Ramayanam | రెండు సంవత్సరాల ఇంటర్ చదువు అలా గట్టెక్కాక ఇంటికి వచ్చేశాను. రమణయ్యను నాన్న అడగ్గానే ఒక్క ముక్కలో చెప్పేశాడు. ‘మన అమ్మాయిది తప్పేం లేదండీ! ఫీజు కట్టిన్రు, ఆఫీసుల అప్లికేషన్ ఇచ్చిన్రు. కాకపోతె అక్కడున్న క్లర్కు ఒకామె సాయంత్రం పూట ఇంటికి పొయ్యే తొందరల ఉన్నప్పుడు మనమ్మాయి అప్లికేషన్ ఇచ్చినట్టున్నరు.
ఆమె దాన్ని తొందరల ఎక్కడ పడేసిందో ఏమో తెల్వదు. పైకి పంపనట్టున్నది. తీర మనం గట్టిగ అడిగితె నాకు ఇయ్యనే లేదు అంటున్నరు. వాళ్ల తప్పు వాళ్లు ఒప్పుకుంటరా? మనదే తప్పంటరు’ అని వెళ్లిపోయాడు.
నన్ను అమ్మా, నాన్నా ఏమీ అనలేదు గానీ, నాకే చాలా రోజుల దాకా గిల్టీగా ఉండేది. నాన్న ఎప్పుడూ మనసులో ఏముందో చెప్పేవాడు కాదు. ఎప్పటిలాగే మామూలుగా ఉండేవాడు. అమ్మ మాత్రం చాలా రోజులు నాతో ముభావంగా ఉండేది. నాకది పెద్ద శిక్ష. అమ్మ ప్రేమ, క్రమశిక్షణ కూడా తెలిసినదాన్ని. అమ్మ నా మీద పెట్టుకున్న ఆశలు వమ్ము చేశాననే బాధ నాది. ఎలాగైనా నన్ను నేను నిరూపించుకోవాలని తపన పడ్డాను. అమ్మ చుట్టూ చేరి ఎలాగైనా నవ్వించాలని చూసేదాన్ని. పుస్తకాలు చదవడం, అమ్మ వెనుక చేరి మొక్కలకు నీళ్లు పోయడం లాంటి పనులతోనే రోజంతా గడిపేదాన్ని.
అక్క ఇంటర్లో పోయిన సబ్జెక్ట్ రాసి పాసయింది. కానీ, తను డిగ్రీలో చేరలేదు, లేదా మా ఇంట్లోవాళ్లు చేర్పించలేదేమో కూడా! అలా నేనూ అక్కా మళ్లీ రెండేళ్ల పాటు చిన్నప్పటిలా మా ఇంట్లో కలిసి ఉన్నాం. అక్క ఎవరింట్లోనయితే ఇంటర్ చదువుకోవడానికి ఉందో ఆ కజిన్ లచ్చక్క వాళ్ల మరిది మా అక్కను ఇష్టపడ్డాడు. అక్క కూడా ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొంది. ఆయన అప్పుడు లా చదువుతున్నారు. ఏదైనా స్థిరమైన, మంచి ఉద్యోగం ఉన్నవాళ్లకు ఇవ్వాలని అమ్మానాన్నా ఆలోచన. అందుకే మొదట ఒప్పుకోలేదు. కానీ, అక్క ఇష్టాన్ని కాదనలేకపోయారు. మొత్తానికి అబ్బాయి వాళ్లింటికి నాన్న, చిన్నాయనలు, మామయ్యలు వెళ్లి వర నిశ్చయం చేసి వచ్చారు. అమ్మాయికి పూలు, పళ్లు, చీర లాంటివి ఇచ్చి నిశ్చితార్థం చేయడం లాంటి ఆచారాలేవీ వాళ్లకు లేవని చెప్పారు.
అదీగాక ఇప్పటిలాగా అప్పట్లో ఎంగేజ్ మెంట్ పేరుతో లక్షలు ఖర్చు పెట్టి గ్రాండ్గా, ఓ చిన్న సైజు పెళ్లిలా చేయడం ఉండేది కాదు. పైగా పెళ్లికి సంబంధించిన ఏ ఖర్చయినా అమ్మాయి తల్లిదండ్రులే పెట్టాల్సి వచ్చే పద్ధతులు ఉండేవి. అందుకని కొందరు మగపెళ్లివారు అమ్మాయికి ఏది పెట్టాల్సి వచ్చినా ‘గిది మాకు ఒంతెన లేదు, మా ఇంట్ల గా ఆచారం లేదు’ అని తప్పించుకునేవారు. కొందరిళ్లల్లో నిజంగానే ఆ పద్ధతి ఉండేది కాదు. మొత్తానికి అక్క ఎంగేజ్మెంట్లో కొత్త దుస్తులు కట్టుకుని కాస్త సందడి చేసే అవకాశం లేకుండా పోయింది నాకు.
మా ఇంటికి ఎప్పట్లాగే చుట్టాలు వచ్చిపోతూ ఉండేవారు. తెలిసిన వాళ్లు, ఊరివాళ్లు కూడా ఎవరో ఒకరు వచ్చి మాట్లాడుతుండేవారు. ఇక ఆడవాళ్లయితే లోపలిదాకా వచ్చి అమ్మనో, నానమ్మనో ఏదో ఒక వంటింటి దినుసు అడిగి తీసుకుపోయేవారు. కొందరు కరివేపాకు కోసం, మరికొందరు చింతపండు కోసం, ఇంకొందరు మా పెరట్లో కాసే కూరగాయలకో, పూసే పూలకో.. వచ్చిన వాళ్లు ఊరికే పోకుండా ‘గిత్తత్త పచ్చడ పెట్టరా దొర్సానీ!’ అంటూ కూర్చునేవారు.
‘సడే! గిప్పుడేం పచ్చడి? స్నానాలు జెయ్యకుండ జాడీలు ముట్టుకోని ఎట్ల తీస్తం?’ అనేది నానమ్మ. నిజానికి పెట్టొద్దనే ఉద్దేశం ఆమెకు ఉండేది కాదు. ఏ విషయమైనా మొదట ‘నో’ అన్నాకే ‘ఎస్’ అనేది. అప్పటికే అమ్మ చూసి ‘సరే, పెడత ఉండు’ అని పచ్చడి తెచ్చేలోగా వచ్చిన వాళ్లు ఊరికే ఉండరుగా! వాళ్ల కళ్లకు నేనో, అక్కనో కనబడేవాళ్లం. ‘ఇగ అమ్మాయిలిద్దరి సదువు అయిపోయినట్టున్నది గద, ఈడనే ఉంటాన్రు, పెండ్లి జేస్తరా?’ అనడిగేవారు. ‘ఆఁ ఆ.. ఇగ జెయ్యాలె, చేస్తం! ఆడిపిల్లలన్నాక ఎన్నాండ్లు ఇంట్లుంచుకుంటం? మంచి సమ్మంధం జూడాలె గద!’ అనేది నానమ్మ. ‘మరి యాడనన్న జూసిన్రా? మ్యానోల్లు ఉన్నరా? జల్ది జూసి లగ్గం జేసి ఎల్లగొట్టాలె’ అంటూ ఉచిత సలహా ఇచ్చేవారు. అలాంటి మాటలు విన్నప్పుడు నాకూ, అక్కకూ కోపం వచ్చేది.
‘ఏందమ్మా! వాళ్ళందరికీ మా పెండ్లిళ్లు ఏమవసరం? ఒచ్చిన పని చూస్కోని పోవాలె గాని, మన విషయాలు వాళ్లకెందుకు?’ అనేవాళ్లం. ‘అంటే మీకేమయుతుంది? ఎవరికి తోచింది వాండ్లు చెప్తరు. అట్ల ఎవ్వరు ఏమనొద్దు అంటే.. ఊరి బయట ఉండాలె. నలుగురితో ఉంటేనే సమాజం అంటరు. సమాజం అంటె పదిమందితోటి కలిసి మెలిసి ఉండాలె. వాండ్లు అనేది ఇనాలె, మనం జేసేది చెయ్యాలె’ అన్న అమ్మ మాటలకు నోరు మూసుకునేవాళ్లం.
ఇంకొందరు మరికాస్త చొరవ తీసుకుని ‘సమ్మందం చూసుడెందుకు? ఇంటి ముందర్నే ఆడిబిడ్డ ఉన్నది గద! వాండ్ల కొడుక్కు మీ ఇద్దరు బిడ్డలల్ల ఎవలన్న ఈడు కారా? ఒగల్లను అటిచ్చి అల్లున్ని ఇల్లింటం తెచ్చుకోని, ఇంకోల్లను బయిటికిచ్చి ఎల్లగొడితే అయిపాయె!’ అని వాళ్లే నిర్ణయించేవారు. ‘ఇంకేంది? సంబంధాలు కూడా ఆమెనే మాట్లాడి, పెళ్లిళ్లు కూడా ఆమెనే చెయ్యమనక పోయినవా?’ అని నేను ఉక్రోషంగా అమ్మతో అనేదాన్ని. ఒక్కోసారి నాన్నతో ‘అబ్బ… ఏంది నానా, ఎవరు పడితే వాళ్లొచ్చి మన ఇంటి విషయాలు మాట్లాడుతరు? నువ్వు కూడ ఏం మందలించవు?’ అని విసుక్కునేదాన్ని. పోనీ, తియ్యి, ఏదో అంటరు. ఎట్ల అయ్యేది గట్లనే అయితది అనేవాడు నాన్న.. స్వామి ప్రశాంతానంద లాగా!!
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి