ములుగు, మే16 (నమస్తేతెలంగాణ) : ములుగులోని గిరిజన యూనివర్సిటీ స్థలాన్ని పురావస్తు శాఖ అధికారులు సమగ్రంగా పరిశీలించాలని సమ్మక్క, సారలమ్మ కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ వైఎల్ శ్రీనివాస్ కోరారు. ప్రహరీ నిర్మాణం కోసం చేపట్టిన తవ్వకాల్లో పురాతన ఆలయ శిలలు బయటిన నేపథ్యంలో శనివారం ఆయన వారికి లేఖ రాశారు. గిరిజన విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం 337 ఎకరాలకుపైగా భూమిని కేటాయించగా 287 ఎకరాల చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టామని పేర్కొన్నారు.
ఇందులో దాదాపు 50 ఎకరాల అటవీ ప్రాంతాన్ని వదిలి అక్కడ బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు శ్రీనివాస్ తెలిపారు. లోకం చెరవు దిగువ ప్రాంతం సమీపంలో తవ్వకాల చేపట్టగా జేసీబీ ఆపరేటర్ పాత కట్టడానికి చెందిన గుడి నిర్మాణాన్ని పోలిన మూడు పెద్ద రాతి స్తంభాలను వెలికితీశాడని అన్నారు. ఆ ప్రదేశంలో పెద్ద పాములు తారసపడినట్లు పేర్కొన్నారు. దీనిపై కొన్ని మీడియా సంస్థల్లో ఊహాగానాలు వెలువడ్డాయని తెలిపారు. ఇక్కడ పురాతన ఆలయం ఉండేదని చర్చ జరుగుతున్నదన్నారు. ఈ క్రమంలో ముందస్తుగా స్త్తంభాలు కనుగొనబడిన ప్రదేశానికి ఇరువైపులా సుమారు 50 మీటర్ల వ్యాసార్థంలో అన్ని పనులను నిలిపివేయాలని కాంట్రాక్టర్ను కోరానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పురావస్తు శాఖ అధికారులు సదరు ప్రదేశాన్ని సందర్శించి సమగ్ర దర్యాప్తు జరపాలని సూచించారు.