Ramayanam | జయశ్రీ నా క్లాస్ మేట్. తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచీ మా క్లాస్‌లో వుందా లేక సెకండ్ ఇయర్లో వచ్చిందా అన్నది నాకు గుర్తు రావడం లేదు. తను చాలా అందంగా వుండేది. అప్పుడప్పుడూ నాతో క్లోజ్‌గా మాట్లాడుతూ వుండేది. మేము కాలేజీ ఫీజు డైరెక్టుగా కాలేజీలో కాక నారాయణగూడ చౌరస్తాలో శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంకులో కట్టాల్సి వుండేది.
ఓ సారి అలా వెళ్లినపుడు జయశ్రీ నన్ను వాళ్లింటికి తీసుకెళ్లింది. టెంత్ తర్వాత నేను మొదటిసారిగా ఓ క్లాస్మేట్ ఇంటికి వెళ్లడం అదే మొదటిసారి. జయశ్రీ వాళ్లు వైఎంసీఏకి ఎదురుగా శాంతి టాకీసు వరుసలో ఓ బిల్డింగు మొదటి అంతస్తులో వుండేవారు. కిందన్నీ షాపులే. పైన కూడా చాలా మటుకు షాపులే వుండేవి. వీళ్లకు ‘జయశ్రీ ఆప్టికల్స్’ పేరుతో ఆ పక్కనే ఓ షాపుండేది. షాపున్న భాగం, పక్కన పోర్షను రెండూ కూడా వాళ్ల సొంతం కాదు, కిరాయి కట్టేవారు. ‘మా నాన్నకు నేనంటే శాన ప్రేమ, అందుకనే నా పేరు మీద షాపు పెట్టిండు’ అనేది. మరి ‘మంజు ఆప్టికల్స్’ అని ఎందుకు పెట్టలేదు? అనడిగాను. జయశ్రీని వాళ్లింట్లో మంజు అని పిలిచేవారు. ‘ఏమో! కానీ, నువ్వు నన్ను ‘మంజూ’ అనే పిలువాలె’ అంది జయశ్రీ. సరేనని తలూపాను.
ఓసారి మంజు నేనుండే ఇంటికి వచ్చింది. నాయనమ్మ అప్పుడు ముందు రూంలోనే కూర్చుని ఉంది. ‘ఏ ఊరమ్మా మీది?’ అనడిగితే తను హైద్రాబాదే అని చెప్పింది. ‘ఆఁ హైద్రాబాదుల ఉన్నోళ్లంత హైద్రాబాదోళ్లు అయితరా! మీ నానదెక్కడ.. మీ అమ్మదెక్కడ?’ అని మొదలుపెట్టి మొత్తం వివరాలు అడిగింది. ఇంతకూ వాళ్ల నాన్నది మానుకోట అనీ, వాళ్లమ్మది సూర్యాపేట దగ్గర్లోని గొల్లపల్లి అనీ, వాళ్లు మాకు ఏదో రకంగా దూరపు బంధువులనీ తెలిసింది. అది కూడా మా నానమ్మ తాలూకూ అని నాకు కొంచెం ఆనందం కలిగింది. ఇల్లు దగ్గరవడం వల్ల అప్పుడప్పుడూ జయశ్రీ రావడమో, నేను వెళ్లడమో జరుగుతూ ఉండేది.
జయశ్రీ వాళ్లమ్మ ఇందిరమ్మ ఆంటీ ఎంతో అందంగా ఉండేది. చాలా ఆప్యాయంగా, ప్రేమగా మాట్లాడేది. వాళ్ల చెల్లెలు ఉషశ్రీ, తమ్ముడు శరత్ కూడా సరదాగా మాట్లాడేవారు. శరత్ రెండేళ్లు చిన్నవాడనుకుంటా, అప్పుడు నైంత్ చదువుతుండేవాడు. వాళ్లింట్లో జయశ్రీ మేనబావ వెంకట్ కూడా వీళ్లతోపాటే ఉండేవాడు. ఆయన బాగా జోకులేసేవాడు. ‘వెంకటేశ్వర రావు అసలు పేరయితే వెంకట్ అని పెట్టుకున్నాడు. ఎంత పాతపేరో’ అంటూ జయశ్రీ కూడా ఆయన్ని బాగా వెక్కిరిస్తుండేది. ఆయన ఈజీగా నవ్వి ఊరుకునేవాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసేది. మా సొంత మేనబావలతో మేమెన్నడూ అంత చనువుగా ఉండేవాళ్లం కాదు. పైగా భయపడేవాళ్లం కూడా!
జయశ్రీకి ఓ ఊతపదం బాగా అలవాటు. దేనికైనా ‘నా బొంద’ అంటూండేది. ‘నా బొంద, నేనెప్పుడు చదివిన.. నా బొంద, నేనెందుకు అన్న.. నా బొంద, నాకేం తెల్సు?’ ఇలా ప్రతిదానికీ ‘నా బొంద’ అని వాడుతుండేది. చాదస్తపు ముసలివాళ్లలాగా ఆ వయసు అమ్మాయి అలా అనడం విచిత్రంగా అనిపించేది. ఎవరు చెప్పినా ఆ అలవాటు మానలేదు. ఓ సారి నేను వాళ్లింటికి వెళ్లినప్పుడు వాళ్ల వెంకట్ బావ ‘మంజు ఊరికూరికే నా బొంద అనకుండ ఒక మంచి ఉపాయం ఆలోచించినం, నువ్వు కూడ దాన్ని ఫాలో అయితే దెబ్బకు బంద్ జేస్తది’ అని నాకు ఆ ఉపాయం చెప్పాడు. అప్పట్నుంచీ జయశ్రీ ‘నా బొంద’ అంటుందేమో అనిపించగానే ఎవరో ఒకరు ముందే ‘నీ బొంద’ అనడం మొదలుపెట్టారు. ముందు ఉడుక్కున్నా పూర్తిగా మానిందో లేదో గానీ, చాలామటుకు అలా అనడం తగ్గిపోయింది.
నేను పుస్తకాలు బాగా చదువుతాననో ఏమో గానీ, జయశ్రీ వాళ్ల తమ్ముడు ఓసారి నాకు ఓ పుస్తకం ఇచ్చాడు. అదేమిటో ఎప్పుడూ నేను చదివే పుస్తకాల తీరులో లేదని పేజీలు తిరగేస్తుంటే తెలిసింది. అదొక బూతు కథల పుస్తకమని. నేనెప్పుడూ అలాంటిది చూడలేదు కనుక నాకు ఒళ్లంతా తేళ్లు జెర్లు పాకినట్టు జుగుప్స కలిగింది. ‘ఇదేంది, మీ తమ్ముడు చదవమని ఈ పుస్తకం ఇచ్చిండు? మీ ఇంట్ల ఇట్లాటి పుస్తకాలుంటయా? మీ అమ్మానానా కోప్పడరా?’ అని నేను జయశ్రీని అడిగాను. ‘ఎహె, వాడికి తెల్వదు. ఏదో బుక్కని ఇచ్చిండేమో! మా బావ చదువుతడు గావొచ్చు.
అయినా, నువ్వు ఫస్ట్ టైమా అట్లాంటివి జూసుడు?’ అంది పెద్దగా ఆశ్చర్యపోకుండా. ఈసారి ఆశ్చర్యపోవడం నా వంతైంది. ఎందుకంటే ఆ అబ్బాయి పనిగట్టుకుని నాకా పుస్తకాన్ని నవ్వుకుంటూ ఇవ్వడం నేను మర్చిపోలేదు. ఈ పిల్లగాడు పెద్దగయ్యాక ఏమవుతాడో అనిపించేది. ఎందుకో గానీ, జయశ్రీ నాతో బాగానే వుండేది గానీ, అప్పుడప్పుడూ మూడీగా ఉండేది. నేను గమనించినంతవరకూ తను కొంత దాపరికంగా ఉండేదనిపించేది. ఇంటర్ తరువాత నాకూ తనకూ మధ్య పెద్దగా స్నేహం కొనసాగలేదు.
ఈ ప్రపంచం ఎంత పెద్దదో అంత చిన్నది. మరో మూడేళ్లకే మా మేనత్త కూతురు పెళ్లిలో పెళ్లికొడుకు కజిన్స్‌గా జయశ్రీ, ఉషశ్రీ కనిపించారు. ఆ తర్వాత మరో పదిహేనేళ్లకు మా ఆడబిడ్డ కూతురుకు సంబంధం కుదిరిందని అబ్బాయి వివరాలు చెప్పారు వాళ్లు. ఆ పెళ్లికొడుకు ఎవరో కాదు, జయశ్రీ తమ్ముడు శరత్. సౌదీలో ఏదో ఉద్యోగమని చెప్పారు. ఆ పెళ్లిలో అబ్బాయి తరఫువాళ్లంతా బాగా సతాయించి మూడు చెరువుల నీళ్లు తాగించారు అమ్మాయి సైడు వాళ్లని. ఇంతా చేసి వాళ్లు ఓ ఏడాదైనా కలిసుండలేదు. అమ్మాయిని బాగా టార్చర్ పెట్టారని మా వాళ్లు చెప్పారు. అలా ఆ కుటుంబంతో బంధం తెగిపోయింది. ఎప్పుడైనా హైదరాబాదు కామన్ ఫంక్షన్లలో జయశ్రీ అరుదుగా కనిపిస్తుంటుంది.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి