నేను మీకు నా కథ చెప్పేముందు.. అమ్మ-నాన్నల, తాతయ్య-నానమ్మల ద్వారా నేను విన్న, నేను తెలుసుకున్న మా ఇంటి కథ, అందులో ఉన్న నా కథ చెప్తాను వినండి. అమ్మ, నాన్న నా ముందే అన్ని విషయాలూ మాట్లాడుకుంటారు. నేను కూడా.. ‘ఆరోజు సంగతులు ఏమిటా?’ అని ప్రతిరోజూ వినటానికి ఆసక్తిగా ఉంటాను. ప్రతిరోజూ అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ మాట్లాడే విషయాలు వింటున్న నాకు.. వీళ్లందరి సమస్యకు కారణము నేనే అనిపించింది. నేను వచ్చిన తర్వాత మా ఇంట్లో చాలా మార్పులు జరిగాయి. ఉదయం అమ్మ దగ్గరికి నానమ్మ వచ్చి..“ఆ జాతి తక్కువ వాడిని అనాథ ఆశ్రమంలో చేర్చండి లేదా ఇంటి నుండి వెళ్ల గొట్టండి. వాడు మన వంశ వారసుడు కాదు అంటే వినరు. ఈ ఇంట్లో ఇప్పటివరకు జరిగిన దరిద్రాలు చాలు, వాడు వచ్చిన తర్వాత మనింట్లో జరిగిన అరిష్టాలు నువ్వు, నీ మొగుడు గుర్తుకు తెచ్చుకోండి” అంటూ గొనుగుతూ బాల్కనీలోకి వెళ్లిపోయింది. ఆ క్షణం అమ్మ కళ్లలో నీళ్లు చూసాను.
అమ్మ, నాన్న ఇద్దరూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. మా ఇంట్లో వారితోపాటు తాతయ్య, నానమ్మ ఉంటారు. మా అమ్మ నాన్నలకు పెళ్లయి పది సంవత్సరాలు అయింది. చాలాకాలం పిల్లలు కలగలేదు. నాలుగు సంవత్సరాల క్రితం మా ఇంట్లో దాలమ్మ అనే పనిమనిషి చేరింది. దక్షిణ వీధి నుండి వచ్చేది. మొదట్లో ఆవిడ పనిమనిషిగా రావటం తాతయ్య, నానమ్మకు ఇష్టం లేదు. పనివారు దొరక్క.. ముఖ్యంగా అమ్మ నాన్న ఉద్యోగాలకు వెళ్లిన తరువాత తాతయ్య, నానమ్మలకు రోజంతా తోడుగా ఉంటుందని తప్పనిసరై ఒప్పుకొన్నారు.దాలమ్మకు నెలల బిడ్డ. వాడి పేరు ఏసుదాసు. ఆవిడ భర్త తాగుబోతు. దాలమ్మ మా ఇంట్లో పని చేసేటప్పుడు ఆవిడ కొడుకును అమ్మ ఆడించేది. ఒక్కోసారి అమ్మ ఒడిలోనే నిద్రపోయేవాడు. పిల్లలు లేని అమ్మ వాడిని అడిపించటంలోనే మాతృత్వ అనుభూతి పొందేది. దాలమ్మ భర్త ప్రతిరోజూ తాగి వచ్చి దాలమ్మను హింసించడం, అనుమానించడం వంటి బాధలు పడలేక.. ఒకరోజు దాలమ్మ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
మా ఇంట్లో ఆమె చివరి రోజూ పనిచేస్తూ.. “మీకు పిల్లలు లేరు కదా! నా కొడుకును పెంచుకోండి” అంది.ఆవిడ చనిపోయిన తరువాత దాలమ్మ కొడుకు ఏసుదాసును ఇంటికి తీసుకు వచ్చారు. ఏసుదాసు పేరును రామదాసుగా మార్చారు నాన్న. నానమ్మ, తాతయ్య.. దాలమ్మను తప్పనిసరై పని మనిషిగా ఒప్పుకున్నట్లే, ఆవిడ బిడ్డ దాసును పెంచుకోవటం ఇష్టం లేకపోయినప్పటికీ తప్పనిసరై ఒప్పుకొన్నారు.
అందరూ ముద్దుగా ‘దాసు’ అని పిలుస్తున్నారు. దాసు వచ్చిన రోజు నుండి అమ్మనాన్నల ఆనందానికి అవధులు లేవు. వాడు వచ్చిన రెండవరోజు ఆకలితో ఏడుస్తుంటే అమ్మ, రొమ్ము పాలు పెట్టిందట. అప్పటి వరకూ పిల్లలు లేక జీవితంలో ఏదో కోల్పాయామని అనుకుంటున్న వారిద్దరు.. దాసును అల్లారు ముద్దుగా చూసేవారు. దాసు వచ్చిన కొద్దిరోజులకు నాన్న ప్రధానోపాద్యాయుడిగా పదోన్నతి పొందారు. అమ్మకూడా దూరంగా ఉన్న స్కూల్ నుండి దగ్గరి స్కూలుకు బదిలీ అయింది. ఇవన్నీ వాడివల్లే అని మురిసిపోయారు.కొడుకు, కోడలుకు పిల్లలు లేరని దిగులు పోయి హాయిగా నవ్వుకోవటంతో.. తాతయ్య నానమ్మలో కూడా కొద్ది రోజులలోనే మార్పు వచ్చింది.
ఈ కథంతా విని ఇది నా కథే అనుకుంటున్నారు కాబోలు. ఇది నా అన్నయ్య రామదాసు అనబడే ఏసుదాసు కథ. అమ్మ నాన్నలతో వారం క్రితం తాతయ్య అన్న మాటలు గుర్తొచ్చాయి. ఈ సమస్య చూడటానికి, వినటానికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కానీ, భవిష్యత్‌లో ఇదే పెద్ద బండరాయి అయి నెత్తి మీద కూర్చుంటుంది. “నేను, మీ అమ్మ చనిపోతే నువ్వు పెద్ద కొడుకుగా వంశ వారసుడిగా మా తలకొరివి పెడతావు. అందరూ చనిపోయే వాళ్లే! మరి నువ్వు చనిపోతే చితి ఎవరు అంటిస్తారు? ఎవరు దహనం చేస్తారు? ఆ జాతి తక్కువ వాడే నీ పెద్ద కొడుకుగా నీకు తలకొరివి పెడతాడా? లేదంటే పెంపుడు కొడుకు కాబట్టి వాడిని కాదని.. నీ చిన్న కొడుకు చితి వెలిగిస్తాడా? ఇద్దరిలో ఎవరు ఈ వంశ వారసుడు?” గట్టిగా అరుస్తూ
అడిగారు తాతయ్య.
“‘ఆలూ లేదు సూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అన్న సామెత మాదిరిగా.. ఇప్పుడు మా వయసు ముప్పై అయిదు సంవత్సరాలు. యాభై అరవై సంవత్సరాల తర్వాత చావు కోసం ఇప్పుడు ఎందుకు మాట్లాడటం నాన్నగారు!” అన్నారు నాన్న కూడా కోపంగా. “నీకు ముప్పై అయిదు సంవత్సరాలు కాబట్టే నీకు ఏమి అర్థమవటం లేదు. నా స్నేహితుడు వైజాగ్ విశ్వనాథ్ మామయ్య తెలుసు కదా! వాడి దహన సంస్కారాలలో ఇదే సమస్య వచ్చింది. వాడికి పిల్లలు లేక కాపుల అబ్బాయిని పెంచుకున్నారు. వాడిని పెంపకం తీసుకున్న సంవత్సరం తిరగకముందే విశ్వనాథ్‌కు అబ్బాయి పుట్టాడు. విశ్వనాథ్ చనిపోయినపుడు పెంపుడు కొడుకైనా పెద్దవాడు కాబట్టి వాడే చితి ముట్టించాలనే వాదన వచ్చింది. కాదు.. రక్తం పంచుకున్న కొడుకు మాత్రమే లెక్కలోకి వస్తాడు. పెంపుడు కొడుకు బ్రాహ్మణుడే కాదు కదా! అని మరికొందరు వాదించారు. దహన సంస్కారాలకు వచ్చిన బ్రాహ్మణులు కూడా రెండు గ్రూపులుగా మారి.. చెరో వాదన వినిపించారు. ఆరోజు పెద్ద యుద్ధమే జరిగింది. ఉదయం జరగాల్సిన కార్యం మధ్యాహ్నం మూడు గంటలకు జరిగింది” అన్నారు తాతయ్య.
మా ఇంట్లో గత మూడు సంవత్సరాలుగా అంతా బాగానే ఉంది కానీ గత ఆరు నెలలుగా విచిత్రమైన మార్పు వచ్చింది. ముఖ్యంగా నానమ్మ, తాతయ్యలో వారసుడు, జాతి, కులం అనే పదాలు వినిపిస్తున్నాయి. తాతయ్యలో మార్పు మరీ ఎక్కువ. “నా రక్తం పంచుకుని పుట్టావు నువ్వు. నీ రక్తంతో పుట్టిన వాడే నా మనవడు, ఈ ఇంటి వారసుడు వాడే అవుతాడు” అని వాదించారు.“ఇంటికి వారసుడు వచ్చాడు కదా! ఇంక ఈ జాతి తక్కువ వెధవ ఎందుకు? వాడిని అనాథ శరణాలయంలో వేయండి” అంటూ సలహా ఇచ్చారు కూడా. ఇక దాసు వచ్చిన తర్వాత ఎన్ని అనర్థాలు జరిగాయనేది తాతయ్య మరోసారి వల్లె వేసారు. దానికి సమాధానంగా నాన్న.. “వాడు వచ్చిన కొద్దిరోజులకే నేను ప్రధానోపాద్యాయుడిగా పదోన్నతి పొందాను. నా భార్యకూడా దూరంగా ఉన్న స్కూల్ నుండి దగ్గరి స్కూలుకు బదిలీ అయింది” అని గుర్తుచేస్తూ.. “వాడిని అనాథాశ్రమంలో చేర్పించే బదులుగా మిమ్మల్నే వృద్ధాశ్రమంలో చేరుస్తాను” అని గట్టిగా తిరుగు జవాబు ఇచ్చారు.
బిడ్డలు లేరని పెంచుకున్న దాసు అన్నయ్య మీద సాధింపు ఎక్కువైంది. ఎలాగైనా వాడిని వదిలించకుందామని ప్రయత్నాలు మొదలు పెట్టారు తాతయ్య. అమ్మ, నాన్న మాత్రం దాసు అన్నయ్య వచ్చిన తర్వాత అంతా మంచే జరుగుతున్నదని నమ్ముతున్నారు. అమ్మ నాన్నలకు దాసు అన్నయ్య అంటే ఇష్టం తగ్గలేదు కానీ, నానమ్మ-తాతయ్యలకు మాత్రం గత ఆరు నెలలుగా అన్నయ్య అంటే అయిష్టం పెరిగింది. అమ్మ-నాన్న ఇద్దరూ ఉద్యోగానికి వెళ్లిన తరువాత నానమ్మ దాసు అన్నయ్యతో.. “ఎందుకురా! మా ఇంట్లో దాపురించావు. మేము ఏ జన్మలో చేసుకున్న పాపమో రా ఇది. జాతి తక్కువ వెధవ!” అని తిట్టేదట.ఇలాంటి సూటిపోటి మాటలు, అమ్మ స్కూల్ నుండి వచ్చిన తర్వాత దాసు అన్నయ్య అమ్మతో చెప్పటం నేను గత ఆరు నెలలుగా వింటున్నాను.సమస్య ఇప్పుడు నా వల్ల చిలికి చిలికి గాలి వాన అయింది. పరిస్థితి ఎంతలా అయింది అంటే.. తాతయ్య మొన్న దాసు అన్నయ్యను ఆట కోసం తీసుకువెళ్తానని చెప్పి.. ఊరు చివర శ్మశానంలో వదిలిపెట్టి వచ్చాడు. అక్కడ శవాలు కాలుతుంటే చూసి భయపడి చనిపోతాడని తాతయ్య ఉద్దేశం. అయితే స్కూలు నుంచి వచ్చిన నాన్నగారు దాసు అన్నయ్యను వెతికి ఇంటికి తీసుకువచ్చారు.
నాన్నకు ఆ రోజు చాలాకోపం వచ్చింది. “రామదాసు నా కొడుకు. వాడు ఇష్టం లేకపోతే మీరే ఇల్లు వదిలి వెళ్లండి” అంటూ వారిద్దరి మీదా అరిచారు.ఆ కోపంలో ఆ రోజే నానమ్మ-తాతయ్యలను వృద్ధాశ్రమంలో చేరుస్తాననే నిర్ణయానికి వచ్చారు. ఆ రోజు రాత్రి అమ్మ పక్కకు వచ్చి నానమ్మ.. “చూడు కోడలు పిల్లా! దాసు వచ్చిన నెల తిరగక ముందే విజయనగరంలో ఉండే నీ ఆడపడుచు చనిపోయింది గుర్తు ఉందా?” అని అడిగింది. “అదికాదు అత్తయ్యా! ఆరునెలలుగా ఆవిడకు క్యాన్సర్ కదా! ఆ విషయాన్ని వదిలిపెట్టి ఆ చావుకు వీడే కారణం అనడం భావ్యం కాదు” అంది అమ్మ. “క్యాన్సర్ తగ్గిపోయింది. వీడు మన ఇంట్లో అడుగు పెట్టడం వలనే ఇలా జరిగింది!” అంది నాన్నమ్మ. “నాకు ఆ మధ్య తరుచూ ఆయాసం వస్తుండేది. అది కూడా రామదాసు వచ్చిన కొత్తలో.. గుర్తుందా?” అంటూ నాన్నను అడిగారు తాతయ్య.. పక్కనే ఉన్న అమ్మ వినేట్లుగా. “నాన్నగారూ! ఆయాసం అనేది వృద్ధాప్యం వలన వచ్చింది. అంతేగానీ దాసు రాక వలన కాదు” అన్నారు నాన్న. ఇవన్నీ వింటున్న నాకు బాధ అనిపించింది. గుండె ఎవరో పిండినట్లుగా అయ్యింది. నా వలనే కదా అమ్మ-నాన్నలు.. నానమ్మ తాతయ్యలను ఆశ్రమంలో చేరుద్దామని నిశ్చయించారు. నా వలనే కదా.. అనందంగా ఉన్న అన్నయ్య జీవితంలో అనుకోని కష్టాలు. నా జీవితం నలుగురుకీ ఉపయోగపడాలి. కానీ, నలుగురి జీవితాలను ఇబ్బంది పెడుతుంది కదా! అనిపించింది.
ఆదివారం సెలవు కావటంతో అమ్మ పని మొత్తం ముగించి బెడ్రూంలో చేరబడింది. అలిసి ఉండటంతో వెంటనే నిద్ర పట్టేసింది. పడుకున్న అమ్మ దగ్గరికి అన్నయ్య వచ్చాడు. కడుపు మీద తలపెట్టి, చిన్నగా.. “తమ్ముడూ! తాతయ్య, నానమ్మ మంచివాళ్లు. నన్ను బాగ చూసుకునేవారు. నువ్వు కడుపులోకి వచ్చినప్పటి నుండి వారిలో మార్పు వచ్చింది. నన్ను నానమ్మ అనరాని మాటలు అంటున్నది. తాతయ్య కూడా చంపటానికి ప్రయత్నించాడు. బహుశా నేను సంతోషంగా ఉండాలంటే ఎన్నాళ్లు వీలైతే అన్నాళ్లు నువ్వు అమ్మ కడుపులోనే ఉండిపోరాదూ?” అంటున్న అన్నయ్య కంట్లో చిన్నగా కన్నీరు చూశాను నేను.
