Ramayanam | నారాయణగూడ ‘దీపక్ మహల్’ సినిమా టాకీసు ఎదురుగా ఉన్న సందులో నాయనమ్మ వాళ్ల ఇల్లు ఉండేది. గల్లీకి ఎదురుగా కేశవ మెమోరియల్ స్కూలు ఉండేది. ఆ రోడ్డు నుండి అలా ముందుకు వెళ్తే.. ఎడమ వైపు చౌరస్తా ఒక మూల మీద వైఎంసీఏ, దానికి దగ్గర్లోనే శాంతి థియేటర్ ఉండేది.
నిజానికి శాంతి థియేటర్ కొత్తగా కట్టారు అప్పట్లో. నిలువెత్తు అద్దాలతో చాలా అందంగా ఉండేది. మేము ఎప్పుడైనా సినిమాకి వెళితే.. మెట్లు ఎక్కి పైకి వెళ్తూ ఆ అద్దాలలో మా ప్రతిబింబాలు చూసుకునేవాళ్లం. మా ఇంట్లో అప్పటివరకూ ముఖం చూసుకునే చిన్న అద్దాలు తప్ప అలా నిలువుటద్దాలు లేవు. “ఏందే! సిన్మా జూస్తవా, లేకుంటె గీ అద్దాలల్ల జూసుకుంటు ఉంటవా? చెప్పు మరి, నీ టిక్కెట్టు అమ్మేస్తం” అని ఒకరంటే.. “ఆ సరే! నా టిక్కెట్టు అమ్మెయ్యి మరి, అగో.. గా పూలపూల అంగీ పిలగాడు ఇటే చూస్తున్నడు. వానికి నా టిక్కెట్టు అమ్ము. నీ పక్కనే కూచోని సిన్మా జూస్తడు. నువ్వు ఏడ్చుకుంట ఉంటవు” అంటూ ఒకళ్లను ఒకళ్లం ఏడిపించేవాళ్లం.
ఆ థియేటర్లో కొన్ని రోజులకే అక్కినేని, వాణిశ్రీ నటించిన ‘సెక్రటరీ’ సినిమా షూటింగ్ అయిందని చెప్పుకొన్నారు. అక్కినేని, వాణిశ్రీ కలిసి సినిమాకు వస్తారు. అక్కడ కాంచన ఎదురై.. ‘ఓ! కలిసే వచ్చారా?’ అంటుంది. ‘లేదు! వచ్చి కలిసాము’ అంటాడు అక్కినేని. ఆ సీను ఈ అద్దాల దగ్గర తీసారు. ‘సెక్రటరీ’ సినిమాకు వెళ్లి.. అదే చోటులో నిలబడి మేము ఆ డైలాగ్ అంటూ నవ్వేవాళ్లం. అంతే కాదు.. మా కజిన్స్‌తో ఎక్కడికైనా వెళ్లినపుడు మేము ఈ మాటలు వాడుతూ ఉండేవాళ్లం. యద్దనపూడి సులోచనారాణిగారి ‘సెక్రటరీ’ నవల ఎంత బాగుంటుందో, అది సినిమాగా తీసాక అంత గొప్పగా లేదు అనుకునేవాళ్లం.
మేం ఉండే గల్లీ నుండి మెయిన్ రోడ్డుకు వస్తే ఎడమవైపున నాలుగైదు షాపుల అవతల ఆర్కే లైబ్రరీ అనే పుస్తకాలు అద్దెకిచ్చే లైబ్రరీ ఉండేది. అది నాకొక వరంగా అనిపించేది. పుస్తకాలంటే పడి చచ్చే నాకు.. ఆర్కే లైబ్రరీని చూడగానే ప్రాణం లేచివచ్చింది. దాన్ని నడిపేవాళ్లకు తెలుగు సరిగా రాదు. అయినా, తెలుగు నవలలు, పత్రికలు చాలా ఉండేవి. ఒక నవలకు గానీ, పత్రికకు గానీ రోజుకు ఇరవై పైసలో, పావలానో కిరాయి ఉండేది. నేను చాలా తెలుగు నవలలు అప్పటికే మా ఇంట్లో చదివాను గనుక, పత్రికలు ఇంటికి తెచ్చేదాన్ని. చిన్నమ్మలు, అప్పుడప్పుడూ చిన్నాన్నలు కూడా చదివేవారు.
నాయనమ్మ అప్పుడప్పుడూ.. “మీ నాయిన ఇచ్చిన పైసలన్ని గీ పుస్తకాలకే పెడుతావే పిల్లా! పైసలు దాచిపెట్టుకోక ఎందుకొచ్చిన పుస్తకాలే? ఎడ్డి పిల్లవు. మీ అమ్మకు గిట్లనే పుస్తకాలంటే చెడ పిచ్చి ఉండే! నువ్వు గట్లనే ఉన్నవు” అని మందలించేది. నేను నవ్వి ఊరుకునేదాన్ని. నా చదువు దాహాన్ని అలా ఆర్కే లైబ్రరీ తీర్చింది.
