్న సంతోషంలో నవ్వుతూ అన్నది.
ఇంతలో బ్యాగ్ ఓపెన్ చేసిన వాసంతి..
“బ్యాంకులో కాదమ్మా.. బ్యాగులోనే డబ్బులు లేవు!” అని చెప్పింది.ఆ మాటలకు ప్రమీల అవాక్కయి..“అదేంటే.. డబ్బుల్లేవంటావ్? మతి పోయిందా! సరిగ్గా చూడు!” అంది.“చూసే చెప్తున్న.. బ్యాగు ఖాళీగా ఉందమ్మా”“ఏమైందే? వట్టి చేతుల్తో వచ్చావ్? బ్యాంకుకు వెళ్లలేదా?” చిన్న కూతురి భుజం తట్టి అడిగింది తల్లి.“వెళ్లానమ్మా”..
“వెళ్తే డబ్బులు ఎక్కడే?”.. బ్యాగ్ పక్కన పడేస్తూ కోపంగా అడిగింది వాసంతి.“అక్క అడుగుతుందిగా!? చెప్పవే!”
గద్దించింది తల్లి.
“అమ్మా!!” అని నసుగుతున్న మహతిని చూసి..
“ఏంటే.. నీళ్లు నములుతున్నావ్? నాకేదో అనుమానంగానే ఉందే!” అంటూ ప్రమీల కంగారు పడిపోయింది.
“అమ్మా! ఏదేదో ఊహించుకుంటూ టెన్షన్ పడకు. ముందు దాన్ని చెప్పనివ్వు”.. అంటూ తల్లిని నిదానపరిచింది వాసంతి.
“దాని వాలకం చూస్తుంటే తెలియడం లేదా? డబ్బులుంటే బ్యాగులో ఉండాలిగా? మేం అంతలా అరుస్తుంటే మాట్లాడవేంటే??” కాస్త కోపాన్ని పెంచింది తల్లి.
అక్కా, అమ్మ కలిసి ప్రశ్నలమీద ప్రశ్నలు వేస్తుంటే.. మహతికి కోపం వచ్చి..
“నన్ను మాట్లాడనిస్తేగా మీరు” అంది.
“అంత కోపం దేనికే? ముందు ఏం జరిగిందో చెప్పు” మళ్లీ అడిగింది వాసంతి.“డబ్బులు డ్రా చేసి రోడ్డుదాటి వస్తుంటే.. ఒక పెద్దయానకు స్ట్రోక్ వచ్చి పడిపోయాడు. అక్కడున్న ఒక్కరూ హెల్ప్ చేయకపోగా.. ఫోన్లో వీడియోలు తీస్తూ నిలబడి చూస్తూ ఉన్నారంతా! నేను మాత్రం అలా ఉండలేక పోయా! అంబులెన్స్‌కు ఫోన్ చేసి, హాస్పిటల్‌కు తీసుకువెళ్లాను. కండిషన్ సీరియస్‌గా ఉన్నదనీ, వెంటనే ఆపరేషన్ చేయాలని అక్కడి డాక్టర్లు చెప్పారమ్మా! అమౌంట్ కడితే ఏర్పాట్లు చేస్తామన్నారు. దాంతో.. వేరే ఆలోచించకుండా.. అమౌంట్ కట్టేశా!”.. అని చెప్పీ చెప్పగానే మహతి చెంప చెళ్లుమంది. ఆ దెబ్బకు కిందపడిపోయింది.
“కొంప ముంచావు కదే! మీ అక్క కాపురం కూల్చేశావు. నువ్వసలు మనిషివేనా? ఎవరో పడిపోతే నీకేంటే? ఆడపిల్లవై ఉండి.. అణిగిమణిగి ఉండకుండా.. మగరాయుడిలా ఇవేం పనులే!? సొంతవాళ్లనే పట్టించుకోకుండా హాయిగా బతుకుతున్న రోజులివి.. ఆయన మన చుట్టమా? పక్కమా?” అని తిడుతూనే ఉన్న తల్లిని ఆపుతూ..
“అమ్మా ఆపుతావా! పోనీలే.. అయ్యిందేదో అయ్యింది. దాన్ని కొట్టి చంపితే?. డబ్బులు తిరిగొస్తాయా? నా రాత ఇలా రాసుంటే, దాన్నని ఏం లాభం??” అంది వాసంతి.
“అమ్మా.. నాకు తోచింది చేశాను. హెల్ప్ చెయ్యాలా? వద్దా? అని లెక్కలేసుకుని చెయ్యలేదు. ఇందాక అన్నావే .. ‘మనిషివేనా?’ అని. మనిషిగా పుట్టినందుకే ఆ పనిచేశాను. ఒక మనిషి తోటి మనిషికి సాయం చేసుకోకుండా.. ఒకే సంఘంలో బతకడం ఎందుకు?” అంది మహతి.“చూడు ఎలా మాట్లాడుతున్నదో!? ఆడపిల్లని ఆడపిల్లలాగే పెంచాలి. కొడుకుల్లేని లోటు తీరుస్తుందని గారాబం చేస్తే.. సంఘసేవ చేస్తున్నది” అంటూ వాపోయింది తల్లి.
“అక్కా.. నేను చేసిన పనికి క్షమించు. అమ్మ కోపంలో అర్థముంది! చీటీ కట్టి రెడీ చేసిన డబ్బులను బావగారికి ఇవ్వాలనుకున్నారు. ఆ డబ్బుపైనే నీ జీవితం ఆధారపడుంది. కానీ, నాకు ఆ టైంలో ఒక ప్రాణమే ముఖ్యమని అనిపించి అలా చేసేశా!” అంది.చెల్లి మాటల్లో మర్మం అర్థమైన వాసంతి..“పోనీలేవే.. మంచిపనేగా చేశావ్. ఒక ప్రాణం నిలబెట్టావ్! కట్నం ఆశిస్తూ, కట్టుకున్న వాళ్లని హింసిస్తూ, చంపేస్తూ.. పుట్టింట్లో వదిలేసే భర్తలున్నారు. అలాంటి వాళ్లతో ఏ భార్య మనస్ఫూర్తిగా కాపురం చేస్తుంది? ఒక మనిషి ప్రాణం కాపాడిన నీ మనసు ఎంతో గొప్పది. నిన్ను చూసి గర్వపడాలి. నా సంగతి నేను చూసుకుంటాలే” అని చెల్లిని సమాధాన పరిచింది.
“బాగుందమ్మా వరుస! దారిన పోయే దానయ్యకు సొమ్మంతా ధారపోసి వస్తే.. గొప్ప పని చేశావని చెప్తున్న అక్క ఇంకా గొప్పది! రానీయండి.. మీ నాన్న వచ్చాక చెప్పుకోండి.. చెల్లి మదర్ థెరిసా.. అక్క సతీ సావిత్రి. ఖర్మ ఖర్మ” అంటూ తలపట్టుకుంది ప్రమీల.
రాత్రి పది గంటలు. భర్త రాజారాం ఇంటికి రాగానే..“వచ్చారా!? ఫోన్ చేస్తుంటే తియ్యరూ??” అంటూ గయ్యిన లేచింది ప్రమీల.“డ్రైవింగ్‌లో ఉన్నానే! పైగా వెనకాల ప్యాసింజర్స్ ఉన్నారు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడతారా?? తర్వాత చేద్దామనుకున్నా! ఇంతలో చార్జింగ్ అయిపోయింది. ఇదిగో ఇలా వస్తూనే ఉన్నా! అన్నం వడ్డించు.. ఆకలిగా ఉంది. అవునూ.. పిల్లలేరి? తిన్నారా? పడుకున్నారా??” అంటూ అడిగాడు రాజారాం.
“వాళ్లు తినకపోయినా ఊళ్లో అందరి కడుపులూ నింపి వస్తారులే! అప్పుడే వాళ్లకు కడుపు నిండుతుంది. ముందు మీరు తినండి” అంది కోపంగా.భార్య మాటల్లో వ్యంగ్యాన్ని పసిగట్టి..“ఏమైందే! పిల్లలు భోంచేశారా? అని అడిగితే ఏదేదో మాట్లాడుతున్నావ్! మతిగాని పోయిందా?” అన్నాడు రాజారాం.“హా! మతిపోయే మాట్లాడుతున్నా! విషయం తెలిస్తే మీకూ పోతుంది.. మతి!” అంది.“అబ్బబ్బా.. ముందు సంగతేంటో చెప్పు?” అన్నాడు భోజనానికి కూర్చుంటూ..“నీ ముద్దుల చిన్న కూతురు.. అల్లుడుగారికి ఇద్దామనుకున్న లక్ష రూపాయల్ని ముక్కూముఖం తెలియని వాణ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి.. బిల్లు కట్టి లోక కల్యాణం చేసొచ్చింది!”..
‘లోక కల్యాణం’ అని రెండుసార్లు వత్తి పలికింది.ఆ మాటతో రాజారాం గబుక్కున లేచి..“మహతీ!” అంటూ గట్టిగా పిలుస్తూ.. బెడ్రూమ్ వైపు కదిలాడు.భర్త పిలుపులతో భయపడ్డ ప్రమీల వెనకే నడుస్తూ..“నేనే కొట్టాను. మీరేమీ అనకండి! చిన్నపిల్ల.. తెలిసో తెలియకో”.. అంటుంటే, అవేవీ పట్టించుకోకుండా..“మహతీ.. వాసంతీ.. తలుపు తీయండి!” అని పిలుస్తూనే ఉన్నాడు.
బెడ్‌పైన కూర్చున్న అక్కా చెల్లెళ్లు భయంతో ఒకరినొకరు చూసుకుంటున్నారు. బయటి నుండి రాజారాం తలుపు కొట్టడం ఆపలేదు.ధైర్యం తెచ్చుకొని మహతి డోర్ తీసింది.లోపలికి వచ్చిన ప్రమీల.. అక్కడే ఉన్న వాసంతి భయంతో ఏం జరుగుతుందోనని చూస్తున్నారు.“అదీ.. నాన్నా! అక్కడున్న పరిస్థితిలో నాకు ఆ హెల్ప్ కరెక్ట్ అనిపించింది.. చేసేశాను. క్షమించండి!” అంది మహతి. కూతురు భుజాలు పట్టుకొని ..“ఇప్పుడు ఆ పెద్దాయన పరిస్థితి ఎలా ఉందమ్మా!?” అంటూ ప్రేమగా అడిగాడు రాజారాం!తండ్రి అలా అడిగేసరికి రిలాక్స్ అయ్యి..“ఓకే నాన్నా! బాగున్నాడు. ఆ విషయం తెలిశాకే నేను ఇంటికొచ్చాను” నవ్వుతూ చెప్పింది.బాహుబలి యుద్ధమే జరుగుతుందనుకున్న ప్రమీల, వాసంతి.. అక్కడి సీన్ చూసి షాక్ అయ్యారు.
ప్రమీల కల్పించుకుని..“బాగుంది! కన్నబిడ్డ కాపురం కన్నా.. తెలియని వాళ్ల ప్రాణాలు మీకు ముఖ్యమయ్యాయా?” అంది.“అల్లుణ్ని బతిమాలి.. సర్దుబాటు చేద్దాంలే! అంతమందిలో మన కూతురికే ఆయన్ని రక్షించాలన్న ఆలోచన వచ్చింది చూడు.. అదే మానవత్వం! మానవత్వం ఉన్న మనుషులు.. ఎవరు ఆపదలో ఉన్నా చూస్తూ ఉండరు. ఏం చేయడానికైనా సిద్ధపడతారు. అది వాళ్ల గుణం. దేవుడిచ్చిన వరం! అలాంటి వాళ్లను గౌరవించాలి. మహతి చేసిందీ అదే! ఒక నిండు ప్రాణాన్ని కాపాడింది. ఇది బాధపడే విషయం కాదే!” అన్నాడు.
“పైసా పైసా పోగేసినవి.. ఎవరికో ధారాదత్తం చేసొచ్చింది. కానీ, మీరు ఒక్కమాట కూడా అనలేదు. పైగా ‘సహాయం చేయాలంటే రక్త సంబంధం ఉండాలా? ఒకరికొకరు తెలిసిన వారైతేనే సాయం చేయాలా? మనిషికి మనిషి సహాయం చేసుకోకుండా బతకడం ఎందుకు?? దండగ!’ అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడింది!! అయినా మీరేంటి??.. ఉలకరు పలకరు? నా పాటికి నేను వాగుతూనే ఉన్నా.. మీ పాటికి మీరు తింటూనే ఉన్నారు” అన్నది భర్తకు భోజనం వడ్డిస్తూ..
“ఆపుతావా నీగోల! అది చేసింది మంచిపనేగా? కాకపోతే మన డబ్బులు పోయాయి. పోతే పోనీలే.. అక్కడ ఒక మనిషి ప్రాణం! పైసలంటే మళ్లీ సంపాదించుకోవచ్చు. ప్రాణం పోతే తిరిగిరాదు. ఒకరి సహాయం పొందిన మనం.. ఇలా సహాయం తప్పంటూ రాద్ధాంతం చేయడం ధర్మం కాదే.. ముందు నువ్వు తిను” అంటూ భార్య పళ్లెంలో భోజనం పెట్టి..“గుర్తుందా.. మన మహతి పుట్టిన రోజు”..ఆ మాట వినగానే ఆమె గుండెల్లో ప్రకంపనలు రేపిన సంఘటన తాలూకు నీడలు కళ్ల ముందు కదిలాయి.
ఇరవై ఏళ్ల క్రితం.. జూన్ నెల. అర్ధరాత్రి దాటిన తరువాత కుండపోతగా వర్షం..ప్రమీలకు నొప్పులు మొదలయ్యాయి. ఆమె బాధతో పెట్టే అరుపులకు ఉలిక్కిపడి లేచింది రెండేళ్ల వాసంతి.అప్పుడే వచ్చిన రాజారాం.. నొప్పులతో విలవిల్లాడుతున్న భార్యని, ఏడుస్తున్న కూతురిని ఆటోలో ఎక్కించుకుని హాస్పిటల్‌కి బయల్దేరాడు. ఇంటికి.. ప్రభుత్వ ఆసుపత్రికి చాలాదూరం. ఆటోను వేగంగా నడుపుతున్నాడు.ప్రమీల సొమ్మసిల్లి పోతుంటే..“వచ్చేశాం.. కాస్త ఓర్చుకో!” అంటూ.. వెనక్కీ, ముందుకూ చూసుకుంటూ ఆటోని పోనిస్తున్నాడు.వర్షం ఇంకా పెరిగింది.. రోడ్లన్నీ జలమయం. పైగా కరెంట్ లేదు. గాలివాన.. మెరుపులు!అంతలో మళ్లోసారి వెనక్కి తిరిగి..
“ఇదిగో వచ్చేశాం..” అని చెప్పి ముందుకు తిరిగేలోపు.. వర్షం నీళ్లతో నిండి ఉన్న మ్యాన్‌హోల్‌లో ఆటో ముందు చక్రం దిగబడి.. ఆటో బోల్తా కొట్టింది. ముగ్గురూ చెల్లాచెదురుగా పడ్డారు.
వాసంతి ఏడుపు.. ప్రమీల అరుపులు.. ఆ వర్షంలో కలిసిపోతున్నాయి. బిడ్డని, భార్యని రక్షిద్దామనుకొన్న రాజారాం.. కాలు విరిగి లేవలేకున్నాడు. పాక్కుంటూ వచ్చి కూతుర్ని అక్కున చేర్చుకున్నాడు. అర్ధరాత్రి కావడంతో రోడ్డుపైన వాహనాలు తిరగడం లేదు. ఒకటీ అరా కనిపించినా.. ఎవ్వరూ సాయానికి రావడం లేదు. అప్పటికే ప్రమీల స్పృహ కోల్పోయింది.
కొద్ది సేపయ్యాక ఒక కారొచ్చింది. ఒక వ్యక్తి దిగి వచ్చి.. ముగ్గురినీ హాస్పిటల్‌కు చేర్చాడు.ప్రమీలకు ప్రసవమైంది. రాజారాం కాలికి ట్రీట్మెంట్ చేయించి.. చేతిలో పదివేల రూపాయల డబ్బులు పెట్టాడు! రాజారాం అతనికి చేతులెత్తి మొక్కి..“దేవుడిలా వచ్చి కాపాడారు. ఎంతోమంది మా అవస్థలు చూశారు. కానీ, ఎవరిలోనూ చలనం లేదు. మేము మీకు తెలియకపోయినా కాపాడారు. మీరే మా దేవుడు. మీ రుణం ఎలా తీర్చుకోను. ఇప్పటికే చాలా చేశారు. ఈ డబ్బులు ఎందుకు?? వద్దు సార్..” అన్నాడు.“నాకు తోచిన సాయం చేశాను. సహాయం చేయడానికి ఒకరికొకరు తెలిసుండాలా?. రక్త సంబంధం కలిగుండాలా? మనుషులకు మనుషులే సహాయం చేసుకోకుంటే ఎలా? అలాంటప్పుడు ఈ సమాజమెందుకు? నువ్వెందుకు.. నేనెందుకు? ఈ సంఘంలో బతకడం దేనికి?” అని చెప్పి ముందుకు కదిలాడు.అన్నం కలుపుతూ జ్ఞాపకాల్లోనే ఉన్న భార్యను.. అన్నం నోట్లో పెట్టడం లేదంటూ తట్టాడు రాజారాం.జ్ఞాపకాల్లోంచి బయటికి వచ్చి..“తింటున్నా!” అంది ప్రమీల.
వారం గడిచాక.. ఒకరోజు ఉదయం రాజారాం ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. అప్పుడే బయటికి వెళ్తున్న రాజారాం.. దాన్ని చూసి ఆగిపోయాడు. ఆ కారులోంచి ఒక పెద్దాయన దిగాడు. రాజారాం దగ్గరికి వచ్చి..“బాబూ.. ఇక్కడ మహతి?” అనగానే..“నా కూతురే! మీరూ..” అంటూ.. అతణ్ని పరీక్షగా చూశాడు. ఆశ్చర్యం.. తాము ఇన్నేళ్లూ దైవంగా కొలుస్తున్న వ్యక్తే అతను.“సార్!! మీరా? ఇక్కడ..??” అంటూ అడిగాడు.“నేను మీకు తెలుసా? వయసు పైబడింది కదా.. జ్ఞాపకశక్తి తగ్గింది. గుర్తు పట్టలేకపోతున్నా”..“మేము బతికున్నామంటే మీ దయనే.. ఇరవై ఏళ్ల క్రితం వర్షంలో ఆటో యాక్సిడెంట్.. పురిటి నొప్పులు..” అని రాజారాం అనగానే..
“హా.. రాజారాం, ప్రమీల” అన్నాడు ఆ పెద్దాయన.“రండి రండి..” అంటూ, అతని చేయి పట్టుకుని.. ఇంటిలోపలికి తీసుకొచ్చాడు.
కూర్చోండని కుర్చీ చూపించాడు.“ప్రమీలా.. గుర్తుపట్టావా! మహతి పుట్టిన రోజున మనల్ని కాపాడిన..” అంటూ చెప్పగానే..వెంటనే పెద్దాయన కాళ్లకు మొక్కింది ప్రమీల.“ఏం తీసుకుంటారు బాబాయి గారూ! టిఫిన్, టీ” అంటూ అడిగింది.“అవేమీ వద్దమ్మా! అన్నీ కానిచ్చాను.. ఇంతకూ మహతి?” అని పెద్దాయన అనగానే..రాజారాం, ప్రమీల ఆశ్చర్యపోయారు.మహతి ఈయనకు ఎలా తెలుసని.“మహతీ.. ఇలారా!” అని పిలిచింది ప్రమీల.గదిలోంచి వచ్చిన మహతి.. పెద్దాయన్ని చూసి..“తాతగారూ.. మీరా! మీరిక్కడ?? ఎలా ఉంది మీ హెల్త్?” అంటూ దగ్గరికి వచ్చింది.
“బాగుంది తల్లీ! కొడుకులు పుడితే జీవితానికి కొదవ లేదనుకున్నా! నా బిడ్డలకు నేను పాతబడి పోయానని వదిలేశారు. ఆడపిల్లవైనా.. అందులో చిన్నపిల్లవైనా నీలో చేతులెత్తి మొక్కే సంస్కారం, మానవత్వం నిండుగా ఉన్నాయి! దేవుడి ఆట గొప్పది. నువ్వు పుట్టినప్పుడు నా చేత మీ అమ్మానాన్నలకు సాయం అందించాడు. ఇప్పుడు నాకు పునర్జన్మ ఇవ్వడానికి నిన్ను పంపించాడు” అంటూ ఆనంద బాష్పాలు రాల్చాడు.
విషయం అర్థమై.. ప్రమీల, రాజారాం, వాసంతి ఒకరినొకరు చూసుకుని.. పూజగదిలోని దైవాన్ని చూశారు.
ఇంతలో వాసంతి ఫోన్ మోగింది. భర్త శశికాంత్.“వాసంతీ.. ఈరోజు సాయంత్రమే వస్తున్నా! రెడీగా ఉండు” అన్నాడు.“ఎందుకు?” అడిగింది “అదేంటి డియర్..?”.
“మనీ ఇంకా రెడీ అవ్వలేదు. అయ్యాక చెప్తా! వచ్చి తీసుకెళ్లండి.. మనిషిని కాదు.. మనీని..!” వ్యంగ్యంగా అంది వాసంతి.“సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న మహతి హెల్పింగ్ వీడియో చూశాను. మనుషులు అలాగే ఉండరు.. మారతారు! ఛాన్స్ ఇవ్వండి మేడమ్!” అంటూ బతిమిలాడాడు.
ముసిముసిగా నవ్వుకుని..“చూద్దాంలే మిస్టర్!” అన్నది వాసంతి.పట్ల యాదగిరి ‘గిరిపట్ల’ కలంపేరుతో సాహిత్యసేవ చేస్తున్నారు పట్ల యాదగిరి. ఈయన స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. డిగ్రీ చేసిన యాదగిరి.. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు.
8వ తరగతిలో ఉన్నప్పుడే రచనలో తొలి అడుగు వేశారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ‘బాలానందం’ కార్యక్రమంలో ఈయన రాసిన పొట్టి కవితలు ప్రసారమయ్యాయి. ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గీత రచయితగానూ కొనసాగుతున్నారు. ‘పుత్రుడు’ సినిమా కోసం ఈయన రాసిన తొలి పాటను ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించారు. ఆ తర్వాత ‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’ చిత్రం కోసం రాసిన ‘అడుగుతో అడుగే అడుగేసిందని’, ‘తొలి పరువం కురిసిందని’ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. అప్పటినుంచి వీరి పాటల ప్రయాణం మరింత వేగంతో దూసుకెళ్తున్నది. కృష్ణం, వస్తా, 14డేస్ లవ్ సినిమాల్లో ఈయన రాసిన పాటలు.. రచయితకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక కథ విషయానికి వస్తే.. ఓ యధార్థ సంఘటన స్ఫూర్తితో ‘ఒకరికొకరు’ రాసినట్టు రచయిత చెబుతున్నారు.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన‘కథల పోటీ-2023/24’లోరూ.3 వేల బహుమతి పొందిన కథ.
-పట్ల యాదగిరి,99859 26292