ఆరు నెలల క్రితం అమ్మకు ఒంట్లో బాలేదని నాన్నగారు అమ్మను డాక్టర్ దగ్గరకి తీసుకువెళ్తే.. తను నెల తప్పిందని చెప్పారు. కడుపులో విపరీతంగా నొప్పి రావటంతో స్కానింగ్ చేసి.. మగబిడ్డ, అడ్డం తిరిగిందని చెప్పారు. వైద్యం తరువాత అదృష్టవశాత్తూ తల్లికి బిడ్డకు ప్రాణాపాయం లేదని చెప్పి పంపారు.
ఈ రోజు ఉదయం అమ్మకు నొప్పులు ఎక్కువగా రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువచ్చారు. అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ.. నేను క్షేమంగా బయటికి రావాలని దేవుడికి ప్రార్థిస్తున్నారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డాక్టర్ అమ్మను, కడుపులో ఉన్న నాకు కొన్ని పరీక్షలు చేసారు. నేను అమ్మ కడుపులో పొరపాటున ఉమ్మ గటంతో చనిపోయానని చెప్పాడు. కానీ, నేను పొరపాటున కాదు.. కావాలనే ఆ పని చేసాను అన్న విషయం డాక్టర్‌కు ఎలా తెలుస్తుంది!?తర్వాత ఏమి జరుగుతుంది? అనేది నేను ఊహించగలను. నేను చనిపోయానని తెలిసి అమ్మ నాన్న ఏడుస్తుంటారు. తాతయ్య, నానమ్మ తమ వారసుడు తమ జాతివాడు కాదని బాధపడుతుంటారు. పక్కనే ఉన్న అన్నయ్య.. “తమ్ముడు కావాలి”అని ఏడుస్తుంటే ఎత్తుకొని ఇంటికి చేరుతారు. కొద్దిరోజులు బాధపడి చివరికి అందరూ మాములు స్థితికి వస్తారు. వారసుడిగా అన్నయ్య మారతాడు.
శేషగిరి పట్నాయక్
ఇప్పటివరకూ రాసినవి ముచ్చటగా మూడు కథలే అయినా.. ఆ మూడింటికీ బహుమతులు అందుకున్నారు రచయిత శేషగిరి పట్నాయక్. ఈయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం. తల్లిదండ్రులు స్వర్గీయ కూర్మావతారం-విమలవతమ్మ. ఇద్దరూ ఉపాధ్యాయులు కావడంతో.. చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం, రచనలు చేయడంపై ఆసక్తి పెంచుకున్నారు. గతేడాది నుంచే పూర్తిస్థాయి రచయితగా రచనలు చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ‘ఉలూపి’ అనే పురాణ ఆధారిత సోషియో ఫాంటసీ నవలతోపాటు మూడు కథలు రాశారు. నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీ పీఠం కథల పోటీ-2025లో బహుమతి పొందిన ‘దక్షిణవీధి వారసుడు’.. ఈయన రెండో కథ. ఈయన రాసిన మొట్టమొదటి కథ ‘శూద్ర పుత్ర కర్ణ’. విశాలాక్షి మాస పత్రిక సంక్రాంతి జాతీయ కథల పోటీ-2025లో ఈ కథకు బహుమతి అందుకొని.. రచనా ప్రస్తానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత విశాఖ సంస్కృతి పత్రిక హాస్య కథల పోటీలో ‘జట్టు’ అనే హాస్య కథకు బహుమతి దక్కింది.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రత్యేక బహుమతి రూ.5 వేలు పొందిన కథ.
-శేషగిరి పట్నాయక్
77993 34841