మేముండే గల్లీకి కుడిపక్కన రోడ్డులో వెళితే బాలాజీ స్వీట్ హౌస్ ఉండేది. రంగారావు చిన్నాయన అక్కడినుండే వారానికి ఒకసారి కోవాపేడా తెచ్చేవారు. ఎవరైనా అతిథులు ఇంటికి వచ్చి అర్జెంటుగా వెళ్లిపోవాలని తొందరపెడితే, ఆ సమయానికి నేను ఇంట్లో ఉంటే.. గోపిక చిన్నమ్మ నన్ను ఇంటి వెనక్కు పిలిచి డబ్బులిచ్చి బాలాజీ స్వీటు హౌజ్‌కు పంపేది. నేను రహస్యంగా వెళ్లి అక్కడ స్టాండర్డ్‌గా దొరికే బూందీ మిక్స్చర్, ఏదైనా స్వీటు కొనుక్కుని అంతే రహస్యంగా వెనుకనుంచి ఇచ్చేదాన్ని.
నారాయణగూడ చౌరస్తా మూల మీద పెద్ద కూరగాయల మార్కెట్ ఉండేది. గోపిక చిన్నమ్మ చాలాసార్లు నన్ను వెంట తీసుకుని కూరగాయలు కొనడానికి వెళ్లేది. కాస్త అలవాటయ్యాక ఎప్పుడైనా నేను కూడా ఒక్కదాన్ని వెళ్లి తెచ్చేదాన్ని. హైదరాబాదీ హిందీని నేను ఆ మార్కెట్లోనూ, రిక్షా వాళ్ల దగ్గర నుండీ నేర్చుకున్నాను. ఆ మార్కెట్ నుండి చక్కగా వెళితే చిక్కడపల్లి బ్రిడ్జి, అది దాటితే సందులో వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉండేది. కానీ, ఏడాదికోసారైనా గుడికి వెళ్లేవాళ్లం కాదు. మేమే కాదు.. నేను చూసిన చాలామంది ఇంట్లో దేవుడికి దండం పెట్టుకోవడం, ఎప్పుడో కొన్నేళ్లకు ఓసారి తిరుపతో, యాదగిరిగుట్టో పోవడం తప్పితే ఇప్పట్లా ఇన్నిన్ని గుళ్లకు ఇంత తరచుగా వెళ్లేవారు కాదు.
చిక్కడపల్లిలో సుధా హోటల్ చాలా ప్రసిద్ధి. అంటే హోటల్‌కు వెళ్లేవాళ్ల కన్నా ఎవరికైనా అడ్రస్ చెప్పేటప్పుడు.. ‘సుధా హోటల్ గల్లీ’ అని చెప్పేవారు. ఆ సందులోనే త్యాగరాయ గానసభ ఉంది. అందులో ఏం కార్యక్రమాలు అవుతాయో నాకు అప్పుడు తెలియదు. మా రేడియోలో వచ్చే లాంటి శాస్త్రీయ సంగీతం పాడేవాళ్లు అక్కడ ఉంటారనుకునేదాన్ని. అది దాటితే సంగం చౌరస్తా ఉండేది. ఇప్పుడేమో గాంధీనగర్ అంటున్నారు. అక్కడే సంగం టాకీసు, కొత్తగా కట్టిన సుదర్శన్ 70 ఎంఎం, సుదర్శన్ 35 ఎంఎం థియేటర్స్ ఉండేవి. ఆ తరువాతి రోజుల్లో అటు రామ్‌నగర్ వెళ్లే దారిలో సంధ్య థియేటర్ కట్టారు. సుదర్శన్లోనే పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయ్యేవి. ఆ రోడ్డంతా ఎంతో రద్దీగా ఉండేది.
చిక్కడపల్లి బ్రిడ్జి వైపు కాకుండా హిమాయత్ నగర్ వైపు వెళుతుంటే కుడిపక్కన వెంకటేశ, శ్రీనివాస థియేటర్లు, తాజ్ మహల్ హోటల్ వరుసగా వచ్చేవి. ఎడం పక్క సందు ముందట ‘జ్యోతి మాసపత్రిక’ అనే బోర్డు ఉండేది. ఆ సందులోనే ఆఫీసు ఉండేది. ‘జ్యోతి’ అనే అక్షరాలు నిజంగానే దీపం ఆకారంలో ఉండి, భలే అందంగా కనిపించేవి. వి.లీలావతీ రాఘవయ్య గారి సంపాదకత్వంలో వచ్చే ఆ పత్రిక ఇక్కడ తయారవుతుందా? అసలు పత్రికను ఎలా తయారు చేస్తారు? ఎలా, ఎందరు దాని కోసం పనిచేస్తారు? ఓసారి చూడాలనే కుతూహలం నాలో ఉండేది.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి