Ramayanam | హైదరాబాద్‌లో మా గల్లీ చాలా ప్రసిద్ధి చెందింది. అయితే, ఆ విషయం అప్పుడు నాకు తెలియదు. పలువురు ప్రముఖ రచయితలు, ఆర్టిస్టులు మా కాలనీలోనే ఉండేవారు. వారిని కలిసేందుకు మరింతమంది లబ్ధప్రతిష్ఠులు మా కాలనీకి వచ్చేవారు.
మా గల్లీ మొదట్లోనే సుప్రసిద్ధ రచయిత త్రిపురనేని గోపీచంద్ గారిల్లు ఉండేది. అప్పటికి నేను “అసమర్థుని జీవయాత్ర” చదవలేదు. ఆ మాటకొస్తే బుచ్చిబాబు “చివరికి మిగిలేది” గానీ, చలం, కొడవటిగంటి మొదలైనవారి రచనలు కూడా ఆ రోజుల్లో చదివే అవకాశం రాలేదు. చిన్న పిల్లల కథలు, యద్దనపూడి, కోడూరి, రంగనాయకమ్మ, మాదిరెడ్డి సులోచన వంటి వాళ్ల నవలలు అప్పుడప్పుడే చదువుతూ ఉన్నాను.
అప్పటికి గోపీచంద్ గారు చాలా ఏళ్ల కిందటే చనిపోయారు కాబట్టి, ఆయణ్ని చూసే అవకాశం లేదు. వాళ్ల అబ్బాయిల్లో పెద్దాయన రమేష్ చంద్ర డాక్టర్ అనుకుంటా! మరొకాయన జ్యోతి మాసపత్రికలో సబ్ ఎడిటర్‌గా చేసేవాడు. ఇక ఆఖరి కొడుకు సాయిచంద్. ఆ తరువాతి కాలంలో సినిమా నటుడయ్యాడు. అప్పటికి సుమారు ఇరవై ఏళ్లవాడేమో! ఆ గల్లీలో వాళ్ల స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. అప్పుడప్పుడూ “రంగన్నా! బాల్ పడింది మీ కాంపౌండ్‌లో” అంటూ వచ్చి.. బాల్ వెతుక్కుని తీసుకెళ్లేవాడు.
మేము ఉండే ఇంటికి రెండిళ్ల అవతల ఆర్టిస్టు చంద్ర గారుండేవారు. అదే కాంపౌండ్‌లో ప్రముఖ సాహితీవేత్త పల్లా దుర్గయ్య గారుండేవారనీ, అక్కడికి దాశరథి గారూ, వట్టికోట ఆళ్వారు స్వామి గారూ వచ్చేవారని చెప్పుకొనేవారు. ఆ పక్క గల్లీలోనే ప్రముఖ రచయితలు అరిపిరాల విశ్వం గారూ, సీఎస్ రావు గారూ ఉండేవారు. సీఎస్ రావు గారింటికి చిన్నాయనలు వెళ్లి వస్తూ ఉండేవారు. ఆఖరి చిన్నాన్న శేషగిరిరావు గారు కూడా కథలు రాసేవాడు గానీ.. నేనెప్పుడూ చదవలేదు అనేకన్నా, నాకు చూపించలేదనే చెప్పాలి. నిజానికి నేనప్పుడు పదమూడేళ్ల చోటీ బచ్చీని గనుక.. ‘దీనికేం తెలుసులే!?’ అనుకునుండవచ్చు. అది సహజం కూడా. ఆ తరువాత రోజుల్లో ఆయన ‘హరిత’ అనే మాసపత్రిక తెద్దామని చాలా ప్రయత్నించాడు గానీ.. ఎందుకో కార్యరూపం దాల్చలేదు. కొన్నాళ్లకు ‘ప్రమీల’ అనే పత్రిక కూడా తలపెట్టాడు గానీ, అదీ వెలుగు చూడలేదు.
కాంపౌండ్‌లో ఒకపక్క అవుట్ హౌస్‌లో గదులు ఉండేవి. ఇంటి వెనుక భాగంలో కూడా వరుసగా గదులుండేవి. వాటినన్నిటినీ రెండు మూడు కుటుంబాల వాళ్లకు రెంట్‌కు ఇచ్చేవారు. ఒక గదికి తాళం వేసి ఉండేది. దానికే ‘హరిత మాసపత్రిక’ అనే బోర్డు వేలాడుతూ ఉండేది. చిన్నాన్న న్యూ సైన్స్ కాలేజీలో చదివారనుకుంటా. ప్రముఖ కవి తిరుమల శ్రీనివాసాచార్య గారు ఆయనకు స్కూలు లోనో, కాలేజీలోనో పాఠాలు చెప్పేవారట. నాలుగేళ్ల కిందట తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నాకు వారి శ్రీమతి పేరిట ‘తిరుమల స్వరాజ్యలక్ష్మి పురస్కారం’ అందించినపుడు.. శ్రీనివాసాచార్య గారు ఈ విషయం చెప్పారు.
రంగారావు చిన్నాయన చాలా జోవియల్‌గా ఉండేవారు. ఆయన, గోపిక చిన్నమ్మ విడివిడిగా నన్ను వెంట తీసుకువెళ్లి నాకు కూరగాయల మార్కెట్, కొన్ని షాపులు పరిచయం చేసారు. అప్పటికి నాకు ఏ వస్తువు ఎంతకు బేరం ఆడాలో, నాణ్యత ఎలా చూడాలో ఏమీ తెలియదు. వాళ్లను చూసే నేర్చుకున్నాను.
నారాయణగూడలోని ఆ ఇల్లు చాలా పెద్దది. ఎవరో జాగీర్దారు నుండి అమ్మ వాళ్ల మేనమామ నర్సింహారావు గారు కొన్నారట. ఆయన చిన్న వయసులోనే చనిపోయారు. అప్పటికి మొదటి భార్య కొడుకులు కొంచెం పెద్దవాళ్లే గానీ, ఆమె పోయాక పెళ్లి చేసుకున్న రెండవ భార్య అయిన మోహినీదేవి నాయనమ్మది కూడా చిన్న వయసే! పైగా ఇద్దరు మగపిల్లలు కూడా చిన్నవాళ్లే కనుక బమ్మెరలోని ఆస్తి ఇవ్వడంతోపాటు హైదరాబాద్‌లోని ఇంటిని రెండు భాగాలుగా చేసి.. సగభాగం పెద్దవాళ్లు అయిదుగురికీ, మిగతా సగం ఆఖరి ఇద్దరు కొడుకులకీ ఇచ్చారు. మొదటి వాళ్ల సగభాగంలో దయాశంకర్ అనే ఎల్ఐసీ అధికారి కుటుంబం కిరాయికి ఉండేవాళ్లు. వాళ్లు నార్త్ ఇండియన్స్. ఓసారి మా కజిన్స్ లక్ష్మి, హైమక్క, నేను, మా అక్క నారాయణగూడలో ఎందుకో గానీ, దయాశంకర్ గారింటికి వెళ్లాం. అప్పటికే మా ఇళ్లల్లో హెచ్చరిక లాంటి జాగ్రత్త ఎప్పటికీ వర్తించేలా ఉండేది. ఎవరింట్లోనైనా ఏదైనా తినడానికి పెడతామంటే..
“ఒద్దండీ! మేము ఇంతకుముందే తిన్నం” అనో, అలాంటిదేదైనా చెప్పాలని. అయిదు నిముషాలు వాళ్లింట్లో ఉన్నాక ఇక మేము వెళతామన్నప్పుడు.. “అయ్యో! ఏదైనా తినకుండా మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతాం?” అని హిందీలో అంటూ.. ఏవో తినడానికి నార్త్ ఇండియన్ తినుబండారాలు పెట్టారు వాళ్లు.
మేము ఎప్పటిలాగే మా డైలాగ్స్ డిటో డిటోగా చెప్పాం. “క్యా ఖాయే? హమ్ కో భీ జరా బోల్ దేనా!” ఆని అడిగారు మిసెస్ దయాశంకర్. మేము మళ్లీ ఏం మాట్లాడితే ఏమొస్తుందో అని లక్ష్మి వంక చూసాము. ఇలాంటప్పుడు తనే ఆపద్బాంధవి మరి! “హమ్ ఘర్ పే పూరీ ఔర్ పిట్లా ఖాయే ఆంటీ” అన్నది లక్ష్మి. ఆమె వదలకుండా.. “పూరీతో మాలూమ్ హై! పిట్లా? ఉస్ కో కైసే బనాతే?” అనడిగింది. వెంటనే హైమక్క వైపు చూసింది లక్ష్మి. ‘నాకేం తెలుసు?’ అన్నట్టు హైమక్క పైకి చూస్తే.. నేనూ, అక్కా నేలనే నమ్ముకుని కిందకి చూసాం.
అంతలో దయాశంకర్ అంకుల్ వచ్చారు. “క్యా హోరా?” అంటూ. ఆమె.. “ఏ బచ్చియాం ఖారే నై” అన్నది. వెంటనే ఆయన.. “ఎందుకమ్మా! ఎందుక్ తినర్? మేమేమన్న విషం పెడ్తమా? తినకుంటే ఇంట్ల నుండి బాహర్ పొయ్యేదే లేదు” అని ఎస్వీ రంగారావు గొంతుతో అన్నారు. ఆ దెబ్బకు భయమేసి ఏదో వాళ్లు పెట్టిన నమక్ పేడాలు తిని పరుగో పరుగు అంటూ ఇంట్లోకి వచ్చి పడ్డాం. అన్నట్టు.. అప్పటిదాకా మేము స్నేహితుల తల్లిదండ్రుల్ని గానీ, కొంచెం పెద్దవాళ్లని గానీ ‘అత్తమ్మ, మామయ్య’ అనే పిలిచేవాళ్లం. ‘ఆంటీ, అంకుల్’ అని అప్పుడప్పుడే
నేర్చుకున్నాం.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి